గొర్రె కాలి విందు

కిటికీ తెరలు వేసి ఉన్నాయి. గది శుభ్రంగా, వెచ్చగా ఉంది. గదిలో రెండే దీపాలు వెలుగుతున్నాయి – ఒకటి ఆమె దగ్గరగా, రెండవది ఎదురుగా ఖాళీ కుర్చీలోనూ. ఆమె వెనుక, చిన్న బల్ల మీద రెండు పొడవైన గాజు గ్లాసులు, విస్కీ, సోడా నీరూ ఉన్నాయి. ప్రక్కనే ఫ్లాస్కులో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి.

మేరీ మెలొనీ తన భర్త పాట్రిక్ ఆఫీసునుండి ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తోంది.

ఉండుండి, తలెత్తి గోడ గడియారం వంక చూస్తోంది. కానీ, ఆదుర్దా ఏమీ లేదు. నిజానికి, గడిచిన ప్రతి నిముషంతో తన భర్త ఇంటికి వచ్చే వేళ దగ్గర పడుతోంది కదా అన్న ఆలోచన ఆనందాన్ని ఇస్తోంది కూడా. ఆమె ముఖంలోను, చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రసన్నత ప్రతిఫలిస్తోంది. తల పక్కకు వాల్చి చేసుకుంటున్న కుట్టుపనిలో నిమగ్నమైన ఆమె ముఖకవళికలో చెప్పలేని ప్రశాంతత తొంగి చూస్తోంది. ఆరవ నెల గర్భంతో ఉన్న ఆమె శరీరంలో చిత్రమైన చాయ పొడమింది. పెదాలు మెత్తగానూ, కొత్తగా శాంత గంభీరతని సంతరించుకున్న ఆమె కన్నులు, మునపటికంటే నల్లగా, విశాలంగా కనిపిస్తున్నాయి. ఐదు గంటలు అవడానికి ఇంకా పది నిముషాలు ఉందనగా ఆమె చెవులు రిక్కించి వినసాగింది. ఎప్పటిలాగే, కొద్ది నిముషాలు గడవక ముందే, ఠంచనుగా బయట కంకర మీద టైర్ల చప్పుడు, కారు తలుపు మూతబడటం, కిటికీని దాటి వెళుతున్న అడుగులు, వీధి తలుపు తాళం తియ్యడమూ వినవచ్చాయి. తన కుట్టుపని పక్కనబెట్టి, అతను ఇంట్లోకి అడుగుపెడుతుంటే, ప్రేమపూర్వకంగా స్వాగతించడానికి లేచి నిలుచుంది.

“హాయ్, డార్లింగ్!” అందామె.

“హాయ్, డియర్!” బదులిచ్చాడు తను.

ఆమె అతని కోటు విప్పి, అలమరలో వేలాడవేసింది.

తర్వాత, అతనికి ఘాటుగాను, తనకి తేలికగానూ ఉండేట్టు డ్రింకు కలపడానికి బల్ల దగ్గరకు నడిచింది. పూర్తయ్యాక, తిరిగి తన కుట్టుపని ప్రారంభించింది. రెండు చేతుల మధ్యా గ్లాసు పట్టుకుని, ఐస్ క్యూబ్స్ గలగలలాడేట్టు ముందుకీ వెనక్కీ కలుపుతూ, అతను ఎదురుగా కుర్చీలో కూచున్నాడు.

అతనితో అలా గడిపే ఈ సమయం ఆమెకి ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. మొదటి గ్లాసు పూర్తి చేసేదాకా అతను పెదవి విప్పడని ఆమెకు తెలుసు. రోజల్లా ఒక్కర్తీ ఇంటిలో గడుపుతుందేమో, తన వైపునుండి అతని విశ్రాంతికి భంగం కలగకుండా, అతని సామీప్యాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ సంతృప్తి పడుతుంది. ఎండకోసం తపించేవాడు ఎండలో ఎంత ఆనందం వెతుక్కుంటాడో అంతగా అతని సన్నిధిలో అలవిలేని ఆనందాన్ని వెతుక్కుంటుంది ఆమె. వాళ్ళిద్దరే ఉన్నప్పుడు, అతని శరీరంలో తొంగిచూచే మగతనాన్ని తనివితీరా ఆనందిస్తుంది. కుర్చీలో చేతులు, కాళ్ళూ బారజాపుకుని అతను కూర్చునే పద్ధతి అన్నా, ఇంట్లోకి అడుగుపెట్టే రీతి అన్నా, పెద్ద అంగలతో తాపీగా నడిచే విధానం అన్నా ఆమెకి ఇష్టం. అతను ఆమెనే చూస్తున్నప్పుడు, లోతైన అతని కళ్ళు, ఆ చూపులలోని భావాలు, నవ్వు తెప్పించేట్టుండే అతని మూతి, ముఖ్యంగా, తను తీసుకున్న విస్కీ కొంత పనిచేయటం మొదలుపెట్టే దాకా అలసట గురించి ఏమీ మాటాడకుండా మౌనంగా కూచునే పద్ధతి ఆమెకి నచ్చుతుంది.

“అలసిపోయావా, ప్రియా!” అని అడిగిందామె.

“ఔను” అన్నాడతను. “బాగా అలసిపోయాను” అంటూ అతను ఎన్నడూ లేనిది, గ్లాసులో సగం విస్కీ ఇంకా మిగిలి ఉండగానే ఒక్క గుక్కలో దాన్ని ఖాళీ చేశాడు. నిజానికి ఆమె చూడలేదు. అతను చెయ్యి క్రిందకు దించినపుడు ఖాళీ గ్లాసులో వెనక్కి పడ్డ ఐస్ క్యూబ్స్ చేసిన చప్పుడు బట్టి ఆమె గ్రహించింది. ఒక క్షణం ఆగి, కుర్చీలో ముందుకు వంగి, నెమ్మదిగా లేచి, మరొక గ్లాసు తెచ్చుకుందికి బల్ల దగ్గరకు నడిచాడు.

“నేను తెస్తానుండు” అని ఒక్క ఉదుటున లేవబోతూ అందామె.

“కూచో” అన్నాడతను.

తర్వాత అతని గ్లాసులో విస్కీ, ఎక్కువ మోతాదులో, ముదురు రంగులో ఉండడం గమనించింది.

“డియర్! స్లిపర్స్ తీసుకురానా?” అని అడిగింది.

“అవసరం లేదు” అన్నాడతను.

అతను కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే, సుడులు తిరుగుతూ గ్లాసు గోడలకు అంటుకుంటున్న తీరును బట్టి, విస్కీ ఎంత చిక్కగా ఉందో గ్రహించింది.

“నీ వంటి సీనియర్ పోలీసు అధికారిని రోజంతా కాళ్ళు అరిగేలా తిప్పించటం, ప్రభుత్వానికి సిగ్గుచేటు.”

అతను బదులు చెప్పలేదు. దానితో, తల వంచుకుని తన పనిలో తాను మునిగిపోయింది. కానీ, అతను పెదాలతో విస్కీని చప్పరించి, గ్లాసు క్రిందకు దించినప్పుడల్లా గ్లాసు గోడలకి తగిలి ఐస్ క్యూబ్స్ చేసే చప్పుడు వినిపిస్తూనే ఉంది.

“డియర్! ఈ రోజు గురువారం కదా. రాత్రికి ఏమీ చెయ్యలేదు…”

“వద్దు.”

“బయటకి వెళ్ళి తినడానికి ఓపిక లేకపోతే, మరీ అంత సమయం మించిపోలేదు. ఫ్రీజర్లో తినడానికి చాలా ఉన్నాయి. వంట చేస్తాను. కుర్చీలోంచి కదలకుండా నువ్వు ఇక్కడే తినొచ్చు.”

అంగీకారంగా తలూపడమో, నవ్వడమో, చేస్తాడని ఎదురుచూసింది. కానీ అతడి నుండి ఏ విధమైన సంకేతమూ రాలేదు.

“పోనీ, నీకు తినడానికి కుకీస్ అండ్ చీజ్ తీసుకురానా?” అంది.

“అవేమీ వద్దు.”

అతని స్వరంలో మార్పుకి కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. ఆమె విశాలమైన కన్నులు అతన్ని గమనిస్తూనే ఉన్నాయి.

“ఏదో ఒకటి తినాలి. ముందు నన్ను తేనీ. తినడం, మానడం తర్వాత చూసుకోవచ్చు.” లేచి, సగం కుడుతూ, కుడుతూ ఉన్న దాన్ని దీపం పక్కన పెట్టింది.

“కూచో! ఒక్క నిముషం, కూచో!” అన్నాడతను.

అంతవరకూ లేనిది, అతను అలా అనగానే ఆమెలో ఏ మూలనో భయం వేసింది.

“విను. చెప్పినట్టు కూచో,” అన్నాడు మళ్ళీ.

నెమ్మదిగా కుర్చీలో కూలబడింది. ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళతో అతన్ని మరింత జాగ్రత్తగా గమనిస్తోంది.

అతను రెండో గ్లాసు పూర్తి చేసి, కనుబొమలు ముడివేసి, గ్లాసు అడుగుకి చూస్తున్నాడు.

“విను! నీకో ముఖ్య విషయం చెప్పాలి.”

“ఏమైంది మై డియర్? ఏమిటా విషయం?”

అతను కుర్చీలో బిర్రబిగుసుకున్నట్టు కదలకుండా కూచున్నాడు. తల దించుకున్నాడు. ప్రక్క నున్న దీపం వెలుగు అతని ముక్కుపైనా, నుదురు మీదా మాత్రమే పడటంతో, క్రింది భాగం అంతా చీకటిలో ఉంది. అతని ఎడమ కన్ను అదరడం ఆమె గమనించింది.

“ఇది నిన్ను బాగా కలతపరిచే విషయమని నాకు తెలుసు. ఎలా చెప్పాలా అని చాలా తీవ్రంగా ఆలోచించాను. చివరకు నేనే స్వయంగా చెప్పడం ఉత్తమమని నిశ్చయించుకున్నాను. నన్ను నువ్వు పెద్దగా నిందించవని అనుకుంటున్నాను.”

అసలు విషయం చెప్పాడు. చెప్పడానికి అట్టే సమయం తీసుకోలేదు. మహా అయితే నాలుగు, అయిదు నిముషాలు పట్టి ఉంటుంది. చెబుతున్న ఒక్కొక్క మాటతో అతను ఆమెకి దూరం అయిపోతుంటే, ఆశ్చర్యానికి గురయిన కళ్ళతో, మారుమాట లేకుండా, మౌనంగా వింటూ కూచుంది.

“అదీ సంగతి. చెప్పడానికి ఇది సరైన సమయం కాదని తెలుసు. కానీ ఇంతకు మించిన సమయం మరొకటి లేదు. అఫ్ కోర్స్. నీకు నేను పరిహారం చెల్లిస్తాను. నీ యోగక్షేమాలకి తగిన ఏర్పాటు చేస్తాను. ఇందులో రాద్ధాంతం చెయ్యడానికి ఏమీ లేదు. కనీసం, నేను అలా అనుకుంటున్నాను. అది నా ఉద్యోగానికి కూడా మచ్చ.”

ఇదేదీ ఆమెకి ముందు నమ్మదగ్గదిగా కనిపించలేదు. కొట్టి పారెయ్యాలని అనిపించింది. అసలు అదంతా ఆమె భ్రమ తప్ప, ఆ మాటలేవీ అతను అన్నట్టు గాని, తను విన్నట్టు గాని అనిపించలేదు. విననట్టు తన పని తాను చేసుకుంటూ పోతే, ఉదయం నిద్ర లేచిన తర్వాత, ఇదేదీ జరిగినట్టే అనిపించదని ఊహించుకుంది.

“రాత్రికి వంట చేస్తాను” అన్న మాటలు మాత్రం గొణుక్కున్నట్లు నోటినుండి ఎలాగో బయటకి వచ్చాయి.

ఈసారి అతను ఆమెను అభ్యంతరం పెట్టలేదు.

గదిలోంచి బయటకి నడుస్తున్నపుడు, నేలకు కాళ్ళు ఆనుతున్నట్టు అనిపించలేదు ఆమెకి. అసలు ఏమీ అనిపించలేదు. కొద్దిగా తల తిరుగుతున్నట్టు, వాంతి వస్తుందేమోనన్న భయం తప్పితే. చేస్తున్న పనులన్నీ అచేతనంగా జరిగిపోతున్నాయి: సెల్లార్ లోకి వెళ్ళడం, లైటు వెయ్యడం, ఫ్రీజర్ తలుపు తెరవడం, చెయ్యి పెట్టి ఏది ముందు తగిలితే దాన్ని అందుకోవడం. అందినది బయటికి తీసి అదేమిటా అనుకుంది. చుట్టిన కాగితం తీసి చూసింది.

అది గొర్రె కాలు. సరే! రాత్రికి ఇద్దరమూ అదే తింటాం అనుకుని, దాన్ని రెండు చేతులతో పట్టుకుని మెల్లిగా మెట్లెక్కి గదిలోకి వచ్చింది. వచ్చేసరికి అతను కుర్చీనుండి లేచి, కిటికీ లోంచి బయటకి చూస్తూ నిలబడి ఉన్నాడు.

అతన్ని చూసి ఆమె ఆగింది.

ఆమె అడుగుల చప్పుడు విని, తల తిప్పకుండా, “రాత్రికి నా కోసం వంట చెయ్యకు. నేను బయటకు వెళుతున్నాను” అన్నాడు.

అలా అనేసరికి, మేరి మెలొనీ నడుచుకుంటూ వెళ్ళి, ఉన్న శక్తినంతా కూడదీసుకుని, ఫ్రీజరు లోంచి తీసిన గొర్రె కాలును రాతిగదలా పట్టుకొని ఎత్తి నెత్తిమీద గట్టిగా కొట్టింది. ఆ మాటకొస్తే, ఆమె చేతిలో ఇనప ఊచ ఉన్నా దానితో కొట్టి ఉండేదే.

ఒక అడుగు వెనక్కి వేసి, తనని తాను నిగ్రహించుకుంటూ, అతని ప్రతిక్రియ కోసం ఎదురుచూసింది. చిత్రంగా, అతను నాలుగు, అయిదు సెకెండ్ల పాటు అటూ ఇటూ ఊగుతూ నిలబడి, తివాచీ మీద ఒక్కసారి కుప్పకూలిపోయాడు.

అతను దబ్బున పడడం, పక్కన ఉన్న టేబులు మీదకి దొర్లిపోవడం, అది చేసిన చప్పుడు – ఆమెను దిగ్భ్రాంతి నుండి తేరుకొనేలా చేసింది. ఆశ్చర్యమూ గగుర్పాటూ కలిగాయి. అతని శరీరాన్ని కళ్ళు మిటకరించి చూస్తూ నిలబడింది. ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన మాంసం ముక్క ఇంకా ఆమె చేతుల్లోనే ఉంది.

‘అయితే, అతన్ని నేను చంపేశానన్నమాట!’ అని తనలో అనుకుంది.

ఆమెకు ఏమిటి చెయ్యాలో ఒక్కసారిగా ఎలా స్ఫురణకు వచ్చిందో ఆలోచిస్తే ఆశ్చర్యం వెయ్యకమానదు. చకచకా ఆలోచించింది. డిటెక్టివ్ భార్యగా ఆమెకు పడబోయే శిక్ష గురించి పూర్తి అవగాహన ఉంది. అది కూడా తన మంచికే. దానివల్ల పెద్ద తేడా పడదు. నిజానికి తనకి మనశ్శాంతి చేకూరుతుంది. కానీ, పుట్టబోయే బిడ్డ సంగతి ఏమిటి? గర్భం ధరించి ఉన్న హంతకురాళ్ళకు వర్తించే చట్టాలు ఏవి? వాళ్ళు తల్లినీ బిడ్డనూ కూడా చంపుతారా? లేక బిడ్డ పుట్టేదాకా ఆగుతారా? ఏం చేస్తారు?

మేరీ మెలొనీకి ఆ విషయం బొత్తిగా తెలీదు. ఆందుకని ఆ విషయంలో తను సంభావ్యతమీద ఆధారపడదలుచుకోలేదు.

మాంసాన్ని వంటగది లోకి తీసుకుపోయింది. బాణలిలో ఉంచి, ఓవెన్ లోపలకి తోసి, ఉష్ణోగ్రత పెంచింది. చేతులు శుభ్రంగా కడుక్కుంది. మేడమీదకు వెళ్ళి, అద్దం ముందు కూచుని, తల సాఫుగా దువ్వుకుని, పెదాలకీ, ముఖానికీ కొంచెం పౌడర్ అద్దుకుంది. నవ్వడానికి ప్రయత్నిస్తే అది చాలా కృతకంగా వచ్చింది. మరొకసారి సాధన చేసింది సహజంగా వచ్చేదాకా.

“హలో శామ్!” అని గట్టిగా, నవ్వుతూ పలకరించింది.

తన గొంతు తనకే అదోలా వినిపించింది.

“శామ్, నాకు కొన్ని బంగాళాదుంపలు కావాలి. వాటితో పాటు బఠాణీలు కూడా.”

ఇప్పుడు ఆమె నవ్వూ, గొంతూ కొంచెం మెరుగయినట్టు అనిపించింది. రెండింటినీ మరికొన్నిసార్లు సాధన చేసింది. చేసి, క్రిందకు వెళ్ళింది. కోటు తీసుకుంది. వెనక త్రోవగుండా, తోట దాటి, రోడ్డు మీద అడుగుపెట్టింది.

అప్పటికి ఇంకా సాయంత్రం 6 గంటలు కాలేదు. గ్రాసరీ స్టోరులో దీపాలు ఇంకా వెలుగుతున్నాయి.

“హల్లో శామ్!” అని నవ్వుతూ హుషారుగా పలకరించింది కౌంటరు దగ్గర ఉన్న వ్యక్తిని చూసి.

“గుడ్ ఈవెనింగ్ మిసెస్ మెలొనీ! ఎలా ఉన్నారు?”

“నాకు కొన్ని బంగాళాదుంపలు కావాలి, శామ్! వాటితో పాటే, బఠాణీల డబ్బా ఒకటి కావాలి.”

వెనక్కి తిరిగి ఆ వ్యక్తి బఠాణీల డబ్బా తీసి ఇచ్చాడు.

“పాట్రిక్ చాలా అలసిపోయానని, ఇవాళ బయట భోజనానికి వెళ్ళలేననీ చెప్పాడు. మీకు తెలుసు గదా, గురువారాలు రాత్రి పూట మేము బయటే భోంచేస్తామని. తీరా చూస్తే, ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి.”

“అయితే మిసెస్ మెలనీ, మరి మాంసం?”

“గుర్తు చేసినందుకు థాంక్స్. కానీ, అవసరం లేదు. ఇంట్లో ఫ్రీజరులో మాంసం దండిగా ఉంది.”

“ఓ, అలాగా.”

“శామ్, ఫ్రీజరులోంచి తీసినది ఎలా వండాలో నాకు సరిగ్గా తెలీదు. దేవుడి మీద భారం వేసి ప్రయత్నిస్తున్నాను. ఫర్వాలేదంటారా?”

“నన్నడిగితే, పెద్ద తేడా పడుతుందని అనుకోను. మీకు ఈ ఐడహో దుంపలు కావాలా?”

“అవైతే మరీ మంచిది. రెండు పెద్ద దుంపలు ఇవ్వండి.”

“ఇంకా ఏమైనా కావాలా?” వ్యాపారస్తుడు తల ఒకవైపుకి వంచి ఆమె వంక ప్రసన్నంగా చూస్తున్నాడు. “భోజనం తర్వాత మాటేమిటి? ఏమిటి చేద్దామనుకుంటున్నారు?”

“శామ్, మీ సలహా ఏమిటి?”

అతను తన షాపులో ఉన్న వస్తువులన్నీ ఒకసారి పరిశీలనగా చూశాడు. “హాఁ. చీజ్ కేక్ అయితే ఎలా ఉంటుంది? ఇది అతనికి బాగా ఇష్టం.”

“మంచి సలహా. ఇదంటే అతనికి గొప్ప ఇష్టం.”

అన్ని పాక్ చేసిన తర్వాత బిల్లు చెల్లించి, ఎంత హాయిగా నవ్వగలదో అంత హాయిగా నవ్వుతూ, “థాంక్యూ, శామ్. గుడ్‌నైట్!” అని చెప్పింది.

“గుడ్ నైట్ మిసెస్ మెలొనీ. థాంక్యూ!” అన్నాడా దుకాణదారుడు.

ఇంటికి త్వరగా వెళ్తూ, మనసులో మననం చేసుకుంది: ఆమె చేస్తున్నదల్లా ఇంటికి త్వరగా వెళ్ళి రాత్రి భోజనానికి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూడటం. వంట బాగా చెయ్యాలి. తను ఎంత బాగా చెయ్యగలదో అంత బాగా చెయ్యాలి. ఎందుకంటే, భర్త బాగా అలసిపోయి వస్తాడు. తను ఇంట్లో అడుగు పెట్టగానే, ఏదైనా అసాధారణమైనది, విషాదకరమైనది, భీతిగొలిపేదీ కనిపించే విషయం చూడటం తటస్థిస్తే, సహజంగా తను దిగ్భ్రాంతికి లోనవుతుంది. భయంతో, దుఃఖంతో ఉద్వేగానికి గురవుతుంది. గుర్తుంచుకోవలసింది అసాధారణమైనది ఏదీ కనిపిస్తుందని ఆమె ఊహించటం లేదు. కేవలం తను కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్తున్నాది. అంతే! మిసెస్ పాట్రిక్ మెలొనీ పాట్రిక్ రాత్రి తన భర్తకి వంట చెయ్యడానికి గురువారం సాయంత్రం కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్తోంది.

అదీ తను ఆలోచించవలసింది అని తనకు తానే సర్ది చెప్పుకుంది. అన్నీ సవ్యంగా, సహజంగా ఉండేట్టు చెయ్యాలి. ఇందులో నటనకి అవకాశం ఇయ్యకుండా, అన్ని సహజంగా ఉన్నట్టే ప్రవర్తించాలి.

కనుక వెనక త్రోవనుండి వంటింట్లోకి అడుగు పెడుతున్నపుడు ఏదో కూనిరాగం తీసుకుంటూ, నవ్వుతూ ప్రవేశించింది.

“పాట్రిక్! ప్రియా, ఎలా ఉన్నావు?” అంటూ గట్టిగా పిలిచింది.

తెచ్చిన వస్తువులు టేబులు మీద పెట్టి, మేడ మీద తన గదిలోకి అడుగు పెట్టింది. అక్కడ తన భర్త నేలమీద పడి, రెండు కాళ్ళూ వంకర తిరిగి, ఒక చెయ్యి అతని శరీరం క్రింద ఇరుక్కుపోయి కనిపిస్తే తనకి గుండె అదిరిపోదూ? అతని మీద పూర్వం ఉన్న ప్రేమంతా ఒక్కసారి పెల్లుబికింది. ఆమె అతని దగ్గరకు పరిగెత్తి, ప్రక్కన కూచుని, గుండెలు పగిలేలా ఏడిచింది. అది చాలా సులువుగా జరిగిపోయింది. ఇందులో నటన అవసరం రాలేదు.

కొద్ది నిముషాలు పోయిన తర్వాత తేరుకుని ఫోను దగ్గరకు వెళ్ళింది. పోలీసు స్టేషనుకు ఫోను చేసి, అవతల నుండి సమాధానం వచ్చిన వెంటనే, ఏడుస్తూ, “త్వరగా రండి! త్వరగా రండి! పాట్రిక్ చనిపోయాడు” అని చెప్పింది.

“ఎవరు మాటాడుతున్నారు?”

“మేరీ మెలొనీ. మిసెస్ పాట్రిక్ మెలొనీ.”

“మీరంటున్నది పాట్రిక్ మెలొనీ చనిపోయేడనేనా?”

“అలాగే అనిపిస్తోంది. అతను నేలమీద పడి ఉన్నాడు. చనిపోయాడనే నా అనుమానం.”

“ఇదిగో, క్షణంలో వస్తున్నాం.” అన్నాడు అవతలి వ్యక్తి.

అన్నట్లుగానే పోలీసు కారు త్వరలోనే వచ్చింది. ఆమె వీధి తలుపు తెరిచేసరికి ఇద్దరు పోలీసులు లోనికి అడుగుపెట్టేరు. వాళ్ళిద్దరినీ ఆమె ఎరుగును. అసలు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులందరూ ఆమెకు తెలుసు. ఆమె కుర్చీలో కూలబడింది. ఓ’మాలీ అన్న పోలీసు, పడి ఉన్న శరీరం ప్రక్క మోకాళ్ళమీద కూర్చుని ఉండడం చూసి, లేచి వచ్చి,

“అతను చనిపోయాడా?” అని ఏడుస్తూ అడిగింది.

“అనే నా అభిప్రాయం. అసలు ఏం జరిగింది?”

తను స్టోర్‌కి సామానులు కొనడానికి వెళ్ళడం, వెనక్కి వచ్చి అతను నేలమీద పడి ఉండడాన్ని చూడడం అంతా క్లుప్తంగా చెప్పింది. ఆమె మాటాడుతూ, ఏడుస్తూ, మాటాడుతూ చెబుతుంటే, రెండో పోలీసు నూరన్ మృతుడి తల మీద సన్నగా గడ్డ కట్టిన రక్తపు చారికని చూశాడు. దాన్ని ఓ’మాలీకి చూపించగానే అతను వెంటనే ఫోను దగ్గరకు పరిగెత్తాడు.

కొంతసేపట్లో మరి కొందరు పోలీసులు ఇంట్లోకి వచ్చేరు. ముందు ఒక డాక్టరు, ఇద్దరు డిటెక్టివ్‌లూ వచ్చారు. వాళ్ళలో ఒకరు ఆమెకు పేరుతో సహా పరిచయమే. తర్వాత పోలీసు ఫొటోగ్రాఫరు వచ్చి ఫొటోలు తీసుకున్నాడు. తర్వాత వేలిముద్రల నిపుణుడు వచ్చాడు. శవం చుట్టూ, వాళ్ళలో వాళ్ళు గొణుక్కోవడం నడిచింది. డిటెక్టివ్‌లు ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కానీ వారు ఆమె పట్ల మర్యాదగానే ప్రవర్తించారు. ఈసారి వాళ్ళకి జరిగిన కథంతా చెప్పింది, మొదటి నుండీ… పాట్రిక్ ఇంటికి రావడం, తను కుట్టుకుంటూ ఉండడం, అతను అలసిపోవడం, ఎంతగా అంటే అతనికి బయటకి వెళ్ళి భోజనం చేసేంత ఓపిక లేనంత. తను ఓవెన్‌లో మాంసం ఎలా ఉంచిందో, ‘ఇంకా అది అందులో ఉడుకుతూనే ఉండి ఉంటుంది’ అని చెబుతూ, తను సామాన్లు, కూరగాయలు కొనడానికి బయటకు వెళ్ళడం, తిరిగి వచ్చి చూస్తే పాట్రిక్ నేల మీద పడి ఉండడం… అంతా పూసగుచ్చినట్టు చెప్పింది.

“ఏ స్టోర్?” అని అందులో ఒక డిటెక్టివ్ అడిగాడు.

ఆమె సమాధానం చెప్పింది. అతను వెనక్కి తిరిగి ఇతర డిటెక్టివ్‌లతో ఏదో గొణిగాడు. వెంటనే వాళ్ళు వీధిలోకి వెళ్ళారు.

పదిహేను నిముషాలు గడవగానే వాళ్ళలో ఒకడు పెద్ద నోట్‌తో తిరిగి వచ్చాడు. మరిన్ని గుసగుసలు. తను వెక్కివెక్కి ఏడుస్తూనే మధ్య మధ్యలో ఒకటీ అరా వాళ్ళు మాటాడుకున్నవి వింటూనే ఉంది: “ఆమె మామూలుగానే కనిపించింది… చాలా ఆనందంగా ఉంది… రాత్రి మంచి భోజనం వండాలనే వచ్చింది… బఠాణీలు… చీజ్ కేక్… ఆమె… అసంభవం…”

కొంత సమయం గడిచేక, ఫొటోగ్రాఫరూ డాక్టరూ వెళ్ళి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి శవాన్ని స్ట్రెచర్ మీద బయటకు తీసుకుపోయారు. తర్వాత వేలిముద్రల నిపుణుడు నిష్క్రమించాడు. ఇద్దరు డిటెక్టివ్‌లూ మరో ఇద్దరు పోలీసులూ మిగిలారు. వాళ్ళు ఆమెతో అసాధారణమైన మర్యాదతో మాటాడేరు. అందులో నూరన్, ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చుననీ, తన సోదరి ఇంటికో, చివరకి నూరన్ ఇంటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చుననీ, తన భార్య ఈ రాత్రికి ఆమె పరిరక్షణ బాధ్యత తీసుకుంటుందనీ హామీ ఇచ్చాడు.

ప్రస్తుతానికి తనకు ఒక అడుగు కూడా బయటకు వేసే శక్తి లేదని చెప్పింది. తను కాస్త కోలుకునే దాకా అక్కడ ఉంటే “మీకు అభ్యంతరమా?” అని అడిగింది. ఆమెకు మనసు ఏమీ బాగోలేదంది. నిజంగా బాగులేదు కూడా. అలాంటప్పుడు పక్కమీద పడుకోవడం మంచిదేమో? అని నూరన్ సలహా ఇచ్చాడు. అక్కడ నుండి కదలాలని లేదని, కూర్చున్న కుర్చీలోనే కొనసాగి, కొంత సమయం గడిచిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగైతే అక్కడ నుండి కదులుతాననీ చెప్పింది.

దానితో ఆమెను అక్కడే విడిచిపెట్టి, ఇల్లంతా వెతికే పనిలో పడ్డారు. ఉండుండి వాళ్ళలో ఒక డిటెక్టివ్ ఆమెను ఏదో ఒక ప్రశ్న అడిగేవాడు. జాక్ నూరన్ అమె ప్రక్కనుండి పోతున్నప్పుడు ఆమెను ఏవో ప్రశ్నలు అడిగేవాడు. తల వెనుక మొండిగా ఉండే బలమైన ఏదో సాధనంతో గట్టిగా కొట్టడం వల్ల ఆమె భర్త చనిపోయాడని చెప్పాడు. అది ఖచ్చితంగా ఏదో బరువైన లోహంతో చేసినదై ఉండాలని కూడా అన్నాడు. వాళ్ళు దానికోసం వెతుకుతున్నారు. హంతకుడు ఆ ఆయుధాన్ని తనతో తీసుకునైనా వెళ్ళిపోయి ఉండాలి, లేదా దాన్ని ఆ చుట్టు ప్రక్కల విసిరేసో, లేదా ఎక్కడో దాచిపెట్టయినా ఉండాలి.

“ఎప్పుడూ ఉన్న కథే. హత్యకి ఉపయోగించిన సాధనం దొరికితే మనిషిని పట్టుకున్నట్టే!” అన్నాడు.

కొంత సమయం గడిచాక, అందులో ఒక డిటెక్టివ్ ఆమె ప్రక్కన కూర్చున్నాడు. ‘ఈ ఇంట్లో ఏదైనా బరువైన వస్తువు గాని, సాధనం గాని ఆయుధంగా వాడే అవకాశం ఉందా?’ అని ఆమెను అడిగాడు. ఆమెకు ఓపిక ఉంటే ఇంట్లో అలాంటి వస్తువు, ఉదాహరణకు స్పానర్ గాని, బరువైన లోహ పాత్ర గానీ కనిపించటం లేదేమో వెతకమన్నాడు.

‘మా ఇంట్లో బరువైన లోహపు పాత్రలు ఏమీ లేవు” అందామె.

“పోనీ పెద్ద స్పానర్?”

ఆమెకు తెలిసి అలాటిది ఏదీ లేదు. కానీ గరాజ్‌లో అలాంటిది ఏదైనా ఉంటే ఉండి ఉండొచ్చు. వెతుకులాట కొనసాగింది. ఆమెకు తక్కిన పోలీసులు ఇంటి చుట్టూ తోట అంతా వెతుకుతున్నారని తెలుసు. కంకర మీద వాళ్ళ అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. ఒకోసారి తెరల మధ్య నుండి వాళ్ళు వేస్తున్న ఫ్లాష్ లైట్ వెలుగులు కనిపిస్తూనే ఉన్నాయి. రాను రానూ ఆలస్యం అయిపోతోంది. మాంటిల్ మీద నున్న గడియారం తొమ్మిది చూపిస్తోంది. గదులన్నీ వెతుకుతున్న పోలీసులు అప్పటికే బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. వాళ్ళు కొంత నిస్పృహకి కూడా లోనయినట్టు కనిపిస్తున్నారు.

మళ్ళీసారి సార్జంట్ నూరన్ తన ప్రక్కనుండి వెళుతున్నప్పుడు, “మీకు అభ్యంతరం లేకపోతే, నాకు కొంచెం డ్రింకు కలిపి ఇవ్వగలరా?” అని అడిగింది.

“తప్పకుండా. మీకు కావలసింది ఈ విస్కీయే కదా?” అడిగాడు.

“అదే. కానీ తక్కువ మోతాదులో. అది తీసుకుంటే నా పరిస్థితి కొంత మెరుగౌతుందని అనుకుంటున్నాను.”

ఆమెకు ఒక గ్లాసు కలిపి ఇచ్చాడు అతను.

“మీరు కూడా ఒక గ్లాసు తీసుకోండి. మీరు కూడా బాగా అలసిపోయారు. దయచేసి తీసుకోండి. మీరు నన్ను ఎంతో మర్యాదగా చూస్తున్నారు.”

“నిజం చెప్పాలంటే, అలాంటివి నిషిద్ధం. కానీ నా పని నేను కొనసాగించాలంటే, మీ మాట కాదనలేక ఒక్క డ్రింక్ తీసుకుంటాను.”

ఒకరి తర్వాత ఒకరు లోనికి అడుగుపెట్టడం, వాళ్ళని ఒక్కొక్కర్నీ కొద్దిగా శ్రమ తీర్చుకుందికి కొంచెం విస్కీ తీసుకోమని ఆమె ప్రార్థించడం జరిగింది. చేతుల్లో డ్రింక్ పట్టుకుని, ఓదార్పు మాటలు చెబుతూ, ఆమె చుట్టూ ఇబ్బందిగా నిలబడ్డారు. సార్జెంట్ నూరన్ వంటింట్లోకి దూరాడు. బయటకి వచ్చి, “మిసెస్ మెలొనీ, ఆ ఓవెన్ ఇంకా మండుతూనే ఉంది. అందులో ఉంచిన మాంసం ఉడుకుతూనే ఉంది” అని హెచ్చరించాడు.

“అయ్యో! నిజమే, మరిచిపోయాను!” అని అరిచిందామె.

“నేను ఓవెన్‌ను ఆర్పెయ్యనా?” అని అడిగాడు నూరన్.

“ఏమీ అనుకోకపోతే, ఆ పని చెయ్యండి. థాంక్యూ.”

సార్జెంటు రెండోసారి తిరిగి వచ్చినపుడు, తన నల్లని విశాలమైన కళ్ళతో అతన్ని చూస్తూ, “జాక్ నూరన్” అని పిలిచింది.

ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు నూరన్ ఆమె వంక.

“మీరు నాకో చిన్న ఉపకారం చేసిపెట్టాలి.”

“తప్పకుండా ప్రయత్నిస్తాను, చెప్పండి మిసెస్ మెలొనీ.” హామీ ఇచ్చాడు అతను.

“మరేమీ లేదు. మీరందరూ ఇక్కడ డిన్నర్ చేయాలి. మీరందరూ పాట్రిక్‌కి మంచి స్నేహితులు. నేను ఇప్పుడు ఏదీ తినే పరిస్థితిలో లేను. ముఖ్యంగా అతనితో పంచుకోవాలని వండినది ఏదీ. మీకు ఫర్వాలేదు. మీరందరూ నేను చేసిన ఆ గోట్ లెగ్ రోస్ట్ తినగలిగితే నాకు మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మళ్ళీ మీ పని మీరు చూసుకోవచ్చు.”

నలుగురు పోలీసులూ తినడానికి చాలా తర్జనభర్జనలు పడ్డారు. వాళ్ళందరూ ఆకలిగా ఉన్న మాట స్పష్టం. చివరకి తినడానికే నిర్ణయించుకున్నారు. ఆమె ఉన్నచోటునే కదలకుండా కూర్చుంది, వాళ్ళు మాటాడుకునే మాటలు వింటూ. వాళ్ళ మాటలు బొంగురుగా, ముద్దగా వస్తున్నాయి. దానికి కారణం వాళ్ళ నోటినిండా మాంసం ఉండడమే.

“చార్లీ! మరికొంచెం వేసుకో.”

“అంతా మనం తినెయ్యడం మంచిది కాదు.”

“ఆమె కోరిక మనం తినాలనే. పూర్తిగా తినెయ్యమని చెప్పింది. అది ఆమెకు ఉపకారం అని కూడా చెప్పింది.”

“సరే అయితే. నాకు మరికొంచెం ఇవ్వు.”

“పాపం పాట్రిక్‌ని తలమీద దేనితో కొట్టాడో కాని అది ఖచ్చితంగా చాలా పెద్ద ఆయుధం అయివుండాలి.” వాళ్ళలో ఒకడు.

“సమ్మెటతో కొట్టినట్టు, తగిలిన చోట పుర్రె నుజ్జునుజ్జు అయిపోయింది అన్నాడు డాక్టరు.” మరొకడు.

“అందువల్లనే, అది సులభంగా దొరకాలి.”

“నేను అనుకుంటున్నదీ అదే!”

“అవసరానికి మించి ఆయుధాన్ని పట్టుకుని ఎవరూ తిరగరని నా అభిప్రాయం.”

ఒకడు ‘బ్రేవ్’మంటూ గట్టిగా త్రేన్చాడు.

“కళ్ళెదుటే అని అంటారే, అలాగ అది మన కళ్ళ ఎదురుగా ఎక్కడో ఉందని నా అనుమానం. ఏమంటావు, జాక్?”

ప్రక్క గదిలో, మేరీ మెలొనీ చప్పుడు కాకుండా చిరునవ్వులు చిందించింది.

(Courtesy: Lamb to the Slaughter – Roald Dahl.)