నేరము – శిక్ష

“ఈ కేసులన్నీ మన ఒళ్ళో వచ్చి పడతాయేంట్రా” జడ్జీ ముకుంద రావు తన చిన్న నాటి స్నేహితుడు లాయర్ వెంకట్ రెడ్డితో నిరాసక్తంగా అన్నాడు.
అది అగస్టు నెల, ఆదివారం. రాత్రి తొమ్మిది అయింది, అప్పుడే తెలుగు టీవీ లో వార్తలు అయిపోయి ఏదో మళ్ళీ సినిమా మొదలయింది. ఇద్దరూ కలిసి ఒక బీరు బాటిలు ఖాళీ చేసారు అప్పటికి.

ప్రతి ఆదివారం అది వాళ్ళకలవాటుగా మారిన తంతు. జడ్జీ భార్య అమెరికాలో కూతురి దగ్గరకు వెళ్ళింది. ఇక ప్రతి వారం వీళ్ళిద్దరికీ ఇంట్లో ఉండే పని వాడు తెచ్చిన బీర్లు ఖాళీ చేస్తూ లోకాభిరాయణం, దేశమ్మీది రాజకీయాలు, ఊళ్ళో కేసులు మాట్లాడుకోవడం అలవాటు.

ఇద్దరూ పట్నంలో డిగ్రీ కలిసి చదువుకున్నా ముకుంద రావు అన్ని జిల్లాలూ తిరిగి రావడం జరిగింది కానీ, వెంకట రెడ్డి ప్రాక్టీసు చేస్తున్న పాలమూరు జిల్లా కోర్టుకు రావడం ఇదే మొదటి సారి. ఇరవై ఏళ్ళుగా జడ్జీగా చేస్తూ కొద్దిగా ఒళ్ళు చేసి ఇంట్లో నలుగురైదుగురు పని వాళ్ళతో అంతో ఇంతో సోమరిపోతుగా మారినందుకు స్నేహితుడుగా ఆటపట్టించినా, తెల్లారి కోర్టులో కలిస్తే మిగతా లాయర్లలాగే భయ భక్తులతో ఉండటం అలవాటు చేసుకున్నాడు వెంకట రెడ్డి.

వాళ్ళీ రోజు తల బద్దలు చేసుకునే కేసేమిటో ఇద్దరికీ తెలుసు. రెండు నెల్ల క్రితం, బోయ నీలమ్మ ముక్కు కోసాడు ఖాసిం అనే ఒక రిక్షా పుల్లర్.

మామూలుగా అయితే ఇట్లాంటి కేసులు ఏ ఏడాదికో కాని కోర్టుకు రావు. ముక్కు కోసిన వాణ్ణి వెంటనే పట్టుకోలేదని ఊళ్ళో మహిళా సంఘాలు మీటింగులు పెట్టినారు. ఆడవాళ్ళంటే మరింత అలుసు అవుతుందనీ ఇది సంఘం ఉనికికే ప్రమాదమని ఆ నీలమ్మ ఆసుపత్రిలో ఉండగానే ఒక ఊరేగింపు తీసినారు. ఆవిడకు ఏదైనా పని నేర్పించి ఉద్యోగం వెతికి పెడతాం, అయినా ఇట్లా హాని చేసిన వాడు బయట ఉంటే ఆవిడకు ప్రాణానికే ప్రమాదమని కలెక్టరుకు మెమో అందచేసినారు.

మామూలుగా ఎవరో పెద్ద వాళ్ళ కేసులో, డబ్బు వచ్చే అవకాశం ఉన్న కేసులో అయితే తప్ప త్వరగా కదలని పోలీసులకు అస్పత్రిలో ఆవిడ వాజ్ఞ్మూలం తీసుకుని ఆ ఘాతుకం చేసిన వాడిని పట్టుకుని కేసు పెట్టక తప్పలేదు. నీలమ్మ చెప్పిందాని ప్రకారం ఆవిడ తన గుడిసెలో ఉండగానే ఖాసిం వచ్చి కత్తిపీటతో ముక్కు కోసినాడు. వేరే ఎవరూ లేరు ఆ టైముకు, ఆవిడే మంట భరించలేక బయటకు పరుగెత్తితే చుట్టు పక్కల వాళ్ళు గవర్మెంటు ఆస్పత్రికి తీసుకొచ్చినరు. మహిళా సంఘాలు చేబట్టి అందరినీ ఖాళీ చేయమనే ఆస్పత్రి వాళ్ళు పదిహేను రోజులుంచుకున్నా బాగానే చూసుకున్నరు.

ఇప్పుడు ఆ కేసు వాయిదాకొచ్చింది. పబ్లికు ప్రాసిక్యూటరు వెంకట రెడ్డి. కేసు టైటుగా ఉంది ఎట్లాగూ, వెంకట రెడ్డి తనకై తను పట్టించుకుని వాదించిన కేసుల్లో నేరస్తుడికి శిక్ష పడకపోవటం అంటూ జరగదు. అదీ కాక వాడొక రిక్షా తొక్కేవాడు, జేబులో డబ్బెలాగూ లేదు కనుక ఎవరూ కేసు వాదించడానికి ముందుకు రాలేదు ఒక నెలంతా.

జడ్జీ ముకుంద రావు ఖాసింఉను కోర్టులో ప్రవేశపెట్టిన మొదటినాడు అడిగాడు అతని తరఫున ఎవరైనా లాయరున్నాడా అని. వేరే జడ్జీల సంగతేమో కానీ జడ్జీ ముకుంద రావు మాత్రం నేరం రుజువయ్యే దాకా అందరినీ సమంగా చూస్తాడనే అంతా చెప్పుకుంటరు.

వాయిదా డిసైడ్ చేస్తూ కోర్టులో అప్పుడే కొత్తగా క్రిమినల్ లాయరుగా రిజిస్టరు చేసుకున్న శ్రీనివాసును వాడికి కోర్టు వారు అప్పాయింటు చేసిన లాయరుగా తీసుకోమన్నాడు. శ్రీనివాసుకు అంత పెద్ద జడ్జీ తనకు ఒక కేసు ఇస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక బుర్ర ఊపాడు.

“బుర్ర ఊపడం కాదు, బాగా ప్రిపేర్ అయి సరిగ్గా వాదించు, పైకొస్తావ్” అని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పినట్టు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

ఈ రోజు ఆ శ్రీనివాసే మిత్రులిద్దరికీ ఇంత తలనొప్పి తెచ్చిపెడతాడని అనుకుని వుంటే అసలు ఈ కేసును వేరే జడ్జీకి బదిలీ చేసి ఉండేవాడు ఆనాడే. ఇప్పుడు తప్పేలా లేదు, మొత్తం కథ వినడం తప్ప.

మొదటి వాయిదా నాడు, అంటే నెల క్రితం శ్రీనివాసు ఒక కొత్త విషయం పట్టుకొచ్చాడు. ఆ ఖాసిం ఈ బోయ నీలమ్మకు ప్రియుడట. ఆవిడ అసలు మొగుణ్ణి వదిలిపెట్టి చాన్నాళ్ళయింది. విషయమేంటంటే, ఖాసిం ముక్కు కోసాడా లేదా అని కాదు ప్రశ్న. పోలీసులు పెట్టిన కేసు కేసు కాదు అన్నది వాదన. ఆ కేసు బోయ నీలమ్మ ఫిర్యాదు పైన కాదు. ఎవరూ కంప్లైయింటు చేయకుండా ఎవరో చెప్పిన మాటలు విని పోలీసులు కేసు బనాయించి ఖాసిం ను అరెస్టు చేసారు అతడిని వెంటనే విడుదల చేయాలని అప్పీలు చేసుకున్నాడు.

ఈ వాదన విన్న పీ పీ వెంకట రెడ్డి పైకి లేస్తూ ఉంటే వారించి, జడ్జీ గారు, “బాబూ శ్రీనివాసు, నీవు మొదటికేసుకే బాగా వాదిస్తున్నవు, వేరే మాటేదయినా చెప్పు, అసలు ఆవిడ పేరు చెప్పనిదే పోలీసులు వెళ్ళి అరెస్టు చేసారని మాత్రం చెప్పకు, ఎందకంటే ఈ ఎఫ్ ఐ ఆర్ లో సరిగ్గానే రాసి ఉంది మరి” తన దైన శైలిలో గుర్రు మన్నడు.

“జడ్జీ సార్ …” అని శ్రీనివాస్ మొదలుపెట్టే లోపలే, అందుకుని, “యువరానర్ …” అని అందించాడు ఒక చిర్నవ్వు నవ్వి. ముకుంద రావుకు ఓపెన్ – షట్ కేసుల్లో తప్ప వేరే కేసుల్లో అసలు నవ్వెట్లా ఉంటుందో కూడా తెలియదు. వెంకట రెడ్డి ఊపిరి పీల్చుకున్నడు.

“సారీ యువరానర్, పోలీసులు చేసిన తప్పేంటంటే ఆవిడ బాధలో ఉన్నప్పుడు, అంటే ఇంకా ఆస్పత్రిలో ఉన్నప్పుడే కనిపించి ఆవిడను కేసు పెడతావా ఎవరిమీదయినా అని అడిగే బదులుగా, ఆవిడ నోటెమ్మట వచ్చిన మొదటి పేరు తీసుకుని ఈ కేసు పెట్టారు” అన్నడు శ్రీనివాస్.

“అయితే నీ క్లయింటు ఈ పని చెయ్యలేదంటవు”, జడ్జీ గారు.

“ఆ విషయం మిగతా ఆధారాలు అన్నీ చూసి కోర్టు వారు చెప్పవలసినదే కాదా యువరానర్”, శ్రీనివాస్.

వీడు తన పాఠాలు తనకే చెప్పేలా ఉన్నాడు అనుకుని, “సరే అయితే నీ క్లయింటును బెయిలు మీద విడుదల చెయ్యమంటారా, లాయరు గారు”, చివరి పదాల్ని వత్తి పలికాడాయన.

“అవును సార్”.

“నువ్వుంటావా పూచీకత్తు?”

“లేదు సార్, మీరు వొప్పుకుంటే తను కూడబెట్టుకున్న వెయ్యి రూపాయలూ కోర్టుకు పూచీకత్తు కింద కట్టి బెయిలు మీద విడిపించడానికి ఖాసింతోటి ఇన్నాళ్ళుగా ఉన్న బోయ నీలమ్మనే వచ్చింది తయారుగా వుంది”.

జడ్జీ, పీ పీ లతో పాటుగా కోర్టు రిపోర్టరు, మిగతా అక్కడున్న అంతా కొద్దిగా తెల్లబోయినరు.

“ఏం, మజాక్ జేస్తున్నవానయ్యా?” జడ్జీ గొంతులో కొంత ఎడ్జీనెస్

“లేదు సార్, నేను చెప్పేది నిజమే, కావలంటే ఆవిడ బయట మెట్ల మీద ఉంది తీసుకొస్తాను, మీ పర్మిషను ఉంటే”

జడ్జీ ఒప్పుకోవడం, ముక్కుకు ఇంకా పట్టీతోటే ఉన్న నీలమ్మ కూడా లాయరు శ్రీనివాసు చెప్పింది నిజమేనా అని అడిగిన దానికి తలాడించడం చూసి చిర్రెత్తుకొచ్చినా ఇక చేసేదేం లేక బెయిలు ఇచ్చి మరో వాయిదా పెట్టినాడు జడ్జీ ముకుంద రావు.

వెంకట రెడ్డికి అడ్డు చెప్పే అవకాశమే రాలేదు.

మరుసటి వాయిదాలో, ఖాసిము-నీలమ్మ కేసును పంచనామా చేసిన పోలీసులు ఆవిడ చెప్పిన విషయాలను, అక్కడే అసుపత్రిలో ఉన్న మిగతా అందరి వాగ్మూలాలూ కోర్టు వారికి ప్రవేశ పెట్టినాడు వెంకట రెడ్డి.

“కేసు టైటుగానే కనిపిస్తుంది, నువ్వు చెప్పవలసింది త్వరగా చెప్పేస్తే మనకందరికీ ఈ వాయిదాల బాధ తప్పుతుంది” క్రిందటి సారి వచ్చిన సర్ ప్రైజ్ ను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు జడ్జీ.

“సార్ మీరు త్వరగా పని జరిగిపోవాలంటున్నారు కనుక, నా క్లయింటు పేరు లక్ష్మణుడుగా మార్చుకుంటే ఎట్లాంటి శిక్ష వేస్తారో అదే శిక్ష వేయండి” అని కూర్చున్నాడు శ్రీనివాస్.

మరోసారి తెల్లబోవడం జడ్జీ వంతయింది.

“ఏం జోకులేస్తున్నవా లాయరు గారూ, నీ క్లయింటు ముక్కు కోసింది నిజమా కాదా అన్నది చెప్పమంటే రామాయణం విప్పుతానంటావేం” కొద్దిగా హుంకరించాడు కూడా.

“యువరానర్, మీకు నేను ఈ కేసు వాదించవద్దు అని ఉంటే, నన్ను తీసేసి మరొక సమర్ధుడికి ఇవ్వండి, దయచేసి”

“ఇది నా కోర్టు, నీ ఇష్ఠం వచ్చినట్టు మాట్లాడ్డానికి ఇదేం నీ కాలేజీ క్లాసు కాదు, మరో సారి నా అధారిటీని ఛాలెంజ్ చేస్తే నీ క్లయింటు బదులు నువ్వుంటవు శ్రీ కృష్ణ జన్మస్థానంలో” ఈ సారి ఒక్కొక్క పదమూ ఒత్తి పట్టి చెప్పినాడు జడ్జీ, ఈ పిల్ల లాయరు వచ్చి మొదటికేసులో అదీ కాక ఇట్లా తెరిచిన పుస్తకంలా కనిపిస్తున్న కేసులో తన కోర్టులో తననే అవమానిస్తున్నాడన్న అనుమానంతో.

“కోర్టు వారు క్షమించాలి, నా ఉద్దేశ్యం మిమ్మల్ని అవమానించడం కాదు. మీరు శ్రీ కృష్ణ జన్మస్థానం అని చెప్పే జైలు, రామాయణం అనే ఒక కల్పిత కథ ఇవన్నీ మన జీవితాల్లో భాగమైనప్పుడు, మరి నా క్లయింటును నేను ఈ కథలన్నీ చెప్పే నియమావళి ప్రకారం వాదించి విడిపించకూడదా, మీరే న్యాయం చెప్పాలి”.

“పీ పీ గారు, మీకేం అభ్యంతరం లేదా, ఇట్లా పురాణాల్లోకి వెళ్ళడం?”

పీ పీ వెంకట రెడ్డి ఇక్కడే కొన్ని పాయింట్లు కొట్టేసే అవకాశం ఉన్నట్టుగా తోచి అదీ కాక పురాణాలను చెప్పి క్లయింటును కాపాడ్డం ఎవరి వల్లా కాదు అని తెలిసి, జడ్జీ కేసి చూసి, “కోర్టు వారు ఎట్లా తలుస్తే అది మాకు సమ్మతమే” అన్నడు.

“సరే, నీ లక్ష్మణున్ని ప్రవేశపెట్టి అడుగు తనే ఈ పని చేసాడో లేదో”.

“యువరానర్ లక్ష్మణుడు కాదు, కోర్టు అనుమతిస్తే రాముణ్ణి ప్రవేశ పెడతాను”

“మళ్ళీ జోకా?, నేనన్నది వ్యంగ్యంతోటి. సరే నా మనసు మార్చుకున్నాను. ఈ కేసు అయిపోయేంత వరకూ ఈ కోర్టులో ఎవరూ రామాయణం కానీ భారతం కానీ విప్పరు. అట్లా విప్పితే ఒక రోజు జైల్లో కూర్చో వలసి వస్తుంది ఇరువైపుల లాయర్లకూ, ఇదే నా ఆకరు మాట” అప్పుడప్పుడూ మాత్రమే ఉపయోగించే కంచు కంఠంతో చెప్పాడు జడ్జీ ముకుంద రావు.

“యువరానర్ ఖాసిం అన్న భాషా ను కోర్టు వారి ముందు ప్రవేశ పెడతాను”

“సరే నీ విట్నెస్ లిస్టులో ఉన్నాడు కనుక, తీసుకురా”

భాషా కోర్టులో చెప్పిన దాని ప్రకారం, ఆవిడ ఈ మధ్య వదిలేసి వచ్చిన మొగడు మళ్ళీ కలిసినప్పిటినుండి ఖాసింకూ నీలమ్మకూ గొడవలు ఎక్కువైనవి. అది ఆ వాడలో అందరూ అనుకుంటూ ఉంటే ఇంటి పరువు పోతున్నదని తమ్ముడితో చెప్పాడట. అదీ కాక దీనికి ఎవరి మీద మనసైతే వాళ్ళ మీదికి పోతది, సైతాన్ ది అని చెప్పిండట.

“బోయ నీలమ్మ ప్రవర్తన మంచిది కాదు.” భాషా చెప్పినడు.

“అది నువ్వు చూసినవా”, పీ పీ వెంకట్ రెడ్డి అడిగినాడు.

“తోటోళ్ళు అంతా అనుకునేదే” చెప్పాడు భాషా.

“చెప్పుడు మాటలు కాబట్టి ఆవిడ ప్రవర్తన గురించిన మాటలు కోర్టు వారు పరిగణించకూడదు” పీ పీ వాదించాడు.

“అది కరెక్టే, వెంటనే తొలగిస్తాం. ఏమయ్యా శ్రీనివాసూ, మాటలు మర్యాదగా మాట్లాడమని నీ విట్నెస్ లకు చెప్పు ఇక మీదట, సైతాన్ అనే లాంటి పదాలు కోర్టు ఒప్పుకోదు” అని గుర్రుమన్నడు జడ్జీ ఇదంతా ఎటువైపు పోతున్నదో అన్న తికమకతో.

భాషా చెప్పిన దాని ప్రకారం ఖాసిం నీలమ్మ ఇద్దరూ కలిసి బ్రతకడం మొదలు పెట్టి దాదాపు నాలుగేళ్ళు. నీలమ్మకు అంతకు మునుపే ఒక పెళ్ళి అయింది. ఊర్లో ఉంటూ తిండి గింజలకు కూడా కష్టమై మొగుణ్ణి ఊర్లో వదిలిపెట్టి, ఉన్న ఒక్క కొడుకునూ వెంట తీసుకుని టౌనుకు చేరింది. చిన్న పిల్లవాణ్ణి పట్టుకుని మట్టికొట్టుక పోయి టౌనులో తిండి సరిగ్గా లేక ఫుట్ పాత్ మీద పడుకుని ఉంటే ఖాసిం చేర దీసాడు.

ఖాసిం ను కలిపింది కూడా ఈ అన్న భాషా నేనట. బస్ స్టాండు దగ్గర అన్నదమ్ములిద్దరూ రిక్షాలు నిలుపుకునే స్టాండు దగ్గరికొచ్చి భాశాను ఒక్క టీ ఇప్పించుమని వచ్చి అడిగితే ఇప్పించాడటా. మాటల్లో తెలిసింది, ఆ ఊళ్ళో నీలమ్మకు ఎవరూ లేరని. సరే నాకు పెండ్లి అయింది కాని మా తమ్ముడున్నడు వాడు బాడుగకు వెళ్ళినడు ఇప్పుడు వచ్చినంక మాట్లాడుమని చెప్పినాడట.

నీలమ్మ కూడా ఖాసిం అంటే మనసు పడ్డది. ఆ రోజు నుండి ఈ రోజు దాక ఇద్దరూ కలిసే బ్రతుకుతున్నరు.

“మరి ఇద్దరూ పెండ్లి ఎందుకు చేసుకోలేదు” జడ్జీ గారు అడిగినారు దాదాపుగా కుతూహలం ఆపుకోలేక మాత్రమే.

“ఇటువొరకు పెండ్లి అయింది ఈమెకు, ఆమె పెనిమిటికి ఆమెకు ఏర్పాటు కాలేదు ఇంకా, అదీ కాక పైసలు కూడ లేవు”.

“సరే మరి ఇప్పటి సంగతి చెప్పు, నువ్వు చెప్పినవా ముక్కు కోయమని?”

“నేనెందుకు చెప్త సారు, నాలుగు గుద్దులు గుద్ది ఒక్క కాడ పెట్టుమని చెప్పిన కాని ఇట్ల అయితదని అనుకోలేదు”

“ఎందుకు తన్నమన్నవు, నీ తమ్ముడికి అట్లా చెప్పడం తప్పు కాదా”

“సారు, నీలమ్మ మొగడు వచ్చిండు మూణ్ణెలకింద, ఆనికి ఊర్లె ఏం పని లేదట, ఇక్కడ్నే రిక్ష తొక్కుత అని వచ్చిండు. ఆడు రిక్ష నేర్వలేక బస్తాలు మోస్తున్నడు. ఆడు వచ్చినప్పటి సంది, మద్యాహ్నం తిండికి నీలమ్మ కాడికి వస్తడు. ఖాసిం ఇదేం బాగలేదు తోటోళ్ళ ముందట అని కొద్దిగ బుద్ధి చెప్పుమన్న, తప్పుంటె నాకెయ్యిండ్రి శిక్ష, నా తమ్ముణ్ణి ఏం అనొద్దు”.

జడ్జీ గారికి ఆ చివరి మాటలు కొంత డ్రమటిక్ గా తోచినయి. ఏమన్న కోచింగ్ ఇచ్చినవా అన్నట్టు శ్రీనివాస్ వైపు చూసినాడు తప్ప ఏం అనలేదు.

“ఇంతేనా, ఇంకేమైనా ఉందా”

“నా తమ్మునికి ఇదంటే శాన ఇష్ఠం సారు, పెండ్లి కూడ చేసుకుంట అని చెప్తడు. బెయిలిచ్చినంక మళ్ళ ఇద్దరు కలిసే ఉంటున్నరు.”

ఈ కేసు తొందరగా వదిలించుకుంటే మంచిదనిపింది మళ్ళీ వారమే సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పెట్టినాడు జడ్జీ గారు.

ఇదిగో తెల్ల వారితే సోమ వారం రానే వచ్చింది. పీ పీ వెంకట రెడ్డీ, స్నేహితుడు జడ్జీ ముకుంద రావు ఇద్దరూ కలిసి రెండో బీరు అయిపోగొట్టారు.

జడ్జీ తన అనుభవాలు నెమారేసుకుంటున్నట్టు సాలోచనగా చూస్తూ తనలో తనే అనుకున్నట్టు పైకే అనేసాడు, “వెంకట్, కోర్టులోకి రామాయణం తీసుకు రావద్దని చెప్పింది నేనే, కానీ నిజానికి ఒకావిడ నిజంగానే తప్పు చేసిందనుకుందాం. ఆవిడ ఒక మనిషి మీద మనసు పడి మళ్ళీ ఇంకొకరి మీదకు మనసు మార్చుకుని సమాజం తప్పు అనుకుంటున్న దానికి సిద్ధపడిందనే అనుకుందాం. లేదా కథలో చెప్పినట్టు కాక లక్ష్మణునికే ఉంపుడు గత్తెగా ఉండి రాముని మీద మనసు పడిందే అనుకో, అది తప్పుగా చెప్పి ఆవిడను జలసీతోటో, లేక అన్న చెప్పిన మాట వినో తమ్ముడు ముక్కూ చెవులూ కోసాడే అనుకుందాం. మరి తమ్ముడికి శిక్ష పడాలా వద్దా? ఇక్కడ శూర్పణఖ “ఇంజ్యూరెడ్ పార్టీ ” కాదా? దేహానికి దెబ్బ తగిలింది ఈవిడకు, మనసుకు దెబ్బ దగిలింది మగ వాడికి, ఈ రెండూ ఒకదానికొకటి సరిపోయే “నేరమూ-శిక్షా ” అంటావా?”

వెంకట్ రెడ్డికి తెలుసు తనేం మాట్లాడినా మొదటికే మోసం రావచ్చు అని. జడ్జీని ఇంతగా ఆలోచనల్లోకి నెట్టాడంటే ఈ శ్రీను గాడు ఉద్ధండుడే అయినాడనేది అర్ధమవుతూనే ఉంది. “అప్పటి కాలానికీ ఇప్పటి శిక్షా సంఋతికీ చాలా తేడా ఉంది, అదీ కాక కథలకూ జీవితానికీ ముడి పెడితే ఎట్లా, ఇవ్వాళ మీరు నీతి కథలను పట్టుకుని వీడిని వదిలేస్తే రేపు దాని గొంతు నుములుతాడు అప్పుడు ఎవరేం చేస్తారు? అట్లా అనుకుంటే ఏ మగాడైనా పెళ్ళాం మీద అనుమానముంటే, లేక అది నీతి తప్పిందనే అనుమానంతోటి దాని గొంతు కోసి చంపెయ్యమనే సంకేతం ఇచ్చినట్టు అవ్వదా “, ఈ ఆలోచననించి జడ్జీని తప్పిస్తే బావుంటుందని కర్ర విరగకుండా జవాబిచ్చేడు ఆయన.

“నువ్వు చెప్పేది నిజమే అయుండవచ్చు. పోయినేడు అమెరికాలో అమ్మాయి దగ్గరకెళ్ళినప్పుడు అక్కడ దీనికి ప్రతికూలమైన కేసొకటి చూసాను. అక్కడి టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం చేసారులే. లొరీనా అనే ఆవిడ భర్త జననాంగాన్ని కోసి వేసింది. అక్కడ నువ్వన్నట్టు ఫిజికల్గా ఇంజ్యూరెడ్ పార్టీ మరి భర్తే. కానీ సైకలాజికల్ గా రోజూ అవస్థననుభవించిందీ, నష్ఠపొయిందీ, భార్య. కోర్టులో ఆవిడ నిజంగానే ఇంట్లో మానసికంగా హింసించబడిందీ అని ప్రూవ్ చేసినందుకు ఆవిడకు శిక్ష పడలేదు. కానీ ఇక్కడ భార్య ప్రవర్తనతోటి భర్త బయట అవమానాలకు గురైనట్టు ఎదుటివాడు నిరూపిస్తే?” సాలోచనగా చెప్పాడు జడ్జీ.

“అంటే ఒక భార్య ఇంట్లో పడే మానసిక హింసను తట్టుకోలేక చేసిన పనిని, భర్త భార్య వల్ల బయట అవమాన పడి ఆవిడకు ఫిజికల్గా హాని చేయటాన్ని ఒకే రకంగా చూస్తామంటారా జడ్జీ గారు. అయినా ఆ అవమానాలు ఊహాజనితం కాకూడదని ఎక్కడా లేదు కదా? ఒక వేళ నిజమే అయినా అవమానానికీ హింసకూ తేడా ఉంటుంది కదా.”

“అవును ఉంటుంది. అయినా మనమెట్లా చూస్తామన్నది కాదు ప్రశ్న. లోకం ఎట్లా అన్~వయించుకుంటుందీ అన్నదే తేలాలి. సంఘాన్ని పట్టి నేరమూ శిక్ష ఉండాలి కదా”

“లేదు జడ్జీ గారూ, సంఘాన్ని పట్టి కాదు, చట్టాన్ని పట్టి ఉండాలి”

“నువ్వు చెప్పేది కరెక్టే, మనకే ఈ చచ్చు కేసులు తగులుతాయెందుకు?” ఇక ఈ లాయర్తో వాదించడం తన వల్ల కాదన్నట్టు చేతులెత్తేసాడు ఏనాడూ లాయరుగా ప్రాక్టీసు చేయని జడ్జీ గారు.

సోమవారం మధ్యాహ్నానికి కోర్టులో మళ్ళీ కలుసుకున్నారిద్దరు మిత్రులూ, ఎవరి కోట్లు వాళ్ళు తొడుక్కుని. రాత్రి తన వాదనని అంగీకరించిన జడ్జీ ఈ రోజుతోటైనా ఈ కేసును పూర్తి చేస్తే ఒక తలనొప్పి తగ్గుతుందని పీ పీ గారి ఆశ.

కొత్త విట్నెస్ ఇంకా ఎవరన్న ఉన్నారేమోనని లిస్టు చూసి చివర్లో ఉన్న నీలమ్మ పేరు చూసి ఈవడనే తీసుకొచ్చి చెప్పిస్తే పోతుంది కదా అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు జడ్జీ గారు ఇద్దరు లాయర్లలో ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశ్యించి కాక. ఆయనకూ తొందరగానే ఉన్నట్టుంది.

ప్రతివాది లాయరు శ్రీనివాస్ అదే పని చేసాడు, జడ్జీ గారి దగ్గర తాను మాత్రం పాయింట్లు కొట్టేయలేనా అన్నట్టు పీ పీ వైపొక సారి చూసి.

నీలమ్మ విట్నెస్ బోను ఎక్కింది.

ఆవిడ చెప్పిన దాని ప్రకారం, ఊర్లో ఏ పనీ లేక కొడుకుని పెంచడం కష్టమైతున్నదని టౌనుకొచ్చింది ఏదైనా పని దొరకక పోతుందా అని. ఖాసిం మంచివాడే, కానీ కోపమొస్తే మనిషి కాదు. ఏది దొరికితే దానితోటే కొడతాడు. ఊళ్ళో ఉండగా ఇష్టం లేని పెండ్లి చేసుకున్నా సరే ఏనాడూ పెనిమిటి చెయ్యి చేసుకోలేదు. తిండి సరిగ్గా లేదన్న బాధనే తప్ప, అక్కడ మిగతావన్నీ బాగానే ఉండేవి. కొడితే నీతో ఉండనని ఖాసింతో ఎన్నో సార్లు చెప్పిందట. అయినా తిండికి గతిలేనప్పుడు పెట్టిన వాడు అని చెప్పి వాడంటే అభిమనమే. ఇప్పటికీ వాడితోటే ఉంటోంది. అదీ కాక వాడంటే ఆవిడకూ ఇష్ఠమే.

ఆవిడ చెప్పిన ప్రకారం ఖాసిం మీద అన్న వదినల పెత్తనం ఎక్కువట. వాళ్ళెంత చెబితే అంత. పొద్దునంతా రిక్షా తొక్కి వచ్చి అన్న వదినల దగ్గర తిని వచ్చి తన దగ్గర పడుకుంటాడు ఖాసిం. తనకు ఉండడానికి ఎంతో ఇష్ఠం చూపుతాడు. మొదట్లో బాగానే ఉండేది. నీలమ్మ కొడుకు చిన్న వాడుగా ఉన్నప్పుడు వాడినీ బాగానే చూసుకునేవాడు. ఆ పిల్లవాడు కొద్దిగా పెద్దయ్యాక ఒక రోడ్డుపక్కన డబ్బా హోటల్లో టీలిచ్చేందుకు పనికి పెట్టాడు కూడా. ఒక బీడీ తాగడం తప్ప పెద్దగా తాగుడు లాంటి అలవాట్లు లేవు. ముందు ఎట్లా ఉండేదో కానీ నీలమ్మతో కుదిరాక వేరే ఆడుదానివైపు వెళ్ళలేదు. ఖాసిం ఎట్లా ఉంటాడో అట్లానే నీలమ్మ కూడా ఉండాలని కోరుకునేవాడు. అందుకే ఆవిడ ఊళ్ళో వదిలిపెట్టి వచ్చిన పెనిమిటి పని వెతుక్కుంటూ ఎక్కడోచోట జాగ దొరుకుతుందని ఆశగా తన ఇంటికి ఆవిడంటికి రావడం వాడికి పడలేదు. వేరేవాళ్ళ చెప్పుడు మాటలు విని చెయ్యి చేసుకునే వాడు. ముఖ్యంగా అన్న భాషా ఎట్లా చెబితే అట్లా.

“మరి ఈ ముక్కు కోయమని ఖాసిం అన్న భాషా చెప్పినాడా” శ్రీను ఆవిడను కొద్దిగా ఆపుతూ అడిగాడు.

“అవి ఎవరో చెబితే విన్న మాటలు, ఈవిడ ఎట్లా ధృవీకరిస్తుంది, కోర్టు వారు అనుమతించకూడదు” వెంకట రెడ్డి లేచాడు, తనకివ్వాళ దొరికిన ఒకే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక.

“ముక్కు కోయమని వేరే ఎవరూ చెప్పలేదు సార్, అది నేనే చెప్పిన” నీలమ్మ కొంగును నోటికి అడ్డు పెట్టుకుంటూ చెప్పింది. ముక్కున్న బ్యాండేజీ అట్లాగే ఉంది. గొంతులో ఏడుపు లేదు. మరింత ధృడంగా ఉంది.

శ్రీనివాసుతో సహా అక్కడంతా ఊపిరి పీల్చడం మర్చిపోయారు. నువ్వు మళ్ళీ నా మీద జోకులెయ్యడం లేదు కదా అన్నట్టు జడ్జీ లాయరు వైపు చూసాడు.

“ఇప్పుడేమంటున్నవు నువ్వు? కోర్టుకు అర్ధమయితట్టు చెప్పు”

“అన్న భాషాతో పాటు తోటోళ్ళంత సతాయిస్తుంటె ఇంటికొచ్చి నా మీద ప్రతి దినాం ఎగురబడ్తడు ఖాసిం. నాకు నా పెనిమిటికి సంభంధం లేదు అంటె ఇనకపాయె. నేను దర్గా కాడ నిప్పులల్ల నడువమంటె నడుస్త అని చెప్పిన. అయినా నేను బాగుంటనని నా మొగడు వచ్చిండని నువ్వనుకుంటె నా ముక్కు కొయ్యి అని నేనే చెప్పిన. ఇవన్ని నేను చేసిన తప్పు కప్పెడుతందుకు చెప్తున్న అన్నడు. నాకే కోపం ఆగక నా ముక్కు నేనే కోసుకున్న సారు.”

“ఇదెక్కడి తమాశ, ఇది కోర్టు, కోతులాడే సర్కసు కాదు …” కుర్చీ కింద మంట పెట్టినట్టు పీ పీ పైకి లేచిండు.

“నువ్వాగు, ఇక్కడ నాకే చాలా ప్రశ్నలు ఉన్నయి” జడ్జీ తన మిత్రుడికేసి కాకుండా శ్రీనివాసును చూస్తూ చెప్పాడు.

“అయితే నువ్వే నీ ముక్కు కోసుకున్న అంటవు” జడ్జీ.

“అవును సారు. ఆస్పత్రిల రక్తం కారుతుంటె మంట మండుతుంటె, పోలీసులు అడుగితె ఏం చెప్పాల్నో తెవక ఖాసిం పేరు చెప్పిన. తరువాత ఆడోళ్ళ సంఘాల వాళ్ళొచ్చినరు నాకు న్యాయం చేపిస్తమని. నేను పెండ్లి చేసుకున్నోనితోటి కాక వేరే వాని తోటి ఉంటున్నాని తెలిసి వాళ్ళు మళ్ళీ నా దిక్కు రాలేదు. ముక్కు తెగిన దాన్ని ఇప్పుడు ఏ మొగోడు దగ్గరికి రానిస్తడు? ఖాసిం మంచోడు కాబట్టి పోలీసోళ్ళ దగ్గర రిమాండుల ఉన్నప్పుడే వాని అన్న తోటి చెప్పి తోలిండు, ఇప్పటికి కూడ వానికి నేనంటె ఇష్ఠమని. నన్ను పెండ్లి చేసుకుంటడని. నా తాడ పైసలు లేవు సారు, ఉన్న కాడికి బెయిలుకోసం కట్టిన. జర నా పెనిమిటి కాడినించి ఏర్పాటు చెయ్యిండ్రి నేను ఖాసిం నే పెండ్లి చేసుకుంట.”

కోర్టు ముగిస్తూ నిందితుడి మీద కేసు కొట్టి వేసినారు జడ్జీ ముకుంద రావు.

మరుసటి ఆదివారం జడ్జీ గారు తొమ్మిది గంటలకే పడుకో బోతూ వెంకట రెడ్డినీ సాగనంపుతూ, “నువ్వోడిపోయానని ఏడ్వకుండా, సిల్వర్ లైనింగ్ చూడు, ఇవ్వాళ్రేపు దెబ్బలు తిన్న వాళ్ళంతా కొట్టింది ఎవరో తెలియదనీ, ఒంట్లో తుపాకీ గుళ్ళు పెట్టుకుని కాల్చింది ఎవరో తెలియదని చెప్పి కేసులు పర్సిష్కారమయ్యేట్లు చూస్తున్నారు కనుకనే మన కోర్టుల్లో ఈమాత్రమైనా కేసులు కదులుతున్నయి. నువ్వేం బాధ పడకు.” అన్నడు.

వెంకట రెడ్డి, “నా బాధ ఖాసిం కు శిక్ష పడక పోవటం గురించి కాదు, నీలమ్మకు మనం వేయకపోయినా పడిన శిక్ష గురించి” అని ఇక బయల్దేరాడు.