విమర్శ సృజనాత్మక కావ్యం

అవును. విమర్శ గొప్ప సృజనాత్మక వ్యాపారం అని నా అభిప్రాయం. సృజనాత్మకత లేని విమర్శ సారం లేని పిప్పిలా, ఎండు గడ్డిలా కనిపిస్తుంది నాకు. అందులో రుచి తగలదు. దేన్ని నువ్వు సృజిస్తావు అందులో? సాధారణ విషయాల్ని విమర్శించటానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అవి నీ కల్పనని ప్రేరేపించవు. కాని ఒక కొత్త విషయం సాహిత్య ప్రపంచంలో ఆవిష్కరించబడినప్పుడు దాన్ని నువ్వు పాత సాధనాల్తో తవ్వి తలకెత్తలేవు. పై పొరల్లోనే ఆగిపోతావు. రససిద్ధాంతంతో మహాప్రస్థానం రచనని విశ్లేషించిన వాళ్ళున్నారు. అందువల్ల తగు మోతాదులో రసానందం పొందగలం. కాని అందులో ఏ సామాజిక వర్తమానాన్ని కవి నిరాకరిస్తున్నాడు? ఎటువంటి ప్రపంచాన్ని కలగంటున్నాడు? ఆ కలకి ప్రేరణ ఏమిటి? ఆ కల సాకారం కావటానికి జనం చెయ్యాల్సిన త్యాగం ఏమిటి? ఇవేవీ ఆ విమర్శలో తర్కించబడవు గాక బడవు. అప్పుడు నీకు వర్తమానత (Contemporaneity) అనే ప్రమాణం అవసరమవుతుంది. సామాజిక చైతన్యం అనే ప్రమాణం కావాల్సివస్తుంది. అటువంటి మరికొన్ని ప్రమాణాలతో మాత్రమే ఆ రచనని విలువ కట్టగలం. అంటే ఒకానొక కాలపు సాధనాలతో అన్నిసార్లు మరో కాలపు సాహిత్యాన్ని సమగ్రంగా అంచనా వెయ్యలేం. కొత్త సాధనాలేవో అవసరమవుతాయి. అక్కడే విమర్శకుడు సృజనశీలి కావాలి.

ఆధునిక కవిత్వంలో అస్పష్టత గూర్చి నేను రాయాల్సివచ్చినప్పుడు ఇంతకీ అస్పష్టత అంటే ఏమిటనే ప్రశ్న ఎదురయింది. అందరూ ఆ మాట అనేవాళ్ళే గాని దాన్ని ప్రాథమికంగా నిర్వచించిన వాళ్ళు లేరు. అప్పుడేమవుతుంది? అస్పష్టత గూర్చి మనం ఏ విమర్శ చేస్తున్నామో మాట్లాడుతున్నామో అది కూడా అస్పష్టంగా మిగిలిపోతుంది. కనుక దాన్ని ఒక భావనగా నేను నిర్వచించుకోవాల్సి వచ్చింది. ‘కవి పాఠకుల మధ్య ఏర్పడిన అసంబంధ ఫలితమే అస్పష్టత’ అని నా నిర్వచనం. ఎప్పుడైతే ఆ నిర్వచనం చెయ్యగలిగానో అప్పుడిక ఆ విషయం గురించి విశ్లేషించటం, కొన్ని నిర్ధారణలు చెయ్యటం తేలికైంది. ఆ నిర్వచనం చెయ్యటం అంటే ఒక కొత్త సాధనాన్ని సృజించటమే. అట్లాగే అశ్లీలం గురించి ‘స్త్రీ పురుష లైంగిక సంబంధాన్ని కించ పరచటమే అశ్లీలత’ (The disgrace of the sexual relation between a man and woman is obscenity) అని నిర్ధారించాను. ఇట్లా కొన్ని భావనల్ని నిర్వచించగలిగి నప్పుడు ఆ విషయం లోలోతుల్లోకి తేలిగ్గా స్పష్టంగా వెళ్ళగలం. వస్తువు, రూపం, అస్పష్టత, సంక్లిష్టత, స్తబ్ధత, అశ్లీలం మొదలైన భావనల వివరణతో సాహిత్యం-మౌలిక భావనలు అనే పరిశోధన గ్రంథం వెలువరించాను.

సాహిత్యవిమర్శలో సాహిత్యేతర సాధనాలు కూడా ఉపకరిస్తాయని నా అవగాహన. ఉదాహరణకి మనం ధాన్యాన్ని కొలవాలంటే సంప్రదాయబద్ధంగా గిద్ద, సోల, మానిక వంటి కొలమానాల్ని ఉపయోగిస్తాం. అయితే దాన్ని చేటతోనైనా కొలవవచ్చు. దానితో కొలిచేటప్పుడు ధాన్యాన్ని విరివిగా, వివరంగా చూసే అవకాశం ఉంటుంది. అట్లాగే సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు అన్ని సార్లూ సాహిత్యసాధనాలు చాలవు. సాహిత్యేతర సాధనాలు కూడా అక్కరపడతాయి. అప్పుడు తత్త్వశాస్త్రం, భాషాశాస్త్రం, సామాజికశాస్త్రం మొదలైనవాటిని ఆశ్రయిస్తే తప్పులేదు. నాకు తెలిసినంతలో ఆచార్య చేకూరి రామారావు చేరాతలులో ఆధునిక కవితల్ని విశ్లేషించటానికి భాషాశాస్త్ర పరిభాషల్ని, భావనల్ని సమర్థంగా వాడుకొన్నాడు.

ఒకానొక సందర్భంలో మన సాహిత్య చరిత్రలో పాత, కొత్త ధోరణులు కొన్ని సహజీవనం చేస్తున్నట్టు గుర్తించాను. ఎంతో అభ్యుదయం సాధించామనుకొంటున్న దశలోనూ వెనకటి పద్ధతులు సమాజంలో, సాహిత్యంలో కొనసాగుతున్నట్టు బోధపడింది. దానినిఎట్లా అర్థంచేసుకోవాలో, ఎట్లా సూత్రీకరించాలో తెలియలేదు. ఆ సమయంలో దామోదర్ ధర్మానంద కోశాంబి An Introduction to the Study of Indian History అనే రచన నాకు తోడ్పడింది. ఆ విశిష్ట చరిత్రకారుడు భారతీయ సంస్కృతిలోని ఒక అవిచ్ఛిన్న లక్షణాన్ని గుర్తించాడు. పూర్వస్థితి ఎంతోకొంత ఉత్తర స్థితిలోనూ కొనసాగటం అది. తెలుగు సాహిత్య చరిత్రలోనూ ఆ లక్షణం ఉంది. దాన్ని కనుగొని, కొన్ని ప్రతిపాదనలు చెయ్యటానికి ‘అవిచ్ఛిన్నత’ అనే భావనని రూపొందించుకొన్నాను. ‘తెలుగు సాహిత్యంలో అవిచ్ఛిన్నత’ అనే వ్యాసం ద్వారా ఆ పని చేశాను.

విమర్శకుడికి సృజనాత్మకత మరో విషయంలోను అవసరమే. ఒక సృజనాత్మక విషయాన్ని లోతుగా అవగాహన చేసుకోవటానికి, ఆవిష్కరించటానికి కేవలం విమర్శకుడి తెలివితేటలు చాలవనుకొంటాను. అతడు స్వయంగా కవి అయితే కవితా సృజనలోని ఆల్కెమీ తేలిగ్గా అర్థంచేసుకోగలడు. సృజన క్రమంలో కవి హృదయంలో జరిగే సాగరఘోష వినగలడు. కవి కానివాడు శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ సంపూర్ణంగా అర్థంచేసుకోలేడని, ఆవిష్కరించలేడని నా నిశ్చితాభిప్రాయం. అట్లాగే మంచి కథకుడు కానివాడు ఒక గొప్ప కథ ఆత్మని సంపూర్ణంగా పట్టుకోలేడు. సృజన క్రమంలో కవి/రచయిత అంతర్లోకంలో జరిగే రసాయన చర్య అటువంటి క్రమంలో ఉన్నవాడికే పూర్తిగా అర్థమవుతుంది. (ఈ మాటకి అందరూ తల ఊపుతారని నేననుకోవటం లేదు.)

తెలుగులో ప్రాచీన కవిత్వానుశీలన చాలాకాలం రస సిద్ధాంతం, నాయికా నాయకులు, అలంకారం, వర్ణన మొదలైన ప్రమాణాలతో సాగింది. వాటిని ఆధునిక సాహిత్యానికీ యథాతథంగా అన్వయించే వాళ్ళున్నారు. ఈ ప్రమాణాలకు సంస్కృత అలంకారశాస్త్రం ఆధార భూమిక. ఇది క్రమక్రమంగా ఒక మూస పద్ధతికి దారితీసింది. ఈ మూసను బద్దలు గొట్టినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. అతని కవిత్వ తత్త్వ విచారము ఆధునిక విమర్శకు నాంది. ‘వికృతులు లేని పాత్రలు జడసమానములు’ అని ఆయన తీర్మానం. పాత్రలు శుద్ధ చరిత్రలుగా కాకుండా మిశ్ర చరిత్రలుగా ఉండాలనటం అప్పటికి మిక్కిలి కొత్త మాట. ‘విపరీతాలంకార రచనకు ప్రేరేపకము భావశూన్యత’ అని తేల్చాడు కట్టమంచి. ‘వర్ణనముల కన్న అంగాంగ సాంగత్యము కావ్యముల శ్రేష్టము’ అని చెప్పాడు. ఇంచుమించు ఆయనకు సమకాలంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సాహిత్యాధ్యయనంలో అభిరుచి, స్పందనల పాత్ర గురించి పరిశీలించాడు. వేమన వంటి మౌలిక అన్వేషకుల్ని వెలుగులోకి తెచ్చాడు. సాహిత్యంలో సంస్కారానికి ఉండాల్సిన స్థానం గురించి చక్కని ప్రతిపాదనలు చేశాడు. ఆ విషయంలో తనకు ఆరాధ్యుడైన కట్టమంచిని ఖండించటానికీ ఆయన వెనుకంజ వెయ్యలేదు. ఇటువంటి మౌలిక విమర్శకులే మనకవసరం.

తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి ఘటికుడైన విమర్శకుడు. చాలా తీవ్రమైన నిర్ధారణలెన్నో చేశాడు. ఏ మాత్రం మొహమాటం, కనికరం లేకుండా నిష్కర్షగా తన ప్రతిపాదనలు చేశాడు. అటువంటి మేధావిని శ్రీశ్రీ ‘క్రూరుడైన విమర్శకుడు’ అన్నాడు. విమర్శలో క్రూరత్వం ఏమిటి? విషయకాఠిన్యం వేరు; భాషణ కాఠిన్యం వేరు. ఒక విమర్శ విషయపరంగా ఎంతో తీవ్రంగా ఉండవచ్చు. దాన్ని సరైన రీతిలో వ్యక్తీకరించటంలోనే ఉంటుంది సమస్య. దిగంబరకవుల కవిత్వాన్ని తూర్పారబట్టవచ్చు. కాని వాళ్ళని అరిషడ్వర్గాలుగా అవమానించటం సరి కాదు. అది వ్యక్తిగతమైన దూషణ. అటువంటి వ్యాఖ్యలే శ్రీశ్రీకి బాధ కలిగించి ఉంటాయి. కాగా విమర్శలో వ్యంగ్యం ఉంటే ఆ విమర్శ పదునెక్కుతుంది. అయితే వ్యంగ్యానికి, వెటకారానికి తేడా తెలియాలి. మార్కిస్టు పంథాలో రంగనాయకమ్మ గొప్ప విమర్శకురాలు. వ్యంగ్యాన్ని బాగా పలికిస్తుంది. అయితే ఒక్కోసారి అది మితిమీరి వెటకారానికి దారితీస్తుంది. ఆమె బలమైన బలహీనత అదే. వేమన కవిత్వాన్ని విలువగట్టేటప్పుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ చక్కని వాఖ్యానం చేశాడు. వేమనది తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత అని, అది గాయపుమందు కత్తికే పూసి కొట్టినట్టుంటుందని ఆయన పరిశీలన. అట్లాగే తీవ్రమైన విమర్శ అయినా రచయితను వ్యక్తిగతంగా నొప్పించకుండా ఉండాలని నా అభిప్రాయం. ఈ విషయంలో కొడవటిగంటి కుటుంబరావు చాలా వస్తుగత దృష్టితో విమర్శ సాగించినట్టు తెలుస్తుంది. కొ.కు. విమర్శలో స్పష్టత, పదును ఉంటాయి. వ్యంగ్యం ఉంటుంది. అనవసర హేళన, వెటకారం ఉండవు.

ఇక్కడ ఒక పాత సంగతి మళ్ళీ గుర్తించాలనిపిస్తుంది. కావ్యపాఠకుడు సహృదయుడై ఉండాలని ప్రాచీన విమర్శకులు (ఆలంకారికులు) చెప్పారు. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకానికి లోచనవ్యాఖ్య చేస్తూ అభినవగుప్తుడు సహృదయుడికి ఒక చక్కని నిర్వచనం చేశాడు. ‘యేషాం కావ్యానుశీలనాభ్యాసవశాత్ విశదీభూతే మనో ముకురే వర్ణనీయ తన్మయీభవనయోగ్యతా తే హృదయసంవాదభాజః సహృదయాః’. నిరంతర కావ్యపఠనం వల్ల పాఠకుడి మనస్సు విప్పారుతుంది. అద్దంలాగా మారుతుంది. కవి వర్ణించే విషయంతో తన్మయత్వం కలుగుతుంది. ఆ విధంగా కవి హృదయంతో సమానమైన హృదయం గలవాడే సహృదయుడని ఆ నిర్వచన సారాంశం. హృదయ సంవాదం అనేది ఇక్కడ ముఖ్యమైన మాట. కవి/రచయిత ఏ హృదయధర్మంతో రచన చేశాడో ఆ హృదయధర్మం ప్రాథమికంగా కలిగి ఉండాలి పాఠకుడు. అంటే ముందుగానే ఏర్పరుచుకొన్న భావాలతో రచనను చూడరాదని తాత్పర్యం. రచన అంతా చదివినాక ఆ కవి/రచయిత అభిప్రాయాలతో విభేదించవలసి వస్తే వేరే సంగతి. అభినవగుప్తుడు ఈ నిర్వచనం దృశ్యకావ్యాన్ని తిలకించే ప్రేక్షకుడి గురించి చెప్పాడు. అది శ్రవ్యకావ్యానికీ అన్వయించుకోవచ్చు. అప్పుడు సహృదయుడైన పాఠకుడనీ అనుకోవచ్చు. ఈ సారాంశం కేవలం పాఠకుడికేగాక విమర్శకుడికీ అన్వయించుకోవచ్చు. పురస్సిద్ధాంతాలతో ఆయా రచనల్ని ముందస్తుగానే వ్యతిరేక దృక్పథంతో చూడరాదని తెలుసుకోవాలి. సహృదయత అంటే అంతిమంగా సాహిత్య సంస్కారమే.

ఏ సాహిత్యాన్ని గాని పరిశీలించి, సారగ్రహణం చెయ్యటానికి ఏదో ఒక సిద్ధాంతం చాలదు. ఆ మాటకొస్తే ఏ సిద్ధాంతమైనా సర్వసమగ్రం కాదు. అది కొన్ని జ్ఞాన సంబంధమైన, కాలసంబంధమైన పరిమితులకి లోబడుతుంది. అది తెలియని వాళ్ళు తాము ఇష్టపడే సిద్ధాంతం ప్రాపంచిక సమగ్రతను ఏ మినహాయింపూ లేకుండా వ్యాఖ్యానించగలుగుతుందనుకొంటారు. ఇతర సిద్ధాంతాలను పట్టించుకోరు. పట్టించుకొంటే తమ పునాదులు కదలిపోతాయని లోలోపల భయం. ఇది నిశ్చయంగా సంకుచిత స్వభావమే. మాట వరసకి ఒక సిద్ధాంతం సర్వ సమగ్రమే అనుకుందాం. అది ఒకప్పటి ప్రాపంచిక వాస్తవికతని సరిగ్గా వ్యాఖ్యానించిందనే అనుకుందాం. ఆ ప్రాపంచిక వాస్తవికత ఎల్లకాలం అదే విధంగా ఉంటే ఆ సిద్ధాంత అన్వయాన్ని తప్పుబట్టనక్కర్లేదు. అయితే ప్రపంచంలో అన్నీ నిరంతరం మారుతుంటాయనేది ప్రాథమిక సత్యం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. వాటివల్ల జీవన విధానాలు మారుతుంటాయి. భౌతిక ఉత్పత్తి రంగంలో సాఫ్ట్‌వేర్ ప్రవేశంతో ఉత్పత్తి స్వరూప స్వభావాలే మారిపోయాయి. పెట్టుబడి మిక్కిలి తేలిగ్గా భూగోళం ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి ప్రయాణించగలుగుతుంది. వర్గ నిర్వచనాలూ మారిపోయాయి. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ మొదలైన సాధనాలతో సమాచారరంగం విద్యుత్ వేగాన్ని అందుకొంది. సిద్ధాంతాన్నిబట్టి ఆచరణని తూకం వేస్తాం. అదే సందర్భంలో మారిన కాలమాన పరిస్థితుల్నిబట్టి సిద్ధాంతం కూడా తనను తాను మార్చుకోవాల్సి ఉంటుంది. న్యూటన్, ఐన్‌స్టీన్ లాంటి మహామహులు చేసిన సిద్ధాంతాలకు కాలక్రమంలో కొన్ని సవరణలు చెయ్యబడటం మనకు తెలిసిన విషయమే. అట్లాగే సాహిత్య సిద్ధాంతాలకూ మార్పులు, చేర్పులు తప్పవు. ఒక సిద్ధాంతం కలకాలం ఏ మార్పూ లేకుండా ఉందంటే దాన్ని తప్పకుండా అనుమానించాల్సిందే. అది అక్కడే నిల్చిపోయిందని, దానితో మెల్లమెల్లగా మన అవసరం తీరిపోతుందని కూడా తెలుసుకోవాలి.

1980 తర్వాత తెలుగు సాహిత్యంలో ఆధునికానంతర ధోరణులను గుర్తించే ప్రయత్నం జరిగింది. విశ్వజనీనతని ప్రశ్నించటం, మహాకథనాలను తిరస్కరించటం, విఘటనం, వాచక బహుళత్వాన్ని గుర్తించటం మొదలైన పద్ధతులు ఆధునికానంతర విమర్శలో ఉంటాయి. ఈ కొత్త ధోరణులను బి. తిరుపతిరావు బలంగా ప్రతిపాదించాడు. మార్క్సిస్టు సిద్ధాంతవాదులకు మింగుడుపడని రీతిలో వచ్చిన స్త్రీవాద, దళిత వాదాలు మొదలైనవాటిని ఆధునికానంతరవాదాలుగా నిరూపించే ప్రయత్నం జరిగింది గాని అది నెరవేరలేదు. అయితే కొత్త ఆలోచనాధోరణులకు అది తెర తీసిందని మాత్రం చెప్పవచ్చు. ఆధునికానంతరవాదాన్ని ఒక లక్షణంగా కాకుండా ఒక దశగా గుర్తించటం ఆ వాదంలోని లోపమనిపిస్తుంది.

ఆధునికోత్తరవాదం విడి విడి అస్తిత్వాలను గుర్తిస్తుంది. పరిశీలిస్తుంది. కాని వాటి మధ్య అంతస్సంధానం, కలయికల గురించి ఏమీ మాట్లాడదు. వాటిని కలిపే పనిముట్లు దాని వద్ద దొరకవు. అవి లేకుండా ఆధిపత్య వ్యవస్థల్ని విడివిడిగా ఎదుర్కోవటం కష్టం. దళిత, స్త్రీ అస్తిత్వాల దగ్గరికి వద్దాం. అవి ఆధునికానంతరవాద ఉద్యమాలు కాజాలవు. దళితవాదం పూర్తిగా స్థానికం. దానికొక రాజకీయార్థిక సామాజిక దృక్పథం, ఆ పైన ఉద్యమాచరణ ఉన్నాయి. ఆ భూమిక నుంచి ఆధునికానంతరవాదం దళితవాదాన్ని, ఆ సాహిత్యాన్ని పరిశీలించలేదు. ఇక ఆ వాద విపులత్వం, ఉద్యమస్థాయి స్త్రీవాదానికి లేవు. అయితే ఆధునికానంతరవాద ప్రభావం దాని మీద ఉంది. ప్రస్తుతం తలెత్తుతున్న రకరకాల అస్తిత్వవాదాలకు ఆధునికానంతర భావజాలానికీ ఏమైనా చుట్టరికం ఉందా అనేది పరిశీలించాలి.

సమాజ జీవనం ద్రవాత్మకంగా మారిందని, ద్రవప్రపంచంలో మానవ సంబంధాలు బలహీనమవుతున్నాయని, వస్తువినియోగతత్వం మానవసంబంధాలలోనూ జొరబడిందని జిగ్మంట్ బౌమన్ గుర్తించాడు. వర్తమాన జీవితంలో మూడు లక్షణాలు పసిగట్టాడు. 1. అపాయం, 2. అస్థిరత్వం, 3. అరక్షణ/దుర్బలత్వం (vulnerability). తమ స్థితిగతుల గురించి అభద్రత, భవిష్యత్తు గురించి అనిశ్చితి, తమ శరీరం మొదలు కలిమి దాకా క్షేమరాహిత్యం – ఇవన్నీ ఆ కష్టాల రూపాలు.

నేటి కార్పొరేట్ ప్రపంచాన్ని అర్థంచేసుకోవటానికి ఈ ద్రవాధునిక భావన బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెట్టుబడి ప్రపంచంలో ఏ మూలనుంచి ఏ మూలకైనా పరిగెత్తుతుంది. ప్రపంచీకరణలో భాగంగా జరిగిన ఒక ముఖ్య పరిణామం ఏమిటంటే పారిశ్రామిక పద్ధతిలో భౌతిక ఉత్పత్తి గాక బౌద్ధిక ఉత్పత్తి విజృంభించటం. సాఫ్ట్‌వేర్ రంగమే దీనికి రామచక్కని ఉదాహరణ. ఇక్కడ కావాల్సింది భౌతికావరణ కాదు, అంతర్జాల ఆవరణ (cyberspace). వందల పనిముట్లు అక్కర్లేదు, చిన్నపాటి కంప్యూటర్ చాలు. ఒడిలో బుల్లి కంప్యూటర్ (Laptop) మరీ మేలు. మానవుడు సృష్టించిన కృత్రిమమేధ మానవుడినే శాసించే పరిస్థితి ఏర్పడింది. మనుషుల మధ్య పూర్వాధునిక, ఆధునిక సమాజాల్లో మాదిరిగా కాక, సామాజిక సంబంధాలు వినియోగ, వస్తు సంబంధాలుగా మారుతున్నాయి. మనుషుల మధ్య అనుబంధాలు (relations) అనుసంధానాలుగా (contacts) మారుతున్నాయి. ముడేసుకోవటం ఎంత తేలికో తెంచేసుకోవటం కూడా అంత తేలికే. వ్యక్తి విచ్ఛిన్నత, పరాయితనం నేటి మనిషి అంతరంగం. ఈ విధంగా బౌమన్ కనుగొన్న అంశాలని మన సమాజానికి, సాహిత్యానికి అన్వయించటానికి ‘ద్రవాధునికత’ అనే భావనని రూపొందించాను. ఇలాంటి కొత్త భావనల పరికల్పన వల్ల విమర్శ సిద్ధాంతం పరిపుష్టమై విమర్శాకార్యం సులభమవుతుందని నా అభిప్రాయం. కొత్త కొత్త సాహిత్యప్రాంతాలను గుర్తించటం కూడా విమర్శకుడికి చాలా అవసరం. ఈమధ్య కాలంలో స్త్రీవాద, దళిత, మైనారిటీ, ప్రాంతీయవాదాల చుట్టూ సాహిత్య ఉత్పత్తి, విమర్శ ఉత్పత్తి విరివిగా జరుగుతుంది. కాలం గడిచేకొద్దీ చెప్పిన వాటి గురించే చెప్పిందే ఎవరూ చెప్పలేదన్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్పటం వింటున్నాం. పాత విషయాలనే కొత్తగా తవ్వి తీస్తున్నారు విమర్శకులు. అయితే వాదాలెప్పుడూ అసమగ్రాలే అని తెలుసుకోవాలి. అవి జీవిత వాస్తవికతని పాక్షికంగా మాత్రమే ఆవిష్కరిస్తాయి. అది వాటి పరిమితి. వాటికి భిన్నంగా, అతీతంగా పరిశీలించాల్సిన సామాజిక, వైయక్తిక ప్రదేశాలెన్నో ఉన్నాయి.

సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. పొరలు పొరలుగా, గజిబిజిగా, గందరగోళంగా, సంక్లిష్టంగా ఉన్న మానవజీవితాన్ని సాహిత్యం వడకట్టి, దాని సారాంశం తేటతెల్లం చేస్తుంది. అటువంటి సాహిత్యాన్ని పరిశీలించి, శోధించి, తాలు తప్ప వేరు చేసి, విలువ కట్టి, అందులో ఉత్తమమైనదేదో వెలికితీస్తుంది విమర్శ. ఈ కారణంగా సృజన కన్న విమర్శ మరీ కష్టం. ఒక సృజన చెయ్యటానికి ఏ కళాసూత్రాలు తెలియనక్కర్లేదు. కాని ఆ సృజనని విలువ కట్టటానికి కళాసూత్రాలు మొదలు రకరకాల వాదాల, సిద్ధాంతాల పరిజ్ఞానం అవసరం. కనుక సృజనకారుడి పని సులువు. విమర్శకుడి పని కష్టం. నా మట్టుకు నాకు కథ, కవిత్వం కష్టం గాని ఇష్టం. విమర్శ కష్టమైన ఇష్టం.

తెలుగులో కవులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. (ఇప్పుడు కవి కుటుంబ నియంత్రణ దేశానికి చాలా అవసరమని అంటుంటాను!) ఏది అకవిత్వమో, సుకవిత్వమో చెప్పగలిగేవారు కావాలి. మృదువుగాను స్పష్టంగాను ప్రతిపాదనలు చెయ్యగలగాలి. అట్లా చెయ్యగలిగిన గొప్ప విమర్శకులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. విమర్శ నిజాయితీగా, నిర్మలంగా సాగినప్పుడే సాహిత్యానికి కళాకాంతీ.