చందవరం, ప్రకాశం జిల్లా

ఊగుతాడు సూర్యుడు
గుండ్ల కమ్మ మీద
తేలుతాడు చంద్రుడు
కాళ్ళు జాపుకు ఆవులిస్తూ
మెటికలు విరుస్తుంది కాలం.

పొద్దుటి పూట
పొగలు కక్కే చౌకరకం తేనీరు
ఆరారగా తాగుతుంది ఊరు
వీధిలో ఉరికి ఉరికి పోతుంది
ఆడ కూలీల గుంపు
పురుగును పొడుస్తుంది
బిత్తర చూపుల కోడిపుంజు.

ఎండ పొద్దెక్కాక
వీపున పిచికారీ గొట్టాలతో
వడివడిగా అంగలు వేస్తాడు రైతు
బొడ్రాయి దగ్గరకు చేరుతుంది
పోచికోలు కుర్రకారు
అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.

సాయంకాలం పూట
నాసిరకం పుణుగులు పొంగణాలకి
గలగల్లాడతాయి రూపాయలు
పేడ కళ్ళెత్తుకుంటూ
చెతుర్లాడుతుంది ఓబులమ్మ
శివాలయం మీద ఇంకొంచెం పొడుగు పెరిగి
ఎచ్చులు పోతుంది రావి మొక్క.

రాత్రిపూట
బజనలు చేయుట మా బారం
మా బాదలు తీర్చుట మీ బారం
రాం రాం రామ్మంటుంది గుళ్ళో మైకు
నులక మంచాల మీద
దుప్పట్లు పరుస్తుంది వెన్నెల
గోడ పగుల్లోంచి తొంగి చూస్తుంది తేలు.

ఇక్కడ ఏ పొద్దూ ఇలాగే
ఊగుతాడు సూర్యుడు
గుండ్ల కమ్మ మీద
తేలుతాడు చంద్రుడు
కాళ్ళు జాపుకు ఆవులిస్తూ
మెటికలు విరుస్తుంది కాలం.