గీతలూ గీయని, రంగులేవీ అద్దని పటవస్త్రం
జీవితమెలా అవుతుంది?
అర్థమయో అర్థంకాకో
కొన్ని గీతలు గీయాలి
కొన్ని రంగులు అద్దాలి
గీత గీసే ముందూ రంగులద్దేముందూ
ఒకింత పరికించుకో
ఆకసానికి ఆకుపచ్చనీ
గడ్డిపరకకు నీలాన్నీ అద్దకు
నవ్వుకూ కన్నీటికీ
ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
కొంచెం గమనించుకో
ఉన్నాయి కదా రంగులని
ఊరికే అతిగా పులమకు
కోపం మరింత ఎర్రబడినా బాగోదు
నవ్వులు తెల్లబడినా బాగోదు
ఇన్ని మనసుల ప్రపంచంలో
ఎన్నో కష్టాలూ సుఖాలూ
నవ్వులు ఏడుపులూ
ఈ రంగులన్నిటినీ చక్కగా కలుపుకో
ఆ గుసగుసలు పోయే గాలి పాటని
అదుగో ఆ మెరుపు నవ్వు చూపుని
ఈ హోరుగాలి గుండె బరువును
కలగలిపి వేసిన చిత్రాన్నలాగే
వదిలేయకు
గుండె అంగీలా చుట్టుకో
నవ్వుల పటంగా కట్టి
కనీసం ఒక్కరితోనైనా పంచుకో
రచయిత విజయ్ కోగంటి గురించి:
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...
Begin typing your search above and press return to search. Press Esc to cancel.