తెలుగు సాహిత్యాభిమానులందరూ ఎదురు చూసే పుస్తకాల పండుగ మళ్ళీ వస్తోంది. డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగునాట – ముఖ్యంగా హైద్రాబాదు, విజయవాడలలో – జరిగే అతి పెద్ద పండుగల్లో పుస్తక మహోత్సవం కూడా ఒకటి. ఎన్నో ప్రాంతాల, ఎందరో రచయితల కథలను, కవితలనూ మూటగట్టుకుంటూ, మళ్ళీ ఈ నెలాఖరుకి కొత్త కాగితాల రెపరెపలతో సందడి మొదలు కాబోతోంది. పుస్తకాలు కొనడమూ, చదవడమూ కాదు, ఊరికే చూడటం కూడా ఉత్సవమయి, ఉత్సాహాన్నిచ్చే సంబరంగా ఏడాది చివర్లలో సాగడం, గత కొన్నేళ్ళుగా తెలుగునాట స్థిరపడిపోయిన ఆనవాయితీ. ఈ ఏడాది చదివిన పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాలు, వెతుక్కోవాల్సిన పుస్తకాలు… ఒక నెలలో పండుగ రానుందంటే ఈపాటికి ఎన్ని జాబితాలు ప్రకటితమవ్వాలి! పుస్తక ప్రేమికులే చొరవ తీసుకుని మొదలెట్టాల్సిన వేడుకలివి. పుస్తకాల పండుగ అంటే ప్రచురణకర్తలదీ రచయితలదీ మాత్రమే కాదు, పాఠకులది కూడా. ఈ బుక్ ఫెస్టివల్స్ జరిగినన్నాళ్ళూ అక్కడ సభలూ జరుగుతాయి. ప్రక్రియల వారీగా చర్చలు జరుగుతాయి. అక్కడైనా, బయట మాధ్యమాల్లో అయినా, పత్రికల్లో అయినా విమర్శ వ్యక్తిగతంగా వ్రాయకుండా రచనాపరిధికి లోబడి వ్రాసే నియంత్రణను రచయితలు; విమర్శను వ్యక్తిగతంగా తీసుకోకుండా సూచనగా గమనించగల విజ్ఞతను పాఠకులూ అలవరచుకుంటే, సాహిత్య సమాజంగా మనకు ఎంతో కొంత ఎదుగుదల ఉంటుంది. రచయితలు కూడా వ్రాయడం అన్న ప్రక్రియకు పదును పెట్టుకోడానికి మొదట పాఠకులవ్వాలి. సాటి రచయితల పుస్తకాలపై సద్విమర్శలు వ్రాయాలి. వాటిని చర్చించాలి. వాటి మీద ఆసక్తి పెంచాలి, వాటికి గుర్తింపు తేవాలి. పాఠకులు వెతుక్కుని వెళ్ళి పుస్తకాలను కొనుక్కునే రీతిలో ఆకర్షణ కలుగజేయాలి. ఒక రచన మంచి చెడ్డలు, బలాబలాలు సాటి రచయితలే చప్పున గుర్తు పట్టగలరు కనుక, ఇదంతా రచయితలే ఒక కర్తవ్యంగా చేయవలసిన పని. వాళ్ళు క్రియాశీలమైతే, ఆ ఉత్సాహం పాఠకులలోకీ పాకుతుంది. అలా పుస్తకం నలుగురి నోళ్ళల్లో నానుతుంది. చదివిన పుస్తకాల గురించి నచ్చినా నచ్చకున్నా నిర్మొహమాటంగా అభిప్రాయాలను పంచుకోవడము, చదువరులు వీలైనంత వివరంగా తమ విమర్శలను, సమీక్షలను రాసి పత్రికలకు పంపించడమూ చేస్తే, అటు మరో నలుగురికి చదివే స్పూర్తిని అందించినవారు అవుతారు. ఇటు సాహిత్యమూ ఇంకాస్త చలనశీలమైనట్టు ఉంటుంది. ఆహ్లాదం, ఆలోచన, హక్కులు, బాధ్యతా, ఉత్తేజం, స్పూర్తి – పుస్తకాలు ఇవ్వలేనిది లేదు, పుస్తకాలు చెప్పనివీ ఏం లేవు. అయితే ఇప్పుడు మొదలయే ఈ పుస్తక మహోత్సవాల ద్వారా ఇవన్నీ అందిపుచ్చుకుని, వచ్చే పండుగ దాకా వీటిని నిలిపి ఉంచుకోవడమే ఇప్పటి మన కర్తవ్యం.