నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం

ఉ.
నీవొక మ్రోడువై తుదకు నిల్చిన గ్రీష్మమహోగ్రవేళ – నే
లా, విలయావిలార్తరుతి, హా, యనిపోదును పక్షినై? కృపాఽ
భావుడ, నీకునాకు నెడబాటగుటే గురుతింపలేను; నీ
వే వలదన్న కాని, నిను వే చిగురింపగజేతు గీతితో!

మోక్షసాధనసామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ అని కదా ఆర్యోక్తి. దుఃఖకారకము, అశాశ్వతమూ ఐన సంసారవలయం నుండి మనలను బైటికి లాగే సాధన సామగ్రులలో భక్తిదే పీఠాధిపత్యం. భగవంతుడిపై ప్రేమ భక్తి. తన్మయత్వం లేని ప్రేమకు అస్తిత్వం లేదు. విశ్వాన్నంతటినీ వ్యాపించిన ఒకానొక భగవద్వస్తువును ప్రేమించాలంటే, ఆ భక్తి కూడా విశ్వమంతా వ్యాపించి ఉండాలి. లేకపోతే ఆ ప్రేమ అసమర్థమై కుచించుకున్న ప్రాణంగానే ఉంటుంది తప్ప, సంపూర్ణంగా విచ్చుకొని ధన్యతను పొందలేదు.

కవులలో భక్తకవి వర్గానికి చెందినవారెపుడూ ఒక సూక్ష్మమైన చిక్కుతో సహవాసం చేస్తారనిపిస్తుంది. తాము దర్శించి, కీర్తించే తత్త్వం భౌతికతకు అందనిది. కానీ వారి పనిముట్లు లౌకికమైనవి. వాటిలో కొన్నయితే, భౌతికతకూ అధ్యాత్మప్రపంచానికీ పొసగని ఊహాజనితమైన కవిసమయాలు. వాటినే సమీకరించుకుని, భగవత్తత్త్వాన్ని సాక్షాత్కరింపజేయడంలో కృతకృత్యులైన గొప్ప కవులు లౌకికకవులకు మించి ఏ ప్రయాసా పడలేదనే తోస్తుంది. లౌకిక కవిత్వంతో పోల్చితే మనకు భక్తికవిత్వం విలువలోను, కొలతలోనూ కూడా ఘనతరమైందే. ఇంత పాటు వారికి ఇంత తేలిక ఎలా అయిందో, తేలిక కాకుంటే ఏ కొరతా లేని పరిపూర్ణతతో ఆ వాఙ్మయం ఎలా సాధ్యమైందో అన్న ప్రశ్నకు జవాబు అందదు.

అటువంటి ఉదాత్తమైన ఒక విలువ ప్రతిఫలించిన పద్యమిది. ఈ పద్యం చల్లా సీతారామాంజనేయులుగారు శివాంకితంగా వ్రాసిన బిల్వమాల అనే కావ్యంలోది. సీతారామాంజనేయులుగారు ఆధునికయుగానికి చెందిన గొప్ప కవి. ప్రతీ ఋతువునూ శివమయంగా చూస్తూ, చూపిస్తూ వారు లిఖించిన ఆరు కవితల సమాహారం ఈ కావ్యం. అది ఒక ప్రత్యేకత కాగా, ప్రతీ పద్యమూ నవోహలతోనూ, సనాతన భక్తితోనూ చెన్నలరారడం రెండవ ప్రత్యేకత. ఈ రెండు ప్రత్యేకతలూ ఒకే రచనలో లభించడం చాలా అరుదు. అటువంటి ఈ కావ్యంలో గ్రీష్మగానము అన్న కవితలోనిదీ పద్యం.

ఈ పద్యంలోని ఊహ సరికొత్తది. భగవంతుడి కవితలన్నీ నూటికి తొంభైపాళ్ళు స్తుతులు. కాకుంటే వ్యాజనిందా వ్యాజస్తుతులే కానీ ఇటువంటి ఒక భావన మనకు ఎక్కడో గానీ లభించదు. గ్రీష్మమహోగ్రవేళలో భగవంతుడు ఒక మ్రోడట. అదేవిటయ్యా, అన్ని వాంఛలనూ తీర్చే కల్పతరువు వంటి స్వామిని పట్టుకుని మోడంటావూ అంటే, అన్నీ అయిన స్వామి మోడెందుకు కాడు అని కవి మనకు ఇచ్చే సమాధానం. ఆ మ్రోడుకూడా తుదకు నిల్చినది. లోకాలన్నీ మృత్యువు ఇష్టానికి లోబడి నశించిపోయాక చివరలో నిల్చి ఉండేది స్వామే.

భగవంతుడు మోడైతే, తానెవరు? అంటే ఒక పక్షి అట. అది ఎటువంటి పక్షో ఆయనే చెప్పుకుంటున్నాడు – గ్రీష్మతాపాలు చుట్టుముట్టి, భగవంతుడు మోడైన వేళలో విలయావిలార్తరుతులతో అక్కడనుండి ఎగిరిపోయేది కాదట ఈ పక్షి. విలయమంటే ప్రళయం. ఆవిలమంటే కలుషితమైనది అని. రుతి అంటే పక్షిధ్వని. మరి ఎటువంటిదట ఈ పక్షి? స్వామినే పునస్సంజీవితుడ్ని చేసేదట.

విలయంచేత కలుషితమైన ఆర్తరుతులతో నేనెందుకు అక్కడనుండి ఎగిరిపోతాను స్వామీ? ఎగరను. నేనెటువంటివాడనంటే, ఆ అనిష్టసమయంలో కూడా, నీకూ నాకూ ఎడబాటు కలగడాన్నే నేను గుర్తించలేనయ్యా! ఒకవేళ, నువ్వే వద్దన్నా, నా గానగీతికతో నిన్ను చిగురింపజేస్తాను! అంటున్నాడు కవి.

కృపాఽభావుడ! అన్నది గొప్ప సంబోధన. కృపయొక్క అభావం కలవాడా! లేదా కృపలేనివాడా అని అర్థం.

ఈ కవితలో భక్తికుండవలసిన పరిపూర్ణత సాక్షాత్కరిస్తుంది. అనుకూలమైన వస్తువులలోనే భగవంతుడ్ని చూడడం అర్ధభక్తి మాత్రమే. అననుకూల విషయాలలో, ముఖ్యంగా తాను దైవోపహతుడై ఉన్న సమయాలలో, తన దృఢకర్మను తప్పించకుండా అనుభవింపజేస్తూ ఏదో కృపలేని ఘోరస్వరూపుడిగా తన దైవం అగుపిస్తున్నపుడు కూడా ప్రేమించేవాడు పరిపూర్ణప్రేమి. ఆ సూత్రాన్ని మనోహరమైన ఊహతో మనకు దర్శింపజేసే గొప్ప పద్యమిది.

ఈ పద్యం చదువగానే నాకు ఒక మహాకవి అమ్మవారిపై వ్రాసిన ఈ శ్లోకం స్ఫురణకు వచ్చింది:

పాతయ వా పాతాళే
స్థాపయ వా సకలలోకసామ్రాజ్యే
మాతస్తవ పదయుగళం
నాహం ముంచామి నైవ ముంచామి.

అమ్మా, నీవు నన్ను పాతాళంలో పడదోసినా సరే, లేదా సకలలోకసామ్రాజ్యానికి చక్రవర్తిని చేసినా సరే–నేను మాత్రం నీ పాదయుగాన్ని విడువను గాక విడువను.