చెప్పు చేతలు

ఒట్టి కాళ్ళతో నడవడం
అలవాటు తప్పిపోయేక
చెప్పులు బట్టల్లాగే
ఒంటిని అంటిపెట్టుకునే ఉంటాయి.
సహజ సంరక్షణ కదా!

కొత్త చెప్పుల వేళ
విడవడం అంటే బెంగ,
పెళ్ళి అయిన కొత్తలోలా
గుడికి అసలు వెళ్ళబుద్ధవదు.
‘దేవుడు ఎక్కడ లేడు’ అనిపిస్తుంది.
చెప్పులూ మనతోటే.

చెప్పులతో
స్నేహం మనకి తెలియకుండానే
చాలా దూరం వచ్చేస్తుంది
ఎవరి అలవాట్లు ఎవరివో
తెలియనంత.

కాలు చెప్పులో పెట్టేమా
చెప్పే కాలుకెక్కిందా,
అడుగులు వడిగా పడతాయి.

అన్నీ అలవాటయిన దారులే
చెప్పులు ఎటు తీసుకెళితే
అటే ప్రయాణం.

కాలం గడిచేకొద్దీ
పాత చెప్పు
అచ్చం మన మడమని
అచ్చు గుద్దినట్టు సొంతం
చేసుకుంటుంది.

వేళ్ళ సందుల్లో
పట్టి ఉంచే బిగువు వదిలేసి
అనుకరిస్తున్నట్టు
లేచిన కాలితో పాటు లేచి
కిందికి దిగే సమయాన్ని
చిన్న చప్పుడుగా మారుస్తుంది.

అరికాళ్ళకి తెలియకుండా
రాళ్ళు చేరుస్తుంది
చటుక్కున నడకలో
గగుర్పాటు తెస్తుంది.

నడుస్తున్నప్పుడు
చీలమండ దగ్గర నొప్పి
ఎప్పుడు అలవాటయిందో
తెలుసుకునే క్రమంలో
చెప్పుకిందే కాళ్ళు.

అయినా అలవాటయిన
సంసారంలో
చెప్పు చేతల్లో ఉండడం కంటే
చెప్పుకిందే ఉంచుకోవడానికి
ఎప్పుడు పునాది పడిందో
తెలుస్తుందా ఎప్పటికైనా?