ఆర్యోదాహరణము
ఉదాహరణములను గుఱించి ఇంతకు మునుపే రెండు వ్యాసములు(1, 2) ప్రచురింపబడినవి. సామాన్యముగా ఉదాహరణములలో ప్రతి విభక్తికి మొదటి పద్యము ఒక వృత్తము, తఱువాత కళికోత్కళికలుగా రగడ భేదములను వ్రాయవలెను. అంతములో ఒక సార్వ విభక్తిక పద్యముండును. కళికోత్కళికలు లేక కూడ ఉదాహరణములను కొందఱు కవులు వ్రాసిరి. మచ్చునకు శ్రీనాథుని హరవిలాసమునుండి ఒక ఉదాహరణము ఇక్కడ చూడ వీలగును. దేవీనవరాత్రుల పండుగ సమయములో అలాటి ఉదాహరణమును ఒకదానిని నేను వ్రాసినాను. దేవికి ఆర్య అని కూడ పేరు, కావున ఈ పద్యములను ఆర్యాభేదములలో వ్రాసినాను. కావున ఇది ఆర్యోదాహరణము!
ఆర్యా లేక గాథా: ఇది సంస్కృత ప్రాకృతములలో ఒక ద్విపద.
మొదటి పాదము: 7 చతుర్మాత్రలు, ఒక గురువు; మొత్తము 30 మాత్రలు;
రెండవ పాదము: 5 చతుర్మాత్రలు, ఒక లఘువు, ఒక చతుర్మాత్ర, ఒక గురువు; మొత్తము 27 మాత్రలు; ద్విపదయైన ఆర్యా లేక గాథా పద్యములో మొత్తము 57 మాత్రలు.
చతుర్మాత్రలు: IIII, UII, IUI, IIU, UU; రెండు పాదములలో ఆఱవ చతుర్మాత్ర నల లేక జ గణము. ఆఱవ గణము నలమైనప్పుడు మొదటి లఘువు వద్ద పాదము అంతము కావాలి. ఏడవ గణము నలమైనప్పుడు, ఆఱవ గణములో పదము అంతము కావాలి. రెండు పాదములలో బేసి గణములు జగణేతరములు.
విపులా: ఒకే పదము మూడవ, నాలుగవ గణములో నుండాలి. ఆది విపులలో ఇది మొదటి పాదమునకు, అంత్య విపులలో ఇది రెండవ పాదమునకు వర్తిస్తుంది.
చపలా: మొదటి రెండు జగణములకు రెండు వైపులా గురువు ఉండాలి. కావున మూడవ మాత్రాగణము ఎప్పుడు గగమే. ముఖచపలలో ఇది ద్విపద మొదటి పాదమునకు, జఘనచపలలో ఇది రెండవ పాదమునకు వర్తిస్తుంది.
గీతి: ద్విపద రెండు పాదములు ఆర్యలోని మొదటి పాదమువలె నుంటాయి; ప్రతి పాదములో 30 మాత్రలు, పద్యములో మొత్తము 60 మాత్రలు.
ఉపగీతి: ద్విపద రెండు పాదములు ఆర్యలోని రెండవ పాదమువలె నుంటాయి; ప్రతి పాదములో 27 మాత్రలు, పద్యములో మొత్తము 54 మాత్రలు.
ఉద్గీతి: ఆర్యా పాదములు ఇందులో తారుమారు అవుతాయి; ఉద్గీతిలోని మొదటి పాదము ఆర్యలోని రెండవ పాదము, రెండవ పాదము ఆర్యలోని మొదటి పాదము.
ఆర్యాగీతి లేక స్కంధకము: ప్రతి పాదములో ఎనిమిది చతుర్మాత్రలు, మొత్తము పద్యములో 64 మాత్రలు; చివరి గణము సగణము లేక గగము. కన్నడ తెలుగు భాషలలో ఆర్యను ద్వితీయాక్షర ప్రాసతో చతుష్పదిగా వ్రాయుట వాడుక; ద్విపద పాదము మూడు, ఐదు మాత్రాగణములుగా విఱుగుతాయి ఇలా వ్రాసినప్పుడు. తెలుగు కందములో సరి పాదములలో మొదటి, ఐదవ గణములకు అక్షరసామ్య యతి చెల్లుతుంది.
మహావిపులా: ఇది తెలుగు కందమునకు మాత్రమే పరిమితము. ఇందులో పదము రెండవ పాదమునుండి మూడవ పాదమునకు చొచ్చుకొని వెళ్ళును. ఇది నేను వర్గీకరించిన క్రొత్త కంద భేదము.
స్కంధక షట్పది: ఇది నా కల్పన; షట్పదిలోని మూడవ, ఆఱవ పాదములు కందములోని నిడుద పాదములు; మిగిలినవి కుఱుచ పాదములు. 1,2,4,5పాదములలో 12 మాత్రలు, 3,6 పాదములో 12 + 6 + 2 = 20 మాత్రలు. మొత్తము షట్పదిలో 88 మాత్రలు.
కళికోత్కళికలు లేని ఆర్యోదాహరణము
అమ్మవు, కోర్కెల సురవృ-
క్షమ్మవు, చెలువంపు జగతి – కమ్మవుగా
బొమ్మవు, కరుణామృతపు ర-
సమ్మవు, హృదయ జల-జమ్మవుగా
(ఆర్యా – ప్రథమా విభక్తి)
మందిరమునగల తల్లిన్
సుందర భువనమ్ము గాచు – సురవల్లిన్
మందారపుష్పవల్లిన్
వందింతుఁ జెలువఁపుఁ – బాల్వెల్లిన్
(పథ్యార్యా – ద్వితీయా విభక్తి)
భువనపు సృజనయు నీచే-
త, వృద్ధి నీచేత నెపుడు – తథ్యమ్మై
చివరకు నంతము నీచే-
త, వర్ణనము నాకుఁ – దగదమ్మా
(విపులార్యా – తృతీయా విభక్తి)
ముదములు బ్రతుకున నీచే-
త, దుఃఖము గలుగును మాకు – ధర నీచే
నిదియే నీచే సృష్టియొ
హృదయముతో నాట – లేల తల్లీ
(ఆది విపులా – తృతీయా విభక్తి)
వెలుఁగులు నీచేఁ గలుగును
మలుపులలో దివ్వె చూపు – మతి నీచే
తలఁపులు గలుగును నీచే-
త, లయ గతి భవమున – దరి నీచే
(అంత్య విపులా – తృతీయా విభక్తి)
భువనమ్ము పుట్టు నీకై
దివాకరుండు శశి నడచు – దివి నీకై
ధ్రువతార వెల్గు నీకై
నవమ్ముగాను సృజ-నము నీకై
(చపలార్యా – చతుర్థీ విభక్తి)
రచియింతు గీతి నీకై
వచింతు డెందమున నిష్ట-పది నీకై
సుచరిత సర్వము నీకై
ప్రచలిత గీతికల – రహి నీకై
(ముఖచపలా – చతుర్థీ విభక్తి)
జయమంగళ రా నాకై
దయతోఁ దరి నొసఁగు జలధి – దాఁటుటకై
భయమయ్యె నాకు నీకై
రయాన నీయ నిట – రా నాకై
(జఘనచపలా – చతుర్థీ విభక్తి; నీకై = నీచేయి, విభక్త్యాభాసము)
నీవలనఁగదా సృష్టియు
నీవలననె స్థితియు లయయు – నీవలనన్
నీవలన నన్నియు నిజము
నీవే లేకున్న సున్న – నీవలనన్
(గీతి, పథ్యాగీతి – పంచమీ విభక్తి)
ఇల నాపాపమ్ములవల-
న లెస్స నుండంగనౌనె – నను గావన్
గల సామర్థ్యము నీవల-
న లాలనము సేయుమమ్మ – నగునగుచున్
(విపులాగీతి – పంచమీ విభక్తి)
వరవీణ మ్రోఁగుచుండన్
స్వరమ్ము నీవలన జగతి – వ్యాపించున్
కరుణామృతాబ్ధి పొంగన్
నిరంతరమ్ము సుఖమబ్బు – నీవలనన్
(చపలాగీతి – పంచమీ విభక్తి)
జంబూద్వీపనివాసికి
నంబుజలోచనికి – నలరుల నే
నంబకు, జగదంబకు నతి
సంబరమునఁ బూజ – సలిపెదన్
(ఉపగీతి, పథ్యోపగీతి – షష్ఠీ విభక్తి)
రకరకమగు పూవుల మా-
తకు, మంజులరవకుఁ, – దనరెడు నా
శుకవాణికి, నంతర్యా-
మికి నర్చన సేతు – మేలొసఁగన్
(విపులోపగీతి – షష్ఠీ విభక్తి)
సుగుణాంబురాశికిన్, ది-
వ్యగానలోలకును – భగవతికిన్
జగదాధినేత్రికిన్, గం-
బుగాత్రికిన్, జోత – మోదమిడన్
(చపలోపగీతి – షష్ఠీ విభక్తి, ఇది విపుల కూడ)
నీయందే నాధ్యానము
నీయందే నాదు – నిఖిలముగా
నీయందే నాపుట్టుక
నీయందే లీనమౌదు – నిక్కమ్మై
(ఉద్గీతి, పథ్యోద్గీతి – సప్తమీ విభక్తి)
అండము నీయందే, బ్ర-
హ్మాండము నీయందు – మాకు సదా
యండయు నీయందే, కూ-
ష్మాండము, చిఱుచీమలందు – మసలెదవే
(విపులోద్గీతి – సప్తమీ విభక్తి)
యుగమందు నీవెగాదా
జగానఁ నీవెగద – క్షణమందున్
సుగమందు నీవెగాదా
జగాన దుఃఖమున నుండు – జల నీవే
(చపలోద్గీతి – సప్తమీ విభక్తి)
రావా యోభువనేశ్వరి
కావఁగ మమ్మీ ప్రపంచ-కమ్మున నెపుడున్
దేవీ నీవే గాదా
మావేలుపు బ్రతుకు నింపు – మంగళకరమై
(ఆర్యాగీతి, కందము, పథ్యాకందము – సంబోధనా ప్రథమా విభక్తి)
జయ మోజననీ మాకను-
నయమిమ్ము భయమ్ము తొలఁగ – నవరాగమతీ
జయ మోజగదీశ్వరి ప్ర-
శ్రయముల నీవందుకొనుము – శరదిందుమతీ
(విపులా కందము – సంబోధనా ప్రథమా విభక్తి)
జయ మోసనాతనాత్మా
దయాంతరంగమ్ము చూపి – ధైర్యము నిడుమా
జయ మోశుభప్రదాయీ
లయప్రభావితము సేయ – రమ్మో తల్లీ
(చపలా కందము – సంబోధనా ప్రథమా విభక్తి)
ఓసర్వమంగళా జయ
మోసత్యజ్ఞానకలిత – యురుతర గురుధ-
ర్మాసక్తా యోమాతా
భాసిత హసితాంగి యుక్త – వరముల నిమ్మా
(మహావిపులా కందము – సంబోధనా ప్రథమా విభక్తి)
మాతవు, నిను గొలుతును, నీ
చేతన్ క్షేమమ్ము గలుగు, – చిందుము మాకై,
నీచిరునగవు వలన సిరి,
యాచకునకుఁ, దల్లియందు – నాశలు, దేవీ
(కందము – సార్వ విభక్తికము)
మనమున దినమున మఱువక
నిను నమ్మిన వారలకును
విను మెప్పుడు తప్పకుండ – విజయము కలుగున్
తనువిది నీసేవలకే
మనసిది నీభావనకే
ప్రణుతింతును మోహనుండఁ – బ్రవిమలతేజా
(స్కంధక షట్పదిలో విజయదశమిలో అంకితాంకితము)