పరిచయం
శ్రీకృష్ణదేవరాయలకు మూరురాయర గండ (ముగ్గురు రాజుల అధిపతి – గజపతి, అశ్వపతి, నరపతి), సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కన్నడరాజ్యరమారమణ, ఆంధ్రభోజ అనే బిరుదులున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇతని రాజ్యపరిపాలనాకాలం ఒక స్వర్ణయుగము అని చెప్పవచ్చును. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం ఇతని రాజ్యములో ఆంధ్రేతర భాషల కవిత్వవికాసాన్ని పరిశీలించడం. ఇక్కడ రాయలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరిచయం ఉన్న కవులను గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. అతని సామంతరాజుల రాజ్యాలలో ఉండే కవులు, పండితులు, వారి గ్రంథాలను పరామర్శించడం ఈ వ్యాసపరిధిని మించిన విషయం.
రాయలు విజయనగరాన్ని పరిపాలించిన వంశాలలో మూడవదైన తుళువంశానికి చెందినవాడు. ఇతని మాతృభాష తుళు. ఈ భాషను నేటికీ కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు ప్రాంత ప్రజలు వాడతారు. కన్నడ భాష తెలిసిన రాయలకి సంస్కృత తెలుగు భాషలలో కవిత్వం వ్రాసేటంత శిక్షణ ఉన్నది. రాయలు సంస్కృత కవితాసాగరాన్ని మథించిన అపరవిష్ణువు. అందుకేనేమో ఆముక్తమాల్యద ప్రతి ఆశ్వాసాంతంలో మిగిలిన కవులలా ఒక గద్యం వ్రాయక ఇది నేను వ్రాసిన ఆశ్వాసమని ఒక మత్తేభవిక్రీడితంలో చెప్పుకొంటాడు. ఆముక్తమాల్యద పీఠికలో, శ్రీకాకుళ మహా విష్ణువు కలలో కనిపించి రాయలిని ఆంధ్రభాషలో కావ్యము రచింపమని అడిగినాడని చెప్పే సందర్భంలో, అతని ఇతర కావ్యాల గురించిన ప్రస్తావన ఇలా ఉన్నది –
సీ. పలికి తుత్ప్రేక్షోపమల జాతి పెంపెక్క
రసికు లౌనన మదాలసచరిత్ర
భావధ్వనివ్యంగ్య సేవధి గాఁగఁ జె-
ప్పితివి సత్యావధూప్రీణనంబు
శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి
సకలకథాసారసంగ్రహంబు
శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తి-
నైపుణి జ్ఞానచింతామణికృతి
తే. మఱియు రసమంజరీముఖ్య మధురకావ్య
రచన మెప్పించికొంటి గీర్వాణభాష
నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిఁక మాకు బ్రియముఁ గాఁగ
(ఉత్ప్రేక్ష, ఉపమ, స్వభావోక్తి మొదలైన అలంకారాలతో రసికులు ఔనని తల ఊపే విధముగా మదాలసచరిత్రను వ్రాసినావు; భావమునకు, ధ్వనులకు, వ్యంగ్యానికి నిధివలె ఉండే సత్యావధూప్రీణనము అనే కావ్యాన్ని వ్రాసినావు; వేదాలు, పురాణాలు, సంహితలు వీటిని పరిశోధించి సకలకథాసార సంగ్రహమును సంకలన పరిచినావు; విన్నవారి పాపములు పటాపంచలు అయ్యేట్లు మాటల చమత్కారముతో జ్ఞానచింతామణిని వ్రాసినావు; తరువాత రసమంజరిలాటి మధుర కావ్యాలను సంస్కృత భాషలో వ్రాసినావు; అట్టి నీకు ఆంధ్రభాషలో కృతిని వ్రాయడము కష్టమా, మేము ఉప్పొంగిపోవునట్లుగా కృతిని వ్రాయుము.)
రాయల సంస్కృత కావ్యములు
రసమంజరీకావ్యము: రసమంజరీకావ్యము అలబ్ధము. కాని ఈ పద్యము అందులోనిదని నానుడి –
ఉడురాజముఖీ మృగరాజకటి
ర్గజరాజగతిః కుచభారనతా
యది సా రమణీ హృదయే రమతే
క్వ జపః క్వ తపః క్వ సమాధిరతిః
(చంద్రునిలాటి అందమైన ముఖము గలది, సింహములాటి సన్నని నడుము గలది, ఏనుగులాటి మందమైన గమనము గలది, స్తనభారముచేత వంగినది, అట్టి ఆ సుందరి హృదయములో ఆసనము వేసికొని ఉన్నప్పుడు జపమెందుకు, తపమెందుకు, సమాధి ఎందుకు?)
జాంబవతీకల్యాణం: శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన సంస్కృత కావ్యాలు అన్నీ ఇప్పుడు దొరకకపోయినా జాంబవతీ కల్యాణము (పరిణయము), సకలకథాసారసంగ్రహము మనకు అందుబాటులో ఉన్నాయి. జాంబవతీ కల్యాణము వసంతోత్సవ సమయములో ప్రదర్శించబడిన నాటకము అని పేర్కొనబడినది. నాటకాంతములో “సమాప్తమిదం రాజాధిరాజ రాజపరమేశ్వర సకలకలాభోజ రాజవిభవ మూరురాయరగండ శ్రీమత్కృష్ణరాయ మహారాయ విరచితం జాంబవతీకల్యాణం నామ నాటకం” అని ఉండడంవల్ల ఈ నాటకకర్త రాయలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇందులోని అసంపూర్ణమైన మొదటి పద్యాన్ని, చివరి పద్యాన్ని ఇక్కడ మీకు తెలియబరుస్తున్నాను –
…. శ్రీకృష్ణరాయః కవిః
సూక్తిః కర్ణరసాయనం సుమనసాం శ్లాఘ్యస్వభావా సభా
చారిత్రం యదువంశశేఖరమణేః దేవస్య సర్వోత్తమః
పారంపర్యకృతశ్రమాః పునరపీ నాట్యేనపారా వయం
(దీనికి శ్రీకృష్ణరాయలు కవి. చెవుల కింపైన మాటలతో మనోజ్ఞమైనది, పొగడబడే స్వభావములు గలది. సర్వోత్తముడైన కృష్ణుని కథ యిది. ఈ అపారమైన నాటకాన్ని పూర్వజన్మ సుకృతముచే మళ్ళీ వ్రాస్తున్నాను.)
ధర్మం పాదచతుష్టయేన కృతవత్ స్థైర్యం సమాలంబతాం
చాతుర్వర్ణ్యముపైతు కర్మ సతతం స్వస్వాధికారోచితం
శేషక్ష్మాధరనాయకస్య కృపయా సప్తార్ణవీమధ్యగా
రక్షన్గామిహ కృష్ణరాయనృపతిర్జీయాత్సహస్రం సమాః
(స్థిరత్వము ఊతగా ఉండగా ధర్మము నాలుగు పాదాలతో నడుస్తుంది, నాలుగు వర్ణాలవారు వారి వారి ఉచిత కర్మలు తప్పక చేసికొంటూ ఉంటారు, దైవ కృపవలన సప్త సముద్రాల మధ్య ఉండే దేశమును శ్రీకృష్ణరాయ నృపతి వేయేళ్ళు జీవించి రక్షించుగాక.)
సకలకథాసంగ్రహసారము: ఆముక్తమాల్యదలో పేర్కొన్న సకలకథాసంగ్రహసారము అనే కావ్యాన్ని తన గురువైన వ్యాసతీర్థుల ప్రేరణచే వ్రాసినానని రాయలు చెప్పుకొన్నాడు. ఈ కావ్యం నుంచి వేటూరి ప్రభాకర శాస్త్రిగారు భారతిలో ప్రచురించిన ఒక పద్యము –
ఉత్సాహం మమ వీక్ష్య మద్గురు రథ శ్రీవ్యాసతీర్థో మునిః
పర్యాలోచ్య పురాణశాస్త్ర వివిధామ్నాయేతిహాసాదికాన్
లబ్ధాస్తత్ర కథాహరేః పశుపతేస్సామ్యం నిరూప్యాధికం
విష్ణుం కీర్తయ సర్వధేత్యుపదిశన్ మహ్యం ముదా దత్తవాన్
(మా గురువుగారైన వ్యాసతీర్థులు నన్ను ఆసక్తితో చూసి ఇలా అన్నారు – పురాణాలను, శాస్త్రాలను, వేదాలను, ఇతిహాసాలను క్షుణ్ణముగా చదివి అందులోని హరి హరుల కథలను చెప్పుము. విష్ణువును నీవలా కీర్తిస్తే మాకు సంతోషము కలిగించినవాడు అవుతావు.)
తుక్కా పంచకము: రాయలను గురించి, ఆ నాటి కవిత్వమును గురించి చెప్పేటప్పుడు తుక్కాదేవి ఉదంతాన్ని మర్చిపోకూడదు. కళింగరాజ్యాన్ని జయించిన పిదప గజపతి కుమార్తెను రాయలు పెళ్ళాడుతాడు. ఆమె పేరు సుభద్ర; ఆమెకే తుక్కా అని మరో పేరు కూడ ఉన్నదని వాడుక. కొందరు తుక్కాదేవియే చిన్నాదేవి అని అంటారు. ఈ వివాహము ఓఢ్రరాజుకు రుచించలేదు. ఆమెకు బదులుగా ఆమెనే బోలిన ఆమె అన్నను ఆడ వేషములో పడకటింటికి పంపుతాడు. అప్పుడు ఆమె ఈ పద్యాన్ని వ్రాసి రాయల విడిదికి హెచ్చరికగా పంపుతుంది.
పడకటింటను నో ప్రభూ, పాన్పు వెలితి
పేరటాండ్రు నారులు గారు, వీరకులము
తొందరించిన పనులెల్ల తోవ చెడును
సావధానత నే హాని జరుగబోదు
దానిని చదివిన మహామంత్రి తిమ్మరసు తగిన సన్నాహాలను చేస్తాడు. రాత్రి రాయలు పడకగదికి వెళ్ళి మంచమును తట్టగా అది కూలిపోతుంది. వెంటనే ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది. ఇటువంటివారితో పొత్తు కుదరదని రాయలు తుక్కాదేవిని తిరిగి పుట్టింటికి పంపుతాడు. కాని ఆమె చెలికత్తెతో ఖమ్మం దగ్గర వాసము ఏర్పరచుకొని, అక్కడ ఒక పెద్ద చెరువు త్రవ్వించి దానధర్మాదులు చేస్తూ, రాయల అనుగ్రహానికి ఎదురుచూస్తూ తుక్కాపంచకము లేక భృంగపంచకము అనే ఐదు పద్యాలను సంస్కృతంలో వ్రాస్తుంది. (మానవల్లి రామకృష్ణకవి ఈ ఉపాఖ్యానము ఒక కట్టు కథ అని అభిప్రాయపడినారు). తుక్కా పంచకములో మొదటి పద్యము –
భ్రమన్వనాంతే నవమంజరీషు
న షట్పదో గంధఫలీ మజిఘ్రత్
సా కిం న రమ్యా స చ కిం న రంతా
బలీయసీ కేవల మీశ్వరేచ్ఛా
క్రొత్త క్రొత్తగ వనిలోన జిత్త మలర
బ్రోవులై పూచె జెలువంపు పూవు లెన్నొ
షట్పద మ్మేల నొల్లదు సంపెగలను
షట్పదికి లేదొ రసికత సరసతయును
గాదొ సంపెగ సుందర గంధవతియు
దైవలీలయె సర్వము దరచి చూడ