వార్త నిన్నటిదే వాస్తవమే నేటిది

నెమరు పుస్తక వీక్షణం

శ్రద్ధగానో, అశ్రద్ధగానో చదివినా, ఆయా వార్తలు ఆసక్తి కలిగించకపోయినా గానీ వార్తాపత్రికలో ఇలా కనిపించి అలా వెళ్ళిపోయే వార్తలూ వార్తాకథనాలూ నిజానికి మాయం అయిపోవు. ‘మాయం చేయబడతాయి’. ఎక్కువసార్లు అలాంటి వార్తాంశాల, వార్తాకథనాల సారాంశం కేవలం కొద్దిమంది, మరీ అతికొద్దిమంది, జర్నలిస్టులనే ఆవహిస్తాయి. ఎందుకని? నీవు ఉండే ప్రాంతంలో, నీ చుట్టూ నిలిచే మనుషుల్లో నువ్వు ఉన్నావుగనుకే. అలా కాకుండా నువ్వెక్కడో వుండి, ఆ భద్రలోకం ఏసీ నుంచీ ‘కాశ్మీరు’ వాయువులో, ‘కాళేశ్వరం’ నిజానిజాలో అవలోకించి, అవలీలగా నాలుగు ‘కాలాలు’ రాసిపడేసి చేతులు దులుపుకొని ‘జర్నలిస్టు అవార్డు’లకు వొడిగడితే, నీవంటివారి చేతులు శుభ్రంగా ఉంటాయి. ఏ పేచీ ఉండదు, ఏ దృశ్యం, ఏ సంఘటనా వార్తారూపంగా కల్లోలపెట్టే కలల్లోకి రావు గాక రావు. కానీ, నీవు వున్నచోటే వుంటూ నిన్ను వుండనివ్వని నిజానిజాలు, ఘోర ఆటవిక స్థితిగతులూ నిన్ను నిలువెల్లా అల్లుకుంటుంటే నీవు రాయక మానలేవు. (వార్తలూ వార్తా కథనాలూ) రాసి మనలేవు. మనగలిగే అవకాశం నీ ప్రత్యర్థులు రానీయరూనూ. అప్పుడు ఇంకెలాగ మిత్రమా?! ఇదిగో ఇలాంటి వార్తల వెనుక కథల భీకర శబ్దం, భయంకర వాస్తవం చవిచూసిన ఒక జర్నలిస్టు రాసిన ఒక మంచి పుస్తకం ‘నెమరు’ చదివి తెలుసుకోవడం తగినపని.

కొంచెం రచయిత, కొంచెం కవి అయినవారు జర్నలిస్టు అయితే, మరీ ముఖ్యంగా ఉద్యోగం నుంచి విడుదలయిన వారయితే రాసిందేదయినా అందులో సమాజం గురించిన నిర్దయాపర్వం పాఠకుల మనసు నిండార విస్తరించుకోగలదు… అని ‘సి.సి.’ (రచయిత) రాసిన ఆయన జ్ఞాపకాలను ‘నెమరు’ రూపంలో చదువుతోంటే అనిపించింది. రచయిత కవి, జర్నలిస్టు, ఉద్యమం తెలిసినవాడూ కావటం, వివిధ తెలుగు దినపత్రికల్లోనూ, వారపత్రికల్లోనూ పనిచేసిన గట్టి అనుభవం పీడించడం చేతనూ, తాను ఉన్న ప్రాంతంలోని దురన్యాయాన్ని, మానవీయాన్ని కొంచం కొంచంగా ప్రస్తావించినా మొత్తం సంఘటనలు మనల్ని పలవరించేట్టు రాయగలిగాడు. పాలమూరు ప్రాంతాలన్నీ తిరిగినవారికి, తెలిసినవారికీ మాత్రమే ప్రత్యేకించినట్టున్న ఈ వార్తాకథనాలు మానవత, ఆర్ద్రత గుండెనిండా గుర్తులా వున్న ప్రతి పాఠకుడినీ పలకరిస్తాయి. రంగురంగుల తెరల వెనుక రాజకీయ గుహ్యరూపాన్ని చూపెడతాయి.

కార్యమో, కాలక్షేపమో ఏదీ తోచక సగం నిద్రలో ఎడం చేత్తో ఏవో జ్ఞాపకాలు రాసిపడేసిన (మన నెత్తిన) తీరు కథలు కావు… పుస్తకం నిండార వున్న చిన్న చిన్న సంగతులన్నీ మనిషి స్పృహ తాలూకు తేమ ఏ మాత్రం ఎండిపోకుండా వున్నా, దానికి పని కల్పిస్తాయి. పత్రికల్లో వార్త చదవనివాళ్ళకు సైతం వారి ఆలోచనల్లో చిన్నపాటి సుడిగుండమొకటి బయలుదేరి ‘వాట్ మస్ట్ బి డన్?” అని నిలదీస్తుంది.

నిజమే… ఈ పుస్తకంలోని మనుషులు, సంఘటనలు చాలావరకూ వాస్తవాలుగా గతించిపోయినవే. మరోచోట తల ఎత్తి తిరుగుతున్నవే కానీ, ఇప్పుడూ, రేపూ ఇవేమైనా పునరావృతమయితే, అదీ మన ఎదుటే, మనం వాటిని ఎలా ఎదిరించి నిలవగలమూ? అని ప్రశ్న పడగవిప్పేట్టు కలవరపెడతాయి. ‘జర్నలిజంలో ఉన్నత విలువలు నిలవడం’, ‘కలం వీరులు – నాడు, నేడు’ అంటూ సరసాలు ఏవో రాసి విసిరేసి రాత్రివేళల ప్రసంగాల్లో ఎత్తుకు పైఎత్తు ఎగిరెగిరిపడుతూ వృత్తితో వాణిజ్యం చేయడం ఈతనికి (సి.సి.) చిర్రెత్తించే విషయం. అటువంటి వ్యక్తిత్వం వలన పడరాని తిప్పలు వృత్తి, ప్రవృత్తి రీత్యా పడి, లేచాడు. అందుకే అన్నిటికంటే అతి సులువుగా త్యాగం చేసుకోగల పదార్థం ‘వ్యక్తిత్వం’ అని గుర్తించిన చిన్న, పెద్దల గురించిన కథలు ఈ పుస్తకంలో దిష్టిబొమ్మల్లా నిలిపాడు. రచయిత తాను వృత్తిలో వుండగా ‘రిపోర్టు’ చేసిన వట్టి వార్తలు కావు ఇవి. ‘నెమరు’ వేసుకున్న వృత్తి కథనం వెనకబడి న్యాయం జరగక దిక్కులేని స్థితిలో వున్నవారి సంరక్షణ గురించి నానాయుద్ధం చేసిన తీరు కనిపిస్తుంది. అందువల్ల హితులు, స్నేహితులు తన, పర, అంటూ వేరు చూడక రచయిత తన మనిషితనం ప్రదర్శించిన సంఘటనలు అన్నీ ఇన్నీ కావు.

పాలమూరు దీన దృశ్యం, వలస కూలీ బతుకుల చీకటి రంగు, రుచి తెలిసిన ప్రతివాడూ తమ కళ్ళు చెమర్చేట్టు నెమరు నిండా రాశాడు రచయిత. ఈ వార్తాకథనాలను రచయిత మరింత వివరంగా, పొడవుగా రాసినా ఇంకా బాగుండేదనిపించింది. ఐనా, రాజకీయ నాయకుల స్నేహం దగ్గర, వృత్తి పెద్దల వద్ద, కుల పెద్దల వద్ద స్వలాభం కోసం రబ్బరులా సాగడం, అల్యూమినియం తీగలా అష్టవంకర్లూ పోకుండా, లబ్ధి పొందకుండా ధన రాజకీయ అధికార వర్గాల్లో వలయాల్లో వణుకుపుట్టించే సాహస విశేషాల వైనం ఈ పుస్తకంలో ఉంది. దాదాపు ముప్పయి సంవత్సరాలకు పైగా సొంత ఊరిలో సైతం ప్రమాదం ఉన్నాగానీ చలించకుండా సాహస గాథలు వివరించి, సమాజం ప్రేమ, స్నేహం, గౌరవం పొందిన సత్సంకల్పం వంటివి ప్రతిధ్వనించారు రచయిత ఈ పుస్తకంలో.

సాహిత్య దృశ్యాలు ‘నెమరు’వేసుకుంటున్నవేళ తనదయిన అభిప్రాయం చదువరులకు వచ్చినా, నచ్చకున్నా, పట్టింపు లేని ధోరణిలో నిష్కర్షగా రాశారు రచయిత. ఈ పుస్తకమొక జీవన పర్వం!

అమీను పుల్లయ్య, పాలమూరు వలస గాథల వంటి వార్తాకథనాలే గాక దారితప్పిన రచయిత, సాహిత్య జీవి ‘నల్లపురెడ్డి’, కె.ఎన్.వై. పతంజలి స్మృతి వంటి సాహిత్య దృశ్యాలు, పుస్తక సమీక్షలు, కొన్ని స్వీయ కవితలు మనతో ఈ పేజీల్లో సంభాషిస్తాయి. నెమ్మదిగా కదుల్తున్నట్టు ఉండే పదాల, అక్షరాల వెనక రచయిత కదలిక, చైతన్యసారం సరాసరి గుండెకు చేర్చే సులభశైలి కనిపిస్తూందీ పుస్తకంలో. ఆపై, ఈ వార్తాదృశ్యాలు మనల్ని పలకరిస్తున్నట్టే హెచ్చరిస్తాయి. మన కనురెప్పలవెంటే మాటువేసి వుంటాయి.


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...