ఆత్మనొక దివ్వెగా
ఆత్మనొక దివ్వెగా వెలిగించి యే సౌందర్యం పాదాల చెంత ఉంచాలో వెదుక్కుంటూ వెళ్ళిన అన్వేషకుడి కథ, మూలా సుబ్రహ్మణ్యం నవల ఆత్మనొక దివ్వెగా. చదువుని, చదువుతో ముడిపడ్డ స్నేహాలని, తానే ఎగదోసిన విశ్వాసానికి ఆనంద తాండవం చేసి చేతులు చాచి పిలిచిన అమ్మాయిని, అటుపైన ఉద్యోగాలని, దేశాలు దాటివచ్చి ఉన్న ఊరిని, అన్నింటినీ వదులుకుని ఒక మనిషి దేనిని వెదికాడు? ఎందుకు వెదికాడు? అన్న ఒక స్నేహితుడి ఆరాటంగా ఈ కథ నడుస్తుంది. ఆ స్నేహితుడు గోపాల్. ఆ అన్వేషకుడు శివ. ఒక మామూలు సహాధ్యాయిగా పరిచయమైన శివ, చదువుకునే రోజుల నుండే ఆటల్లోను, మాటల్లోను, నిర్భయంగా వెల్లడించుకుంటూ వచ్చిన తన వ్యక్తిత్వం ద్వారా గోపాల్‌ను ప్రభావితం చేసిన తీరూ, హృదయపు లోతుల్లోకి చేరి కుదురుకున్న ఆ స్నేహం జీవితం పట్ల అతని నిర్ణయాలను స్థిరపరచిన తీరూ రచయిత గొప్ప శిల్పంతో చెక్కుకుంటూ వచ్చారు. గతానికీ వర్తమానానికీ మధ్య చక్కటి లంకెలేస్తూ శివ, గోపాల్‌ల మధ్య అనుబంధాన్ని, శివ జీవితాన్ని, పొరలుపొరలుగా ఒలిచి చూపించిన పద్ధతి ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. ‘ఇది కాదు’, ‘ఇది కాదు’ అనుకుంటూ జీవితంలో తనకు తారసపడ్డ ప్రేమను, అంకెలకందని జీతాన్ని, హ్యాకర్ జీవితంలోని ఉత్సుకతని, సౌందర్యాన్ని, అన్నిటినీ వదులుకుని వెళ్ళడాన్ని మెట్లుమెట్లుగా చెప్పడంలోని శిల్పచాతుర్యంతో, శివ ఔన్నత్యం అంతకంతకూ పాఠకులకూ అనుభవంలోకి వస్తుంది. గోపాల్ భార్య కల్యాణి కథ దానికదే ఒక పాయగా చీలిన విధానం, జానపద గేయాల మీద ఆమె కృషి, ఆమె డైరీ, ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణలు. నవలకు తగినన్ని పాత్రలతో, ఆ పాత్రలకు తగిన బలాలతో, పాత్రోచితమైన కథనంతో, కవితాత్మకమైన చూపుతో నడిచిన వాక్యాలతో ఈ నవల చదివించే గుణాన్ని పుష్కలంగా పోగుచేసుకుంది. కవితాత్మకత ఉన్నా, అది సరళమైన మాటల్లో ఉండటం వల్ల, ఆ తేలికదనంలో ఉండే సౌందర్యం వల్ల ఇబ్బందనిపించదు. ముగింపు ఊహాతీతంగా ఉండి మరపురాని ముద్ర వేస్తుంది. ఆత్మనొక దివ్వెగా వెలిగించాలనుకున్నది ఈ పాదాల చెంతేనా అన్న ప్రశ్న మిగిలిపోతుంది.
రచయిత: మూలా సుబ్రహ్మణ్యం
ప్రచురణ: ఆన్వీక్షికి పబ్లిషర్స్
ప్రతులకు: ఆమెజాన్ మరియు నవోదయ బుక్ హౌస్
ధర: రూ. 150
ఎదారి బతుకులు
తెలుగు పుస్తకమూ, పాఠకలోకమూ ఇప్పుడిప్పుడే అలవాటుపడుతోన్న మాండలీకాల అందానికి అద్దం పట్టే కథలు ఎండపల్లి భారతి ఎదారి బ్రతుకులు. పేద బ్రతుకుల్లోని ఒక్కో సంఘటననూ ఒక్కో కథగా దిద్దుకున్న ఈ పుస్తకానికి ప్రాణం, జీవం తొణికిసలాడుతున్న భాష. సంఘటన సామాన్యమైనదే అయినా, కొన్ని కథలు అసామాన్యంగా వెలగడానికి, ఎవరి పెదాలనో తోసుకు వస్తున్నట్టున్న భాషాసౌందర్యమే కారణం. చుట్టూ ఇప్పటికీ కొందరికి పుట్టుక వల్ల పొందిన లక్షణాలను సుఖంగా అనుభవించే స్వేచ్ఛ లేదు, అడక్కుండానే నుదుటన పడ్డ ముద్రలను అనవరమనిపిస్తే చెరుపుకునే వీలూ లేదు. మూలాలను వదులుకుంటూ కొత్త దారుల్లో నడుద్దామంటే ఆ ప్రయాణమూ తేలికేం కాదు. సచ్చి సాదించడం లాంటి కథలు చదివినప్పుడు, ఇంత చిత్రమైన ఆచారాలున్న గిరుల్లో బ్రతుకుతూ కూడా, మనుష్యులు తోచినంత, కుదిరినంత సుఖంగా ఉండడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలేవో చెయ్యడం, మొండి మూర్ఖపు సమాజం వాటినీ గద్దల్లే తన్నుకుపోవడం గమనింపుకొచ్చి నిరుత్తరులను చేస్తుంది. అంటిత్తులు కథలో, ఇరుకిరుగ్గా కనపడే జీవితాన్ని కేవలం మరొక మనిషి ఉనికితోనే విశాలపరుచుకోవడం; మాయన్న సదువు కథలో ఎర్రటి ఎండలో కూలిపని చేసుకునే అన్నను చూస్తూ, గొడ్డు తునకలను బళ్ళోకి ఏరుకొచ్చిన మాదిగ పిల్లాడని అయివారు ఆనాడు కొట్టకపోతే నీడపట్టున పనిచేసుకునేవాడేమో ననుకోవడాన్ని ముగింపుగా మార్చడం; దప్పి కథలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి పిల్లకి కొన్న మామిడికాయని కోతొచ్చి పెరుక్కుని పోతే, అటుపైన మళ్ళీ అర్ధరూపాయి దక్కినా, ఏమీ కొనక ఇంటికి పోవడం; మొదలైనవన్నీ ఈ సంపుటిలో చదివేప్పుడు, జీవితమంటే స్థాయీ మార్పులతో ఆచారానికీ తిరుగుబాటుకీ, ఆకలికీ నిగ్రహానికీ, మీదపడే దుఃఖానికీ మనిషి పూనికగా బ్రతుకు నుండి తొలుచుకునే సుఖానికీ మధ్య నిరంతరం జరిగే పోరాటమేనా అన్న ఆలోచన వస్తుంది. బహుశా అందుకే, ఈ నేపథ్యాలు పాఠకులకు కొత్తగా అనిపిస్తాయేమో కానీ, ఇందులోని ఉద్వేగాలు కావు. ఉడుంపట్టు పట్టినట్టు బ్రతుకుని పెనవేసుకుని వదలని ఈ దుఃఖపు కథలు, ఒకానొక సామాజికచిత్రం నుండి బయటపడటమంటే వాళ్ళవాళ్ళ అస్తిత్వాలను వొలుచుకుంటూ ఒక్కో అడుగూ వెయ్యాల్సి రావడమనీ, వాళ్ళకు చేతనైన జీవితానికీ, వాళ్ళు ఎదుర్కొనే జీవితానికీ మధ్యనున్న సంఘర్షణ సమాజం పూరించలేకపోతున్న అంతరమనీ పచ్చిగా చెప్పుకుపోతాయి. వివక్షలను, వేదనలను అడ్డుగా పెట్టుకుని ఎంతైనా చెప్పగల అవకాశమిచ్చే కథల్లో, అట్లాంటి ప్రయత్నమేదీ కనపడకపోవడం, పుస్తకాన్ని ఒక ఓపెన్ మైండ్‌తో చదివే సావకాశాన్ని ఇస్తుంది. యే ప్రత్యేకతా లేని కథలను కూడా ఈ కారణానికే–అంటే, కథ ఏదో చెప్తుందనో, చెప్పాలనో అంచనాలుండని కారణం చేత, నిరుత్సాహపడకుండా చదవగలం. కథ చదవడం ఒక అనుభవానికే తప్ప, పాఠాలు నేర్వడానికో, నేర్పడానికో కాదని నమ్మితేనే ఈ పుస్తకం జోలికి పోవాలి. ‘నీ కూతురుండబట్టి ఏమిచ్చి పొగిడిచ్చె/ యెండి రూకాలిచ్చి ఎచ్చుగా పొగిడిచ్చె’ అంటూ చులాగ్గా సాగిపోయిన పల్లెపాటలు ఆ వాతావరణంలోకీ, సందడిలోకీ తీసుకుపోతాయి. జీవితం దానికదే గొప్పదనీ, బ్రతుకు మనిషిమనిషికీ ప్రత్యేకమనీ చూపిస్తూ, అపరిచితంగా మిగిలిపోయే మనుష్యులనూ, వాళ్ళ హృదయాలనూ, జీవితాలనూ ఏ లౌల్యాలకూ లొంగకుండా చూపించుకొచ్చిన ఈ పుస్తకం వివరాలు:
పుస్తకం పేరు: ఎదారి బతుకులు
రచయిత: ఎండపల్లి భారతి
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ధర: రూ. 100
ఒక భార్గవి-రెండు ప్రయాణాలు
ప్రయాణాన్ని అనుభవంగా రాయాలంటే, చూడబోయే ప్రదేశంలోనైనా, లేదా చూసే కళ్ళలోనైనా ఒక ప్రత్యేకత ఉండాలి. ఇంటికొకరిగా అమెరికాకు తరలి వస్తున్న ఈ రోజుల్లో, ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలేమిటో ఇప్పుడందరికీ తెలుసు. కాబట్టి, పేరొందిన ప్రదేశాల వరుసతో సాగే మామూలు యాత్రాకథనాలు అమెరికాకు ఇక ఎంత మాత్రం చెల్లబోవు. ముందస్తుగా, ఆ బెడదను దాటించినందుకు గానూ, ఇది అందుకోవలసిన పుస్తకం. బోస్టన్, వాషింగ్టన్‍లతో పాటు, అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత కళారూపాలు కొలువుతీరిన కొన్ని తావులకు పాఠకులను తరలించుకుపోయిన కథనమిది. మ్యూజియంలను దర్శించే మనిషికి, అక్కడి కళాఖండాల వైశిష్ట్యాల పట్ల అవగాహనా, వాటిని అభినందించగలిగిన అభిరుచీ ఉంటే, రాతలో ఈ రెండూ కలగలిసిన కొత్త వర్ణమేదో తారసపడి చదివించుకుంటుంది. రొంపిచెర్ల భార్గవిగారి ఒక భార్గవి-రెండు ప్రయాణాలు ఇదే కోవకు చెందే పుస్తకం. వాషింగ్టన్‌లోని న్యూసియం ప్రత్యేకతనూ, తెర ముందు మసలే విశేషాల వెనుక దన్నుగా నిలబడ్డ ఆలోచనలనూ ఆసక్తి రేకెత్తిస్తూ చెప్పారిందులో. గేలరీలకు సంబంధించి కూర్చిన సమాచారం ఆయాప్రాంతాలకు వెళ్ళినప్పుడు సూచిగా పనికొచ్చేలా ఉంది. హోలోకాస్ట్ అన్న పదానికి మూలం, అర్థం, అసలు హోలోకాస్ట్ మ్యూజియం నెలకొల్పడం వెనుక ఉద్దేశ్యాలు చదవడం దానికదే ఒక పాఠం అనుకుంటే, వాటిని చూడడమింకెంత ఉద్వేగభరిత అనుభవం కానుందో ఈ పుస్తకం వివరంగా పరిచయం చేసింది. లోత్రెక్, గోగాఁ, వాన్ గో గురించి చెబుతూ, బోస్టన్ మ్యూజియంలలో నడయాడిన అనుభవాన్ని కలిగించే శైలి ఈ పుస్తకానికి అదనపు సొబగు. హార్వర్డ్ మెడికల్ మ్యూజియం జాబితాలో వచ్చి చేరిన మరొక ప్రదేశం. ‘శిల్పి శిల్పంలో తన ఆత్మనీ ప్రేమనీ జీవనలాలసనూ ప్రతిష్టించాలి. అవి శిల్పంలోని ఎత్తుపల్లాలలో గరుకుదనాలలో ప్రతిఫలించాలి కానీ నున్నగా అందంగా పాలిష్ చేసినంత మాత్రాన మంచి శిల్పం రూపొందదు’ అని చెప్పిన రొడాఁ మాటలను అతని శిల్పాల ముందు నిల్చుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, పాఠకులనూ ఆపి నిలబెడుతుంది. మెక్సికన్ కళాకారుడు డియేగో రివియేరా కబుర్లూ ఆసాంతం చదివిస్తాయి. అనుబంధంగా ఉన్న గుజరాత్ యాత్ర కొంత ఆధ్యాత్మిక భావనలతో, ఆహ్లాదకరమైన తలపోతలతో వడివడిగా ముగిసింది. అమెరికా తొలిసారి రానున్నవారు, అలాగే ఇక్కడే వుంటూ కూడా ఇక్కడి మ్యూజియంలలో ఏం చూడాలో, ఎందుకు చూడాలో తెలీనివారు, కరదీపికగా ఈ చిన్ని పుస్తకాన్ని వెంట ఉంచుకోవడం లాభిస్తుంది. ఈ పుస్తకం అందించే ఆధారాలతో, వివరించిన విశేషాలతో ఆయా ప్రాంతాలను చూసినప్పుడు, మునుపు తోచని వెలుగుల ప్రకాశంలో అవి మరింత కొత్తగానూ, అందంగానూ కనపడే అవకాశమూ ఉంది. అమెరికా యాత్ర మొదట్లోనూ, చివరిలోనూ వ్యక్తిగత వివరాలను మరికొంత కుదిస్తే పుస్తకానికి నిండుతనం వచ్చేది. అతిసామాన్యమైన రోజువారీ వివరాలను, ఏ అదనపు బలమూ, అందమూ లేని ఇంటింటి సమాచారాన్ని, ఏకరువు పెటినట్టుగా సాగిన కొన్ని పేజీలు ఈ పుస్తకానికి అనవసరపు బరువు.
పుస్తకం పేరు: ఒక భార్గవి-రెండు ప్రయాణాలు
రచయిత: రొంపిచెర్ల భార్గవి
ప్రతులకు: బదరి పబ్లికేషన్స్, 08674-253210
ధర: రూ. 100