క్షణాల నుంచి క్షణికాలకు

విషాదమల్లా ఏడవటానికి కారణం తెలిసినప్పుడే” – మో.

ఈ బాల్య లక్షణం దాటాక, విషాదమేమిటంటే, శోకించడానికి స్పష్టంగా కారణాలు కనిపిస్తున్నా ఏడవలేకపోవడం. ‘నన్ను మనసార ఏడ్వనిండు’ అని కవి, దేవులపల్లి మన తరఫున ప్రాధేయపడింది చుట్టూ మనుషులను కాదేమో. మన లోపలి పరాయితనాన్ని, మొద్దుబారుతున్న స్పృహను, లోపల కొడిగట్టుతున్న స్పందించగల శక్తిని. అందుకే, అవి పునర్జ్వలించి మనిషిని ఒక జీవప్రవాహం చేయడానికి సదా బాలకుడిగా ఉండటాన్ని అధ్యయనం చేస్తారు కొందరు.

పిల్లల సహజలక్షణం, నిద్దర పట్ల పెద్ద చిరాకు ఉండటం. అది ఆవహించినపుడే ఏమైందో తెలీక ఏడుస్తుంటారు.

Sleep is where we can’t play. బేసిగ్గా ఇతని బాధ ఇదీ! ‘నిద్దుర మాని ముద్దుగా తంబుర బట్టి’ గుర్తుకు రావడం లేదూ?! ఇతనికి నిద్దురలో కనిపించే లోకాలనూ ఇలానే లోతుగా చూడగలిగితే బహుశా ఈ మాట అనడేమో అనుకుంటాం కాని అది అతనికి సంబంధించిన లోకం కాదు. ఇది వేకువలో, మెలకువలో మాత్రమే సంభవించే లోకం. ఈ లోకంలో తనని తాను పరీక్షించుకొనే ఈ శస్త్రచికిత్సలో బాధను మర్చిపోయే మందు ఇతనికి అక్కరలేదు. ఇతని అన్వేషణ ఆ బాధ గురించే. దాని మూలాల గురించే.

తను తరిచి చూడాలనుకుంటున్న తత్‌క్షణంలో స్థలమూ కాలమూ తనూ (ఏకాకిగా, సమూహంగా) కలిసిపోయి ఉన్నాము అని అనుభవమయ్యాక తన పరిధిలో తాను అధ్యయనం చేయగలిగినది ఆ మూడింటిలో ‘తను’ అనే ఒక వస్తువును మాత్రమే అనే సత్యదర్శనం కలగటమే ఈ క్షణికాలు అన్న పుస్తకంలోని రాతల వెనుక ఉన్న కార్యకారణాలు. అందుకే ధీరజ్ పేజీలొక్కొకటీ స్వీయపరీక్ష కోసం తెరవబడిన అంతరంగ శకలాలు. ముందే ఉన్న గాయం రేగిందో, ఈ నిత్యానుశీలనం అనే కత్తిగాట్లకు కొత్తవే మరి కొన్ని ఏర్పడ్డాయో?

పరాయి దేశంలో తారసపడిన ఒక వృద్ధుడి పాక్షిక పక్షవాతపు రొటీన్ అయినా, తనకు మాత్రం పాన్ ఐస్‌క్రీమ్ కొనుక్కుని ఇంటికొచ్చాక వాచ్‌మన్ కొడుకు కనపడి ఇచ్చే గిల్టీకాన్షస్‌నెస్ అయినా, పుచ్చిన పన్ను ఇచ్చే నొప్పి, అది నొక్కితే వచ్చే హాయి లాంటి విడిచిపోయిన ప్రేమ తాలూకు స్మృతి అయినా, మరింకా ఇలాంటి క్షణికాలన్నీ కలిసి ప్రస్తుతపు తను. విడదీయలేని, విడదీసి మనలేని తన అస్తిత్వం.

ఏదైనా, అవన్నీ కొత్త ఆలోచనలు, పాత జ్ఞాపకాలు, మార్మికమైన కలలు, మరొకరి కలలతో ఓవర్‌లాప్ అయిన కలలూ అన్నిటినీ కలిపి నేసిన ఒక అందమైన కలనేత. A tapestry of reality, dreams, illusions, questions and memories.


ఇతనికి ఒక బాధ కాదు, తనకు ఊహ ఆలస్యంగా తెలిసింది అనే దిగులు, జ్ఞాపకాలూ గుర్తుండవేమో అని భయం కూడా.

నిజానికి ఇవి రెండూ వరాలు.

వాటిని వదిలేసుకుని జీవించే ప్రతి క్షణం అది కర్కశమో సౌందర్యపూరితమో, ఒక పువ్వుని నాజూగ్గా స్పృశించడానికే తటపటాయిస్తున్నట్లుండే తన మనసుతో సమీపించి దాని మేకింగ్ లోని మర్మాన్ని తెలుసుకోవాలని ఉపక్రమించాడు. తనకు తారసపడే వ్యక్తులో, వస్తువులో, దారులో, క్షణాలో అలా అన్నింటి మజ్జా అస్థిగత సత్యాలు తెలుసుకునే మార్గంలో ఎంతో యాతన ఉంటుంది. అందుకు సిద్ధం అయినవాడే ధీరుడు.

అందుకే, ఇతనికి ఇష్టమైన ఆట ప్రతీదీ ప్రశ్నించడం, చిన్నపిల్లల లాగా. ప్రతీదీ ఒక అద్భుతంలాగా, ప్రతీదాని వెనుకా ఏదో ముర్మముంది, అదేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత. ఎందుకు, ఎందుకు, ఎందుకు అని పిల్లలందరూ ఎడతెరపి లేకుండా అడిగే ప్రశ్నలు. తెలియనిదంతా తెలుసుకోవాలనే తపన. తన చుట్టూ నడిచే ప్రపంచం, దానిని నడిపించేదేంటి? ఎలా? ఎందుకు?

మనలో చాలామందికి వయసుతోపాటూ ఈ కుతూహలం కరిగిపోతుంది. ధీరజ్‌కు కాదు. ఇతను సదా బాలకుడు. ఇతని కుతూహలం ఇతనితోపాటే పెరిగి పెద్దయింది. మరింత లోతుగా ప్రశ్నించడం నేర్చుకుంది. ఆ కుతూహలం అతనికి అవసరం. కనిపించేదయినా, కనిపించనిదయినా ఈ ప్రపంచపు నిజాన్ని, అతని ‘నిజాన్ని’ అతను తెలుసుకోవడం అతనికి అతిముఖ్యం.


దత్తుగాడి బాల్యం, రంగురాళ్ళ కల, ఆ ఇంటి కథ… అన్నీ అలవోకగా ఒకే ఫ్లోలో వ్రాసినట్లు కనపడుతూ చేయి తిరిగిన రచయిత రాసినట్లుండే చిక్కటి నిర్మాణం గల కథలు. కొన్ని స్పష్టంగా ఆత్మకథనాత్మకాలు, కొన్ని ప్రచ్ఛన్న స్వీయానుభవప్రకాశాలు.

బాల్య జ్ఞాపకాలను తడిమినపుడు వచ్చే కవిత్వం ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనది, అది కాగితంపైన పెట్టడం చేతనైన ఏ కవికైనా. కథగా మొదలుపెట్టినా, అది కవితలానే తేలుతుంది! ఒక చక్కటి ఉదాహరణ, దత్తుగాడి బాల్యం – నేనై ఉండి నావి కాని క్షణాలను తెలుసుకోవడం సగం జన్మ ఎత్తి మరో సగం జన్మ ఏరుకోవడం! ఏదో సముద్రతీరాన గవ్వలు ఏరుకునే పిల్లవాడు పొడగడతాడు. పిల్లవాడు గవ్వకూ వజ్రపు రవ్వకూ, ఇసుకకూ తనకూ తేడా చూడడు.

ఇతని కథలూ కవితలన్నీ కలిసి ఒకే మెలాంఖలిక్ గీతం! అచ్చం విషాదమే కాదు. కానీ శోకపుజీర లేకుండా సౌందర్యలహరి ఉండదనే ఎఱుక గల కవి ధీరజ్.

ప్రేమానుభవపు తొలి సంతానం తన తన్మయ క్షణం!

పై పోర్షన్‌లో ఆగిపోయిన ఒక వృద్ధ ఊపిరి.

ఒక క్షణమే! ఒకచోట మిథునం, జన్మం, సమీపంలోనే మరణం! విడివిడి విషయాలుగా వదిలేయదగిన వీటిల్లో తన దృష్టి ఒక సృష్టి సూత్రాన్నేదో దర్శిస్తుంది.


కొన్నిసార్లు ఈ కవి నొసలు చిట్లిస్తుంటే నోరు నవ్వుతుంటుంది. నిరాపేక్షతో చూస్తున్నట్టు కనపడుతూనే ఒక్కోసారి చుట్టూ ఉన్న దుఃఖంతో మమేకం అవుతుంటాడు. ఇవి అవలక్షణాలు కావు. ద్వైతం ద్వైదీభావం లోకం తీరు. మనసు తీరు కూడా. ఒక్క వీక్షణంతో రెండింటిలో సాకల్యంగా జీవిస్తూ వాటినుంచి చాకచక్యంగా విడిపడగలిగిన కోవ ఒకటుంటుంది. ధీరజ్ ఆ కోవలోకి చేరుతూ ఉన్నాడు. బళ్ళో ఆయా ఆయమ్మ గురించి ఆలోచించడంలో ఉన్న మమేకతను, నిండా అమాయకత్వంతో నిండిన అమ్మమ్మను ‘తను’ అని సంబోధించగలగడంలో పరాయితనాన్ని ఒకేసారి గుర్తించగలిగిన వాడితను. అందుకే జీవం కోల్పోయి పక్కకు పడిపోయిన ముసలాయన చేతికున్న వాచినే చూస్తూ నిలబడిపోయేది ఇతను కాదు. ఇతనిలాంటి వాడొకడు!

ఇతను ఊర్ణనాభి, కానీ తన గజిబిజి ఆలోచనల, చిక్కుపడిన జ్ఞాపకాల వలలో పడడు. అందుకు భిన్నంగా, తన అనుభవగత సత్యాలను కవనపు దర్పణాలుగా ఐంద్రజాలిక ఉపనయనాలను తయారుచేసుకున్నాడు. దుర్భేద్యంగా ఘనీభవించిన రంగు వజ్రపురాళ్ళను మళ్ళీ పూవులుగా, తిరిగి చైతన్యం పొందిన క్షణాలుగా చూపించే అద్దాలవి.

ఎఱుకతో జీవించడం, ప్రేమో, వియోగమో, చిలిపి సంతోషమో, ముడతలు పడి పొడిబారిన విషాదమో! ఏదైనా అతని చైతన్యం మీద ఒక వెలుతురు రేఖ విసరకుండా పోలేదు.


అన్నిటికన్నా తన పెద్ద భయం, తననూ తన పుస్తకాన్ని ‘ఫలానా’ అని లేబుల్ చేస్తారేమో అనిట! ముందుమాటలో చెప్పాడు.

తన పెన్‌లో కనిపించని అల్లరి ఉంది, కనిపిస్తూ సంయమనమూ ఉంది. అరుదైన ధైర్యం ఉంది; చెప్తున్న విషయం అదే అయినా, అందులో నిజాయితీ ఉన్నా కొందరు ఉచ్చరించడానికి సంకోచించే ఫిలాసఫీ, స్పిరిచ్యువాలిటీ తత్సంబంధిత భాషా భావాలను వాడితే ఎక్కడ అనాగరీకుణ్ణి అవుతానో అనే భయం లేని ధైర్యం!

ఇది కొత్తతరం కవిత్వానికి ఆశాదీపం. నిజాయితీ గల రాత. అన్నిటికీ మించి, నిమిష నిమిషం ఒకానొక ఎఱుకతో గడిపిన జీవితపు రికార్డు. ఆ ఎఱుక మనిషి జీవితాన్ని బాగుపరుస్తుందనే బలమైన నమ్మకం ఇతనిది. అందుకే చెప్తాడు ‘ఇదిగో, నన్ను నేనిలా పూర్తిగా వొంపేసుకుంటున్నా’ అని. ఇతనికి నిజానికి ఏ భయమూ ఉండకూడదు. ‘రాయడం అనేది సిగ్గు విడిచి చేసే ప్రక్రియ’ అని మాత్రమే ఇతను ఆగిపోయాడు. అది ఒక నిస్సిగ్గు ప్రయాణం అని తెలిసిన ఇతనికి తను ఈ ప్రపంచం అంతా పరుచుకున్న నీరులాంటి వాడని, ఏ పాత్రలో ఒంపితే ఆ పాత్ర రూపమే తనదనుకునే ఈ ప్రపంచపు లేబుల్ చూసి, నిత్యానుశీలనం అనే కత్తిగాట్లకే వెరవని ఇతను, భయపడవల్సిన అవసరం కనపడదు. కాని, ఇదీ ఎంత కాలం! ‘ఎన్ని పుస్తకాలు రాసినా అన్నీ ఒకే పుస్తకం’ అన్న ఎఱుక ఉన్న ఇతను వీటినీ దాటిపోతాడు మన కళ్ళముందే.

ఇతని వ్రాతలన్నీ జీవించడంపై మినిట్ బై మినిట్ కామెంటరీస్ అనకుండా ఉండలేము. ఎలా ఉండగలం? అతనే అనేశాక ‘క్షణాలనుంచి క్షణికాల వరకే కదా ఈ ప్రయాణాలన్నీ‘ అని!


పుస్తకం: క్షణికాలు – Of lights and lives (2023)
రచన: ధీరజ్ కశ్యప్ వేముగంటి
ప్రచురణ: బోధి ఫౌండేషన్, హైదరాబాద్
వెల: ₹150.00 పే. 130.
ప్రతులకు: అమెజాన్.ఇన్, లోగిలి, చెరీ పిక్ (అమెరికా), ప్రముఖ పుస్తక దుకాణాలు.