ఎవరిలో ఎవరో

ఎవరిలో ఎవరైనా ఉండొచ్చు
ఎవరూ ఉండకపోవచ్చు కూడా
ఒకోసారి లోలోపల
మరణించిన సహచరి సజీవ శీతలచ్ఛాయో
మరపురాని ఒకనాటి అందాలబొమ్మో
గూట్లో దీపంలా వెలుగుతుండొచ్చు

ఒకోసారి ఎవడిలో వాడే బిర్రుగా ఉండొచ్చు –
స్నానం తొట్టిలో ఉబ్బిపోయిన శవంలా
మృతనిశ్శబ్దాల పిరమిడ్ మమ్మీలు
మెలిదిరిగిన కోర్కెల కొండచిలువలు
కొరివిదెయ్యాలు వేటతోడేళ్ళు
ఒకడిలో సంపూర్ణంగా ఉందొచ్చు

ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?
ఎవరిలో ఏవైనా ఉండొచ్చు
ఎవరూ వేటినీ చూసుకోకపోవచ్చు

ఒకనాటి పొద్దున్నే నా ముందు నేను నిలబడ్డప్పుడు
నక్షత్రఖచిత వినీలాకాశం కింద
పచ్చికబీళ్ళ పైన పచ్చపిట్టలు
కొండవాగుల కోడెగిత్తలు
అరుగుమీద అచ్చారు గుక్కపట్టిన చిన్నప్పటి మట్టిబొంగరం
చూశాను