Replica

లెక్కించడం రాని బాల్యపు పసితనంలోనే ఇంకా ఇంకా వెదుకులాడుతుంటాను. వినిపిస్తున్న అలికిడి కంటి తుడుపు చిరునవ్వుల తర్జుమా అనుకుంటాను.


“ఎట్లున్నవ్! ఆరోగ్యమెట్ల వున్నది. నాయిన ఎట్లున్నడు? పానం మంచిగున్నదా?” ఇవేమీ అడగలేకపోతాను. నన్ను చూస్తూనే వికసించే అమ్మ ముఖంలోని నవ్వు అలుగై పారుతది. ఆ తేజస్సు నాలోకి ఇంకి నన్ను వెలిగిస్తది. మాటలేవీ వుండవు మా మధ్య! ఒకరికొకరం అలా చూస్తూ ఉండిపోతాం. అంతే!


దగ్గరికి తీసుకుని ‘మల్లెప్పుడు అవుపడుతవ్ బిడ్డా!’ అన్నప్పుడు – నా చెల్లని మొఖాన్ని ఏడ దాపెట్టుకోవాలో తెలియక గింజుకుంటుంటాను. పట్టున పత్తి పువ్వు లెక్క పలిగిపోవాలనుంటుంది. బుంగబడ్డ చెరువు లెక్క ఖాళీ అయిపోవాలనుంటుంది.


అదేందోగాని బెల్లంగొట్టిన రాయి లెక్క నిల్సునుడు దప్ప ఏ ఉలుకూ వుండదు. తన చల్లని చూపుకు ఈ నల్లని మబ్బు ఏడ జడివానవుతుందోనని పయిలంగ పదురుకుంట. ఒక్క డల్లు పడినా మత్తడి పోసే అమ్మ మనసును కనిపెట్టుకొని కూసుంట.


కొన్ని మాటలలో ఏ భావోద్వేగమూ పలకదు. నిశ్చలమైన నీటిలో ఒక పచ్చనాకు రాలిపడ్డట్టు… అచ్చం అమ్మలా పసిపాప నవ్వుతది. అంతే ఇగ! ఎందుకు పుట్టానో ఈ జన్మకు సార్థకత దొరికినట్టనిపిస్తది.


నన్ను నేను బయటేసుకోవాలనే వుంటది. నన్ను మోసిన తల్లికి నా నిస్సహాయతను, నా బిడ్డల్ని మోస్తున్న తల్లికి నా నిర్లక్ష్యాన్ని తప్ప ఏమీ ఇవ్వలేని అసమర్థుడిలా మిగిలిపోతుంటాను. ఇద్దరు తల్లుల దీవెనార్తులే ఊపిరిగా శ్వాసిస్తుంటాను. మనసును ఒంపుకున్నప్పుడల్లా ఒక వాక్యం రాస్తుంటాను – ‘అమ్మలందరూ కారణజన్ములే’ అని!


కుండపోతగా కురిసే బడబాగ్ని వాన లోపలెంతగా సుడులు తిరుగుతుందో, చిట్టి చిట్టి లేలేత చేతుల దోసిళ్ళతో ఒడిసి పట్టలేనంత దుఃఖం ఎంత వుందో…ని అమ్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది?