అక్కడ…

అక్కడ…

నా అలసటని అనుమానంగా

ఆలోచనని అపహాస్యంగా చూస్తారు

నా ఆదుర్దాని అనవసరంగా

అశ్రువుల్ని అనర్ధంగా భావిస్తారు

ఆశయాలూ, ఆదర్శాలూ

నాకు సంబంధించిన మాటలుకాదంటారు

విజయాలూ, విశిష్టతలూ

నాకు తెలియాల్సిన పని లేదంటారు

గడియారంలో అన్నిటికన్నా పెద్ద ముళ్ళు

నాకాళ్ళ కన్నా వేగంగా తిరిగితే

అసహనం చూపిస్తారు

చిగురుకొమ్మ నుండి పూవు రాలిన శబ్దం

నా మాట కన్నా సుతిమెత్తగా ధ్వనిస్తే

చిరాకు పడతారు

చైత్రమాసపు సూర్యుడు

నాకన్నా ముందు నిద్ర లేస్తే

నొసలు ముడుస్తారు

అమాస ముందు నాటి చంద్రుడు

నాకన్నాతక్కువ దర్పంతో కనిపిస్తే

అదిరిపడతారు

నన్ను నేను తెలుసుకొనేంత జ్ఞానం

నాకేనాడూ కలగకుండా

పాటుపడతారు

నన్ను నేను మరచిపోయేంత ఆనందం

అసలెక్కడయినా వుంటే..

అది నాదాకా రాకుండా

కోట కడతారు

అయినా సరే…

అంతకన్నా గొప్ప చోటు

అవనిలో నాకెక్కడా దొరకదంటారు

అపనమ్మకం నిలువునా తొలిచేస్తున్నా

అదే నా ఇల్లని నన్నందరూ నమ్మమంటారు


టి. శ్రీవల్లీ రాధిక

రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. "రేవు చూడని నావ" అనే కవితాసంపుటి, "మహార్ణవం", "ఆలోచన అమృతం" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి "mitva" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. "నా స్నేహితుడు" అనే కథకు 1994 లో "కథ" అవార్డు అందుకున్నారు ...