పడమర ముఖం ఇంటి మీద
ఎండ పొడ పెడగా జారినట్టు
ఎదురుపడని నిందలన్నీ చెవి వెనకే చేరతాయి.
ఈదురు గాలి రాల్చిన కచ్చికాయల్ని
పక్షులు గుజ్జు కోసం పొడిచినట్టు
నా గుమిగూడిన నిమిషాలకు గాయం చేస్తాయి.
ఎంత కాదన్నా నిందను ఉండ చేసి విసిరే వాడొకడుంటాడు.
అది ఒకడి నుండి ఒకడికి బొంగరంలా తిరిగినప్పుడు
వికటానందమేదో ముఖం మీద చెమటలా మెరిసినప్పుడు
నమ్రత పట్టు తప్పి కోపంతో తూలినట్టు ఉంటుంది కానీ
క్షణం గడిచాక రుసరుస కరిగి ఫక్కున నవ్వుకుంటాను.
వాడి చెత్త చింతనలో ఎన్ని జీవకణికలు
చితికి ఉంటాయో తలుచుకుంటాను.
ఒక్కోసారి ఎవరూ దొరకనప్పుడు
పెరుగన్నం దక్కని గండుపిల్లిలా
జాలి మరకతో తిరిగినట్టుండే
వాడి కంతిరి ముఖం మీద పోలికలు
గంపలు గంపలుగా పోగుపడతాయ్.
ఏ నిమిషాన్నీ రసహీనంగా చూడని వాడ్ని కదా –
చివరికి వాడి చింపిరి చూపు కూడా పద్యాన్నిచ్చిందని
తృప్తి పడతానిలా…