అమృతం – అనన్యం

(అమృత షేర్‌-గిల్ గురించి స్మృతివచనం)

నేలమీద పెదవులు పెట్టి తలకిందులుగా మనం ఎవరమైనా నిలబడగలమా?! సర్కస్ కంపెనీవారినో టివి లైవ్‌షో డాన్స్ మేష్టర్లనో అడిగిచూద్దాం. నావంటి ప్రేక్షకులు, సందర్శకులు ఇట్లాంటి పని చేయలేరని గ్రహించి నేనాపనికి పూనుకోలేదు- అప్పుడోసారి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ మొదటి గేటు లోపల ముందుగా ఎదురయే నిర్మాణం దగ్గర నా సొంత పాదాలపై నిలబడివున్నప్పుడు. నాకు కొంచెం చివుక్కుమంది. పోనీ నే నిలబడిన చోటుని వంగి ముద్దెట్టుకుందామంటే 1. శరీరం సహకరించలేదు. 2. మొహమాటపడ్డాను. రోడ్డుమీద చర్మకారుడు చెప్పులు కుడుతోంటే అతని మీద పడిపోయి ప్రేమ కురిపిస్తున్నట్టు, లేదా నడిరోడ్డు మీద ఊరకుక్కని కరుణ పొంగేలా నిమురుతూన్నట్టు ఫోటో తీయించుకుని నలుగురూ మెచ్చే విధంగా అచ్చు వేయించుకోడం మనలాంటి మామూలు బాపతుకు కుదురునా సామీ?!

కానీ అదే నేను ఢిల్లీలో గాలిబ్ సమాధి ముందు తెలుగు అనువాదపు గాలిబ్ గీతాలు నమస్కరించి చదువుతూ చాలామంది స్త్రీల మధ్య సిగ్గువంటిది పడ్డాను. కనీసం ఓ ఫోటో తీయించుకుని పత్రికలో వేయించుకున్నా కాస్త పేరొచ్చును. (ఇలాంటి సంగతులు తీరిగ్గా ఫేస్‌బుక్ అనే ఆత్మకథాగాన వేదికపై చూస్కుందాంలెండి.) ఇంతటికీ ముఖ్య కారణం ‘ఇచ్చోటనేగదా అమృత షేర్-గిల్ బంగారుతల్లి నిలబడింది-– తన సోలో ఎగ్జిబిషన్‌ను నిజాంగారంతటి నవాబుగారు ఏర్పాటు చేసిందీనీ!’

మనమెంత! నెహ్రూగారంటి మనిషి తన గులాబీతో సహా లాహోర్ రైల్వే స్టేషన్ దగ్గర కాబోలు అమృత ముందు పడిపోయేంత పనిచేసేరు. అదీ అమృత షేర్-గిల్ అందం అంటే!

తెలివి, జ్ఞానం, కళ మిళాయించిన సౌందర్యం వున్నా, అమృత గొప్ప తిక్క మనిషి అని ఆమె హంగరీ దేశపు తల్లి కితాబు ఇచ్చింది. తండ్రి అమృతకు పట్టలేనంత స్వేచ్ఛ యిచ్చి, (అదీ గాంధీజీ ఎవరో దేశానికి పూర్తిగా పట్టనికాలంలో!) పంజరపు పిట్టని వదిలినట్టు వదిలాడు. అమృత అనే పిట్ట చిత్రకళాభ్యాసం పేరిటా మిత్రుల పేరిటా ఇటలీ, ఫ్రాన్స్, తదితరాలు గింజ కోసం అన్నట్టు మహా తిరిగింది. ఆనాటి చిత్రకళలో అత్యాధునికతను వొంటబట్టించుకున్నది. అద్భుతమైన గజల్ అంచు నుంచి జారిపడ్డ ఫ్రెంచి మద్యం అన్నారు స్థానిక ఆర్ట్ క్రిటిక్‌లు. ఎప్పుడూ? ఇంకా ఆమె ఆరంభదశ విజృంభించకమునుపే! ఎర్రటి ముఖ్‌మల్ పెదవులు పెట్టుకుని, చీర చుట్టి, కుంచె చేతపట్టిన అమృత ముందు అప్సరసలు ‘రిలీజ్ అవుతూనే ఫ్లాప్’ కాగలరు! ఎందుకోగాని ఎప్పుడూ అమృతకు తన గడ్డం (చుబుకం వగైరా అనాలా?) అంటే వొళ్ళు మండిపోయేది.

‘ఇది ఇలా వుండగా…’

అప్పటికి ఖండల్వాలా, కరంజియా, కుష్వంత్ వంటి పెద్దలకు అందని కుంచెవాటంతో ఇటలీ, ఫ్రెంచిదనపు పెయింటింగ్‌లు వేసి సాటి చిత్రకారులను బాబోయ్‌! అనిపించింది. ఒక బంధువు వంటి డాక్టర్ కుర్రాణ్ణి పెళ్ళాడింది. భారతదేశంలోని సిమ్లాలో కాలుపెడుతూనే బాంబే ఆర్ట్ సొసైటీకి జ్వరం తెప్పించింది. గుర్తింపు బహుమతి పొంది తన శైలి ఏమిటో చిత్రకళా భాషలో మాట్టాడింది, చిత్రించింది, వెర్రెత్తించిందీనీ! వయసుకి, సొగసుకి, సెక్సుకి ఎసరు పెట్టుకుని నిలువునా చిత్రకళాకళలు పోయింది. ఈలోగా మొగుడువంటి ప్రియుడుగారు ఓ సిలువ, కొన్ని మేకులూ సిద్ధంచేసి పెట్టాడు అమృత కోసం. అప్పుడామె కల చెదరడం మొదలయిందని ఆమెకే తెలిసేలోగా, తల్లికి మనస్తాపం పెరిగేలోగా ఉత్తర, దక్షిణ భారతావనిని స్కేలుపెట్టి కొలుస్తున్నట్టు గజం గజం తీరిగ్గా తిరిగింది అమృత.

అజంతా చిత్రాలని, ఎల్లోరా శిల్పాన్ని, మొగల్ మినియేచర్లని దాహంతో తాగేసి, సరికొత్తదనం తద్వారా పుట్టించటానికి అమృత తలకిందులుగా తపస్సు చేసింది. స్వీయశైలితో కొత్తదనం తెస్తున్న అమృత పెయింటింగ్ తపస్సు భగ్నం చేయటానికి కుర్ర కుష్వంత్, కజిన్స్ వంటివారు నాట్యం చేసి ఆకర్షించబోయి కంగారుపడ్డారు. నిజం.

నందలాల్ బోస్ వంటి పెద్దలను ఆమె మొదట్లో విమర్శించినా, ఆనక తీరిగ్గా భారతీయతను చిత్రకళలో స్థిరం చేయిస్తున్నట్టు గ్రహించిన అమృత తన పాత మాటలను వాపస్ తీసుకుంది. అంతా అచ్చులోనే. ఇలస్ట్రేటేడ్ వీక్లీ అమృత సెల్ఫ్ పోర్ట్రెయిట్‌ని విస్తరాకంత సైజులో అచ్చువేసి భారతీయ చిత్రకారులందరినీ గడగడలాడించింది. దక్షిణ భారతదేశ పర్యటనలో దేశీ చిత్ర శిల్ప కళల్లో ధారని, కనబడని సంగీతాన్ని, కదలికను గ్రహించింది; తన విదేశీ విద్యతో పొంతన లేదనీ అర్థంచేసుకుంది అమృత. ఈ దేశాన్ని తనకిష్టమైన పుస్తకంలా చదివింది. తిరిగి చూసింది. చూసి చదివింది. చలించి పోయింది.

అలా పరవశించిన తిరుగుడులో అజంతా, ఎల్లోరా, తంజావూరు, త్రివేండ్రం, మహాబలిపురం, ఐహోల్, పట్టడకల్ చిత్ర శిల్పాలు, కంచు శిల్పాలు, తాళపత్ర చిత్రాలు, దక్షిణాది ఫ్రెస్కోల్లోని ఆకుపచ్చ, నీలి, ముదురు పసుపు, చామనచాయల్లో సగం మసకబారిన అందగత్తెలయిన దేవతలని దర్శించింది. వారి పెద్ద కళ్ళతో అమృత చూసింది పౌరాణిక దృశ్యాల్లో ఆధునిక రేఖల వొంపుల విన్యాసాలను, చైతన్యం తొణికిసలాడే లయనీ! వీటన్నిటి సారాన్ని, మర్మాన్ని శ్రుతిబద్ధంగా కాన్వాస్‌పై ఎట్లా ధారపట్టాలో, వీటి తరువాతి పరిణామ దశ అన్నట్టు స్వీయ శైలిలోకి ఎలా దింపుకోవాలో అమ్రిత గహనంగా పరిశీలించి, ప్రయత్నించి ఫలితం మనముందుకు తెచ్చింది.

చైనా, జపాన్ దేశాలవలే వారి జాతీయత, శైలీ చెప్పే చిత్రకళ వంటిది ఒకటి మనదేశం నుంచి మన ఆధునిక రూపంలో రాబట్టాలన్న తపనతో అమృత కొత్తదారి పట్టి చిన్న వయసులోనే తనెవరో మనదేశానికీ ప్రపంచానికీ చూపెట్టింది. అప్పటివరకూ నాటకీయపు మోడలింగ్‌లోని రంగు నీడలు, వొంపులూ వగైరాలు రాబట్టిన అమృత వాటికి ఓ నమస్కారం పెట్టేసి తనదనాన్ని తెచ్చింది. అటు బెంగాల్, రాజమండ్రి, బందరు, మద్రాస్, బొంబాయి చిత్ర కళాశాలల ‘ఉత్పత్తు’లను, ఇటు సగం యూరోపియన్, కలోనియల్ నీడల రవివర్మ రకం బొమ్మలను, భావిభారత కాలండర్ బొమ్మల కళనూ — దరిదాపులకు రానీకుండా రేపటి మెలకువను నాడే ఆవిష్కరించింది.

అమృత ఆరంభించింది చిత్రకళలో నాటికి పెద్ద విప్లవమే. ముందుగా కోరస్‌లాగ, ఆపై జుగల్‌బందీలాగ, ఆ తరువాత ఫ్యూజన్‌లాగ కదలిన ఆమె చిత్రకళాశైలి ధ్వజస్థంభంలా నిలబడే దశలో హఠాత్తుగా అదృశ్యమైంది– లేదా అదృశ్యం అయే ఏర్పాటు జరిగిందనిపించింది. ఆ మధ్య అమృత మీద ఏనుగుల్లాటి రెండు భారీ పుస్తకాలు వచ్చాయి. వాటిలో ఆవిడ జీవితం, చిత్రకళ సవివరంగా విస్తారంగా వుంది. అమృత జననమరణాలు, జన్యు వివరాలూ పక్కన పెడితే ఒకటి మాత్రం స్పష్టం. అమృత నిశ్శబ్దంగా, నిద్రమత్తుగా వున్న మన దేశ ఆకాశంలో ఫెళఫెళమన్న వెలుగు మెరుపు తీగ! ఎలా వేగంగా మెరిసిందో అలా వేగంగా వెళ్ళిపోయినా అమృత పెయింటింగులన్నీ వరసన చూస్తే ఆమె ఉధృతి, ఆవిష్కరణ ఈ దేశ ఆధునిక చిత్రకళ దశకి ఎంత గొప్ప నాందీ ప్రస్థావన పలికిందో అర్థమవుతుంది. అలాంటి అమృత షేర్-గిల్ చిత్రాలు ఢిల్లీ నేషనల్ ఆర్ట్ గేలరీలో దెబ్బతిని, తింటూ వున్నాయి. పొరపాటు ఎవరిదో తెలీని దురవస్థ మొదలయింది ఆమె చిత్రాలకు. లాహోర్, సిమ్లాల నుంచీ కన్యాకుమారి వరకూ 28 సంవత్సరాల అమృత అనే అమ్మాయి ఒక తుఫాను గాలిలా తిరిగి చిత్రకళలో స్వేచ్ఛని, ఆధునిక దృష్టిని కొత్త కళ్ళజోడులా ఇచ్చిన అసాధారణ శక్తి మరిచిపోలేనిది గదా! 2013వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అమృత షేర్-గిల్ సంవత్సరంగా యునెస్కో ప్రకటించిందంటే మన దేశ చిత్రకళకు ఆమె ఎంతటి ఉన్నతి కల్పించిందో ఊహించుకోవచ్చు.

పంజాబీ నిరుపేద నీరసపు పిల్లల దిగులు కళ్ళు, దక్షిణాది బ్రహ్మచారుల గుంపు, ఉత్తరాది పెద్ద లోగిళ్ళు, హుక్కా పట్టిన జనం, పెరట్లో ఆవుగేదెలు, అవతల బరువు మోసే ఏనుగులు, బూడిద, నల్లరేగడి, ఎర్రమట్టిరంగు మనుషులు, బండ్లు, బుల్‌బుల్ పిట్టలు సందడి చేసే ఉత్తరాది చెట్లు… అన్నీ ఆమె చిత్రాల్లో చిత్రలోకాన్ని తర్జుమా చేసినట్టుంటాయి. పాల్‌ గొగేన్ చిత్రాల ఊపిరితో మొదలయిన అమృత– చోళ కాంస్య శిల్పంలో స్థిరమైనట్లు, ఆధునిక నవభారత చిత్రకళకు విమర్శ, విశ్లేషణలకు గట్టి అవగాహన కుదిర్చినట్టు, మహా నిర్మాణపు తలుపులు మనకోసం తెరిచిపెట్టినట్టు– అంతగా చిత్రించి అంతలోనే వెళ్ళిపోయింది.

ఏ సొంత సృజనాత్మక సత్తా లేకుండా వట్టినే విదేశీ చిత్రకళకు నిరర్థకమైన అనుకరణ దారిపట్టిన ఎందరెందరో దేశీ చిత్రకారులకు అమృత షేర్-గిల్ ఒక అత్యవసర నిఘంటువు. తెరచి చూసి తెలుసుకోవలసిన ఆవశ్యకం.

రంగు, రేఖలకు లేతగానూ ఘాటుగానూ పొందికలో తేడా రాకుండా శ్రుతి కుదిర్చే అమృత షేర్-గిల్ చేతివేళ్ళకు, అవి పట్టిన కుంచెలకు, అవి అద్దిన రంగులకూ నమస్కరిస్తూ, ముద్దుపెట్టుకుంటూ, ఆమె నిలచిన చోట నిలబడి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ…


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...