భగవత్సంకల్పం

[అమెరికాకు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, మహోపన్యాసకుడు అయిన రాబర్ట్ ఇన్గర్‌సాల్ (Robert G Ingersoll, 1833-99) స్వేచ్ఛాలోచనకు స్వర్ణయుగం అని పిలవబడిన 19వ శతాబ్ది మధ్యకాలంలో మతాన్ని, మతాచారాలను ప్రశ్నిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, ఎన్నో ప్రసంగాలిచ్చాడు. అజ్ఞేయవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ‘ది గ్రేట్ అగ్నాస్టిక్’గా పేరు పొందాడు. ఈతని వ్యాసాలు, ఆలోచనలు ఇప్పటికీ పాతపడలేదు సరికదా ఇప్పటి సమాజానికి మరింతగా వర్తిస్తాయి. నౌడూరి మూర్తి తెలుగులోకి అనువదించిన కొన్ని ఇన్గర్‌సాల్ వ్యాసాలు ఈమాటలో ప్రచురిస్తున్నాం. – సం.]


మానవాళి ప్రవర్తన పట్ల భగవంతుడి సంకల్పం ఒక స్ఫూర్తి లాగా మనలోనే ఉండి మనలను నడిపిస్తుందని అందరూ చెప్తారు. కానీ ఆ సంకల్పం ఏమిటో ఆ స్ఫూర్తి అంటే ఏమిటో ఎవరికీ తెలీదు; దానికెన్ని ఇతర అర్థాలున్నప్పటికి, భగవంతుని ఆదేశం కాబట్టి అది సత్యం అని మాత్రం నిర్థారించుకోగలం. కాని, సత్యానికి ఆదేశం కాని స్ఫూర్తి కాని అవసరం లేవు. సత్యం తనకు తానుగా నిలబడగలదు. సత్యం తనను తాను ఋజువు చేసుకోగలదు.

ఈ సంకల్పస్ఫూర్తి ఏమిటో ఎవరికీ తెలియదు కాబట్టే బైబుల్ తక్కిన పుస్తకాలకంటే భిన్నమైనదని చెప్పవలసిన అగత్యం చర్చికి ఏర్పడింది; భగవంతుని నిజసంకల్పం అందులో ఉందనీ చెప్పవలసి వచ్చింది. ఒకసారి నిజంగా ఈ సంకల్పస్ఫూర్తి అంటే ఏమిటో పరిశీలిద్దాం. ఒక వ్యక్తి సముద్రంకేసి చూస్తాడు. సముద్రం అతనికి ఏదో చెబుతుంది. అతని మనసుమీద ముద్ర వేస్తుంది. అతని జ్ఞాపకాలను తట్టిరేపుతుంది. అతని మనసుపై పడిన ముద్ర అతని పురానుభవాలను బట్టి, అతని మేధోవివేచన బట్టీ ఉంటుంది. మరొకవ్యక్తి ఇదే సముద్రాన్ని చూస్తాడు. అతని అనుభవం వేరు; అతని బుద్ధి వేరు. ఒక వ్యక్తి సముద్రాన్ని చూసినప్పుడు అతనికి సముద్రం ఆనందాన్నిస్తుంది; వేరొకరికి అదే సముద్రం దుఃఖాన్ని ఇవ్వచ్చు. సముద్రం ఏ ఇద్దరు మనుషులకీ ఒకే అనుభవాన్ని ఇవ్వదు, ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల అనుభవమూ ఒక్కలా ఉండదు గనుక.

వేరొక వ్యక్తి, సముద్రపుటొడ్డున నిలబడి, గ్రీకు విషాదాంత నాటకకర్త ఏషిలస్ చెప్పినట్టు, ‘అలలు అలలుగా నవ్వుతున్న సముద్రాన్ని’ చూస్తూ రకరకాలుగా భావించవచ్చు. సముద్రంలోని ప్రతి నీటి బిందువూ భూమిమీదనున్న సమస్త తీరాలనూ తాకిందని; ప్రతి బిందువూ విస్తారమైన ధృవసీమలో మంచుస్ఫటికమైందని; ప్రతి బిందువూ హిమమై కురిసిందనీ లేదూ హిమపర్వతసానువుల చుట్టూ సుడిగాలిలో రేగిందని; ప్రతి బిందువూ సూర్యకిరణాల స్పర్శతో ఆవిరిగా మారిందని; సప్తవర్ణ కాంతివసనాన్ని కప్పుకుందని; ప్రతి బిందువూ మనోహరమైన తుంపరలుగా జాలువారిందని; ఏటి ఒడ్డున తనివి తీరుతున్న ప్రేమికులతోపాటుగా నవ్వుతూ సెలయేటి తుంపరలుగా తుళ్ళిపడిందని; ఇంకా, ప్రతి బిందువూ మహానదులతోపాటూ ప్రవహించి, ప్రవహించి తిరిగి సాగరుని కౌగిట కరిగిందనీ; ఇలా ఎన్నో, ఇంకెన్నో రకాలుగా తన అనుభవాలను చెప్పవచ్చు. ప్రకృతిలోని ప్రతి వస్తువూ, చూడగలిగిన ప్రతి కంటికీ, వినగలిగిన ప్రతి చెవికీ ఒక్కొక్క కథ చెబుతుంది.

నా జీవితంలో ఒకసారి, ఒకేసారి, హొరేస్ గ్రీలీ ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. ఆ ఉపన్యాసపు శీర్షిక, ‘అమెరికా: తీరం నుంచి తీరానికి’ అనుకుంటాను. ఉపన్యాసంలో అతను చివరకు కాలిఫోర్నియాలోని మామ్మత్ చెట్ల అడవులకు చేరుకున్నాడు. ‘ఈ చెట్ల జీవనప్రమాణం వెయ్యి ప్రభుత్వాల మనుగడని దాటేసింది. కొన్ని వృక్షశాఖలు పిరమిడ్లకన్నా పాతవి. మనిషి అనాగరిక దశనుండి నాగరికుడుగా మారుతున్న కాలంలో ఈ చెట్లు ఎదిగాయి. చరిత్రకన్నా పురాతనమైన ఈ చెట్టు ఒక్కొక్కటీ ఒక జ్ఞాపిక, ఒక సాక్షి, భవిష్యత్ సూచిక. ఆర్గోనాట్‌ల తెరచాపలనూపిన అదే గాలి ఈ చెట్లనూ ఊపింది.’ నేను మనసులో, ఆ పెద్దమనిషికి తన ఊహలకిలా రెక్కలిచ్చే అవకాశం వచ్చిందనుకున్నాను. అయితే, ఆ చెట్లు గ్రీన్లీకి ఇలాంటివేం స్ఫురింపజేయలేదు. అసలా విషయాలమీద అవి అతనితో ఏమీ మాట్లాడలేదు. తన పెన్సిలు తీసుకుని, కాసేపు దానితో పటాన్ని చూపిస్తూ, ‘ఇందులో ఒక చెట్టు ఎంత పెద్దదంటే, అంగుళం మందంలో దాన్ని ముక్కలుముక్కలుగా కోస్తే, దానినుండి మూడు లక్షల చదరపుటడుగుల కలప లభిస్తుంది.’ అన్నాడతను.

ఒకసారి నేను ఇలినాయ్ రాష్ట్రంలో రైలులో ప్రయాణం చేస్తున్నాను. ఉరుములూ మెరుపులతో ఒక భీభత్సమైన తుఫాను ఎదురైంది. ఎప్పట్లాగే ఆ మధ్యాహ్నపు జడివాన కాసేపటికి వెలిసింది. సాయంత్రమైంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆకాశంలో దట్టంగా ఉన్న నల్లటి మేఘాలన్నీ పడమటి దిక్కుకు కదిలిపోయి వింత వింత ఆకారాలలో కనిపించసాగాయి. గుడులూ, గోపురాలూ, గుమ్మటాలూ కలశాలతో గొప్ప దేవతాభవనాలలా అనిపించాయి. సూర్యాస్తమయ వేళ అవి వాలుకిరణాల వెండి జలతారు రంగులతో, గరుడపచ్చ వన్నెలతో, బంగారు మలాము పూసినట్లుండి, గ్రీకు దేవతల ఆరామాలలా కనిపించేయి. నా ప్రక్కనే ఒక వ్యక్తి కూచున్నాడు. “ఎంత అందంగా ఉందో కదా?” అని ఉత్సాహంగా అడిగేను. అతను ఆ మేఘాలనుగాని, సూర్యుడినిగాని, ఆకాశాన్నిగాని ఏమాత్రమూ పట్టించుకోలేదు. కిటికీలోంచి వెనుకకు పరుగెడుతున్న నేలను మాత్రమే చూస్తున్నాడు. సమాధానంగా, “అవును. ఎంత బాగుందో! మైదానభూములు నాకెప్పుడూ ఇష్టమే.” అన్నాడు.

మరొక సందర్భంలో, నేను ఒక గుఱ్ఱపుబగ్గీలో ప్రయాణం చేస్తున్నాను. అప్పటికే మంచు దట్టంగా కురిసింది. తర్వాత సన్నని తుంపరగా మారింది. మంచు బరువుకు చెట్లూ కొమ్మలూ వంగి వాలి ఉన్నాయి. ప్రతి కంచె, కలప ఇళ్ళు, రూపురేఖలు మార్చుకుని అలౌకిక సౌందర్యాన్ని అద్దుకున్నట్టున్నాయి. కనుచూపుమేర పొలాలన్నిటా స్వచ్ఛమైన తెల్లదనం పరుచుకుంది. ఇక అడవులైతే, నేలలోకి చొచ్చుకుపోతున్నట్టు వంగిపోయి అద్భుతమైన గుహల్లా కనిపిస్తూ, అందులోంచి హిమదేవతల సమూహం ఇక ఏ క్షణంలోనైనా బయటపడవచ్చునన్న ఊహ రేకెత్తిస్తున్నాయి. ప్రపంచమంతా ఆపాదమస్తకం హిమస్ఫటికాలతో అలంకరించబడిన నవవధువులా కనిపించింది. వెనుక సీటులో కూచుని మా మాటలు వింటున్న ఒక జర్మను, “యా… ఇదంతా శుభ్రమైన టేబుల్ క్లాత్‌లా కనిపిస్తోంది!” అన్నాడు.

కాబట్టి, మనమొక పువ్వునో చిత్తరువునో శిల్పాన్నో నక్షత్రాల్లో రంగునో చూసినప్పుడు, వాటి గురించి మనం తెలుసుకునే కొద్దీ, వాటిని అనుభవించే కొద్దీ, వాటి గురించి ఆలోచించే కొద్దీ, జ్ఞాపకం చేసుకునే కొద్దీ – ఆ శిల్పం, ఆ నక్షత్రం, ఆ చిత్తరువు, ఆ ఊదారంగు మరింతగా మనకేవో చెప్తూనే ఉంటాయి. ప్రకృతి నేను అర్థం చేసుకోగలిగిన ప్రతి విషయం గురించీ చెబుతుంది, నేను స్వీకరించగలిగినదంతా ప్రసాదిస్తుంది.

పువ్వు, నక్షత్రము, సముద్రమూ ఎలాగో, పుస్తకమైనా అలాగే. ఒక మనిషి షేక్స్‌పియర్‌ని చదువుతాడు. షేక్స్‌పియర్ నుండి ఏం పొందుతాడు? అతని మనసు ఎంత అర్థం చేసుకోగలిగితే అంత. అతను తీసుకెళ్ళిన కప్పు నిండినంత. నాటకం గురించి, ఆవేశాలు ధరించగలిగిన మారువేషాల గురించీ ఏమీ తెలియని మరోవ్యక్తి చదివితే, అతనికేమి దొరుకుతుంది? బహుశా శూన్యం. ఏమీ దొరకకపోవచ్చు. షేక్స్‌పియర్‌ ఒక్కొక్క పాఠకుడికీ ఒక్కొక్క కథ చెబుతాడు. అతను సృష్టించిన ప్రపంచంలో ప్రతిపాఠకుడూ తనకు పరిచయమున్న వ్యక్తుల్ని గుర్తిస్తాడు. కొన్నిసార్లు కొందరే పరిచయస్తుల్లా అనిపించవచ్చు, కొన్నిసార్లు అందరూ తెలిసినవాళ్ళే కావచ్చు.

మన మనసుమీద ప్రకృతి వేసే ముద్రలు, సముద్రాలూ చుక్కలూ పువ్వులూ చెప్పే కథలు, అవన్నీ మనం సహజంగా ఆలోచించే విషయాలు. పూర్వీకులనుండి మనకు సంప్రదాయంగా, వారసత్వంగా సంక్రమించిన భయాలూ ప్రవృత్తులూ ధోరణులూ క్షణకాలం ప్రక్కనబెట్టండి. మనసులో సహజంగా కదిలే ఆలోచనలను చూడండి. అవన్నీ ఈ బాహ్యప్రపంచంతో మన పంచేంద్రియాలు సన్నిహితంగా వచ్చి, మనసు మీద వేసిన ముద్రల పర్యవసానాలే. మన మెదడుకూడా ప్రకృతిలో ఒక భాగం. దానికి అందించే ఆహారం ప్రకృతిలో ఒక భాగం. పర్యవసానంగా వచ్చే ఆలోచనలూ ప్రకృతిలో భాగమే. అలౌకికమని పిలిచేది ఏదైనా ప్రకృతిసిద్ధమైన వాటితో నిర్మించవలసిందే. నిజానికి అలౌకికమైనవాటి గురించి మనకు ఏ అవగాహనా ఉండదు.

‘ఆలోచన’ వికారంగా ఉండవచ్చు; ఒకరి ఆలోచనలు విచిత్రంగా ఉండవచ్చు; వేరొక వ్యక్తి వాటిని అసహజం అని ముద్ర వేయవచ్చు. కానీ అవెప్పుడూ అలౌకికం కాలేవు. ఆలోచనలు బలహీనంగానో పిచ్చిగానో ఉండవచ్చు. అయినా అవి అలౌకికం కావు. మనిషి ప్రకృతికి అతీతంగా ఎదగలేడు. మనుషుల్లో రూపభేదాలున్నట్టే, ఆలోచనలలోనూ భేదాలుండవచ్చు. మతపరమైన అద్భుతాలూ అనాకృతులూ ఉండొచ్చు. కానీ అవన్నీ ప్రకృతిసిద్ధంగా ఉత్పన్నమవుతాయి. కొంతమందికి వాళ్ళు అలౌకికమని పిలుచుకునే వాటి గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు అలౌకికమని పిలిచేవన్నీ కేవలం వక్రించిన ఆలోచనలు. ప్రతి వ్యక్తికీ ఈ ప్రపంచం అతని వ్యక్తిత్వాన్ని బట్టి దృగ్గోచరం అవుతుంది. ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. మనిషే, తన ప్రపంచాన్ని తాను నిర్మించుకోవాలి. మనిషి సృష్టించిన ప్రపంచానికి మనిషి లేకుండా అస్తిత్వం ఉండదు.

మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి. స్ఫూర్తి ఆ పుస్తకంలోనే కాదు, చదివే వ్యక్తిలోకూడా ఉంది. భగవంతుడు రాసిన వాళ్ళకే కాదు, చదివే వాళ్ళకు కూడా ఒకే స్ఫూర్తి ఇచ్చి ఉండాలి.

‘భగవంతుడికి తన పుస్తకం ఒక్కొక్క వ్యక్తీ ఒక్కొక్కలా అర్థం చేసుకుంటాడని తెలుసు; దానిని అలాగే ప్రతివ్యక్తీ అర్థం చేసుకోవాలనే అతను తలచాడు’ అని మీరు సమాధానం చెప్పొచ్చు. అదే నిజమయితే, నాకు ఇంకొకరి సందేశాన్ని సందేశంగా తీసుకోవలసిన అవసరం లేదు. బైబుల్ చదివినపుడు నాకు కలిగిన అవగాహన మేరకు ఏ సందేశం లభిస్తే, ఆ సందేశాన్ని తీసుకుని దానికే నేను కట్టుబడి ఉంటాను. ఉదాహరణకి, ఈ బైబుల్‌ను చాలా నిజాయితీగా, శ్రద్ధగా, పూర్తిగా చదివిన తర్వాత ‘ఇదంతా అబద్ధం’ అనిపించిందనుకుందాం. అదే నిజాయితీగా అనిపించిన అభిప్రాయం అయినప్పుడు, భగవంతుడు నాకు ఏ సందేశాన్నీ ఇవ్వలేదనైనా చెప్పాలి; లేదా, ‘ఇదంతా అబద్ధం’ అన్నదే దేవుడు నాకిచ్చిన సందేశం అనైనా చెప్పాలి. ఆ రెండిటికీ నేను నిబద్ధుణ్ణి. ఆ పుస్తకము, నా మేధస్సూ రెండూ అనంతుడైన ఆ భగవంతుడి సృష్టే అయినప్పుడు, ఆ పుస్తకమూ నా మెదడూ ఒకదానితో ఒకటి విభేదిస్తున్నపుడు, పొరపాటు ఎవరిది? భగవంతుడు నా మెదడుకి తగినట్టు రాసైనా ఉండాలి, లేదా నా మెదడుని తన పుస్తకానికి తగినట్టుగా సృష్టించైనా ఉండాలి.

బైబుల్ వల్ల కలిగే భగవత్సంకల్పస్ఫూర్తి చదివే వ్యక్తి అజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.

(First Published: The Truth Seeker Annual, New York, 1885 )