విన్నకోట రవిశంకర్ లబ్ధష్రతిష్ఠులైన కవి. ఈయన కవిత్వంలో నాకు బాగా నచ్చేవి – ఈయన సృష్టించే భావచిత్రాలు, వాటికి ఈయన పొదిగే పదవర్ణనలు, దానిలో దాగిన నర్మగర్భ సందేశాలు.
ఇటీవల ఈయన మంచు కరిగాక అనే కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకంలో కవితల్ని విడివిడిగానూ చదువుకోవచ్చు. కొన్నింటిని మరొక కవితతో సంధానిస్తూ కూడా చదవవచ్చు. ఈ పుస్తకంలో అన్ని కవితల గురించీ చెప్పాలంటే చాలా పెద్ద వ్యాసం అవుతుంది. ఆ రసమయ కవితాగుచ్ఛంలో మొదటి కవిత అయిన ‘ఆట’ గురించి, అది నామనసులో ఎలాంటి భావనలు కలిగించింది అన్నదాన్ని గురించీ ఈ వ్యాసంలో చెబుతాను.
‘ఆట’ జరగాలంటే ఒక మైదానమో, వేదికో కావాలి. ప్రకృతి మనకి రెండు అద్భుతమైన వేదికల్ని ప్రసాదించింది. ఒకటి – ఆకాశం; రెండు – భూమి. ఈ రెండు వేదికలూ కలిసి నిరంతరం ఆట ఆడతాయి. ఆ ఆటలో మనకి పరిచయమైన మరొక రూపం లేని వేదికని అనుభవిస్తాం. అదే కాలం.
మంచు కరిగాకలో రవిశంకర్ ఈ మూడు వేదికలమీదా తన ‘ఆట’ మొదలుపెట్టి ‘రిటైర్‌మెంట్’ దాకా అపూర్వ విన్యాసాల్ని ప్రదర్శించారు.
మనిషి వెల్లకిలా పడుకుని కనులు తెరిచి చూసినప్పుడు కనిపించేది అపారమైన ఆకాశం. మనిషి నిటారుగా నిలబడి కనులు తెరిచి చూసినప్పుడు కనిపించేది విశాలమైన భూమి. అన్ని అవస్థల్లోనూ కనులు మూసినా తెరిచినా వెన్నంటేది కాలం. ప్రతి వేదిక మీదా ఒక ఆట ఆడబడుతూంటుంది. ప్రతి వేదిక మీదా ఎంతో చైతన్యం, ఎంతో రసాయనికత, ఎన్నో ఉత్ప్రేరకాలు.
ఆకాశ వేదిక గురించి ఆలోచిస్తే…
విశాలమైన ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్రులు, కోట్లాది తేజోరాశులు, అనంతమైన రోదసీ కుహరం కనబడతాయి. ఇవన్నీ చిన్ననాటి నుంచీ మనం చూసేవే. నక్షత్రాల్ని మనం రాలిపోవడం, కొత్తవి పుట్టడం చూస్తాం.
ఆకాశం మనకిచ్చే వెలుగుల్లో మార్పులు చూస్తాం. అంతకన్న పెద్ద మార్పులు నిత్యం కనబడవు.
ఇవిగాక ఆకాశంలో ఎన్నో అద్భుతాలు క్షణక్షణం జరుగుతున్నాయి. అవి మనకి కనబడవు. ఆకాశం మనకి రకరకాల అనుభవాలని ఇవ్వడం కన్న ఆశ్చర్యాన్ని ఎక్కువ కలగజేస్తుంది. ఎంతో సంక్లిష్టత తనలో ఉన్నా, సాధారణమైన దానిలా, చిరపరిచయమున్నదానిలా అనిపిస్తుంది. చదివేసిన పాతపుస్తకంలా అనిపిస్తుంది. కాని ఆ పుస్తకంలో మనకి అర్థంకాని భావగర్భిత సత్యాలు కోకొల్లలు.
ఆకాశవేదిక మీద ఆడే ఆటలో పాతబడిపోయిన ముసలి కథానాయకుల్లా సూర్యుడు, చంద్రుడు మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటారు.
భూవేదిక గురించి ఆలోచిస్తే…
ఈ వేదికమీద మనకి కనుపించేవి అందమైన నేలలు, నదులు, చెట్లు, పర్వతాలు, సముద్రాలు, వర్ణించడానికి అలవికాని అందాలు, ఈ వేదిక మీదే మనకు అనుభవాలు, బంధాలు, రుగ్మతలు, బాధలు… ఎన్నెన్నో.
మన పూర్వీకులు, శాస్త్రజ్ఞులు Space-Timeని శాస్త్రీయంగా నిర్వచించినా, సామాన్యమానవుడికి తానొక అంతరాళంలో (Space) ఉంటాననీ, తనకి కాలం (Time) అనే స్పృహ ఉందనీ తెలుసు.
స్థూలంగా చూస్తే, కాంతిలో వచ్చే మార్పులే మనకి కాలం పట్ల స్పృహని కలగజేస్తాయి. సూర్యకాంతి కనిపించడం మొదలుపెడితే ఉదయం అయిందనీ, అది తీక్షణమైతే మధ్యాహ్నం అయిందనీ, అది కనిపించడం తగ్గిపోతూంటే సాయంత్రం అయిందనీ, సూర్యకాంతి మాయమైతే రాత్రి అయిందనీ అంటాం. చంద్రకాంతిలో మార్పుల వల్ల రాత్రిలో వచ్చే కాలపు మార్పుల్ని గమనిస్తాం. అందువల్ల, కాంతి కేవలం మనకి విశ్వాన్ని చూపించడం, భోజనం పెట్టడం మాత్రమే కాదు, కాలచక్రాన్ని కూడా అనుభవంలోకి తెస్తుంది. రూపంలేని ఈ కాలం అనేది మాయలా మనల్ని నడిపిస్తుంది.
మనం రోజూ చూసేవి ఉదయ సంధ్య, సాయంసంధ్య. వాటిని ఆనుకుని వచ్చేవి పగలు, రాత్రి. ఇవి కలనేత అంచు చీరల్లా రోజూ కనబడుతూంటాయి. వీటిని నేసే రాట్నం ఆకాశాన్నీ, భూమినీ కలుపుతోందా అని భ్రమ కలిగించే దిక్చక్రం. నేసే బట్ట ఎప్పుడూ ఒకే నూలు నుంచి వచ్చినా, ఆ బట్టకి రంగులు, కలనేత జలతారంచులు ఇచ్చేవి ఋతువులు. మారే ఋతువులు ఉదయసంధ్యారాగాల్లో మార్పులు తేవడం మనకి అనుభవమే. ఈ ఋతువుల వల్ల ప్రకృతిలో కనిపించే మార్పుల్ని, అందాల్నీ నిరంతరం అనుభవిస్తూనే ఉంటాం. ఈ అందాల్ని కాంతి సమక్షంలోనే అనుభవించగలం.
ఈ ఋతువులు దిక్చక్రానికి కాంతులద్దడమే కాదు. మన మనసుల్లో రకరకాల ప్రశ్నల్ని పుట్టిస్తాయి. మనం వాటికి సమాధానాలు వెతకడంలో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాము. ఉదాహరణకి, ఒక వసంతం ఒక చెట్టుకి ఒక ఆకుని తొడుగుతుంది, తరవాత వచ్చే ఆకురాలే కాలంలో ఆ ఆకు రాలుతుంది. మళ్ళీ అదే చోట, అలాంటి కాలప్రభావం ఇచ్చే వసంతం రాగానే, ఆ చెట్టు, ఒక కొత్త ఆకుని తొడుగుతుంది. ఇది ఎలా సాధ్యం? వెళుతూ వెళుతూ ఋతువులు రాబోయే ఋతువులకి సంకేతాలందిస్తాయా? పాత ఆకులు కొత్త ఆకుల కోసం వీలునామాలు వ్రాస్తాయా?
ఈ అనుభవాలని దర్శించి, అనుభవించి, మథించి ప్రకృతి ఆడే ఆటని మనకి సరైన మోతాదులో, నాణ్యంగా చూపుతారు రవిశంకర్.
‘ఏ కళకైనా మూలం మానవుడిలో ఉన్న సృజనాత్మకత, సౌందర్యభావన, అన్వేషణ, సృష్టిపట్ల, మానవసంబంధాల పట్ల ప్రేమ మొదలైనవి’ అనీ, ‘ఒక వస్తువుకి సంబంధించిన అనేక అంశాలలో వేటిని ఎంతవరకు కవి ప్రకాశింపజేస్తున్నాడు, వేటిని నీడలో ఉంచుతున్నాడనేదాని మీద కూడ ఒక కవిత నాణ్యత ఆధారపడి ఉంటుంది’* అని నమ్మే రవిశంకర్ తన పుస్తకాన్ని ఎలా ‘ఆట’తో మొదలుపెట్టారో చూడండి.
ఆకాశం చదివేసిన పాతపుస్తకం
చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా
అదే వేషం వేసే ముసలి కథానాయకుడు
కనుమరుగైన తారల స్థానాన్ని,
మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి.
ఇరు సంధ్యలూ ఒకే నృత్యాన్ని
క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి
‘మనిషి తనకి అర్థం కాని ఆకాశాన్ని గురించి బుర్ర చించుకోనక్కరలేదు. అక్కడ సామాన్యమానవుడు పొందగలిగే అనుభవాలు మితమైనవి. ఎదురుగా కనబడే భూమి అనే వేదిక మీద సవ్యమైన ఆట ఆడితే చాలు; కావలసినంత అనుభవం’ అన్న భావన మొదటిపాదంలో ఆకాశంలోని ఆట.
రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు
ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు
ముందు చరణం చివర్లోనూ, రెండో చరణంలోనూ కాలం మనల్ని వదలని ఒక బంధం, ఇది ఒక చక్రభ్రమణాన్ని మనకి అనుభవంలోకి తెస్తుందనే సూచన.
చుట్టూ మంచు కప్పబడినప్పుడు
చెట్లు యోగముద్ర దాలుస్తాయి
అది కరిగాక అదే చెట్ల మీద
అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి.
అవే వానలు, అవే ఎండలు
అలాగే కురిసి, మెరుస్తాయి
రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు
రంగురంగుల సంతకాలు చేస్తాయి.
మూడవ చరణంలో శిశిరాన్ని (మంచు కురిసే ఋతువుని) ఉదాహరణగా తీసుకుని భూమి మీద ఆటని, అందులో పాల్గొనే సభ్యుల స్థితియోగరహస్యాల్ని, అలవాట్లని కవితాత్మకంగా తెలియజేశారు కవి.
మళ్ళీ యోగ నిద్ర. మూడవ, నాలుగవ చరణాల్లో ఇదంతా ‘ఒక చక్రభ్రమణం, ఇది ఒక చర్వితచర్వణం’ అనే స్ఫురణ.
ఈ కవితలో ఏ విషయాలకి ఆహార్యం అద్ది (makeup వేసి) వేదిక మీద తీసుకుని వచ్చి చూపాలి? వేటిని తెరమరుగున ఉంచి నేపథ్యసంగీతం పాడించాలి, ఎక్కడ వెలుగునీడలు చూపాలి అన్నవి ఈ కవికి గల సృజనాత్మకత, సౌందర్యభావన, అన్వేషణ, సృష్టిపట్ల తనకి ఉన్న ప్రేమ మొదలైనవాటిని అద్భుతంగా వ్యక్తం చేశాయి.
‘మరి మిగిలిన ఋతువులవల్ల కలిగే అనుభవాల సంగతేమిటి?’ అని ప్రశ్నిస్తే, వాటిని గురించి ‘వృక్షచిత్రం’ అనే మరో కవితలో చెట్టుని ప్రతీకగా తీసుకుని విశదంగా చెప్పారు. (ఈ రెండు కవితల్నీ సంధానం చేస్తే ఒక సంపూర్ణమైన అనుభూతి కలుగుతుంది). ఆ కవితని ముగిస్తూ,
ఋతుచక్రంలో ఒక ఆకుగా మారి
ఏడాదిలోనే మొత్తం జీవితాన్ని
రూపుకట్టి చూపిస్తుంది
అంటూ ఈ చక్రభ్రమణంలో ప్రతి జీవి జీవితంలోను ఉండే పౌనఃపున్యాన్ని గుర్తుచేస్తారు.
ఇక ఆట అనే కవిత ముగింపు (లేదా ముక్తాయింపు) గురించి మాట్లాడే ముందు, మళ్ళీ కొద్దిగా మన సొంత ఆలోచనల్లోకి మరోసారి వెళదాం.
దైవత్వం అంటే సంపూర్ణజ్ఞానంతో కూడిన శిశుత్వమే. చిన్నపిల్లలలో తెలియనిదాన్ని, తెలిసినదాన్నీ సమానంగా అనుభవిస్తూ, ఆదరిస్తూ, అన్వేషిస్తూ, నిష్పాక్షికంగా సాగే ఒక జిజ్ఞాస, చైతన్యం ఉంటాయి. రానురాను వాళ్ళు బాల్యం వదిలి, కొన్ని విషయాల్ని తెలుసుకుని, కొన్ని నమ్మకాల్ని ఏర్పరుచుకుని, కొన్ని విషయాలపట్ల అనాసక్తులు అవుతారు. రోజూ జరిగే నిత్యకృత్యాలు ఒక చక్రభ్రమణంలా అనిపిస్తాయి. ఆ సులువైన చట్రంలో జీవితాన్ని నడిపిస్తారు.
ఒక బాలుడు (బాలిక) గాని తాను ఎంత నేర్చినా తనలో ఉండే జిజ్ఞాస, చైతన్యాలని అలాగే అట్టేపెట్టుకోవడం చాల కష్టం. అలా అట్టేపెట్టుకున్నవాడు ఈ చక్రంలోంచి బయటకి వస్తాడు. ‘అయితే, బయటకొచ్చి ఎక్కడికి పోతాడు? అయితే చక్రభ్రమణం నిజంకాదా?’ అని మీరడగవచ్చు. జ్ఞాని అయిన ఆ బాలుడు కొత్త పరిమాణాల్ని (dimensions) అందుకుంటాడు. పరిధిని పెంచుకుంటున్న సర్పిలంలా (spiral) కాలగమనంతో విస్తృతమవుతూ, విశ్వాన్ని ఆక్రమిస్తూ, ప్రతి మలుపునీ కొత్తగా ఆస్వాదిస్తాడు. ఎందుకంటే, వాడికి కాలం కొత్తగా కనిపిస్తుంది. పునరావృతం కాని కొత్త రకం చక్రభ్రమణాన్ని గుర్తిస్తాడు.
ఆ విషయాన్నే కవి మనకు సూచనగా తెలియచేస్తూ ‘ఆట’ను ముగించారు.
ఎడతెగని ఏ మార్పూ లేని ఈ ఆటని
ఏమాత్రం విసుగులేకుండా
అనంతకాలం ఆడాలంటే
ఎంత బాలుడై ఉండాలి!
ఈ కవిత చివరిలో బాలుడికి ఉండే జిజ్ఞాస, చైతన్యం మనిషిలో నిరంతరం లేకపోతే ఈ ఆటని ఆడలేడని ఒకే ఒక పార్శ్వాన్ని మనకి తెలియజేసినట్లు మనకి అనిపిస్తుంది. కాని, తరచి చూస్తే, కవిత ప్రారంభంలో చెప్పిన ‘చదివి పారేసిన పుస్తకం’ అయిన ఆకాశం ఆ జిజ్ఞాస, చైతన్యం ఉన్నవాడికే తన పుస్తక రహస్యాల్ని విప్పుతుందన్నది సంజ్ఞ. ముసలి కథానాయకుని నటనాకౌశలం, ఆతని కళలోని లోతుపాతులు అలాంటి బాలుడికే అర్థమవుతాయన్న సూచన. అనంతకాలం ఈ ఆట ఆపకుండా ఆడే ఈ ప్రకృతియే దైవం అన్న సంజ్ఞ. ‘కవిత మొదలుకి ముగింపుకి మధ్య ఒక సామ్యం సాధించడం ఒక ప్రక్రియ’ అని నమ్మే ఈ కవి ‘ఆట’లో ఆ లక్షణాన్ని ఎంత బాగా ప్రదర్శించారో చూడండి.
ఈ కవితలో కవి చేసిన సరళీకరణ ద్వారా, సాధారణ మానవుడికి ఉండే అనుభవాల అవధుల్ని కూడా సూచించారని నా భావన.
చివరి మాట…
మంచు కరిగాకలో పైన వివరించిన (నిర్వచించిన) Space-Time అన్న భావాన్ని అంతర్వాహినిగా చేసుకుని, దాని ప్రభావం మన జీవితాలమీద, ఆలోచనా సరళి మీద ఎలా ఉంటుందో అందమైన కవితల్తో విప్పిచెప్పే సఫలప్రయత్నం చేశారు విన్నకోట రవిశంకర్. కవిత్వం పట్ల కవికున్న నమ్మకాల్ని పాటిస్తూ, మధురమైన శైలిలో సాగిపోతుందీ కావ్యం. ఆయనలోని ఈ జల ఆగిపోకుండా, ఈ జ్వాల ఆరిపోకుండా మనల్ని మరిన్ని సంకలనాలతో అలరించాలని ఆశిస్తూ, ఆయన పాటించే ‘పౌకా సెడ్ మటూరా (pauca sed matura: Few, but ripe)’ అన్న విలువని శ్లాఘిస్తూ, సెలవ్.
* కవిత్వంలో నేను – విన్నకోట రవిశంకర్. వంగూరి ప్రచురణలు, 2016.