కొత్త చిగురు

అమ్మ ఇంకా పక్క మీదే పడుకుని ఉంది. నేను మంచం పక్కనే నేల మీద ముడుచుకొని పడుకున్నాను. ఇంట్లో నేనూ అమ్మా మాత్రమే మాకెప్పుడు కావాలంటే అప్పుడు లేవగలిగింది. తరతరాల నుంచీ మా ఇంట్లో అందరికీ పెందలాడే లేవాలనే నియమం ఉండేది. లేచి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాల్సొచ్చేది. విశ్రాంతిగా కాస్త పొద్దెక్కి లేచే సుఖం కోసం నేనూ అమ్మా నాన్నతో గొప్ప యుద్ధమే చేయాల్సొచ్చింది. అమ్మకి ఉబ్బసం, నాకేమో కీళ్ళ నొప్పులు. పొద్దున్నే ఇద్దరికీ ఇబ్బందిగా ఉండేది.

బయట నుంచి గుర్రం జూలు విదిలించిన శబ్దమూ గంటల శబ్దమూ వినిపించాయి. అంటే బగ్గీ సిద్ధమైందన్నమాట. కొట్టు తాలూకు తాళాల గుత్తి చేతిలోకి తీసుకుంటాడు నాన్న. గడియారం ముల్లు ఎనిమిదిన్నర వైపు కదులుతూ ఉంటుంది. నాన్న క్వీచ్ క్వీచ్‌మనే తన కిర్రు చెప్పులు వేసుకుంటాడు. తర్వాత గొడుగు సరిగా పని చేస్తుందా లేదా చూడ్డానికి దాన్ని ఒకసారి తెరిచి మూసిన శబ్దం వినిపిస్తుంది. ఇదంతా రోజువారీ రివాజు.

నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. సన్నని సూర్యకిరణం ఒకటి లోపలికి చొరబడి ఏటవాలుగా గాజు గొట్టం లాంటి వెలుగు రేఖ గీసింది. అందులో వలయాలు సృష్టిస్తూ దుమ్ము.

నాన్న! పక్క నుంచి సగం కళ్ళజోడు కనిపిస్తోంది. విభూతి రేఖలు, వాటి మధ్య చందనం చుక్క, దానిలో ఎర్రని కుంకుమ బొట్టు పక్క నుంచి సగం సగమే కనిపిస్తున్నాయి.

“అంబీ, ఇక నిద్ర లే!”

కళ్ళు మూసుకున్నాను. కొంచెం కూడా కదలకుండా గాఢనిద్ర నటించాను.

“పనికి మాలినోడా, నాన్న పిలుస్తున్నారు, లే” అమ్మ. కన్ను ఓరగా తెరిచి నాన్నను చూశాను. ప్రశాంతంగా కనిపించాడు.

“అంబీ లే! లేచి ఏదైనా తిన్నాక ఆనైపాలెం వెళ్ళు. రౌదర్ ఇంటికి వెళ్ళి కొట్టుకు తీసుకురా. నేను వెళ్ళి బగ్గీని పంపిస్తా.”

ముందు అమ్మ వైపు, తర్వాత నాన్న వైపు చూశాను. నిన్న సాయంత్రం నాన్నకీ, రౌదర్‌కీ మధ్య జరిగిన కొట్లాట గురించి అమ్మకి చెప్పేశాను రాత్రే.

“రౌదర్ లేకుండా కొట్టు చూసుకోలేరా మీరు? ఒక రోజు జత కట్టడం, మర్నాడు పోట్లాడుకుని విడిపోవడం మీ ఇద్దరికీ అలవాటైపోయింది” అంది అమ్మ.

నాన్న మొహం ఎర్రబడింది. ఇంకాస్త ఎర్రబడిందంటే, ముక్కు కొన నుంచి రక్తం చిందుతుందేమో అనిపిస్తుంది.

“ఓనమ్ పండగ నాలుగు రోజుల్లో ఉంది. పోనీ నువ్వొచ్చి కట్టు లెక్కలు!” అరిచాడు నాన్న. కోపంతో పెదవులు వంకర్లుపోయాయి. మాటలు తడబడ్డాయి.

“లోకంలో రౌదర్ ఒక్కడేనా లెక్కలు తెలిసిన మనిషి?”

“నోర్ముయ్” అమ్మకి ఆర్డర్ వేసి నా వైపు చూసి “ఇహ లే నువ్వు” అన్నాడు నాన్న.

ఒక్క ఉదుటున లేచి సంధించిన బాణమల్లే నిలబడ్డాను.

“పో, చెప్పిన పని చెయ్!”

నేను గదిలోంచి బయటికి వచ్చేసరికి గుర్రపు బగ్గీ కదిలిన చప్పుడు వినిపించింది.

గబ గబా తయారై పంచె కట్టుకుని, పొడుగు చేతుల చొక్కా వేసుకున్నాను. తరచూ ఆయన మీద వచ్చే కోపం ఇవాళెంచేతో లేదు. పైగా నాన్న మీద కొంచెం ప్రేమగా కూడా అనిపించింది. పాపం, తనంతట తనే చిక్కుల్లో పడ్డాడు. ఆపుకోలేని కోపంతో రౌదర్‌తో మాట్లాడి ఉంటాడు.

కొంచెం నెమ్మదిగా మాట్లాడితే ఏం? ఏ కోపదారి మనిషయినా ఎప్పుడో ఒకసారి నెమ్మదిగా మాట్లాడతాడు గానీ నాన్న కాదు. కోపం మూర్తీభవిస్తే అది నాన్న! శాంతం ఎక్కడినుంచొస్తుంది?

అదే అమ్మతో అంటే అమ్మ నవ్వింది. వెంటనే నవ్వాపేసి “తెలివైనవాడివే గానీ నీ తెలివి వాడి రౌదర్‌ని కొట్టుకు తీసుకురా పో” అంది. గుండె మీద చెయ్యి వేసుకుని “నిన్న జరిగిందానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పానని రౌదర్‌కి చెప్పు. సరేనా?”


గుర్రపు బగ్గీ ఎక్కుతూ అనుకున్నాను, ‘రౌదర్ లేకపోతే ఓనమ్ పడగ రద్దీని కొట్లో తట్టుకోవడం కష్టమే.’ అతని లాగ లెక్కలు ఎవరు వేయగలరు. మెరుపు వేగంతో ఎంతెంత నోటి లెక్కలైనా చేసెయ్యగలడు. ఐదుగురు మనుషులు పెన్నూ పేపర్లూ పుచ్చుకుని లెక్కలు వేస్తున్నా, వాళ్ళ కంటే ముందే రౌదర్ ఆ లెక్క తేల్చగలడు. కొట్టుకు ఆనవాయితీగా వచ్చేవారంతా కూడా ‘అమోఘమైన బుర్ర రౌదర్‌ది’ అని అబ్బురపడతారు. ‘చెవులతో వినే ఇంత వేగంగా లెక్కలు తేలుస్తున్నాడే, అదే కళ్ళు కూడా ఉండుంటేనా?’ అంటుంటారు. అదీ గాక రౌదర్ కేవలం మూడో తరగతి వరకే చదువుకున్నాడు. కొట్టు తుడిచి శుభ్రం చేసే గోమతి కంటే రెండు క్లాసులు తక్కువే.

నాన్నకీ రౌదర్‌కీ గొడవ నిన్న సాయంత్రం జరిగింది. “నీ బాకీ ఇలా కొండలా పేరుకుపోతుంటే ఏం చేద్దామని రౌదర్?” అన్నాడు నాన్న. అంతకుముందే రౌదర్ ఇంటిల్లిపాదికీ కొట్లో బట్టలు తీసి పెట్టుకుని ఉండటంతో నాన్న ప్రశ్న అతనికి కోపం తెప్పించింది. ఖాతాలో రాసుకోమని నాన్నని అడగాలనుకుంటున్నాడు. ఇంతలో నాన్న ఈ మాటన్నాడు.

“ఏం చెయ్యను అయ్యగారూ, ఇంటి నిండా ఆడవాళ్ళేనాయె. నా కొడుకులు, అల్లుళ్ళూ కూడా ఎందుకూ పనికిరారు. నలుగురు కూతుళ్ళు, నలుగురు కొడుకులూనాయె. ఎనిమిది మంది మనవరాళ్ళు, ఎనిమిది మంది మనవళ్ళూ. మొత్తం ఎంతమందయ్యారూ? ఒక్కొక్కరికీ ఒక్కో గుడ్డ ముక్క ఇచ్చినా తడిసి మోపెడవుతుంది.”

నాన్న రౌదర్ వంక ఎలా చూశాడంటే, పరిస్థితి చెయ్యి దాటిపోతోందనిపించింది. రౌదర్ ఎలాగైనా దీన్లోంచి బయటపడాలి.

“కోలప్పన్, బట్టలన్నీ మడత పెట్టి బిల్లు ఇవ్వు నాకు” రౌదర్ చెప్పాడు.

నాన్న అనుమతి ఇవ్వకుండానే బట్టలు తీసుకోడానికి రౌదర్‌కి ఎన్ని గుండెలుండాలి? నాన్న మొహం ఎర్రబడిపోయింది.

“మళ్ళీ అప్పు ఇవ్వడం కుదిరే పనేనా?” కోపం ఉట్టిపడింది నాన్న గొంతులో.

“ఐతే ఇహ మన సంబంధం తెగినట్టేనా అయ్యగారూ? సరే, పదమ్మాయ్, ఇంటికి తీసుకెళ్ళు నన్ను!” రౌదర్ కూడా తగ్గలేదు.

లేచి నిలబడ్డాడు. గోమతి అతని ఎడమ చెయ్యిని తన కుడి భుజం మీద వేసుకుని ముందుకు నడిచింది. రోజూ కొట్టు కట్టేసేటపుడు రౌదర్ నాన్న దిక్కుకేసి అనుమతి పూర్వకంగా చూస్తాడు.

ఇవాళ చూళ్ళేదు.


ముందు గోమతి ఇంటికి వెళ్ళి ఆమెతో కలిసి రౌదర్ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. అది అతని బాధను కొంత పల్చన చేస్తుందేమో అని. కానీ గోమతి ఇంట్లో లేదు.

“కొట్టుకు రానని చెప్పమని గోమతిని మీ ఇంటికే పంపాడు రౌదర్” అన్నది వాళ్ళమ్మ.

పక్కనే ఉన్న ఒక అడ్డదారి పట్టుకుని, ఇరుకు సందులోంచి వెళ్ళి రౌదర్ ఇంటికి చేరాను. నాపరాళ్ళు పరిచిన ఇల్లు. ఇంటి కప్పు బాగా కిందకు దిగి ఉంది. ఇంటి ఆవరణలో ఒక పక్కగా గిలక బావి, పెచ్చులూడిపోయిన దాని గోడ నిండా ఆకుపచ్చని నాచు పరుచుకుని ముఖమల్ లాగ మెరుస్తోంది. ఇంట్లోకి రాతి మెట్లు. గుమ్మానికి గోనె పట్టా తెర వేలాడుతోంది.

“నేను, అంబిని” అన్నాను అక్కడ ఎవరూ లేకపోవటాన.

లోపలి నుంచి ఒక చిన్నపిల్ల వచ్చింది. దాని వెనకే మరొకతె. ఇద్దరూ కవలలు కాబోలు, ఒకేలా ఉన్నారు.

“ఎవరమ్మా వచ్చిందీ?” లోపలి నుంచి రౌదర్ గొంతు.

“నేను, అంబిని.”

“రా, లోపలికి రా బాబూ” రౌదర్ గొంతు సంతోషంగా ధ్వనించింది.

గోనెతెరను పక్కకు నెట్టి లోపల అడుగు పెట్టాను. ఇల్లంతా పేడతో శుభ్రంగా అలికి ఉంది. రౌదర్ కాలు మీద కాలేసుకుని దర్జాగా కూచుని ఉన్నాడు. నా కోసం ప్రేమగా చేతులు సాచాడు. వెళ్ళి అతని ముందు మోకాళ్ళ మీద కూచున్నాను. నన్ను ఆలింగనం చేసుకున్నాడు. చూపున్న నాటి దృశ్యాలేవో గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు కళ్ళు బలంగా చికిలించి మళ్ళీ మళ్ళీ తేరిపార చూడటానికి ప్రయత్నించాడు.

నన్ను లాగి పక్కన కూచోబెట్టుకుని తడిమి చూస్తూ “ఇవాళ పంచె కట్టినట్టున్నావు. ఏం అంచు?” అడిగాడు.

“ఐదు చారల అంచు”.

“అయ్యగారిలాగే అన్నమాట. కొట్లో కుర్రాళ్ళు చెప్తారుగా, నువ్వు అచ్చం అయ్యగారిలాగే ఉంటావని. నా దురదృష్టం, నిన్ను చూడలేను.” నా కళ్ళు, నుదురు చెంపలు అన్నీ తడిమి చూస్తూ “అన్నీ తీర్చిదిద్ది పెట్టాడు, దేవుడు” అన్నాడు.

నేనొచ్చిన పని చెప్పడానికి ఇదే మంచి సమయమనిపించింది. కానీ గొంతులో మాటలు ఇరుక్కుపోయాయి గానీ బయటపడవే!

నెమ్మదిగా గొంతు సవరించుకుని “అమ్మ…” అన్నాను మొదలెడుతూ.

“అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది?” అడ్డుపడ్డాడు రౌదర్.

“ఎప్పట్లాగే ఉంది.”

“నా దగ్గర ముళ్ళ వంకాయల లేహ్యం ఉంది. ఉబ్బసానికి దానికి మించిన మందు లేదు. అయ్యగారికి మాత్రం సీసాల మీద ఇంగ్లీష్ మందుల పేర్లు ఉండాలని కోరిక. నా దగ్గర మందు ఉంది. ఇంగ్లీషు లేదు” అని తన హాస్యానికి తనే పెద్దగా నవ్వాడు.

అమ్మయ్య, ఇదే సమయం.

“మిమ్మల్ని కొట్టుకు తీసుకురమ్మని అమ్మ పంపింది. నిన్న నాన్న ప్రవర్తన మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే, క్షమించమని అడిగింది” చెప్పేశాను!

రౌదర్ మొహం వెలిగిపోయింది. “మహాతల్లి” చేతులెత్తి దణ్ణం పెట్టాడు.

“పద, కొట్టుకు పోదాం” ఉన్న పళాన లేచాడు.


ఆ ఏడాది ఓనమ్ పండక్కి కొట్లో అమ్మకాలు బాగా జరిగాయి. కొట్లో పనివాళ్ళందరినీ ఒంటిచేత్తో నడిపించాడు రౌదర్. భారతంలో అభిమన్యుడల్లే అన్నీ తానై చూసుకున్నాడు. గుడ్డ రేటు, ఎన్ని మీటర్లు కొన్నారో చెప్పగానే, వెంటనే లెక్కగట్టి ధర చెప్పేసేవాడు. అంత వేగంగా ఎలా లెక్కగట్టేవాడో దేవుడికే తెలియాలి.

పదహారు రకాల బట్టల ధరలను చిటికెలో చెప్పేసేవాడు. “మొత్తం పదహారు బట్టలు. మొత్తం పధ్నాలుగు వందల పధ్నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు.”

దీన్ని బోర్డు మీద రాసినా నాకు ఈ లెక్క తేలడానికి అరగంట పట్టేది. అతనికి మాత్రం మెరుపల్లే వచ్చేస్తుంది లెక్క. ఇన్నేళ్ళలో ఒక్క పొరపాటు లెక్క కూడా వేసుండడు.

రాత్రి నాన్న కూచుని లెక్కలన్నీ మళ్ళీ సరిచూసేవాడు. రౌదర్ లెక్కల్లో ఒక్క తప్పైనా పట్టుకోవాలనే నాన్న ప్రయత్నం ఎప్పటికీ నెరవేరలేదు.


ఒకరోజు అన్ని వైపులా తెరలు కట్టి ఉన్న ఎద్దుల బండి వచ్చి కొట్టు ముందు ఆగింది. లోపల నుంచి ఆడవాళ్ళు, పిల్లల గొంతులు వినపడుతున్నాయి.

“మా ఇంటి ఆడవాళ్ళు వచ్చినట్టున్నారు” రౌదర్ లేచి నిలబడ్డాడు.

రౌదర్ ఇల్లు వేలానికొచ్చిందట. అమీనా ఇంట్లో సామానులన్నీ బయట పారేసి పిల్లలనీ, ఆడవాళ్ళనీ బయటికి పొమ్మన్నాడట. రౌదర్ దేవుడిని ప్రార్థిస్తూ చిన్నపిల్లాడిలా ఏడవటం మొదలుపెట్టాడు.

ఇంతలో కొల్లప్పన్ చేతిలో బిల్లుతో వచ్చి “నలభై ఐదు మీటర్ల డెబ్భై సెంటీ మీటర్లు, మీటరు పదమూడు రూపాయల నలభై ఐదు పైసల చొప్పున” అన్నాడు.

రౌదర్ ఒక్క క్షణం ఆగి “రాసుకో, ఆరు వందల పధ్నాలుగు రూపాయల అరవై ఆరు పైసలు.”

నాన్న వైపు తిరిగి ఏడుపు కొనసాగిస్తూ “అయ్యగారూ, ఇల్లు మీద అప్పు, వడ్డీ కలిపి ఐదు వేల పైనే అయింది. ఎక్కడి నుంచి తీసుకురాను?” అన్నాడు.

నాన్న బగ్గీలో అతన్ని లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. మర్నాడు రౌదర్ కొట్టుకు రాలేదు. చెట్టియార్ కొట్లో పద్దులు లెక్కవేసి చెప్పటం తాను కళ్ళారా చూశానని కొల్లప్పన్ చెప్పాడు.

“ఎంత అన్యాయం. వాడి అప్పులన్నీ కట్టేసి ఇలా వచ్చాను. నాకీ శాస్తి చేశాడు. కృతఘ్నుడు” నాన్న అరిచాడు కోపంతో.

“వాడికి లెక్కలెయ్యడం వచ్చుగానీ ఒట్టి మూర్ఖుడు. ఉండండి, జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తా.” కొల్లప్పన్ సైకిల్ మీదకు దూకాడు.

నాన్న విచారంగా నేల మీద కూలబడ్డాడు. “లోకం ఎంత ఘోరంగా తయారైందంటే, సొంత తల్లిని కూడా నమ్మే రోజులు కావు” గొణుక్కున్నాడు.

కాసేపట్లో కోలప్పన్ తన సైకిల్ మీద రౌదర్‌ని ఎక్కించుకుని తీసుకొచ్చాడు. స్థాణువులా నిలిచిన రౌదర్‌ని అతడే కొట్లోకి నడిపించుకొచ్చాడు.

“నా మతి పోయింది అయ్యగారూ. నేనేం చేస్తున్నానో నాకు తెలీలేదు” అన్నాడు రౌదర్ నిస్త్రాణగా.

“నీ పొగరు అణిగే రోజొకటి వస్తుందిలే” అన్నాడు నాన్న.

“అలా అనకండయ్యా, ‘నీ అప్పులన్నీ నే తీరుస్తా నా కొట్లో పని చేయి’ అన్నాడు చెట్టియార్. నిజంగా నేనేం చేస్తున్నానో నాకు తెలీలేదు. వెళ్ళాను. తప్పే” చేతులు కట్టుకుని తలొంచుకు నిల్చున్నాడు రౌదర్.

తర్వాత కొద్ది రోజులకు, టోకు వ్యాపారులను కలవడానికి నాన్న బొంబాయి వెళ్ళి వచ్చేటపుడు ఒక చిన్న మెషీన్ కొనుక్కొచ్చాడు.

“ఇది లెక్కలు చేస్తుంది” అన్నాడు కాలిక్యులేటర్‌ని చూపిస్తూ

“మిషను లెక్కలు చేస్తుందా?” ఆశ్చర్యపడింది అమ్మ. దాన్ని పరీక్షించడానికి నాన్న ఏవేవో అంకెలు చెప్పాడు. అమ్మ అవన్నీ లెక్కేసి చూసింది. కాలిక్యులేటర్ అన్నీ సరిగ్గా చేసి చూపింది.

వాటిని కాయితం మీద లెక్కేసి చూసి “సరిగ్గానే చేసిందమ్మా” అరిచాను సంతోషంగా.

“రౌదర్ బుర్రని దీంట్లో పెట్టారా ఏంటి?” అంది అమ్మ.

రోజంతా దాని మీద ఏవో ఒక లెక్కలేస్తూనే ఉన్నాను. రాత్రి పక్కనే పెట్టుకుని నిద్రపోయాను. కష్టమైన లెక్కలు ఇచ్చి చూశా దానికి. అన్నీ సరిగ్గా చేసింది.

“తాతా, అంత పెద్ద లెక్కల్ని ఒక నిమిట్‌లో ఎలా చేస్తావ్ నువ్వు?” తనకొచ్చిన ఇంగ్లీషు ముక్కని వాడుతూ గోమతి రౌదర్‌ని అడగటం గుర్తొచ్చింది నాకు.

“బుర్రలో లెక్కలు చేసే నరం ఒకటి ఎగస్ట్రాగా ఉందిలే” అన్నాడు రౌదర్ తమాషా చేస్తూ.

“నాకు కూడా దీన్లో లెక్కలు చెయ్యడం వచ్చేసింది. ఇది తాత కంటే గడుసుది” అంది గోమతి.

ఒకరోజు సాయంత్రం కొట్టు కట్టేసే సమయానికి మొత్తం లెక్కలు చూస్తున్నారు. కాలిక్యులేటర్‌ని ఒళ్ళో పెట్టుకుని కూచుంది గోమతి. మొత్తం చూశాక “నువ్వు సరిగ్గానే లెక్కేశావు తాతా” అంది రౌదర్‌తో.

“నేను సరిగ్గా చేశానని నాకే చెప్తున్నావా?”

“అవును. నువ్వు చెప్పినవాటిని మళ్ళీ చేసి సరి చూశా.”

“సరే, నేనొక లెక్క ఇస్తాను. చేసి చూపించు” సవాలు విసిరాడు.

కొన్ని లెక్కలు ఇచ్చాడు. గోమతి అన్నిటినీ కాలిక్యులేటర్‌తో సరిగ్గా లెక్కేసి చూపించింది. మరి కొన్ని ఇచ్చాడు. వాటికీ సరైన జవాబులే వచ్చాయి. “దేవుడా, ఏంటిది? నాకేమీ అర్థం కావట్లేదే” గొణిగాడు.

“ఈ లెక్కలన్నీ నేను కాదు తాతా చేస్తోంది. ఇదిగో ఈ మిషను” అతని చేయి పట్టుకుని చేతిలో పెట్టింది కాలిక్యులేటర్‌ని.

రౌదర్ దాన్ని తడిమి చూశాడు. “ఇది చేస్తోందా లెక్కలు?”

“అవును తాతా”

“సరే ఉంచుకో” వెనక్కి ఇచ్చేశాడు.

ఆ తర్వాత నుంచీ రౌదర్ చాలా స్థబ్దంగా అయిపోయాడు. గోడకు జారగిలబడి కూచునే వాడంతే. ఆ రోజు నేను గోమతి బిల్లింగ్ అంతా చూశాం. గోమతి రౌదర్ మీదికి వంగి “తాతా, ఏదైనా మాట్లాడు” అంది గానీ రౌదర్ మౌనంగా ఉండిపోయాడు.

రోజు కొట్టుకు వచ్చేవాడే గానీ జీవం లేనట్టు కాళ్ళీడుస్తూ నడుస్తూ వచ్చేవాడు. అతని మొహంలో సంతోషం, నవ్వులు, హాస్యాలు, వ్యంగ్యాలు, వెటకారాలు అన్నీ నెమ్మదిగా మాయమైపోయాయి. గట్టిగా వినపడే అతని స్వరం కూడా బలహీనమైపోయింది. బాగా చిక్కిపోయాడు కూడా.

అతనికి పని చెప్పడం మానేశాడు నాన్న.


ఆ రోజు కొట్లో పని ఒత్తిడి చాలా ఉంది. మురుగన్ కత్తిరించిన గుడ్డలు కట్టగా చేతిలో పట్టుకు నిల్చుని రేట్లు చదువుంటే, నేను లెక్క వేస్తున్నాను.

రౌదర్ అకస్మాత్తుగా అన్నాడు “పాప్లిన్ గుడ్డ రేటెంతన్నావు?”

మురుగన్ చదవడం ఆపి “మీటర్ పదిహేను రూపాయల పది పైసలు” అన్నాడు.

“తప్పు. దాని ధర పదహారు రూపాయల పది పైసలు మీటర్‌కి.”

నాన్న రౌదర్ కేసి చూశాడు. ధర సరి చూడగానే మురుగన్ మొహం పాలిపోయింది.

“మీరు చెప్పింది నిజమే” గొణిగాడు.

“పది మీటర్లు అమ్మావు. ఇప్పుడు సరి చూడక పోయినట్టయితే పది రూపాయల నష్టం వచ్చేది. అయ్యగారి డబ్బులన్నీ దారిన పొయ్యేవాళ్ళకి దానం చేయడానికున్నావా ఇక్కడ?”

“నీకు తెలుసా దీని ధర?” అడిగాడు నాన్న.

“బుర్రలో జ్ఞాపకం ఉందయ్యగారూ.”

“అన్ని బట్టల ధరలూ గుర్తున్నాయా నీకు?”

“దేవుడి దయ వల్ల.”

“కొట్లో అన్నిటికంటే చిన్న తువ్వాలు రేటెంత?”

“నాలుగు రూపాయల పది పైసలు.”

“పెద్ద తువ్వాలు?”

“ముప్ఫై ఆరు రూపాయల నలభై పైసలు.”

నాన్న అడుగుతూ పోతుంటే, రౌదర్ జవాబు చెప్తూ పోతున్నాడు.

నాన్న అబ్బురంగా చూశాడు అతని వంక. “ఇక నుంచీ, బిల్లింగ్ చేసేటపుడు ధరలు సరిచూడు.”

“సరే అయ్యగారూ” అని వెంటనే “అయ్యగారూ, కరెంట్ బిల్లు కట్టడానికి ఇవాళే ఆఖరు తేదీ అండీ. కట్టారా?”

“అయ్యో, కట్టలేదు” అంటూ నాన్న కోలప్పన్‌ని పిలిచాడు.

“ఇవాళ కోలప్పన్ రాలేదయ్యగారూ” చెప్పాడు రౌదర్.

“నీకెలా తెలుసు?”

“ప్రతి మనిషికీ ఒక గొంతు, ఒక వాసన ఉంటుందయ్యగారూ. ఇవాళ కోలప్పన్ వాసన రాలేదు నాకు.” అని మురుగన్‌ని కేకేశాడు.

“అయ్యగారూ, నిన్న డబల్ పంచెలు కావాలని ఒకాయన వస్తే మురుగన్ మన దగ్గర లేవని చెప్పాడు.”

“అయితే?”

“మీరు పది డబల్ పంచెలు అమ్మకానికి పెట్టారు. మనం ఏడే అమ్మాం. సరిగా చూడండి. ఇంకా మూడుంటాయి.”

నిజంగానే మూడు ఉన్నాయి కొట్లో. రౌదర్ పెదవుల మీద నవ్వు మెరిసింది. మురుగన్ దిక్కుగా చూస్తూ అన్నాడు. “మురుగన్ స్వామీ, సరుకు లేదని చెప్పి కొనటానికి వచ్చేవాళ్ళని వెనక్కి పంపుతున్నావే, మనం వ్యాపారం చేస్తున్నామా దానధర్మాలా?”

ఆ సాయంత్రం రౌదర్ స్థానం బిల్లింగ్ నుంచి నాన్న పక్కకి మారింది. “మీ పక్కనే ఉంటే మీకు సహాయంగా ఉంటుందయ్యా, ఆ ఫాను స్పీడు కొంచెం పెంచితే నాక్కూడా కాస్త గాలి తగుల్తుంది మరి.” నాన్న ఫాను స్పీడు పెంచమని సైగ చేశాడు.

“అయ్యగారూ, ముందస్తు ఆదాయం పన్ను కట్టే సమయం ఇది. ఆడిటర్‌ని కలవరూ?”

“అవున్నిజవే, రేపు వెళ్తాను.”

కొట్టు కట్టేసే సమయమైంది.

“అయ్యగారూ, అమ్మగారికి మందేదో కొనాలన్నారు. తీసుకున్నారా?”

“తీసుకుంటా, వెళ్ళే దారిలో” కొట్టుకు వేసిన తాళాలను లాగి చూస్తున్నాడు నాన్న.

“అయ్యగారూ,మీ అమ్మగారి ఆబ్దికం త్వరలో ఉందన్నారు కదా, మురుగన్ వెళ్ళే దార్లోనే బ్రాహ్మడి ఇల్లు. ఒకసారి అతనికి చెప్పి ఉంచమని చెప్పండి.”

“నిజమే, మంచి ఆలోచన.”

పనివాళ్ళంతా ఒక్కొక్కరుగా ఇళ్ళకు కదిలారు. గోమతి రౌదర్ చేతిని తన భుజం మీద వేసుకుని ముందుకు నడిచింది.

“ఇక నువ్వు బిల్లులు వెయ్యవా తాతా?”

“ఇబ్రహీం హసన్ రౌదర్ ఇక నుంచి కేవలం లెక్కలు వేసే మిషన్ కాదు. మానేజర్. తెల్సిందా? అదే దైవాజ్ఞ!” రౌదర్ అడుగు ముందుకేశాడు.

(ఆంగ్లానువాదం: ఎస్.కృష్ణన్)