వేకువనే మోకరించే ఆమె

ఆమె మోకరించిన ప్రతీసారీ
ఎవరో ఒకరిని ఆదరించడానికి
శక్తినేదో కూడగట్టుకుంటుంది
వేకువలో పాడే ఆమె గొంతు లోంచి
విడుదలయ్యే ధ్వని తరంగాలు
నిరంతరంగా
ప్రకంపనాలు రేపుతుంటాయి

ఎక్కడ నుండి సంకేతమొస్తుందో
ఆమె దర్శించిన ఇంటిలో
అనారోగ్యమో, దిగులో
తన స్పర్శ కోసం ఎదురు చూస్తుంటుంది
దిగులుచెందిన గుండె ఒకటి
కన్నీరై ఒలికి
ఆమెను హత్తుకొని ఉపశమనం పొందుతుంది

ఆమె సామాన్యమైనది
అక్షరసౌందర్యాలు తెలియనిది
మోకరించిన వేకువలో సత్తువను సంతరించుకొనేది

అమ్మా!
నీతో మోకరించిన వేకువలు
నా జీవిత పథాన్ని నడిపిస్తున్నాయి.

అమ్మను గుర్తుచేసుకోవడం జ్ఞాపకమేనా!


జాన్ హైడ్ కనుమూరి

రచయిత జాన్ హైడ్ కనుమూరి గురించి:

ప్రముఖ తెలుగు కవి, రచయిత, బ్లాగర్ జాన్ హైడ్ కనుమూరి (-2014) ‘హృదయాంజలి’ కవితా సంపుటితో సహామంచి కవితలు రాశారు. ‘సం”గతులు”‘ పేరుతో ఆయన ఒక బ్లాగ్ నిర్వహించేవారు. తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా అంతర్జాల వేదికలపై ఆయన తన కవిత్వంతో ఎంతోమంది పాఠకులను ఆకట్టుకున్నారు. ఆయన కవితల వివరాలను కవిసంగమం లేదా ఆయన బ్లాగ్ ద్వారా చదువుకోవచ్చు.

 ...