మనసులోని మర్మము దెలుపు . . .

మొన్నీమధ్యనే బహుబాధించి మరీ ఆనందపరచిన కవితా సంకలనం పేరు ఆగినచోటునుంచే మళ్ళీ. కవి పేరు రేఖాజ్యోతి (కవయి‘త్రి, ఫోర్, ఫైవ్’). కవితలు చదువుతోంటే కవి అనుభూతి మనలోకి అనువాదం అవుతూ బాధని బాగానే పంచింది. దాని కొనసాగింపుగా ఆనందం మిగిల్చింది. ఇందుకుగాను నేను విమర్శ, విశ్లేషణ వడగట్టిపోయగల సాహిత్య విమర్శకుడిని కాను. కవినీ కాను. ‘అసుర’ అన్నట్టు విమర్శకుడు దేనికి… పాఠకుడిగా నా యిష్టాష్టాలు చాప పరిచినట్టు పరవడానికి?! పూల హోరువలె, నిశ్శబ్దంగా పేచీపెట్టే గుండెవలె ఈ సంకలనంలో కవితలు నాలో చిన్నపాటి ఉత్సవం రేపెట్టాయి – పూర్వం నే చదివిన మహనీయుల దారినీ గుర్తుచేసేయి. కొన్ని రుబాయిలు, సూఫీ సూక్తులు, జిబ్రాన్, టాగూర్ కవితలు, పాత చైనీయ కవితలు, కొన్ని జెన్ ముచ్చటలతో సహా – ఒక రాగంలో ఒక మంచిపాట వింటుంటే మరెన్నో అదే రాగంలోని పాటలు మనసు మీద దాడి చేసినట్టే! ఇదంతా రేఖాజ్యోతి కవితల వినయ ప్రకటనే. మెటఫర్ మాయాలోకం, సాంధ్యభాష తాలూకు నిశ్శబ్ద సంకేతం మరెంతో జతకలిసి విప్పిచెప్పే కవన మర్మవీచిక ఈ సంకలనం. మరేం తోచనీయని వ్యక్తిగత మనోధర్మం ప్రశ్నల్ని పెకలించి తెచ్చిపెట్టినట్టే గుర్తుచేసే కవితల గుత్తి.

నాకు నచ్చిన కవితల్ని పుస్తకంలో టిక్ చేస్తూ చేస్తూ చూసేసరికి మొత్తం అన్నీ టిక్కులే! ఓహో ఇలా ఉందా పాఠకుడి పనీ?! అన్నట్టు! కవితల్లో అధికభాగం కల్మషం లేని నీట చిట్టి చేపల్లా మెరుస్తూ ఈదేస్తున్నాయి! నిజానికి మహా సౌందర్యాఘాతమూ నరకమే. అదేదో గట్టిగా అనుభవించిన దాఖలా ఈ కవిగారు తన గురించి ఈ పుస్తకంలో చెప్పినచోట కనిపించింది. నా సొంత అనుభూతిలో నడిచి నడిచి సీదా తిరిగి మళ్ళీ ఈ సంకలనంలోని కవితల్లోకి ఇరుక్కున్నట్టయింది. అంటే భారీ సెంటిమెంట్లు, మరికొళుందు వాసన గోల కాదు నాది. ఈ కవితలు పన్నిన వలే అంత! పుస్తకం వెనుక అట్టమీద అఫ్సర్ అన్నట్టు నా పాఠక తల ‘గాలి కెరటాలకి ఊగుతోన్న పాలకంకిలా’గయింది. పాత సాహిత్యకారుడన్నాడు కదా – ‘తలయూపింపనిది కావ్యమగునె’ అనిన్నీ?! అదీ వరస. ఇక్కడ కవితలకు ఇంత సత్తా రావడానికి ఒక కారణం, పుస్తకం మొదటి పేజీల్లో బివివి ప్రసాద్‌గారన్నట్టు కవి ‘ఇతరులనే ప్రతిబింబాల్లో తనను తాను చూసుకున్నట్టే’ రాయడం. ఇలాగే పుస్తకంలో మైథిలిగారన్నట్టు ‘సగం దివ్వె, సగం బాలిక’ స్థితిలో కవి ఎగరేసే ప్రతి గాలిపటం పడగ చందమామను తాకక మాన్లేదు. ఊహ కానిది కొంత అలాగే జరిగినట్టుంది. ఒకానొక ఋషికి అరికాల్లో కన్ను ఉన్నట్టే ఇక్కడ కవి గుండెకు ఓ చెవి ఉన్నదని ఖాయం అయింది నావరకు. రెండు మూడు కవితల్లో మినహా కవి తన మనోవీథి దాటి ఒక టెక్నిక్‌ని అనుసరించి పోలేదు. అలాగే వివిధ ప్రాంతాల కవుల ఆంధ్ర, ఆంగ్ల కవితల ప్రభావంతో ‘మూస ఊహ’ ఒకటి తయారుచేసుకున్నదేమీ కనిపించలేదు ఈ కవితల్లో. గాడ్ లివ్‌స్ ఇన్ డిటైల్స్ లాగ ‘మూసిన తలుపుల మాటున’ ఎన్నెన్ని మెటఫర్లో! పాఠకుడిని, కవినీ కలగలిపేవి – తాత్విక ప్రశ్నల్లాగ!

‘ఓపిగ్గా ఒక్కో ముడీ విప్పుతున్న జీవితం’లో ‘అక్షరమయ్యేదాకా వదలని అనుభవాల పోగులన్నీ’ చేర్చి ఒక అంచు కోసమే చీరంతా నేసుకున్నట్టు… ప్రతి పదం ఏమాత్రం భారం మోయకుండా అతి సుఖంగా, శ్రవ్యంగానూ సాగాయి ఎలావున్నావు కవితలో… తీరా నేతంతా అయ్యేకా నిట్టూర్పే ఆ మెరిసే అంచువలె జీవన చీవరం విడక్షరాలు కవితలో కనిపిస్తుంది. పూర్వం ఆనాడు ప్రియురాలు, ఈశ్వరుడు, ఆవేదన స్వభావమై పదాలు భావకవితాంబరాన్ని తాకుతున్న రోజుల్లోనే కదా సమాజం, సాటి మానవుడు, దీనజనదయాపర్వం కవిలో గురి తప్పని కవితల శరాలతో అదీ ఆకాశాన్ని తాకినది! ఇప్పుడు మళ్ళీ అదే పునరపి జననం వలె కవితలు, పాటలు గండ్రగొడ్డళ్ళవలె అడవులను ఉసిగొలిపే కాలం నిదానించి కవి చూపు అంతర్నేత్రమై హృదయలయకేసి చూసి కవితలను ప్రసరిస్తున్నది. ఈమధ్య నలుగురయిదుగురు యువకవులు రేఖాజ్యోతిగారివలె హృదయగానం మనకి వినిపిస్తున్నారు. గతంలో ఇలాంటి కవితలనే గదూ ఆత్మాశ్రయవాద కవిత్వమని, అనుభూతి కవిత్వమని, మరొకటనీ విమర్శకులు లేబుళ్ళు అంటించి పెట్టారు, విలువలూ బార్‌కోడ్‌లూ సూచించారూ! ఏం చెప్పగలం మావంటి పాఠకులం? మరి లేబుళ్ళు, బార్‌కోడ్‌లు దాటి ఇక్కడ మన ప్రయాణం మళ్ళించే కవితలివి. వాటి వెనుక ‘మనసు మీద ఏ బరువూ పడనీకుండా’ అనుభవం నేర్పిన ‘కవిత్వపు ఆసరా’ ఒడుపుగా అందుకున్నారు మన కవి. ఆ రోజు ఓ సాయంత్రం పొగచూరే రైలుపెట్టెలో, రాళ్ళపల్లివారు ఆచంట జానకిరామ్‌తో- భావకవిత్వం అంటే మరి గాథాసప్తశతి భావకవిత్వం కాకుండా పోయిందా ఏం? అని గుర్తు చేసినట్టే కొత్త తరం కవిత్వం ‘ఆగిన చోటునుంచే మళ్ళీ’ ఊపిరులందుకున్నాయి. చివరికి మరేమన్నా మిన్నకున్నా అక్షరాల నిండార కవిత తొణికిసలాడే ఈ పుస్తకంలో లేబుల్ అవసరం లేని కవిత్వం నా కళ్ళను (పాఠకుల) ‘వదిలేదెలా’! చూడండి మామూలు మాటలాడ్డంలోనే నిశ్శబ్ద కవన ధ్వని… ‘మొదటి అడుగు’లోనే మొదలయింది. ఇంక అలా ‘చిరునవ్వు వేలు పట్టుకుని’ నడిపిస్తుంది.

పదాలో భావాల మాటలో గాని ఇలా చూడండి: ‘నిన్ను వెదుక్కోవడం నాకో ఉత్సవం!’ ‘తీగ చివార్న బరువైన పువ్వు వేలాడుతున్నట్టు’ మనస్థితికి తెరతీసి చెప్పడం, ‘ఉన్నదానికి లేనిదానికి తుళ్ళిపడి నవ్వడం’, ఆపై ‘అరువు తెచ్చుకున్న కాలం’లో ఒక తెల్లని కాగితాన్ని కప్పుకొని నల్లని అక్షరాలు పొదువుకొని జ్ఞాపకాల చలిమంట వేసుకోడం.’ అలాగే, ‘నీ చూపుల్లో దాచుకున్న ఆ కాస్త కాంతి మాత్రమే నాకు తోడవుతుంద’నడంలో పదాలు పురి విప్పడం కనిపిస్తుంది. ‘కొండ కింది ఇల్లు’ అనువాద కవితే కానీ అనుభవించిందే అనువాదమయినంత బాగా వచ్చింది. అలా ‘ఆ కాసిని నిరక్షర కవనాలలోనే’ వేదనలా బయటపెట్టడం ‘తెలుస్తూనే ఉంది’. విశదం చేయలేని ‘శూన్యావస్థ’ ‘ఆ చేయి నొక్కి ధైర్యాన్ని ఇస్తున్నానో తీసుకుంటున్నానో’ అన్న మాటల్లో కరస్పర్శలా చెప్పారు కవి. ‘పది అంకెల ఇంద్రధనస్సు’లో తేలికగా చెప్పడంలో కవికి ఎంత బాధ్యత వంటి బరువు వుంటుందో! కవన మర్మం ఇది. అలాగే ‘మెత్తని పచ్చికలో దాక్కున్న పదునైన ముల్లు చకచకా నడుస్తున్న పాదానికి చివుక్కున గుచ్చుకోవడంలో సరికొత్త దృశ్యాలను అనాయాసంగా దొరకబుచ్చుకోవడం కనిపిస్తుంది. మొత్తం కవితలను వాటిలో పొందిన అనుభవాలను బట్టి మూడు భాగాలు చేశారు కవి. పరిచయ స్పృహ, అనుభవాల వేదన, అంతరంగపు మలుపులను సూచిస్తున్నాయి ఈ మూడు భాగాలు. అతడికథ కవితలో అతడి గురించి – ‘సరిగ్గా చెరిపానా లేదా అనుకుంటూనే/ యేళ్ళ తరబడి ఆమెని తనలో/ మళ్ళీ మళ్ళీ శ్రద్ధగా దిద్దుకుంటున్నాడు’ ఇది చదువుతుంటే ఎక్కడిదో ఒక గజల్ ధ్వని పలకరించినట్టయింది. దిగులుగల హాయి రేగినట్టే! ఒకానొక ఆవరణలో షెహనాయ్ ధ్వని నిండుతున్నట్టు ‘ఓరగా తీసిన తలుపు సందులో నుంచి/ రెండు జ్ఞాపకాలు తీసి అతని ముఖం మీదికి’ గిరాటేయడం కనిపిస్తుంది. శైలి, శిల్పం అంటే…’ఈ ముదురు రంగు నేతచీర/ తను నిల్పుకున్న శిల్పానికి ఏమాత్రం నప్పట్లేదు!’ వంటి స్వగతంలో జీవనసంధ్యలోని మార్పు బొమ్మ కనిపిస్తుంది. శైలీ శిల్పాలకు ఇంకేం కావాలి?

తెలుస్తూనే వుంది, పది అంకెల ఇంద్రధనస్సు, విడక్షరాలు, ఆమె, స్వగతం, ఎలావున్నావు, ఉండీ లేక – వంటి కవితలు నది మధ్యలో నిదానంగా కదులుతున్న పడవలా శాంతగంభీరంగా ఉన్నాయి. ఇవి గహనమైన చదువు (కవిత్వం వరకు కనీసం), స్వీయ తత్త్వ శోధన, తూచినప్పుడీ వలకడం వంటి కవి లోవెలుగులు చూపిస్తాయి కూడా. ఇక, తెల్లవారితే నువ్వొస్తావన్నప్పుడు, ఇంకా గుర్తున్నానా నీకు – వంటి రెండు కవితలు మిగతా కవితల మధ్య ఉండనవసరం లేదని అవి లేకపోతేనే బావుండునని అనిపించింది.

యుద్ధ మధ్యంలో శరపరంపరగా కవితలు రాయకపోవడం ఒక విధమైన మెలకువే అని ‘రాసి’ గోల పట్టినట్టు లేదనీ కవిగారితో మాట్లాడిన మాటల్లో అర్థమయింది. పుస్తకం బహు ముచ్చటగా వచ్చింది. చిన్న సంకలనం, చిన్న పిట్టలా ఉంది.

ఆగినచోటు నుంచే మళ్ళీ (రేఖాజ్యోతి కవిత్వం)
రచయిత: రేఖాజ్యోతి
ప్రతులకు: ఛాయా రిసోర్సెస్ సెంటర్, ఫోన్: +91 98480 23384; అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు.


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...