జేగంటల సవ్వడి – మేఘాలనందుకున్న గాలి గోపురం
అదిగో ఆ కొండపై వెలసిన మందిరం
బాల్యంలోనో కలలోనో – చూసినట్లే జ్ఞాపకం.
మెట్ల మీద లయగా నా మెట్టెల ధ్వని
పాదరక్షలు లేని కాళ్ళకి చీరకుచ్చిళ్ళే గొడుగు
కంటి చూపుకి లంకె వేసే ఇరు వైపుల పచ్చదనం
నడక ఆగి సేద తీరి – అచ్చంగా నాదనిపించే సమయం.
మెడలో పచ్చని పసుపు తాడు – చేతిలో చెయ్యి. వారితో పాటు కొన్ని నవ్వులేవో క్రిందకి దొర్లిస్తూ సులువుగా దిగి వస్తున్న కొత్త జంట.
ముందు మెట్లపైన ఎవరో ఆ నడివయసు దాటిన వ్యక్తి. మామధ్య దూరం పాతికనుండి ఇరవై మెట్లుగా మారేక్రమంలో మెరుపులా తోచింది – వెనుక నుండి అచ్చం నాన్నలా ఉన్నాడని!
నిండైన భుజాలతో కాసింత ఒంగిన వెన్ను
అలవాటుగా వేసుకునే లేత నీలి రంగు చొక్కా
ముందర జేబుకి ఇంకు పెన్ను మరక వుందో లేదో కానీ
యాబై ఏడేళ్ళ వయసులో వెళ్ళిపోకుండా వుంటే
బహుశా ఇలాగే ఉండేవాడు.
ఈ ఊహ ఇస్తున్న ఓదార్పో, అది ఇలాగే కొనసాగాలనో, ఎదుటపడి ఈ భావనలను పోగొట్టుకోలేకనో, మా మధ్య కనీస దూరం ఇలాగే వుంచే ప్రయత్నంలోనో నెమ్మదించాను – ఆగి కదిలాను.
ఈ ఆఖరి పిల్ల కూడా గట్టెక్కి వుంటే బావుండునని
ఇరవై ఏళ్ళ క్రితం బెంగపడిన నాన్న
కాల నిర్ణయానికి వెళ్ళిపోయిన నాన్న.
అలా వెళ్ళకుండా ఉండి ఉంటే పదేళ్ళక్రితం అన్నావదినల బదులు అమ్మతో కలిసి నా కల్యాణం జరిపించి ఉండే నాన్న – ఉండి ఉంటే బహుశా ఇలాగే ఉండేవాడు. అమ్మ పక్కన కూర్చుని – ఆకు వక్కలు పేర్చి మరింత లోతు సంతరించుకున్న నుదుటి గీతలతో కుడి బుగ్గలో తాంబూలంతో బహుశా ఈ నా ఊహకి తోచినట్లే వుండేవాడు.
ఉండి ఉంటే కుదురుగా కూర్చోకుండా పరుగులు పెట్టే నా ఆరేళ్ళ కూతురుని తన నవ్వులని అమ్మతో కలిసి చూసి మురిసి అప్పటిలాగే మొహం పైకెత్తి పకపకా నవ్వేవాడు.
అలాంటి మనిషిని కోల్పోయిన అమ్మ
బోల్తా పడిన బండిని సులువుగా పైకెత్తిన అమ్మ
రెండు చక్రాలు – నాలుగు చేతులు తానే అయి జీవిత రథాన్ని నెట్టుకొచ్చిన అమ్మ.
నాన్నే ఉండి ఉంటే తన తరువాతి జీవితం అంత క్లిష్టంగా వుండేది కాదని ఏనాడూ వ్యక్తపరచని అమ్మ…
ఈ స్పృహ కలిగిన మరుక్షణం నా ఊహల నాటకానికి తెరదించుతూ – అతడు వెనుతిరిగి చూశాడు!