తన మొదటి ఉద్యోగం కోసం ఓ పోస్టుమాస్టరు ఊలాపూర్ వెళ్ళాడు. అది బెంగాల్‌లో ఒక చిన్న పల్లెటూరు. దాని దగ్గర్లోనే ఓ నీలిమందు కార్ఖానా ఉండేది. అక్కడి బ్రిటీషు అధికారి పట్టుపట్టి ఆ ఊర్లో ఓ పోస్టాఫీసు ఏర్పాటు చేయించాడు.
ఆ కుర్ర పోస్టుమాస్టరుది కలకత్తా. ఆ పల్లెటూరుకు వెళ్ళటంతో నీటిలోంచి బయటపడ్డ చేపలా అయ్యింది అతని పరిస్థితి. తన ఆఫీసు ఒక చీకటి పూరిగుడిసె. దాని పక్కనే కలుపుమొక్కలతో నిండిపోయిన ఓ నీటిగుంట ఉండేది. ఇక చుట్టూ దట్టమైన అడవి. కార్ఖానా ఉద్యోగులూ కూలీలూ తీరిక లేకుండా పని చేసేవాళ్ళు. ఐనా చదువుకున్న మాస్టరుకి వాళ్ళతో ఏం సంగడి కుదురుతుంది. పరిచయం లేని ఆ ఊళ్ళో తన ఇబ్బందో లేక తన అహంకారమో పోస్టుమాస్టరును అక్కడి మనుషులతో కలవనియ్యలేదు. ఆ ఊరి జనాలెవ్వరితోనూ అతనికి పరిచయం ఏర్పడలేదు.
ఆఫీసులో అతనికి పెద్దగా పనేమీ ఉండేది కాదు. తీరిగ్గా అప్పుడప్పుడూ కవితలు రాసేవాడు. హాయిగా ఆకాశంలో మబ్బుల్నీ గాలికి అల్లాడే చెట్లనీ చూస్తూ ప్రశాంతంగా రోజుల్ని గడపడంలో ఉండే సుఖం ఆ కవితలకు వస్తువుగా ఉండేది. కానీ ఏ అరబ్బు కట్టుకథలోని జీనీయో హాఠాత్తుగా ప్రత్యక్షమయి రాత్రికి రాత్రి అక్కడి చెట్లన్నీ నరికేసి, రోడ్లు పరిచేసి, నింగి కూడా కనపడనంత ఎత్తుగా పెద్ద భవనాలు కట్టివేస్తే తప్ప ఆ ఊళ్ళో సగం చచ్చినట్టు బతుకుతున్న ఆ కుర్రవాడు మళ్ళీ మామూలు మనిషి కాలేడన్నది వాస్తవం.
పోస్టుమాస్టరుది చాలీచాలని జీతం. పైగా భోజనం సొంతంగా వండుకోవాల్సిన పరిస్థితి. ఓ అనాథ అమ్మాయి పూట గడుపుకోడానికి పోస్టుమాస్టరు దగ్గర ఇంటిపని చేసేది. ఆ అమ్మాయి పేరు రతన్. పన్నెండూ పదమూడేళ్ళు ఉంటాయి. తనకు పెళ్ళయ్యే యోగం ఉన్నట్టు లేదు. సాయంత్రాల్లో ఊరి పశువుల దొడ్లనుండి వచ్చే పొగ ఆకాశమంతా చుట్టుకునేది, ఈలపురుగులు పొదల్లో కిచకిచలాడేవి, పక్క పల్లెటూళ్ళనుంచి బౌల్ గాయకులు తాగిన మత్తులో దరువులు వేస్తూ పాడే పాటలు వినవచ్చేవి. అలాంటి సమయంలో గాలికి అల్లాడుతున్న చెట్లను వసారాలో కూర్చొని చూసేవాడు కవే అయినా మనసులో బెదరక మానడు. కాబట్టి పోస్టుమాస్టరు లోపలికెళ్ళి, ఓ మూల చిన్న దీపం వెలిగించి, రతన్‌ని పిలిచేవాడు. పోస్టుమాస్టరు పిలుస్తాడనే తలుపు దగ్గర కూర్చున్నా కూడా రతన్ మొదటి పిలుపుకే వెళ్ళేది కాదు. “ఏంటి దాదాబాబు? ఏం కావాలి?” అని అడిగేది.
“ఏం చేస్తున్నావు?” పోస్టుమాస్టరు అడిగేవాడు.
“వంట చెయ్యడానికి పొయ్యంటించాలి…”
“తర్వాత అంటియ్యచ్చులే గాని, ముందు నా హుక్కా ఇటు తీస్కురా.”
హుక్కాని అంటించడానికి గట్టిగా ఊదుతూ లోపలికి వచ్చేది రతన్. పోస్టుమాస్టరు దాన్ని తీస్కొని ‘రతన్, నీకు మీ అమ్మ గుర్తుందా?’ అని ఉన్నట్టుండి అడిగేవాడు. ఆమె చాలా చెప్పాలనుకునేది, కాని అన్నీ లీలగానే గుర్తున్నాయి. అమ్మకంటే కూడా తనంటే నాన్నకు బాగా ఇష్టం. నాన్న గురించి కొన్ని విషయాలు బాగా గుర్తున్నాయి. పగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చేవాడు. అలా తనతో గడిపిన ఒకటీ రెండు సాయంత్రాలు రతన్ మనసులో అచ్చుపడినట్టు గుర్తున్నాయి. అలా మాట్లాడుతూ రతన్ నెమ్మదిగా పోస్టుమాస్టరు దగ్గరకు జరుగుతూ అతని పాదాల దగ్గర నేలపై కూర్చుండిపోయేది. ఆమెకు తన తమ్ముడు గుర్తున్నాడు. వర్షాకాలంలో ఒక రోజు చెట్టు నుండి విరిగి పడిన కర్రలతో ఇద్దరూ నీటిగుంట దగ్గర నిలబడి చేపలు పట్టే ఆట ఆడుకోవడం ఆమెకు అన్నింటికన్నా బాగా గుర్తుంది. కొన్ని రోజులు ఈ మాటలిలాగే అర్ధరాత్రి వరకు సాగేవి. ఇక వండుకోడానికి ఓపిక లేక, మధ్యాహ్నం మిగిలిన కూరతో రతన్ చేసిన చపాతి తిని ఇద్దరూ సరిపెట్టుకునేవాళ్ళు.
అప్పుడప్పుడూ పోస్టుమాస్టరు తన గుడిసెలో ఓ మూల బల్ల దగ్గర కూర్చొని తన కుటుంబం గురించి రతన్‌కు చెప్పేవాడు. అమ్మ, అక్క, తమ్ముణ్ణి తలుచుకొని వాళ్ళకి దూరంగా ఉన్నందుకు బాధపడేవాడు. కలలో కూడా ఇలా ఆ కార్ఖానా కూలీలతో గాని, ఉద్యోగులతో గాని మాట్లాడలేని పోస్టుమాస్టరు తనకు తెలీకుండానే ఇవన్నీ ఆ చిన్నపిల్లకి చెప్పేవాడు. చివరకు రతన్ పోస్టుమాస్టరు కుటుంబాన్ని తన సొంతదిగా అనుకుంది. సొంత మనుషుల్ని పిలిచినట్టు వాళ్ళ గురించి మాట్లేడేటప్పుడు అమ్మ, అక్క అని పిలవడం మొదలుపెట్టింది.
ఓ వర్షాకాలపు మధ్యాహ్నం అలిసిపోయిన భూమి వదులుతున్న వెచ్చని ఊపిరి చర్మాన్ని తాకుతున్నట్టుగా, ఎండలో పచ్చిక చెమ్మ నిండిన పిల్లగాలి వీస్తోంది. ప్రకృతికీ ప్రపంచానికీ దాని బాధేదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఓ పక్షి విసుగు పుట్టించేలా మధ్యాహ్నమంతా ఆపకుండా కూసింది. పోస్టుమాస్టరుకు చెయ్యడానికి పనేమీ లేదు. తనకు చూడడానికి ఉన్నదల్లా వానకు తడిసి నిగనిగలాడుతున్న ఆకులూ, మిగిలిపోయిన తెల్లని పలుచని మేఘాలూ మాత్రమే. వాటిని చూస్తూ, తన మనసులో భావాలని పంచుకోడానికి ఏకాంతంగా ఉన్న తనకు ఓ మనిషి తోడుంటే ఎంత బాగుండేదని అనుకున్నాడు. నెమ్మదిగా, ఆ పక్షి చెప్పడానికి ప్రయత్నిస్తున్నదీ ఆ ఆకుల చప్పుళ్ళలో ఉన్న అర్థమూ కూడా సరిగ్గా ఇదేనేమో అనిపించింది తనకి. కాని అలాంటి చిన్న పల్లెటూరులో మధ్యాహ్నం ఓ పనిలేని పేద పోస్టుమాస్టరుకు ఇంత లోతైన ఆలోచన వచ్చిందంటే ఎవరు నమ్ముతారు?
ఉన్నట్టుండి రతన్‌ని పిలిచాడు పోస్టుమాస్టరు. హాయిగా బయట చెట్టు కింద పడుకొని జామకాయలు తింటోంది తను. ఆ పిలుపు వినగానే పరుగున వెళ్ళి, “పిలిచారా దాదాబాబు?” అడిగింది, దమ్ము తీసుకుంటూ.
“నేన్నీకు రోజూ కొంచెం చదవడం నేర్పిస్తాను” అన్నాడు. ఆపైన రోజూ మధ్యాహ్నం రతన్‌కు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. అచ్చుల దగ్గర మొదలుపెట్టి జోరుగా హల్లులూ ద్విత్వాల వరకు వచ్చారు.
శ్రావణమాసమంతా ఎడతెరపి లేని వానలు కురిశాయి. కాలువలూ కుంటలన్నీ పొంగిపొర్లాయి. రాత్రింబగళ్ళు చినుకుల చిటపటలూ కప్పల బెకబెకలు. బయట అడుగు పెట్టడానికే వీలుకాక బజారుకు తెప్పల మీద వెళ్ళాల్సొచ్చింది. ఒకరోజు తెల్లవారుజాము నుండి వర్షం ధారగా కురిసింది. శిష్యురాలు ఎప్పటిలాగే తలుపు దగ్గర ఉండి మాస్టరు పిలుస్తాడని ఎదురుచూస్తోంది. పిలుపేమీ రాకపోగా నెమ్మదిగా తన పుస్తకాలతో పాటు లోపలికి వెళ్ళింది. పడుకున్న పోస్టుమాస్టరును చూసి చప్పుడు చెయ్యకుండా మళ్ళీ బయటికి వెళ్ళబోయింది. “రతన్” అని పిలిచాడు. వెనక్కి తిరిగి “మీరు నిద్రపోలేదా దాదాబాబు?” అని అడిగింది.
“నాకు ఒంట్లో బాలేదు. చెయ్యిపెట్టి చూడు” అని తన నుదురు చూడమని అడిగాడు.
నలతగా ఆ వానల్లో ఒంటరిగా అగచాట్లు పడుతున్న పోస్టుమాస్టరు కొంచెం ఊరట కోరుకున్నాడు. తన నుదిటిని తాకే అమ్మా అక్కా చేతులు గుర్తొచ్చాయి అతనికి. ఆ సున్నితమైన స్పర్శా చేతుల గాజులూ గుర్తొచ్చాయి. ఆ సుకుమారత్వం ఇప్పుడు కూడా ఉంటే బాగుండేదనుకున్నాడు. ఆ కోరికేమీ నెరవేరకుండా పోలేదు. రతన్ అమ్మలా బాధ్యత తీస్కొని డాక్టరుని పిలవడమూ మందులివ్వడమూ అన్నీ చేసింది. రాత్రంతా మేల్కొని తన దగ్గరే కూర్చునేది. పదేపదే “ఇప్పుడెలా ఉంది?” అని అడిగేది.
సన్నగా అయిపోయిన పోస్టుమాస్టరు కొన్ని రోజులకి కోలుకున్నాడు. జరిగింది చాలని ముందు అక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తనను బదిలీ చెయ్యమని కోరుతూ కలకత్తాలోని ఆఫీసుకి ఉత్తరం రాశాడు.
నర్సు బాధ్యతలు తీరిపోయి రతన్ మళ్ళీ తనకు అలవాటైన తలుపు దగ్గర కూర్చోడం మొదలుపెట్టింది, పోస్టుమాస్టరు పిలుస్తాడని. కాని ఆ పిలుపు ఎన్ని రోజులకీ రాలేదు. అప్పుడప్పుడు లోపలికి తొంగి చూసేది. పీట మీద కూర్చొనో మంచం మీద పడుకొనో పోస్టుమాస్టరు పరధ్యానంలో ఉండేవాడు. ఓ పక్క రతన్ పోస్టుమాస్టరు పిలుస్తాడని చూస్తుంటే ఇంకో పక్క పోస్టుమాస్టరేమో కలకత్తా నుండి జవాబు కోసం ఎదురుచూస్తున్నాడు. రతన్ తలుపు దగ్గరే కూర్చొని పోస్టుమాస్టరు చెప్పిన పాఠాలన్నీ తిరగేసింది. ఉన్నట్టుంది పిలిచి ఏదైనా అడిగితే చెప్పలేనేమోనని భయం. కొన్ని వారాల తర్వాత ఓ సాయంత్రం పిలుపు రానే వచ్చింది. పరిగెత్తి లోపలికెళ్ళి “పిలిచారా దాదాబాబు?” అనడిగింది.
“నేను రేపు వెళ్ళిపోతున్నాను రతన్” అన్నాడు.
“ఎక్కడికెళ్తున్నారు దాదాబాబు?”
“ఇంటికి.”
“మళ్ళీ ఎప్పుడొస్తారు?”
“ఇంక రాను.”
ఇంకేమీ అడగలేదు రతన్. తను బదిలీ కోసం అడిగాడనీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడనీ పోస్టుమాస్టరే వివరించాడు. కొంతసేపు ఇద్దరు నోరు విప్పలేదు. మబ్బుగా ఓ మూల దీపం వెలుగుతోంది. గుడిసె పైకప్పులో రంధ్రం నుండి వర్షపు నీళ్ళు బొట్టుబొట్టుగా ఓ మట్టిపాత్ర మీద పడుతున్నాయి. రతన్ మౌనంగా చపాతీలు చెయ్యడానికి వెళ్ళింది. తన చిన్ని మనసులో ఏవో ఆలోచనలన్నీ తిరిగాయి. ముందున్న ఉత్సాహమంతా కరిగిపోయింది. మాస్టరు తిన్నాక “నన్ను కూడా మీతో తీస్కెళ్తారా?” అనడిగింది.
“నిన్ను తీస్కెళ్ళాలా!” అన్నాడు పోస్టుమాస్టరు నవ్వుతూ. ఎందుకు తీస్కెళ్ళలేడో చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడు.
ఆరోజు రాత్రంతా నిద్రలోనూ మెలుకువలోనూ పోస్టుమాస్టరు నవ్వుతూ అన్న అవే మాటలు రతన్ చెవుల్లో మోగాయి.
తెల్లవారుజామున పోస్టుమాస్టరు లేచేసరికి బయట తన స్నానానికి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. చేదుకొచ్చిన నీళ్ళతో స్నానం చెయ్యడం అతనికలవాటు. ఖచ్చితంగా ఎప్పుడు వెళ్తాడో అడగలేక, పొద్దున్నే అవసరమవుతాయేమో అని ముందురోజు రాత్రే రతన్ నదిలోంచి ఆ నీళ్ళు చేదుకొచ్చి పెట్టింది. స్నానం అయిపోగానే రతన్‌ని లోపలికి పిలిచాడు పోస్టుమాస్టరు. నెమ్మదిగా లోపలికెళ్ళి పోస్టుమాస్టరు వంక మౌనంగా చూసింది.
“నేను వెళ్ళిపోతున్నానని బాధపడకు రతన్. నా తర్వాత వచ్చేవాళ్ళని నిన్ను బాగా చూసుకోమని చెప్తాను” అన్నాడు.
తన మీద జాలితోనే పోస్టుమాస్టరు ఈ మాటలన్నాడు. కాని ఒకమ్మాయి మనసుని ఎవరు మాత్రం పూర్తిగా తెలుసుకోగలరు? ఇన్నాళ్ళూ పోస్టుమాస్టరు తిట్టినా కూడా మౌనంగా పడేది కాని ఈ మాటలకి రతన్ ఏడుపు ఆపుకోలేకపోయింది. గట్టిగా ఏడుస్తూ “మీరెవరికి ఏమీ చెప్పాల్సిన పనిలేదు. నాకిక్కడ ఉండాలని లేదు” అంది. ఎప్పుడూ తననిలా చూడని పోస్టుమాస్టరు ఆశ్చర్యపోయాడు.
కొత్తగా వచ్చిన ఉద్యోగికి బాధ్యతలప్పగించి ఊరికి బయల్దేరాడు పోస్టుమాస్టరు. వెళ్ళేముందు రతన్‌ని పిలిచి “నేన్నీకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేకపోయాను. ఇది ఉంచు. కొన్ని రోజులు ఖర్చులకొస్తాయి” అని ప్రయాణానికి సరిపడినంత ఉంచుకొని జేబులో ఉన్న తన జీతమంతా రతన్‌కి ఇచ్చాడు. రతన్ నేలకొరిగిపోయి, మాస్టరు కాళ్ళు పట్టుకొని “నాకేమీ ఇవ్వొద్దు దాదాబాబు. నాకేమీ ఇవ్వొద్దు. నా గురించి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది. పోస్టుమాస్టరు నిట్టూర్చి తన గుడ్డసంచి తీసుకొని, భుజం మీద గొడుగుతో, తన తెలుపూ బులుగు రంగు పెట్టెని తలమీద పెట్టుకొని మోస్తున్న కూలీతో పాటు పడవెక్కడానికి వెళ్ళాడు.
పడవ కదిలి ప్రయాణం మొదలైంది. పోస్టుమాస్టరు మనసు వ్యథతో నిండిపోయింది. భూమి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నట్టుగా నది పొంగి వరద నీరు పారుతోంది. బాధగా ఉన్న ఓ పల్లెటూరు అమ్మాయి మొహంలో విశ్వమంతటా ఉండే ధుఃఖం కనబడింది. వెనక్కి వెళ్ళాలనుకున్నాడు. ప్రపంచం పట్టించుకోని ఆ అనాథ పాపని తను తీసుకెళ్ళకూడదూ? అనుకున్నాడు. కాని వరద నీటి ప్రవాహంలో వీచేగాలి నిండిన తెరచాపలతో పడవ వేగంగా కొట్టుకుపోయింది. అప్పటికే ఊరు దాటేశారు. నది ఒడ్డున దహనసంస్కారాలు చేస్తున్న దృశ్యం పోస్టుమాస్టరుకు కనబడింది. అది తనను తాత్విక పర్యాలోచనలో పడేసింది. జీవితంలో ఎన్నో ఎడబాటులూ మరణాలూ ఉంటాయి. వెనక్కి వెళ్తే మాత్రం ప్రయోజనమేంటి? ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఎవరు మాత్రం ఎవరికి సొంతం? అనుకున్నాడు.
సర్దిచెప్పుకోడానికి రతన్‌కు అంత పెద్ద ఆలోచనలేమీ రాలేదు పాపం. ఆ పోస్టాఫీసు చుట్టూనే ఏడుస్తూ తిరిగింది. పోస్టుమాస్టరు తిరిగొస్తాడేమోనన్న చిన్న ఆశ తన మనసులో నుండి పోలేదు. ఆ ఆశే తనని దూరంగా వెళ్ళనియ్యకుండా ఆ పోస్టాఫీసుకి కట్టేసింది.
మూర్ఖపు మనిషి మనసు! పొరపాట్లు చెయ్యడాన్ని మానలేం మనం. హేతువూ తర్కమంత తేలిగ్గా మన తలకెక్కవు. రుజువులు కళ్ళ ముందే ఉన్నా కూడా శక్తిసామర్థ్యాలన్నిటితో మన ఆశల్నీ భ్రమల్నే పట్టుకొని కూర్చుంటాం. చివరికవి మన నాడుల్ని తెంపి గుండెల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు, మేలుకొని తెలుసుకున్నామో లేదో మళ్ళీ ఇంకో భ్రమ ఉచ్చులో పడడానికి బయల్దేరతాం.
(మూలం: ఠాకూర్ కథలు)