దూర్వాసుల వీరరాఘవయ్యకి ఎక్కడో ఏదో నచ్చలేదు. ఏం నచ్చలేదో తెలియకపోవడం అంతకన్నా నచ్చలేదు. చర్రున లేచి పెద్ద పెద్ద అంగలతో బెడ్‌రూమ్ లోకి వెళ్ళాడు. శబ్దం వచ్చేటట్టు తలుపు దబీమని మూశాడు. అలా మూయటం లోపలికి ఎవరూ రావద్దని, తనంతట తను బయటకు వచ్చేదాకా ఎవరూ పిలవద్దని సంకేతం. ముఖ్యంగా భార్యకి.
కిటికీ రెక్క కొద్దిగా తెరిచి కిటికీ పక్కకి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. శ్వాసలో రుసరుస తగ్గించుకునే ప్రయత్నంలో రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. సన్నగా చినుకులు పడినట్లు ఉన్నాయి, దొడ్డిలో నేల చిత్తడిగా ఉంది. పశ్చిమ ఆకాశంలో మబ్బులు అప్పుడే దిగిపోయిన సూర్యుని చివరి కిరణాల అరుణిమతో ఆడుకుంటున్నాయి.
దూర్వాసుల వీరరాఘవయ్యగారు చూడచక్కని మనిషి. పొడవాటి విగ్రహం, చురుకైన కళ్ళు, పదునైన నాసిక, విశాలమైన ఛాతి, బుర్రమీసాలు, సగం నెరిసిన జుట్టు, మధ్య పాపిడి – వీర రాఘవయ్యగారిని మొదటిసారి చూసినవారు ఆయన అరవై యేళ్ళ మధ్యతరగతి తెలుగు మనిషనుకోరు. ఇంకా పది సంవత్సరాల సర్వీసున్న పంజాబ్ రెజిమెంట్ కర్నలనుకుంటారు.
పది సంవత్సరాల క్రితం బొంబాయిలో తనకున్న అంధేరీ ఫ్లాట్, ఆరే కాలనీ ప్రాంతంలో ఇరవై ఏళ్ళు ఎలాగోలా నడిపిన లఘు పరిశ్రమని అమ్మేసుకుని హైదరాబాదు ఆల్వాల్‌లో ఇల్లు కొనుక్కుని సెటిలయిపోయాడు. అమ్మకాలూ కొనుగోళ్ళూ హుటాహుటిన ఇరవైరోజుల్లోనే ఎందుకు జరిపాడో బహుకొద్దిమందికి మాత్రమే తెలుసు.
దూర్వాసులవారి భార్య శాంతమ్మ. ఆయనకంటే ఎనిమిదేళ్ళు వయస్సులో చిన్నది. పద్దెనిమిదేళ్ళప్పుడు పెళ్ళి చేశారు. తెలిసిన సంబంధం, దూరపు బంధుత్వం ఉంది, పిల్ల డిగ్రీ చేసింది, దూర్వాసులవారు దురాశలకి పోరులే అనే ధీమాతో. చిత్తూరు దగ్గర చిన్న ఊరిలో పుట్టి పెరిగిన శాంతమ్మకి, ఆంగ్ల సాహిత్యంలో బి.ఎ. అయిన శాంతమ్మకి, ఎందుకనో పాతికేళ్ళు బొంబాయిలో ఉన్నా నాలుగు వాక్యాలు ఇంగ్లీష్‌లో కాని, హిందీలో కాని మాట్లాడగలిగే సామర్థ్యం రాలేదు. తెలుగువాళ్ళతో గ్రూపులు కట్టో, తెలుగేతరులతో సగం తెలుగు కలిపి హిందీ మాట్లాడో నెట్టుకొచ్చింది. మా ఆయన ఇంజనీర్ ఇండస్ట్రియలిస్ట్ అని కొందరితో, మావారిది కృష్ణాతీరం తెలుసా అని కొందరితో, నేను కూరలు కొనటానికి కూడా కారులో వెళ్తాను డ్రైవ్ చేసుకుంటూ చూశారో లేదో అని కొందరితో, అహం కాపాడుకుంటూ, అహం పెంచుకుంటూ కొట్టుకొచ్చింది. అహం చూపించుకోవటానికి ఆవిడకంటే అనేక ఎక్కువ అర్హతలు, అవకాశాలు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు చుట్టుపక్కల. ఆవిడ అమేషా వాళ్ళకి దూరంగా ఉండేది. అసంకల్పిత ప్రతీకార చర్య.
వీరరాఘవయ్యకి ఇదంతా తెలుసు. ఆవిడ పుట్టింటినుంచి తెచ్చిన నాలుగు రూపాయలతో బొంబాయి జీవితానికి అంకురార్పణ జరిగిందని, ఆ బెట్టు, ఆ ధీమా, ఆ దెప్పు పెళ్ళాం నుంచి జీవితాంతం భరించాలనీ తెలుసు. నాలుగు రూపాయలు నలభై చేశానుగా, నా ప్రమేయమూ కొంత ఉంది అనటానికి లేదు. నా నాలుగే ఈ నలభై అని ఆవిడంటే తార్కికంగా ఆమె తప్పని ఆవిడ భాషలో ఆవిడని ఒప్పించలేడనీ తెలుసు. పరిమిత శక్తియుక్తులు భగవంతుడు ప్రతి వ్యక్తికీ కేటాయిస్తాడు. అవి ఎక్కడ ఎలా కేటాయించాలో తెలుసుకోలేని వ్యక్తులు జీవితాన్ని నరకతుల్యం చేసుకుంటారు.
నాలుగు రూపాయలు ఫాక్టరీలో మిగలంగానే తను నేర్చుకున్న బిజినెస్ మానేజ్‌మెంట్ సూత్రాలని ఆచరణలో పెట్టాడు. ప్రతీ ఏడాదీ పెళ్ళానికి కాసులపేరో రవ్వల నెక్లేసో కంచి పట్టు చీరలో కొనిపెట్టాడు. వడ్డీ క్రమం తప్పకుండా అందుతుంటే అసలు కంటే వడ్డీ ముద్దు. శాంతమ్మకిక భర్తతో గొంతెత్తి మాట్లాడటానికి ఏ విషయమూ లేదు. ఆయన ప్రతిభ మీద అపారమైన నమ్మకం ఉండేలా చూసుకున్నాడు కనుక ఏతావాతా శాంతమ్మ భర్త అడుగులకి జవదాటదు. ఆయన కా అంటే కా, కీ అంటే కీ. ఆయన జీవితంలో సాధించిన ఏకైక విజయం భార్య తనను అంటిపెట్టుకుని ఉండేట్టు కట్టడి చేయగలగడం!
గత దశాబ్దంగా భర్తకి లొంగిపోయిన శాంతమ్మ భరించలేనంత కృంగిపోయింది. భార్యని లొంగదీసుకున్న వీరరాఘవయ్య మరింతగా కృంగిపోయాడు. ఆవిడది సమాజమర్యాదా పాలన. ఈయనది తనకే తెలియని మేకపోతు గాంభీర్యం.
దూర్వాసుల వీరరాఘవయ్య, ధనేకుల బుద్ధరామయ్య కలిసి చదువుకున్నారు బెజవాడ మునిసిపాలిటీ బళ్ళో. స్కూలు చదువయిన తర్వాత పిల్లలందరూ ఎవరిదారిన వారు ఎగిరిపోయారు. కంప్యూటర్లు లేని కాలమది.
మూడు దశాబ్దాలయింది స్నేహితులకి ఒకరిగురించి ఒకరికి తెలిసి, ఒకరినొకరు కలిసి. బుద్ధరామయ్య బాగానే పైకొచ్చాడు ముప్ఫై ఏళ్ళలో. పైకి రావడమంటే కూడపెట్టటమే కదా, ఓ ముప్పై కోట్ల ఆస్తి కూడబెట్టాడు. జూబిలీలో పావు ఎకరం స్థలంలో భవనం కట్టాడు కూడా. ఎలా కూడపెట్టాడో మనకనవసరం. ఆయన జీవితపు స్టీరింగ్ వీల్ కార్యసాధకురాలు భార్య భార్గవి చేతిలో ఉంటుంది.
ఐదేళ్ళ కిందట బుద్ధరామయ్య భార్య భార్గవి తన భర్త పిన్ననాటి స్నేహితుని ఆచూకీ అంతర్జాలాన్ని, అంతకి మించిన తన వాడితనాన్ని, వాడి పసిగట్టింది. భార్గవి పుణ్యాన మిత్రుడి విలాసం తెలిసిన భర్త దూర్వాసులని ఆల్వాల్లో కలిశాడు. మిత్రులు ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం నెలకొకసారో, రెండునెల్ల కొకసారో ధనేకులవారు తమ మెర్సిడీస్‌లో ప్రయాణించి ఆల్వాల్లో దూర్వాసులవారిని కలుసుకుంటూనే ఉన్నారు. కారు భార్గవి నడుపుతుంది. డ్రైవరుకి ఆపూట సెలవిస్తారు. ఈసారి జూబిలీహిల్స్ రావటం మావంతు అంటూనే ఉంటాడు గాని దూర్వాసులవారు, ఆల్వాల్ వదలడు ప్రాణం మీదకు వస్తే తప్ప. ఆల్వాల్ పదానికి అర్ధం ఆప్తమిత్రుడు.
బుద్ధరామయ్యకి వీరరాఘవయ్యని చూస్తే అదొకరకమయిన ఆరాధ్య భావం. అతనితో గడిపిన రెండుమూడు గంటలు తనకి రెండుమూడు నెలలకి జీవించటానికి సరిపడా శక్తియుక్తుల్ని, కోరుకోకుండా తన ప్రమేయం లేకుండా, సమకూరుస్తాయని నమ్మకం. అయిదేళ్ళుగా అనుభవైకవేద్యం.
“రండి రండి” ఆహ్వానించింది శాంతమ్మ ధనేకుల దంపతులని, ఆశ్చర్యపడుతూనే. ఆ ఆశ్చర్యంలో ‘ఈరోజెందుకొచ్చారు చెప్పకుండా?’ అనే అయిష్టత దాగి ఉంది. వాళ్ళు మామూలుగా వచ్చే సాయంత్రం నాలుగు గంటల టైముకే వచ్చారు. టీ తాగి గంటో గంటన్నరో పిచ్చాపాటీ మాట్లాడుకుని చీకటిపడే సమయానికి జూబిలీకొండలు చేరుకుంటారు.
“సమయానికొచ్చావోయ్ బుద్ధా, ఈరోజు కుండలిని కొంచెం ఎక్కువ కదుల్తోంది. ఇవాళ నీకు తప్పదు. కూర్చోవాల్సిందే. ఏదో వంక చెప్పి ప్రతిసారీ తప్పించుకుంటున్నావు. అయినా బెంజి నడిపేది భార్గవి కదా.”
సమాధానం కోసం ఆగకుండా చెంగున సోఫాలోంచి లేచి అల్మారా స్లైడింగ్ డోర్ తెరిచి రెండు కట్ గ్లాసులు సెంటర్ టేబుల్ మీద పెట్టాడు వీరరాఘవయ్య. హాలులో నాలుగు సోఫాలు, ఒక డబుల్, మూడు సింగిల్స్; టూ సీటరులో, సోఫా మధ్యలో ఎప్పుడూ వీరరాఘవయ్యే కూర్చుంటాడు, ఇంకోళ్ళు ఎవరూ కూర్చోడానికి వీల్లేదు అన్నట్టుగా. లోపల ఎంత డొల్లతనముంటే అంత అహం కక్కుకుంటూ బహిర్గతమవుతుంది. హాలు మూడు గోడలకి మూడు తలుపులు ఉన్నాయి. ఒకటి వీధిలోకి పోవడానికి, రెడు చెరో బెడ్‌రూమ్ లోకి వెళ్ళడానికి. ఒక టీవీ యూనిట్ ఒక అల్మారా పెట్టేటప్పటికి హాలు నిండిపోయినట్టు అనిపిస్తోంది. మొత్తం సెటప్ నాటకాల వాళ్ళ స్టేజిని తలపిస్తోంది.
“నాకొకటి ఎప్పటికీ అర్థం కాదు వీరా! స్కూల్లో నువ్వు చాలా అమాయకుడుగా సన్నగా అందరికంటే చిన్నపిల్లవాడిలాగా ఉండేవాడివి కదా, ముప్ఫై ఏళ్ళలో ఎలా చండామార్కుడి వయిపోయావు?”
వీ.రా. బుర్ర మీసాలు ఊగేంతగా మిలటరీ నవ్వు నవ్వాడు. “క్రమశిక్షణ, సమయపాలన. ఇవేనోయ్ నా విజయ రహస్యాలు!”
అటువంటి గంభీర పదాలు ఎవరైనా, ఎప్పుడైనా నిత్యజీవితంలో ఎలా మాట్లాడగలరో అప్పుడే అటుగా వచ్చిన భార్గవికి అంతుపట్టలేదు. అదేం భాష?
“ఓయ్ శాంతా మాకు టీ వద్దులే, మేము మరో కార్యక్రమంలో ఉన్నాం. మీరు మీమానాన ముచ్చట్లాడుకోండి.”
భార్గవి చురుగ్గా చూసింది. సభామర్యాదకైనా నాలుగు గ్లాసులు పెట్టొచ్చుకదా! పురుషాధిక్యత కాకపోతే? అడుగుదామని నోటి దాకా వచ్చింది కాని, బుద్ధని పరికించి చూసి, వచ్చిన పని గుర్తుకు తెచ్చుకొని, కాస్త తమాయించుకుని, “ఎంజాయ్ యువర్ సెల్వ్‌స్” అంటూ శాంతమ్మ ఉన్న బెడ్‌రూమ్ లోకి వెళ్ళిపోయింది. భార్గవి వాలకంలోని ఆంతర్యం గమనించిన వీరాకి ఆమె ముఖకవళికలు నచ్చలేదు. ‘ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళనక్కడ పెట్టాలి’ మనసులో అనుకున్నాడు, బిగ్గరగానే.
“ఏం తీసుకుంటావోయ్?” సమాధానం చెప్పలేనంత బుద్ధిమంతుడు బుద్ధరామయ్య. ఇకిలించాడు, నాకేం తెలుసు అని ధ్వనించేంతగా. అతన్ని సమస్య నుంచి తప్పించడానికా అన్నట్లు వీరా వెంటనే రెండు బీర్లు తెచ్చాడు తన బెడ్‌రూమ్ ఫ్రిడ్జ్ నుంచి. “తాగితే స్కాచ్ తాగాలి బుద్ధా, అదీ సింగిల్ మాల్ట్. నెక్స్ట్ టైమ్.”
“న్యూ జెర్సీలో మీ అబ్బాయి, కోడలు, మనవలు ఎలా ఉన్నారు? ఈమధ్య అక్కడికి మారారన్నావు.” కొంచెం బీర్ గొంతులో నుంచి దిగంగానే బుద్ధ రిలాక్స్ అయ్యాడు.
“అక్కడికి వచ్చి ఉండిపోమంటాడు. సిటిజెన్‌షిప్ తీసుకోమంటాడు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంటాడు. నేను ఇంతవాణ్ణవడం మీ భిక్షే అంటాడు. సెంటిమెంటల్ ఫూల్!” అతని గొంతులో అల్పులకి ధీరత్వం, అధికులకి భీరత్వం గోచరిస్తుంది.
“ఐనా, వాడిని అలా పెంచాను. చక్కగా చదివించాను. గొప్ప ఉద్యోగం తెచ్చుకునేలా చూశాను. ఇప్పుడు చూడు అమెరికాలో హాయిగా ఉన్నాడు. ఇప్పటిలా ఈ వెధవ చదువులు కాదోయ్. వాడిని మొదటినుంచీ ఎంతో క్రమశిక్షణతో పెంచాను, జీవితంలో ఏది ముఖ్యమో ఏది కాదో నేర్పించాను. పరిశ్రమ ముఖ్యమోయ్. అసలు పిల్లలను కంటారే కాని ఎలా పెంచాలో ఎవరికైనా సరిగ్గా తెలుసా అని!”
బుధ్థ బీరా ఇంకా పూర్తవలేదు వీరా బీరాలు వింటుంటే. వీ.రా. మరో బీరా పట్టాడు.
“నా చేతికి విద్యాశాఖ అప్పగించమను. బద్ధకాన్ని, నిర్లిప్తతని, దేశాన్నించి తోలిపారేస్తాను. చైనావాడి క్రమశిక్షణ ఇండియాలో తెస్తాను. బూట్‌కాంప్ అంటే తెలుసా నీకు? అమెరికా వాడు మరీన్లని తయారుచేస్తాడు బూట్‌కాంప్‌లో. ఒక దృష్టిలో క్రమశిక్షణకి పరాకాష్ట, ఇంకో దృష్టిలో అమానుషమైన హింస. అమెరికా ‘అంతా మన కర్మ’ అని గోళ్ళు గిల్లుకుంటూ అగ్రరాజ్యమవలేదు. దేశంలో యువతకి మనసు, శరీరం రాటు తేలాలి. కండ ఉంటేనే గుండె. ఇరవై ఏళ్ళవయస్సు వచ్చే వరకూ ఆడా మగా యుద్ధం నేర్చుకున్నట్లు విద్య నేర్చుకోవాలి. చేతకాని దేశాలు నేలమీద మగ్గిపోనీ. ఇండియా పైకి పైపైకి ఎక్కుతూ పోవాలి. అవసరమైతే పక్కవారి పీకలు కోసైనా సరే. శిఖరాన్ని అధిరోహించాలంటే కొన్ని త్యాగాలు, బలిదానాలు తప్పవు.”
“నీవంటి చిత్తశుద్ధి, వాగ్ధాటి ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉంటే, దేశం ఎక్కడికి దూసుకెళ్తుందో?” బుద్ధరాముడి మెచ్చుకోలు.
“భార్గవీ, నన్ను అర్థం చేసుకోవడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు. మావారు వాట్సాప్‌లో ‘హౌ ఆర్ యు’ అని, రెండు రోజులు అదేపనిగా ఎదురు చూసిన తర్వాత ‘ఐ యామ్ ఫైన్’ అని రిప్లయ్ ఇస్తాడు మావాడు. నాతో అనరు కానీ ఆయన లోలోపల దిగులు పడుతున్నారేమో అని నాకు అనుమానం. ప్రతిసారీ ఆరు నెలలు అమెరికాలో ఉందాం అనుకొని వెళ్తాం, రెండు నెలల్లో ఆయనకి ఏదో నచ్చదు, వెనక్కి వచ్చేస్తాం. మళ్ళీ ఏదో వెలితిపడతారు. చెప్పరుగాని పిల్లల మీద తల్లుల కంటే తండ్రులకే ఎక్కువ ప్రేమ ఉంటుంది.”
శాంతమ్మ ఆలోచనలో అచ్చు తప్పుందని భార్గవి సునాయాసంగా గమనించింది. తండ్రి పొడ కొడుకుకి సుతరామూ గిట్టటంలేదని తెలుస్తూనే ఉంది. కొడుకు తనను కోరుకోవాలనే కోరికే గాని, ఆ కోరికకి తగిన పాత్రత ఈయనలో ఉందా?
షెల్ఫ్ మీద పడేసినట్లుగా ఉన్న ఒక చిన్న ఫ్రేము చేసిన అమ్మాయి ఫోటో భార్గవి కంటబడింది. వీళ్ళు వచ్చే సమయానికి ఆ ఫొటోనే చూసుకొంటోంది రెండో బెడ్‌రూమ్‌లో శాంతమ్మ.
“ఫొటో ఎవరిది శాంతా?” ఉలిక్కిపడ్డట్టు లేచి, ఆ ఫొటోని దాచేయబోయింది శాంతమ్మ.
“ఎవరి ఫొటో అది?” అనునయంగా అడిగింది భార్గవి.
“మా అమ్మాయిది.” చెప్పింది గద్గద స్వరంతో, చెమర్చిన కళ్ళతో. “నీకు పుణ్యం ఉంటుంది. ఫొటో విషయం పొరపాటున కూడా ఎవరితోనూ అనకు, ముఖ్యంగా మీ ఆయనతో. అమ్మాయి తాలూకు ఏ ఆనవాలు ఇంట్లో కనబడినా మా ఆయన ఒప్పుకోరు. వద్దన్న పని చేశామని తెలిస్తే మా ఆయన కోపం పట్టలేము.”
“అయిదేళ్ళయింది మనం కలిసి. కూతురుండేదని ఎప్పుడూ చెప్పలేదే. మీకు అబ్బాయి ఒకడే సంతానమనుకుంటున్నాం.”
“అలా అనే మేమూ, అందరితో పాటు అనుకోవాలని ఆయన ఆజ్ఞ.” శాంత దుఃఖం గమనించి భార్గవి మరే ప్రశ్నా వేయలేదు. రెండు నిమిషాల మౌనం తర్వాత శాంతమ్మే పెదవి విప్పింది.
“విద్యావతికి వాళ్ళ నాన్న అంటే అమితమైన గౌరవం. తండ్రి మెప్పు పొందాలని, అన్నకు ఉన్నంత ప్రయోజకత్వం తనకీ ఉందని తండ్రికి నిరూపించాలని తపించేది. ఆ తపనతోనే చివరి శ్వాసదాకా అహర్నిశలూ శ్రమించింది.”
శాంతమ్మ ఆలోచనల్లో ఈసారి మరిన్ని అచ్చుతప్పులు కనిపించాయి భార్గవికి.
“ఇక బయల్దేరతాం వీరా, ఆరు దాటింది!” బుద్ధరామయ్య ఒక బీరుతో కొట్టు కట్టేస్తే, వీరా నాలుగవ సీసా ఓపెన్ చేశాడు. బుద్ధ ఒక వాక్యం ప్రశ్నిస్తున్నట్లుగా అడిగితే, వీరా నాలుగు వాక్యాలు బోధ రూపంలో మాట్లాడాడు. యువశక్తి, దేశాభ్యుదయానికి సంఘర్షణ యొక్క ఆవశ్యకత, లంచగొండితనం నిర్మూలన, కార్యసాధనకి ప్రణాళికారూపకల్పన, దశాబ్దకాలంలో భారతదేశం ఎలా ప్రపంచంలో అగ్రగామి దేశంగా పురోగమించగలదు వంటి అంశాలమీద తన స్పష్టమైన అభిప్రాయాలు స్వచ్ఛమైన భాషలో చెప్పాడు, ప్రతీ సమావేశంలో చెప్పినట్లే. బుద్ధరామయ్య తన మేధ మరింత విశాలమయిందనుకున్నాడు ఎప్పట్లానే.
“మా చిన్నమ్మాయి ఇంటరుకొచ్చింది. దాన్ని ఐఐటీలో పడెయ్యాలనుంది. అవసరమైతే రెండు కోట్లు పారేస్తా. నువ్వే సలహా చెప్పాలి. బొంబాయి నీకు కొట్టిన పిండి. నువ్వే దానిని ఐఐటీలో చేర్పించాలి మరి!” లేస్తూ అన్నాడు బుద్ధరామయ్య.
దూర్వాసులవారు స్పందించలేదు. ఆ విన్నపం అసందర్భంగా తోచిందో, సందర్భవశాత్తూ ఎక్కడన్నా గుచ్చుకుందో.
భార్గవికి ఎందుకో ఈరోజు వీరరాఘవయ్యతో వెళ్ళొస్తాం అని చెప్పబుద్ధవలేదు. తన్నుతాను పొడుచుకోవాల్సిన మనిషి ఉన్మాదంలో ఎదుటిమనిషిని పొడిచి కొంత జీవితకాలాన్ని అరువు తెచ్చుకున్న నిర్భాగ్యుడిలా కనిపించాడు. ప్రాథమిక మర్యాద పాటించాలని కూడా అనిపించలేదు. చకచకా నడుస్తూ కారు తీసింది. బుద్ధరామయ్య భార్యని బుద్ధిగా అనుసరించాడు.
దూర్వాసుల వీరరాఘవయ్యకి ఎక్కడో ఏదో నచ్చలేదు. ఏం నచ్చలేదో తెలియకపోవడం అంతకన్నా నచ్చలేదు. చర్రున లేచి పెద్ద పెద్ద అంగలతో బెడ్‌రూమ్ లోకి వెళ్ళాడు. శబ్దం వచ్చేటట్టు తలుపు దబీమని మూశాడు. అలా మూయటం లోపలికి ఎవరూ రావద్దని, తనంతట తను బయటకు వచ్చే దాకా ఎవరూ పిలవద్దని సంకేతం. ముఖ్యంగా భార్యకి.
కిటికీ రెక్క కొద్దిగా తెరిచి కిటికీ పక్కకి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. శ్వాసలో రుసరుస తగ్గించుకునే ప్రయత్నంలో రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. సన్నగా చినుకులు పడినట్లు ఉన్నాయి, దొడ్డిలో నేల చిత్తడిగా ఉంది. పశ్చిమ ఆకాశంలో మబ్బులు అప్పుడే దిగిపోయిన సూర్యుని చివరి కిరణాల అరుణిమతో ఆడుకుంటున్నాయి.
బజ్‌మని శబ్దం చేస్తూ పెద్ద రెక్కల తూనీగ ఒకటి కిటికీలోంచి వెలుతురు వెతుక్కుంటూ రూమ్ లోకి వచ్చింది. మళ్ళీ బయటికి వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా వీ.రా. కిటికీ తలుపు మూశాడు. ఎంతోసేపు ఎగిరి అలిసిపోయిందో, వెతుక్కుంటున్న వస్తువు దొరకని నిస్పృహో, తూనీగ గోడ మీద నిదానంగా వాలింది. మెల్లగా కదులుతున్న తూనీగ రెక్కల్ని పరిశీలనగా చూశాడు రెప్పార్చకుండా. రెక్కల మధ్య దూరం తగ్గిన క్షణంలో చటుక్కున్న రెండు రెక్కలు ఒడిసి పట్టుకున్నాడు. అతని చూపుడు బొటన వేళ్ళ మధ్య తూనీగ బందీ అయింది. గిలగిలా కొట్టుకుంది. పట్టు వదలకుండా తన వైపు తిప్పుకుని, కొట్టుకుంటున్న తూనీగ శరీర భాగాల్ని సునిశితంగా పరికించాడు. చెయ్యి మార్చుకుందాం అనే ఉద్దేశంతో రెక్కల చివరలని రెండో చేతితో కూడా నొక్కి పట్టుకున్నాడు. రెండో చేతికి పని చెప్పి మొదటి చేతికి విశ్రాంతిద్దామని.
ఈ ఉధృతానికి తట్టుకోలేని సున్నితమైన తూనీగ రెక్కలు సగానికి చిరిగి విరిగిపోయాయి. అప్రయత్నంగా రెండు చేతులు వదిలేశాడు. జటాయువులా నేల మీద పడిన తూనీగ మళ్ళీ ఎగరడానికి ప్రయత్నిస్తూ, విఫలమౌతూ, గిలగిలలాడింది. ఆ ప్రయత్నాన్ని వీరరాఘవయ్య ఎంతో ముచ్చటగా మెచ్చుకుంటూ చూశాడు. దానికి అలసట మీద ఆకలి వేస్తోందేమో, ఏమైనా తినటానికి పెట్టాలేమో అని జాలికూడా పడ్డాడు. తూనీగ తినదగిన పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని రూమంతా కలయచూశాడు. కొంచెం ఎత్తులో గూడు పెట్టడం అప్పుడే పూర్తి చేసిన సాలె పురుగు ఒకటి కనిపించింది. పురుగులు తినే తూనీగకి పురుగులు తిన్న సాలె పురుగు మంచి ఆహారం అవుతుంది కదా అని నిశ్చయించుకున్నాడు. డ్రాయర్ లోంచి తీసిన స్కేలు పట్టుకుని లేచి నిలబడి సాలెపురుగుని ఒక్క దెబ్బ కొట్టాడు. చితికిన సాలెపురుగు, రసి స్కేలుకి అతుక్కుతున్నాయి.
ఎడమచేతి రెండు వేళ్ళతో తూనీగ సగానికి తెగిన రెక్కలని కలిపి పట్టుకుని పైకి లేపాడు. కుడిచేతితో స్కేలు పట్టుకొని స్కేలు చివర ఉన్న సాలెపురుగు కళేబరాన్ని తూనీగ మూతికి అందించాడు. తూనీగ తింటున్నట్టుగా తోచలేదు. రాచీ నొక్కీ చేతనైన ప్రయత్నం చేశాడు.
సెకన్లలో తూనీగలో కదలిక ఆగిపోయింది. హత్య పూర్తయింది. చట్టం హత్య అని గుర్తించలేని హత్య.
చచ్చిపోయిన తూనీగని కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేశాడు. స్కేలుని వాష్ బేసిన్‌లో కడిగి డ్రాయర్లో పెట్టాడు. చేతులు శుభ్రంగా కడుక్కుని రూము తలుపులు తీసి భోజనానికి తయారయ్యాడు.
సరిగ్గా ఇదేరోజు పది సంవత్సరాల క్రితం విద్యావతి ఐఐటి బాంబే లేడీస్ హాస్టల్లో ఉరిపోసుకు చచ్చిపోయింది.