ఇంకొంచం…

నిన్నటి కన్నా ఎక్కువ స్వప్నిద్దాం
అమ్మ తర్వాత మళ్ళీ
గర్భసంచి ఉన్నది
స్వప్నాలకే.

జీవితం
వేళ్ళ సందుల్లోంచి జారిపోయే
చేపపిల్ల.
ఇంకొంచెం పట్టించుకుందాం

నడిచొచ్చిన దారిని మర్చిపోకుండా
నిద్రను రెండుగా విరగ్గొట్టిన
నిన్నటి వాన చినుకుల్ని
ఎక్కువసార్లు గుర్తు చేసుకుందాం

యుద్ధానికీ దుఃఖానికీ
ఒక్క అల్మరా చాలు
ప్రేమకు
ఇంకొంచం పెద్ద గదిని కేటాయిద్దాం

పిల్లల ముందూ
స్త్రీల ముందూ ఎక్కువ ఓడిపోదాం
ప్రతి ఓటమి
పుండ్లుపడ్డ భూమి గాయాలకు చికిత్స

భౌతిక దృష్టికి ఆవల
మరే స్వర్గమూ లేదు
చుట్టూ వున్న అందాలను చూడ్డానికి
కనుపాపల్ని
ఇంకొంచెం తెరిచి పెట్టుకుందాం.


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...