*ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి….

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ – ఫిబ్రవరి 8, 2010 నుంచి కొద్దిసవరణలతో…)

ద్రౌపది నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ ఇచ్చిన సందర్భంలో వచ్చిన సమీక్షలు, విమర్శలు, చదివిన తరువాత ఈ మూడు మాటలూ చెబుదామనిపించింది. ఈ నవలలో కథనీ, కథాకథనాన్నీ, ముఖ్య అంశాలనీ క్రోడికరించి ఇదివరకే చెప్పారు కాబట్టి, నేను మళ్ళీ ఆ కథ తిరిగి చెప్పనవసరం లేదనుకుంటాను. అయితే, ఈ పుస్తకాన్ని కేవలం ఒక నవలగా, కాల్పనిక రచనగా సమీక్షించడం, విమర్శించడం న్యాయం, సబబు, అన్న ధోరణి ఒకరిద్దరు వ్యక్తపరిచారు. ఈ మధ్యేమార్గ ధోరణి, లోతుకి దిగకండా, పైపైనే చూసేవారికి, చదివేవారికీ చాలా సున్నితంగా సహేతుకంగా కనిపిస్తుంది. అంతేకాదు. ఈ ధోరణి కొందరు విద్యాదికులకి, “పండితుల”కీ ఉపశమనంగా కూడా పనిచేస్తుంది.

ఈ రకమైన ఉపశమనధోరణిలో విమర్శలు చేసే వారితో నాకేవిధమైన పేచీ లేదు. అయితే, ఈ ధోరణి కొన్ని ప్రత్యేకమైన నవలలకి (special genre) న్యాయం చేకూర్చదు. ముఖ్యంగా, ప్రాచీన, పౌరాణిక గ్రంథాలలో పాత్రలని, వారి కథలని ఆధారంగా చేసుకొని చిలవలు పలవలు చేర్చి రాసిన కథలకి, నవలకీ ఈ పద్ధతి మప్పదు. ఇది కేవలం కాల్పనిక సాహిత్యం అనే పేరుతో (మిషతో) సమర్ధించడం, రాజకీయంగా ఉపకరిస్తుందేమో కాని, సాహిత్యవిమర్శా పరంగా సముచితం కాదు.

ముందుగా ప్రాచీన పౌరాణిక సాహిత్యం గురించి కొన్ని విషయాలు గుర్తుకి తెచ్చుకోవడం అవసరం. దేశవిదేశీ సంస్కృతులన్నింటిలోనూ, పౌరాణిక సాహిత్యం, మతసంబంధ సాహిత్యం, polyphonic literature అని నిరాఘాటంగా చెప్పవచ్చు. స్థూలంగా చెప్పాలంటే, ఈ పోలిఫోనిక్ సాహిత్యం — బహుస్వన, బహుస్వర, బహుళార్థక సాహిత్యం — అని అర్థం. ఈ సాహిత్యం సాధారణ నవలా సాహిత్యం కోవకి చెందదు. బహుళార్థక సాహిత్యం గురించి కొద్ది వివరణ అవసరం.

ఈ రకమైన సాహిత్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? వివిధ రకాల వ్యాఖ్యానాలకి, దృక్పథాలకీ ఈ సాహిత్యం అనువునిస్తుంది. ఈ సాహిత్యం చదివిన ప్రతి ఒక్కసారీ వేరొక అర్థం స్ఫురించడం జరుగుతుంది. కారణం: కథల్లో పాత్రలు రచయిత దృక్పథానికి ప్రతిబింబాలుగా మాత్రమే ఉండరు. అంటే, కొన్ని ముఖ్య పాత్రలు వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. రచయిత ఇది సబబా, కాదా అని నిర్ణయించడు; ఈ వ్యక్తులని, పాత్రలనీ తానే సృష్టించినప్పటికీ! మిఖయేల్ బాఖ్తిన్‌ (Mikhail Bakhtin) అనే రష్యను సాహితీవేత్త బహుళార్థక రచనలపై పరిశోధన చేసి వ్యాఖ్యాన గ్రంధాలు రాసాడు. బాఖ్తిన్‌ చేసిన వివరణ ఇంకాస్త విపులంగా తెలుసుకోవాలనుకుంటే, వెల్చేరు నారాయణరావు అనువదించిన కన్యాశుల్కం (Girls for Sale, Indiana University Press, 2007) పుస్తకం వెనుక ఆయన రాసిన వ్యాఖ్యానం చదవచ్చు. లేదా, ఓపిక ఉంటే, Morson, Emerson లు రాసిన వ్యాఖ్యాన గ్రంధం చదువుకోవచ్చు (Mikhail Bakhtin : Creation of a Prosaics, Stanford Unversity Press, 1990).

ఈ విధమైన సాహిత్యానికి రకరకాల వ్యాఖ్యానాలివ్వడానికి తావు ఉండబట్టే కాబోలు, ఈ సాహిత్యాన్ని కాలానుగుణంగా తిరిగి రాయడం, ముఖ్యంగా పాశ్చాత్యదేశాలలో, అనువదించడం, పదేపదే వ్యాఖ్యానించడం పరిపాటి అయింది. రచయితల సంస్కృతి, అనుభవం, విద్యాధిక్యతలపై ఆధారపడి, ఈ వ్యాఖ్యానాలు, వివరణలు కూడా వేర్వేరు స్థాయిలలో ఉంటాయి. ప్రాచీన కథలని ఆధారంగా చేసుకొని అల్లిన కథలని, నవలలని (fictional narratives based on epic stories) పరిశీలించే సమీక్షించి విమర్శించే స్థాయి కూడా వేరుగానే ఉంటుంది. ఇటువంటి కథలకు, నవలలకూ సమీక్షార్హత ఉన్నదని భావించిన పత్రికలలో సమీక్షకులు పూర్వ గాధలని పక్కకు నెట్టేసి సమీక్షించడం నేను ఎక్కడా చూడలేదు. అంతే కాదు; కేవలం సాహిత్యవిమర్శకే ప్రాధాన్యతనిచ్చే పాశ్చాత్య పత్రికలు (ఉదా : The New York Review of Books, The London Review of Books, The Times Literary Supplement, New Left Review, వగైరా), ఇటువంటి సాహిత్యానికి జాగా కేటాయించడం చాలా అరుదు. అంటే, ఇటువంటి పుస్తకాలని ఎక్కడ పడేసి ఉంచాలో అక్కడే ఉంచుతారు, అని అర్థం.

పాశ్చాత్య దేశాల్లో ఈ తరహా సాహిత్యానికి కొదువలేదు. మచ్చుకి కొన్ని: The Da Vinci Code, The Passion of Mary Magdalene, etc. సాహిత్యంగా వీటికేవిధమైన గౌరవం రాకపోయినా, మొదటి నవల సినిమాగా ప్రసిద్ధికెక్కింది. రెండవ దానిని ఎవరూ గుర్తించనుకూడా లేదు. ఈ రచయితలందరికీ ఒకే ఒక ముఖ్యమైన ధ్యేయం: జీసెస్‌కీ మేరీ మేగ్డలీన్‌కి లైంగిక సంబంధం ఉన్నదని చెప్పడం. చిలవలు పలవలు చేర్చి నవల రాయడం. కాల్పనిక సాహిత్యంగా దీనిని ప్రచురించి ప్రచారం చేసి డబ్బులు చేసుకోవడం. ఈ రచనలవెనుక సమర్థవంతంగా నిజమైన పరిశోధన ఏదీ ఉండదు. పరిశోధన ఉన్నట్టు అక్కడక్కడ పబ్లిసిటీ ఇవ్వడం మరొక ట్రిక్‌. అదొక గిమ్మిక్‌.

పూర్వకథ కొంతసేపు మరిచిపోయి, కథా కథనం పరంగా ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా, విమర్శలు ఉన్నాయా అని వెతికితే, ది డ వించి కోడ్‌ పై, న్యూయార్కర్‌ లో (Anthony Lane, The New Yorker, May 29, 2006) వచ్చిన సమీక్ష కనిపించింది. ఈ సమీక్ష ముఖ్యంగా సినిమా గురించి. అయిన సమీక్షకుడు ఆంథొనీ లేన్‌ కథాకథనం, నవలని కూడా విమర్శించడం వదిలిపెట్టలేదు. స్థాలీపులాకన్యాయంగా ఆ విమర్శ నుంచి ఒక్క వాక్యం మీ ముందుంచుతాను. “If a person of sound mind begins reading the book at ten o’clock in the morning, at what time will he or she come to the realization that it is unmitigated junk?” అన్న ప్రశ్నకి “The answer, in my case,” says Anthony Lane, “was 10:00.03, shortly after I read the opening sentence.” ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే , పాశ్చాత్య దేశాలలో ఇటువంటి సాహిత్యానికి ఇచ్చే ప్రత్యేకస్థానం చెప్పటం కోసమే! అయితే, పాశ్చాత్య దేశాలని మనం అనుకరించమని చెప్పటల్లేదు. మనం, మరో రెండు ఆకులు ఎక్కువ చదివి మనకి ఇష్టమైనట్టు రాసుకోవచ్చు, అచ్చు వేసుకోవచ్చు!

మనప్రాచీన గ్రంధాలు బహుళార్థక రచనలని బాఖ్తిన్‌ మనకి చెప్పనక్కరలేదు. అందులోనూ మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక (epic) గ్రంధాలు ఈ కోవలోనివే! బహుళార్థక రచనల విషయంలో మరొక ప్రత్యేకత ఉన్నది. ఒక చదువరి సంస్కృతి, అవగాహన, దృక్పథం, స్థాయిలని బట్టి ఆచదువరి ఆపుస్తకాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. పొరపాటున ఆచదువరి రచయిత కూడా అయితే, తాను చేసే వ్యాఖ్యానం కూడా అతని స్థాయి లోనే ఉండటం సహజం. ఇందులో తప్పు పట్టుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ తప్పున్నా, ఆతప్పుని ఏదోమిషతో సమర్థించవలసిన ఆవశ్యకతా లేదు.

చదువరి దృక్పథం, స్థాయి అన్నాను. దానిపై కొంచెం వివరణ అవసరం. ఉదాహరణకి: ఒకనికి భారతం మొత్తం చదిన తరువాతో (ఇది అందరికీ సాధ్యం కాదనుకోండి!) కాస్తో కూస్తో విన్న తరువాతో, భారతం మొత్తం బహుభార్యాత్వం, బహుభర్తృత్వం ప్రోత్సహించే పుస్తకం అన్న నిశ్చితాభిప్రాయం కలగవచ్చు. మరొక చదువరికి, సవాలక్ష పిట్ట కథలతో కలవరపెట్టే పుస్తకం అనే భ్రమ కలగవచ్చు. ఇంకొక శాంతివాది భారతం యుద్ధప్రేరణ పుస్తకంగా తీసి పారెయ్యవచ్చు. “ఇందులో కొత్త ఏముంది ? జ్ఞాతి వైరం లేని సంస్కృతి ఎక్కడ ఉంది? ఈ పుస్తకం కేవలం జ్ఞాతివైరం ఎంత దుర్భిక్షాన్ని కలిగిస్తుందో చెప్పే నీతి కథ,” అని మరొకరు నిర్ణయించవచ్చు. స్త్రీ వాదులకి భారతాన్ని చడామడా తిట్టటానికి కావలసినంత మేత ఉన్న పుస్తకం, మహాభారతం. వేదాంత గ్రంధంగా, రాజనీతి గ్రంధంగా అనేకరకాల వ్యాఖ్యానాలకీ, ముగింపులకి అనువైన పుస్తకం మహాభారతం. “ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ! యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌,” అని సంస్కృత మహాభారతం ఆదిపర్వంలోనే ఉన్నది. అంటే, ఇందులో ఉన్నది మరెక్కడైనా ఉంటుంది కాని, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని అర్థం.

ఒక చవకబారు కథకో, నవలకో నేను ఒక క్లూ ఇస్తున్నాను. అరణ్య పర్వంలో పంచమాశ్వాసంలో ద్రౌపదీ సత్యభామల సంవాదం ఉన్నది. ద్రౌపది సత్యభామతో ఇలాఅంటుంది. “సత్యభామా! జాగ్రత్తగా విను. ఆడవారి నడువడి చాలా కష్టంతో, జాగరూకతతో తీర్చిదిద్దుకోవలసి ఉన్నది. ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు నీకు కొడుకుల్లాంటి వాళ్ళే. (అంటే సవతి పుత్రులని అభిప్రాయం) వాళ్ళతో ఏకాంతంగా ఒకే ఆసనంపై కూర్చొని ఉండటం మంచిదికాదు,” అని. ప్రద్యుమ్నుడు రుక్మిణి కొడుకు. చాలా అందమైన కుర్రాడు, గర్విష్టి కూడాను. అలాగే సత్యభామ వయసులో చిన్నది; అందమైనదీ, గర్విష్టి! ఇంక కావలసిందేమున్నది? ఈ సంభాషణ తీసుకొని, వావి వరస లేని (incestuous) అవినీతి కథో, నవలో అల్లి పారెయ్యచ్చు. ఆ అల్లినవాడికి రాజకీయంగా కాస్త మద్దతుంటే, అది అచ్చవచ్చు కూడాను! ఏవరన్నా అభ్యంతరం చెబితే, నసిగితే, “దీనిని మీరు కాల్పనిక కథగా పరిగణించాలి కాని, పౌరాణిక కథకి దుర్వ్యాఖ్యానంగా పరిగణించకూడదు,” అని ఏ కుహనా అభ్యుదయవాదో సమర్ధన కూడా రాయవచ్చు.

ప్రజాస్వామ్య దేశాలలో వాక్స్వాతంత్ర్యం ఒక గణనీయమైన హక్కు. అటువంటి స్వాతంత్ర్యం ఎంత సద్వినియోగం చేసుకోవచ్చో అంతే దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు. దుర్వినియోగం చేసుకున్న వైనాలు కోకొల్లలు! అక్కడా, ఇక్కడా కూడాను!

ఇతివృత్తం పౌరాణిక గాథలనుంచి తీసుకొని కొత్తకొత్త కోణాలనుంచి చూస్తూ రాసిన కథలు, నవలికలూ మనకి వింత కాదు. ఇదివరకు ఇటువంటి కథలు వచ్చాయి. రచయిత కున్న పలుకుబడి మూలంగా కొన్నిటికి ఆమోదం కూడా వచ్చింది. అయితే, ఇటువంటి గ్రంధాలకి బహుమతులు, అవార్డులూ ఇచ్చినట్టుగా లేదు. పాశ్చాత్యదేశాలలో ఇటువంటి పుస్తకాలకి ఏవిధమైన అవార్డులూ ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేదు. అవి డబ్బులు చేసుకున్నాయి! అంతే! సెన్‌సేషనల్‌ పుస్తకాలకి, తమోవృత వ్యాఖ్యానాలున్న కథలకీ సాహిత్యంగా పలుకుబడిలేకపోయినా అమెరికాలాంటి దేశాలలో మంచి రాబడి మామూలే!

వాక్యానికి వ్యాకరణం ఉన్నట్టే, కథకి కూడా ఒక అనిర్వచనీయమైన “వ్యాకరణం” ఉన్నది. ఉదాహరణకి: రాముడు సీతకి పెనిమిటి. ఈ వాక్యం వ్యాకరణయుక్తంగా ఒప్పు. ఈ వాక్యాన్నే మరోరకంగా రాయచ్చు. సీతకి పెనిమిటి రాముడు, అని. వ్యాకరణపరంగా ఈ వాక్యానికీ ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు. పాడుకోటానికి బాగుంటుంది కూడాను! అయితే, ఆ మాటలే తీసుకొని, సీత రాముడికి పెనిమిటి అని రాస్తే, వ్యాకరణపండితుడికి అభ్యంతరం ఉండదు కానీ అసలు కథకే ముప్పు వస్తుంది. అల్లాగే, కథకి, కథలో పాత్రలు చేసే సంభాషణలకీ ఒక రకమైన వ్యాకరణం ఉంటుంది. ఆ అవగాహన లేక, స్వంతతెలివి ఉపయోగించి పూరణలు చేస్తే, అది అపసవ్యం అనిపిస్తుంది కానీ, రచయితని అందలాలకెక్కించదు.

ఇక పోతే, పాశ్చాత్యదేశాలలో బహుమతి వచ్చిన గ్రంధాలపై, ఆ బహుమతినిచ్చిన సంస్థ, లేదా ఆ సంస్థ అఢిపతో, సంస్థకి సంబంధించిన పెద్దో బహుమతి ఇచ్చిన పుస్తకం గురించి, బహుమతి ఇచ్చిన ప్రేరణలు, కారణాలగురించి స్థూలంగా ప్రకటనలు చెయ్యడం ఆనవాయితీ. ఒక్కొక్కసారి, ప్రత్యేకంగా వ్యాసాలు కూడా రాస్తారు.

ద్రౌపది పుస్తకానికి అవార్డు ఇచ్చిన సంస్థకి ఏ రకమైన ప్రేరణలున్నాయో ఎవరికీ తెలియదు. అంతే కాకండా ఇతర పుస్తకాలెన్ని పరిశీలనకి వచ్చాయో జన బాహుళ్యానికి తెలియదు. ఈ పుస్తకం మీద తీవ్రమైన చర్చ, సమర్ధనలూ వచ్చిన తరువాతైనా సదరు కమిటీ సభ్యులెవరైనా వివరంగా ఒక ప్రకటన ఇస్తే బాగుండేదేమో!. రమాదేవి, రామబ్రహ్మం, రమాపతిరావు పెద్దలు, గౌరవనీయులు. వీరిలో ఇద్దరు తెలుగు సాహిత్యంపై బోలెడు విమర్శలు, వ్యాఖ్యానాలు రాసిన ఉద్దండులు, ప్రముఖులు. And, of course, they are honorable people!