అదే కాంతి: ఒక పరిశీలన

మనకి సాహిత్యంలో, సంగీతంలో, ఆర్థిక, రాజకీయ రంగాలలో అనేక విప్లవాలు వచ్చాయి. మతంలో విప్లవం వచ్చి మాత్రం చాలా శతాబ్దాలు గడిచిపోయాయి. రెండు వేల సంవత్సరాల క్రిందటి వరకూ విద్య, దేవుడూ-దేవుడికి చేసే సేవలూ, ఈ సృష్టి గురించిన తాత్విక చింతనా అన్నీ కొన్ని సామాజిక వర్గాల పూర్తి అధికారంలో, నియంత్రణలో ఉండేవి. సృష్టిలో కనిపించే అనంతత్వం (Infinitude), అనురూప్యత (symmetry), పొందిక (harmony), సౌందర్యం (beauty), ప్రజలని సామూహికంగా కబళించే భయంకరమైన మహమ్మారులు, ఉపద్రవాలు, అర్థంకాని ప్రకృతి నియమాలూ… ఒకటేమిటి అనేక విషయాలు ఈ సృష్టి వెనుక ఒక సర్వాంతర్యామి (omnipresent), సర్వజ్ఞుడు (omniscient) సర్వ శక్తిమంతుడు (omnipotent) అయిన భగవంతుడు ఉండి తీరాలనే ప్రాథమిక విశ్వాసాన్ని మనిషిలో కలిగించాయి.

మనిషి ఉనికితో, అతని ప్రార్థనలతో నిమిత్తం లేకుండా యాదృచ్ఛికంగానూ, పరిస్థితులకు అనుగుణంగానూ వచ్చే ఉపద్రవాలు భగవంతుని ఆగ్రహానికి సంకేతాలుగానూ, అనుకూలమైన మార్పులు భగవంతుని ప్రసన్నతకు సంకేతాలుగానూ వ్యాఖ్యానిస్తూ, భగవంతునికీ ప్రజలకీ మధ్య సంధాన కర్తలుగా ఒక వర్గం క్రమంగా ఎదగడం మొదలుపెట్టింది. అప్పటి పరిస్థితులలో, అవగాహన గాని, నియంత్రణ గాని లేని అనేక వైపరీత్యాలకూ, మనసును తొలిచే అనేక సందేహాలకూ, కర్మ సిద్ధాంతం విశ్వసించడానికి అనువైన, సుళువైన సిద్ధాంతంగా రూపొందింది. దాని వల్ల అన్ని అసమానతలకూ ఒక సమాధానం దొరకటంతో పాటు, మనిషి పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు బహుమానం/ శిక్ష అనుభవిస్తాడని, ఋజువు చెయ్యలేని ఒక ప్రమేయము (proposition) స్వయంసత్యంగా స్వీకరించబడటమే గాక, ఈ జీవన్మరణ విషవలయం తప్పించుకో శక్యంకానిదని, సర్వసంగపరిత్యాగం ద్వారానో/ కొన్ని కర్మకాండలు నిర్వహించడం ద్వారానో మాత్రమే దీనిని తప్పించుకోగలడన్న నమ్మకం ప్రబలింది.

కానీ దేవుడితోపాటు, ఆ రెండూ సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. అధికారాన్ని హస్తగతం చేసుకున్నవారూ, దానికి వత్తాసు పలికి తమ పబ్బం గడుపుకునే స్వార్థపరులు చేసే అత్యాచారాలు కూడా ఈ కర్మ సిద్ధాంతంలో భాగం అయిపోయాయి. తమ నిస్సహాయ స్థితినుండి బయటపడటానికి, భగవంతుని నామోచ్ఛారణకి, దర్శనానికీ తపిస్తూ అట్టడుగు సామాజిక వర్గాలు, స్త్రీలూ ముఖ్యంగా నలిగిపోయారు. ఆ తపన పరాకాష్టకు చేరుకున్న దశలో, సుమారు 9-10 శతాబ్దులలో, విశాల భారతదేశంలో ఉప్పెనలా భక్తి ఉద్యమం వచ్చింది. దేవుడు ఒకడే అని, అతను అందరికీ ఆప్తుడే అని, అతనిని కొలవడానికి ప్రేమ తప్ప ఏ అర్హతలూ అక్కర్లేదని, భక్తి ప్రధానం తప్ప భాష కాదనీ… అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. వాటి ప్రభావం అనేక రంగాలకు విస్తరించింది కూడా.

విశ్లేషించి చూసినపుడు, భక్తి ఉద్యమం రోజుల్లో ప్రజలకు దేవుని ఉనికి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. అప్పటికి శాస్త్రవిజ్ఞానం ఇంకా బాల్యావస్థలోనే ఉంది. ప్రజానీకంలో అత్యధిక భాగానికి దేవుని చూడాలని, స్మరించాలని, అందుకోవాలనీ తపన ఉంది. తమ నిస్సహాయ స్థితినుండి బయటపడటానికి ఏ పనిచెయ్యడానికైనా సంసిద్ధత ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జీవిక ముఖ్య సమస్య. అనేక మతాలు, అనేక విశ్వాసాలు జమిలిగా ఉన్నాయి. అలౌకిక లక్ష్యాల సాధనకంటే, లౌకిక సమస్యల పరిష్కారం ప్రాధాన్యం సంతరించుకుంది. శాస్త్రవిజ్ఞానం ఫలితాలు అతి సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇన్ని మతాలున్నప్పటికీ భగవంతుని ఉనికి మీద సాంప్రదాయికమైన విశ్వాసం తప్ప, వ్యక్తిగతమైన లోతైన అవగాహన గాని, ప్రగాఢమైన విశ్వాసం గానీ కనిపించవు. కారణం, భక్తి ఉద్యమం వచ్చిన రోజుల్లో మనకి తెలియని అనేక సమస్యలకి సహేతుకమైన సమాధానం విజ్ఞానశాస్త్రం అందించగలిగింది.

సృష్టి ప్రారంభ క్షణంలోని పరిస్థితులను శాస్త్రజ్ఞులు తమ ప్రయోగశాలలో సృష్టిస్తున్నారు. వివరించ సాధ్యం కావనుకున్నవి వివరించబడి, ప్రతిసృష్టి చెయ్యలేమనుకున్న అనేక వస్తువులు సృష్టింపబడుతున్నాయి. కర్మ సిద్ధాంతానికి అంటగట్టిన వంశానుగతంగా వచ్చే అనేక మార్పులకి కారణాలని విశదీకరించి, సమస్యలకి పరిష్కారాలనీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు కనుగొనే దిశలో ప్రయత్నిస్తోంది. మనిషికి తన అస్తిత్వం గురించిన స్పృహ ఎలా కలిగిందన్న విషయాన్ని మానసిక శాస్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. భగవంతుని ఆగ్రహానికి ఒకప్పుడు చిహ్నాలుగా భావించిన కోవిడ్ మహమ్మారి వంటి ప్రపంచవ్యాప్తమైన అంటురోగాలకి తక్కువ సమయంలోనే వాక్సిన్‌‌లు కనుగొన్శారు. రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలూ, పాలపుంతవంటి నక్షత్ర మండలాలూ ఒకప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తే, మనకు అందనంత దూరంలో, సృష్టి ఆవిర్భావానికి కేవలం కొన్ని మిలియన్ కాంతి వత్సరాల దూరంలో ఉన్న తొలి నీహారికలను (nebulas) జేమ్స్ వెబ్ వ్యోమదుర్భిణి చూపిస్తోంది. గ్రహాంతర యానానికి కావలసిన సాధన సంపత్తులను సమకూర్చుకునే దిశలో శాస్త్రవిజ్ఞాన పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇలా అన్ని రంగాలలోనూ ఆకాశమే హద్దుగా శాస్త్రవిజ్ఞానం విస్తరిస్తున్న ఈ తరుణం, అందరూ తమ మత విశ్వాసాలపై ఒకసారి దృష్టి పెట్టి ఇప్పటి పరిస్థితులకు అనువైన మార్పులు తీసుకురావలసిన సందర్భం.

సరిగ్గా ఇటువంటి సమయంలో మన మధ్యకి ముకుంద రామారావు 2022లో అదే కాంతి పుస్తకం తీసుకురావడం ఎంతో ముదావహం. భూమి తనతోపాటు మరో నాలుగు భూతములకి (elements) ఆటపట్టు. ఈ సృష్టి మొత్తంలో, జీవరాశి ఉండడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నవీ, ప్రస్తుతానికి మన పరిశీలనకి అందుబాటులో లేనివీ మినహాయిస్తే, ఈ సృష్టిలో జీవరాశి ఉన్నది ఒక్క మన భూమి మీద మాత్రమే. ఏ గ్రహం మీద జీవరాశి ఉండాలన్నా, అక్కడి పరిస్థితులు, లభ్యమయే మూల ధాతువులను ఆధారం చేసుకునే ఉంటుంది. కనుక, భూమి మీద పంచభూతాలకీ ప్రతీకలుగా ‘అదే ఆకాశం, అదే నేల, అదే గాలి, అదే కాంతి, అదే నీరు’ అన్న విస్తృతమైన కేన్వాస్ తీసుకుని, విశ్వసాహిత్యం లోంచి కొన్ని అపురూపమైన కవితలని ఏరి, అనువదించి, ఆయా వర్గాలుగా తీసుకువచ్చే బృహత్‌ప్రణాళిక వేసుకున్నారు ముకుంద రామారావు. అదే ఆకాశం, అదే నేల తరువాత ఆ వరుసలో ఇది నాలుగవ పుస్తకం. అదే నీరు మొన్ననే వెలువడింది కూడా.

అవసరం అన్ని ప్రయోగాలకీ నాంది అని నానుడి. అప్పటి ఆర్తికి కారణం భగవంతుడిని చూడగలగడానికీ స్మరించగలగడానికీ పుట్టుకద్వారా వచ్చిన అవరోధాలు. భక్తి ఉద్యమం భగవంతుడిని దేవాలయాల, అందుబాటులో లేని భాషలోని స్తోత్ర పాఠాల, కర్మకాండల చట్రాలనుండి విడిపించి, వ్యక్తిగతం చేసింది. కనుక ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, ప్రియుడిగా, ప్రేయసిగా, స్నేహితుడిగా, భార్య/ భర్తగా… తమకు నచ్చిన అనుబంధంతో సేవించారు. తమకు వచ్చిన భాషలో కీర్తించారు. అందుకే దేవుడు వ్యక్తిగతమూ, స్తోత్ర పాఠాలు జానపదమూ అయ్యాయి. లౌకిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, జీవితాన్ని నిబద్ధతతో జీవించడం ద్వారా తమ కర్మ లేశాన్ని తగ్గించుకోవాలన్న కోరిక వల్ల, తమ వ్యక్తిత్వాలని, నడవడినీ నైతిక వర్తనకు ప్రామాణికంగా తీర్చి దిద్దుకున్నారు. ఈ జీవితం గురించి, సృష్టి రహస్యాల గురించీ తాత్వికంగా ఆలోచించడానికి భగవంతుడు ఒక సాధనం అయ్యాడు. పెద్దగా చదువుకోకపోయినా, లోతైన అవగాహన గలిగిన వారి తత్త్వచింతన ఆశ్చర్యం గొలుపుతుంది:

నరికే వరకూ చెట్లు నీడనిస్తూనే ఉన్నట్టు, అపకారం చేసినా, చేయగలిగినంత వరకూ సాయపడుతూనే ఉంటారు వివేకులు. – అవ్వయ్యార్, 12వ శతాబ్దం.

రాయిని దేవునిగా ప్రతిష్ఠించి, పూలను జల్లుతూ
నీ శ్వాసక్రింద మంత్రాల్ని జపిస్తావు- ఏమిలాభం?
అతను నీలో ఉండగా, ప్రతిష్ఠించిన రాయి మాటాడుతుందా?
వంటపాత్రకి ఆహారం రుచి తెలుస్తుందా?
– శివవాక్కియార్, 13వ శతాబ్దం.

‘ఇది నాకోసం’ అంటుంది అగ్ని; పురుగులూ అదే అంటాయి
‘సరే కానీయ్’ అన్న భూమి ‘ఇది నాకోసం’ అంటుంది.
నక్క ‘ఇది నాకోసం’ అంటుంది; పిచ్చికుక్కా అదే అంటుంది
కంపుకొట్టే ఈ దేహబలాన్ని ప్రేమతో నేను పెంచిపోషించాను
ఏమిలాభమో నాకు?
– పట్టిణత్తార్, 14-15 శతాబ్దం.

కోరికకంటే నీచం ఏదీ లేదు; కోరిక లేకపోవడంకంటే గొప్పది ఏదీ లేదు
కరుణకంటే గొప్పమతం లేదు; ఏ సాయమూ హేతువుకంటే గొప్పది కాదు
చేతనాచేతనాలన్నింటికీ సకలేశ్వరునికంటె మరే ఇతర దేవుడు లేడు.
– సకలేశ మాదరస, 12వ శతాబ్దం.

మాలవీధికీ శివాలయానికీ… అదే నేల
మలినాన్ని కడగటానికీ, ఆచారంగా శుభ్రపరచడానికీ… అదే నీరు
స్వీయ జ్ఞానికి కులాలన్నీ ఒక్కటే! ఆరు మార్గాలున్న ముక్తి మార్గం ఒక్కటే
ఓ స్వామీ, కూడలసంగమదేవా!
నిన్ను తెలుసుకున్న వానికి సత్యం ఒకటే!
– బసవన్న, 12వ శతాబ్దం.

బీద అయితే, తిండి చింత; తిండి ఉంటే, దుస్తుల చింత;
దుస్తులుంటే, పొదుపు చింత; పొదుపు ఉంటే, భార్య చింత
భార్య ఉంటే, బిడ్డ చింత; బిడ్డ ఉంటే, సంపాదన చింత
సంపాదన ఉంటే, పోతుందని చింత; ఉన్నది పోకుంటే, మరణ చింత
అన్నిరకాల చింతల్లోనూ మునిగిపోయి
శివునికోసం చింత ఏ ఒక్కరిలోనూ చూడలేదు.
– అంబిగర చౌడయ్య, 12వ శతాబ్దం.

శూన్యం నుండి దేవాలయాన్ని సృష్టిస్తాడు భక్తుడు; దేవాలయం నుండి శూన్యాన్ని సృష్టిస్తాడు జ్ఞాని; ఆకారంలేని నిరాకారానికి వాళ్ళు ఆకారాలు తయారు చేస్తారు. – అల్లమప్రభు.

కోతులాడించే వాని కట్టె మీది కోతిలా, దారానికి చివర కీలుబొమ్మలా
నువ్వు ఆడించినట్టల్లా ఆడాను, పలికించినట్టల్లా పలికాను
నువ్వు ఎలా ఉంచితే అలా ఉన్నాను, నువ్వు ఆపేయ్ అని అరిచే వరకూ
పరిగెడుతూనే ఉంటాను, ఓ విశ్వేశ్వరా, చెన్నమల్లికార్జునా!
– అక్కమహాదేవి, 12వ శతాబ్దం.

ఆకాశంలో మేఘంలా, నీటిలో అలలా, ఈ దేహం వస్తుంది చూడు
ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎలా పోతుందో కూడా
అది ఎలా ఉన్నా దానిని సత్యంగా తీసుకున్నాను
కపిలసిద్ధమల్లికార్జునా.
– సిద్దరామ.

తల్లిపాలు తాగే బిడ్డ చక్కెర కావాలంటుందా?
పౌరుషంగా ఉండేవాడు, చితాభస్మంలో బంగారం వెతుకుతాడా?
దాసోహంలో భక్తుడు, మోక్షం కోరుకుంటాడా?
ఈ మూడింటికీ, ఏ ఇతర కోరికా లేదు
ఉప్పు రుచి స్వాభావికమైనట్టు శివపాదం ప్రీతి సహజం.
ఊరిలింగపెద్ది ప్రియవిశ్వేశ్వరా
ఆత్మ శరీరం దాచినట్టు, శక్తి శివుణ్ణి దాచినట్టు
పాలు నెయ్యిని దాచినట్టు, అనిర్వచనీయాన్ని వాక్కు దాచినట్టు
ఈ ప్రపంచం ఉద్దేశంలో అన్య ప్రపంచం దాగినట్టు
పరమాత్ముని మూలం నాలో దాగి ఉంది
వృక్షం విత్తనంలో దాగినట్టు, నాకు అర్థం కాకముందే ఉందది
మహాలింగగురు శివసిద్ధేశ్వరప్రభువా
– సిద్ధలింగ శివయోగి, 16వ శతాబ్దం.

నడిచే భూమి ఒకటే, తాగే నీరు ఒకటే
అగ్నితో చుట్టుముట్టే సూర్యుడొకడే
మధ్య కులగోత్రాలేందుకు సర్వజ్ఞా
తక్కువ కులం ఇంట్లో దీపం దుర్బలంగా వెలుగుతుందా?
కులం తక్కువా ఎక్కువా మాటలొద్దు
దేవుడు మెచ్చే వాడే ఎక్కువ కులస్తుడు సర్వజ్ఞా.
– సర్వజ్ఞుడు.

సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో మనం ప్రయాణిస్తున్నాం. ఇపుడు దేవుడు వైయక్తికం కాదు… సామాజికం. శాస్త్రవిజ్ఞానం దేవుడిమీద విశ్వాసాన్ని సడలించినా, లౌకిక విషయాలమీద అనురక్తిని తగ్గించలేకపోయింది. జీవితం యొక్క అంతిమ లక్ష్యం మీద స్పష్టమైన అవగాహన కలిగించలేకపోయింది.

దేవునికి బదులు మతంతో తమని తాము గుర్తించుకుంటూ, దేముడొక్కడే అన్న స్థితినుండి, తమ దేవుడే దేవుడనే మూర్ఖ విశ్వాసంతో దేవుడి పేరుతో సంఘర్షణలకు వెరవని ఈ కాలంలో, శాస్త్రవిజ్ఞానం మనకు కల్పించిన అవగాహనతో, మన విశ్వాసాలని మూల్యాంకనం చేసుకోవలసిన సమయమిది. మనం మనంగా ఉండగలిగే సమయం క్షణికం. ఈ చరాచర, చేతనా చేతన ప్రకృతి ‘ఒకటి రెండవదిగా’ నిరంతరాయంగా మార్పు చెందుతుందని, సూర్యుడు 5 బిలియను సంవత్సరాలలో అరుణతారగా మారనున్నాడని, దానికి కొన్ని బిలియను సంవత్సరాలకు ముందే భూమిమీద నీరంతా ఆవిరై, జీవకోటి నశించి, ఒక అనంత నిర్జీవ అవశేషంగా మారుతుందని విజ్ఞానశాస్త్రం చెబుతోంది. అందుకే మరో క్షేమకరమైన గ్రహం మీద మనిషి తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునే సన్నాహాలు చేస్తున్నాడు.

సృష్టికర్త అంటూ ఒకరు ఉంటే, అతను ఖచ్చితంగా మనుషులు తన కారణంగా విరోధులుగా మారడాన్ని అంగీకరించడు. ఒకప్పుడు సకారాత్మకమైన ఉద్యమం, ఇప్పుడు నకారాత్మకంగా మారుతుండడం బుద్ధి జీవులకు నిరాశ కలిగించే విషయం. దేవుని పేరుతో వర్గాలుగా విడిపోయి దూరమై పోతున్న ప్రజలకు, ఈ భక్తి ఉద్యమం గురించి అపూర్వమైన పరిశ్రమ చేసి తీసుకువచ్చిన ముకుంద రామారావు అదే కాంతి ఒక కనువిప్పు.


పుస్తకం: అదే కాంతి – మధ్యయుగంలో భక్తి కవిత్వం: సామాజిక నేపథ్యం.
రచన: వై. ముకుంద రామారావు
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్, 2022. పే.730, వెల: 700₹ (20$ USA)
ప్రతులకు: ఛాయా, అమెజాన్, ప్రముఖ పుస్తకదుకాణాలు.