కొన్ని మోహాల్లోనో దాహాల్లోనో
నీకై నీవే చిక్కుకున్నప్పుడు
తప్పదు
చెదరిన
గడ్డిపరకల గూటినే
మమకారంగా వెతుక్కునే పిట్టలా
ఈ వేదననిలా భరించాల్సిందే
చూపుల అవధికి అందని
తడితపనల ఇంద్రధనువొకటి
నీకై పలకనందుకూ
నీకోసమేననుకున్న అడుగులు
నీకై ఆగనందుకూ
ఎవరూ తిరగని దారిలో నీవిలా
ఎప్పటికీ ఎదురుచూసే
మైలురాయై మిగలాల్సిందే
చలి కాచుకున్న నెగడును
మోహంగా చేసుకుని
గుండెకు హత్తుకున్న
ప్రతీసారీ
నీవిలా దహించుకుపోవల్సిందే
రచయిత విజయ్ కోగంటి గురించి:
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ... పూర్తిగా »
Begin typing your search above and press return to search. Press Esc to cancel.