దొంగ

ఆకుపచ్చ మీద కాషాయరంగు పూలున్న చీర.

వీధి చివర ఉన్న ఆఫ్రికన్ టులిప్ పూలలా లేవు ఆ చీర మీద పూలు. నల్లని మా ఇనప గేటు బయట నిలబడి వచ్చీ రాని మలయాళంలో మాట్లాడుతోంది నారాయణి.

“ఇల్లు చిమ్మి తడిగుడ్డ వెయ్యడానికి ఎంత తీసుకుంటావు?” రంగేసిన తన జుట్టు ఆరడానికి వేళ్ళతో పాయలుగా విడదీస్తూ అడిగింది నానమ్మ. మళ్ళీ తనే చెప్పింది, “అందరూ నూట పాతిక రూపాయలిస్తున్నారు. మా ఇంట్లో ఐదు బెడ్‌రూములున్నాయి కాబట్టి నేను నూట యాభై ఇస్తా.”

డబ్బుల సంగతి పట్టించుకోలేదు నారాయణి. “నేను క్లీనింగ్ పన్లు చెయ్యను. వంట చేసి, బట్టలు ఉతుకుతాను.”

నానమ్మ సాలోచనగా నావైపు చూసింది.

తోటలో దేవగన్నేరు చెట్టు కింద తాతయ్య వేయించిన పాలరాతి దిమ్మ మీద నానమ్మకి ఎడమవైపుగా కూచున్నా. ఇది దేవగన్నేరు పూల ఋతువు కాదు కాబోలు మోడైన కొమ్మలు గాల్లోకి నిలబడి, చెట్టుని తిరగేసి పాతారా అన్నట్టుంది చూడ్డానికి.

నానమ్మ చూపులో భావం నాకెక్కలేదు. అందుకే అదే చూపుని మళ్ళీ తన వైపు విసిరేశాను. పెదాలు బిగించి, కళ్ళు పెద్దవి చేసి, కనుబొమలు పైకెత్తాను.

‘క్లీనింగ్ పన్లు చెయ్యవా!’ అని నిజానికి నానమ్మ నారాయణిని అడగాల్సిన పని లేదు. కానీ అడిగింది. చాలామంది పనిమనుషులు ఇతరుల ఇళ్ళలో మురికిని శుభ్రం చేయడానికి ఇష్టపడరు. బాత్‌రూములు కడగడం లాంటివి అసలే చెయ్యరు. తక్కువ కులాల వాళ్ళని పెట్టుకుంటారు కొంతమంది ఆ పనులకు.

“చెయ్యను” అంది నారాయణి తల అడ్డంగా ఊపుతూ, చిరునవ్వుతో. కాబోయే యజమాని నొచ్చుకుంటుందేమో అన్న భావన ఏ కోశానా లేదు. నానమ్మ ఆమె జవాబుని పెద్దగా పట్టించుకోలేదు.

“ఏం వంటలు వండుతావు?”

“కేరళ, పంజాబీ వంటలు.”

“మాకు పంజాబీ వంటలు ఇష్టం లేదు.”

“చైనీస్ కూడా చేస్తాను. మంచూరియా, నూడుల్స్, స్ప్రింగ్ రోల్స్…”

“వండాక కనీసం గిన్నెలైనా తోముతావా?”

ఒక గంటసేపు సాగిన చర్చలు, బేరసారాల తర్వాత నారాయణిని పనిలోకి తీసుకున్నది నానమ్మ. మధ్యాహ్నం, రాత్రి వంట చేయడం, కిరాణా సరుకులు తేవడం, గిన్నెలు తోమటం, ఎవరైనా తలుపు కొడితే వెళ్ళి చూడటం, ఫోన్లు వస్తే తీయడం, ఆదివారం అదనంగా ఉండే పన్లు ఇవన్నీ నారాయణి డ్యూటీలు. ఇంట్లో వాళ్ళకి, ఇంటికొచ్చే అతిథులకీ ఎవరెవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా చక్కెర, పాలు, మసాలా దినుసులతో టీ పెట్టడం కూడా నారాయణి పనే.

రోజూ మా ఇంటికి ఎంతమంది వస్తారో లెక్క చెప్పడం కష్టం. పాలవాడు, కొబ్బరి కాయలు, కూరలు తెచ్చేవాళ్ళు, తోటమాలి, డ్రైవర్, చుట్టాలు, స్నేహితులు. వీళ్ళు కాక, తాతయ్య కాలమ్ చదివి ‘ఈ దారంట వెళ్తూ వూరికే పలకరిద్దామని వచ్చా’ అంటూ ఆగే ఒకరిద్దరు పాఠకులు.

వారానికోసారి వచ్చేవాళ్ళు మరి కొద్దిమంది ఉంటారు. నానమ్మ ఆస్తి వ్యవహారాలు చూసే బ్రోకర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్.

నెలకోసారి వచ్చేవాళ్ళు కూడా. కశ్మీరీ కార్పెట్లు, బట్టలు అమ్మేవాళ్ళు. తెల్లటి వాళ్ళ మొహాలు, ఎర్రటి పెదాలు గమ్మత్తుగా ఉండేవి. కేబుల్ సర్వీస్‌వాడు, చెత్త క్లీనింగ్ సర్వీస్ మేనేజర్ కూడా నెలవారీ వచ్చేవాళ్ళే.

ఇంకా కొంతమందిని మర్చిపోయానేమో నేను. పనిమనుషుల బంధువులు, స్నేహితులు, పార్కులు, టెన్నిస్ కోర్టుల కోసం చందాలు అడిగేవాళ్ళు, పొడుగు చేతుల బ్లౌజులు, రబ్బరు చెప్పులూ వేసుకుని వాషింగ్ పౌడర్లు, వంటల పుస్తకాలూ అమ్మడానికి వచ్చే ఆడవాళ్ళు…


నారాయణి ఇల్లు సిటీకి ఇరవై మైళ్ళ దూరంలో ఒక చిన్న గది. పొద్దునే లేచి ఇంటి పన్లన్నీ చేసి వంట చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న కూతుళ్ళకి స్టీలు బాక్స్‌లో భోజనం సర్ది ఇచ్చేది. ప్రతి రోజూ అన్నం, సాంబారే. ఎప్పుడైనా అరుదుగా మరో కూర వండేది. “క్లాసులో కబుర్లు చెప్పకుండా, టీచరమ్మ చెప్పేది వినండి” అని చెప్పేది ఎర్రటి నైలాన్ రిబ్బన్లతో జడలు బిగించి కడుతూ.

భర్త ఇంట్లో ఉంటే, ఒంటి గంటకు ముందు నిద్రే లేవడు.

7:25కి వచ్చే బస్సులో గంటసేపు ప్రయాణం చేసి సిటీ చేరేది. బస్సు దిగుతూనే పక్క వీధిలో ఉండే ఉత్తరాది ముసలావిడ ఇంటికి వెళ్ళేది. మా పాత పనిమనిషి బిరామా మానేసినపుడు ఆ ముసలావిడే నారాయణిని మా ఇంటికి పంపింది.

ఇనప్పెట్టె లాంటి రెండంతస్తుల ఇంట్లో ఉంటుందామె. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నపుడో, లేక వాళ్ళకు పుట్టిన పిల్లల్ని చూపించడానికో ఎప్పుడైనా వస్తుంటారు. నారాయణి కాక ఇంకా ముగ్గురు పని మనుషులు వేరే వేరే టైముల్లో వస్తారామె ఇంటికి. ఆవిడ నానమ్మకి ఒక అమోఘమైన మాట చెప్పింది. “ఒకరికి మించి ఎక్కువమందిని పెట్టుకుంటే అందరూ అదుపులో ఉంటారు. వాళ్ళు మానేస్తే మన ప్రపంచం తల్లకిందులై పోతుందనే భ్రమలో ఉంచకూడదు వాళ్ళని.”

ముసలామెకి ముందు టీ చేసి ఇచ్చేది నారాయణి. పాలు పంచదార కలిపి వేడి చేసి, కడిగినా వదలని మురికి అంచున్న కప్పులో పోసి అందులో తాజ్ మహల్ టీ బాగ్ వేసి, సాసర్‌లో పెట్టి ఇచ్చేది. తను మాత్రం మా ఇంట్లో టీ తాగేది. ముసలామె టీ తాగే లోపు బాల్కనీలో ఆరేసిన ఆమె తెల్లచీరలన్నీ ఇస్త్రీ చేసేది. తన లోదుస్తులు కూడా ఇస్త్రీ చేయాలని బలవంతపెట్టేది ముసలామె.

ఆ తర్వాత ముసలామెకు ఒళ్ళు మర్దన చేసేది. ఆ మర్దన చేసే గది చీకటిగా ఉంటుందని ఊహించుకునేదాన్ని నేను. అప్పుడప్పుడు నారాయణి ఆ మసాజ్ గురించి మాట్లాడేది. ఆమె మాట్లాడినపుడల్లా నేను ఆ ముసలామెను మసాజ్ సమయంలో నగ్నంగా ఉంటుందని ఊహించుకునేదాన్ని ఎందుకో. బాదంగింజ లాగ పైన సన్నగా కిందకు వచ్చేసరికి వెడల్పుగా ఉండే శరీరాకృతి ఆమెది. ఆవిడ మెడ మా ఎదురింటి బాక్సర్ కుక్క సుల్తాన్ లాగా బోలెడు ముడతలతో నిండి ఉండేది.

నేనూ నానమ్మ ఆరుబయట బాడ్మింటన్ ఆడేటపుడు ఒకసారి చూశాను. కొబ్బరి బోండాలు కొనడానికి బయటికి వచ్చింది. మోకాళ్ళు దాటిన పొట్టి చేతుల నైట్‌గౌనులో ఉంది. చేతి మణికట్లు కాలిమడమలు సన్నగా ఉన్నాయి. మృదువైన తెల్లని చర్మం మీద వెంట్రుకలు కనిపిస్తున్నాయి. వెళ్ళేటపుడు ఆమెని వెనగ్గా చూశాను. నడుము కిందుగా రెండు మాంసం ముద్దలు అంటించినట్టు ఉంది. లోదుస్తులు వేసుకోలేదనుకుంటా. గౌను తడి గౌనులాగా ఒంటికి అతుక్కుపోయి ఉంది. ఆ ముసలామెకు మసాజ్ చెయ్యడం నారాయణికి అసలు ఇష్టం ఉండేది కాదట. అయినా ఆవిడ బలవంతం చేసేదిట.

ఒక్కోసారి మసాజ్ కార్యక్రమం రెండు మూడు గంటలు పట్టి నారాయణి చేతులకు ఇక స్పర్శ కూడా తెలీకుండా పోయాక గానీ ‘చాలు’ అనేది కాదుట ముసలామె.


పదిన్నరకి ధడేలున పడిన తలుపు శబ్దానికి అవకాడో చెట్టు మీద పిట్టలు భయంతో ఎగిరి పోయాయంటే నారాయణి వచ్చిందని అర్థం.

డోర్‍బెల్ కొట్టొద్దని నానమ్మ చెప్పడంతో నారాయణి వెనక గుమ్మం లోంచి వచ్చేది. తాతయ్య రాసుకునే గది బయటి గుమ్మం పక్కనే ఉంటుంది. ఆయనకు ఏ రకమైన డిస్టర్బెన్సూ ఉండకూడదు. రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌లో ఆయన నలభై ఏళ్ళకు పైగా ప్రభుత్వానికి సేవలందించాడు. ఆ మధ్య రిటైర్ అయినప్పటి నుంచీ ఇంటలిజెన్స్ వైఫల్యాల గురించి జాతీయ వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తున్నాడు.

మధ్యగదిలోకి వచ్చాక నారాయణి అందర్నీ ఏదో ఒక రకంగా పలకరించి తన రాకను ప్రకటించేది.

“అమ్మా, ఇవాళ ఏం వండనూ?”
“పాపా, నీకు నూడుల్స్ చెయ్యనా?”
“అక్కా, టీ తేనా?”

ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు తనకి తెల్సినా, అడుగుతూనే ఉండేది.

మా వంటింట్లోకి తరచూ వచ్చే కూరలు, బీన్సు, కాబేజ్, బెండకాయ, పొట్లకాయానూ. తరచూ వండే కూరలు కూడా నాలుగైదు ఉంటాయేమో. కొబ్బరి, పెరట్లో నానమ్మ పెంచిన చింత చెట్టు తాలూకు చింతపండూ వేసి రొయ్యల కూర, కారెట్లూ ములక్కాడలతో సాంబారు, మజ్జిగ పులుసు, టమాటాలూ వెల్లుల్లీ దండిగా వేసి రసమూ… నూనె లేకుండా పుల్కాలు, నెయ్యేసి కాల్చిన కేరళ పరోటాలు, తెల్లన్నమూ, కేరళ ముడుబియ్యంతో వండిన అన్నమూ ఉండేవి భోజనంలో.

“బ్రౌన్ రైస్‌లో బోల్డన్ని విటమిన్లూ పొటాషియమూ ఉంటాయి” అని రోజూ నానమ్మ ఊదర కొట్టడంతో నాకు దాని మీద ఆసక్తి పోయింది.

సెలవు రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్‌కి నూడుల్స్ తినడం ఇష్టం నాకు. తాతయ్య దాన్ని విషం అనేవాడు. లెక్కల్లో పాస్ అయితే రోజూ నూడుల్స్ తినొచ్చని నాన్న ప్రామిస్ చేశాడు. ఒకవేళ పాస్ కాకపోతే ఇప్పుడున్న మూడు గంటల ట్యూషన్ ప్రతిరోజూ కంటిన్యూ చేయాల్సిందే.

యాలకులు, అల్లం వేసి అమ్మ కోసం బ్లాక్ టీ పెట్టేది నారాయణి. అమ్మని పెద్దక్కా అని పిల్చేది ఆమె. ఆఫీసుకి వెళ్ళేటపుడు అమ్మకి మరో మూడు కప్పుల బ్లాక్ టీ ఫ్లాస్క్‌లో పోసి ఇచ్చేది కూడా. నాన్నయితే నారాయణి రాక ముందే ఆఫీసుకి వెళ్ళిపోయేవాడు. తాతయ్య కొలెస్టెరాల్ లెవల్స్ వల్ల నానమ్మ ఆయన కోసం నూనె, ఉప్పు తగ్గించి వాడమనేది. నేను అప్పుడపుడూ వైట్ బ్రెడ్‌తో మయొనేజ్ సాండ్‌విచ్ చేసుకునేదాన్ని. తను వండినవి నేను తినకపోతే నారాయణికి నచ్చేది కాదు. నానమ్మ వంటింట్లో నుంచి బయటకు వచ్చేదాకా ఎదురు చూసి, తర్వాత లోపలికి వెళ్ళి, వాళ్ళు వద్దన్నవన్నీ వంటలో కలిపేది.

నానమ్మ మాత్రం ఎవరైనా వచ్చినపుడు “మేమసలు నూనె, ఉప్పు వాడనే వాడం. అయినా మా వంటలు ఎంత రుచిగా ఉంటాయో చూడండి” అనేది.

వేయించిన కూరగాయల ముక్కలు ఇష్టం నాకు. అలాగే చేపల వేపుడు, బంగాళాదుంప చిప్సూ. నారాయణి కొబ్బరి తురిమి, కళ్ళు నీళ్ళు కారుతున్నా, ఉల్లిపాయలూ తరిగి ఇచ్చేది.

మొదట్లో నారాయణి మలయాళం, తమిళం కలిపి మాట్లాడేది నాతో. నేను నెమ్మదిగా కొంత ఇంగ్లీషు కలిపాను దానికి. తర్వాత తర్వాత పూర్తిగా ఇంగ్లీషే మాట్లాడ్డం మొదలుపెట్టాను. నారాయణి నా ఇంగ్లీష్ అర్థం చేసుకునేది. కొన్నాళ్ళకు కొంచెం కొంచెం మాట్లాడటం మొదలుపెట్టింది తను కూడా. ఇంట్లో మలయాళమే మాట్లాడాలని నానమ్మ ఎంత చెప్పినా మేమంతా ఇంగ్లీషే మాట్లాడేవాళ్ళం. చివరికి కన్నడం తప్ప రాని తోటమాలితో కూడా.

ఒక గొప్ప భాష, మలయాళం… చచ్చిపోతోందని తాతయ్య బాధపడేవాడు.

మా చుట్టుపక్కల పనిమనుషుల్లో నారాయణి ఒక్కతే ఎవరైనా థాంక్స్ చెప్పినపుడు యు ఆర్ వెల్కమ్ అనేది. అలాగే తుమ్మినపుడు దగ్గర్లో ఎవరూ లేక పోయిన “ఎక్స్‌క్యూజ్ మీ” అనేది కూడా.


వేసవి రాబోతున్న రోజుల్లో రోజూ తాతయ్య నన్ను రేలపూల చెట్లు చూడ్డానికి కార్లో తీసుకు వెళ్ళేవాడు. ఏడాదిలో కొద్ది రోజులే పూసేది ఆ చెట్టు. చెట్టు పట్టుకుని వూపితే జలజలా రాల్తాయా అన్నట్టుండే ఆ పసుప్పచ్చ పూలు భలే నచ్చేవి నాకు. ఈ వసంత ఋతువులోనే నానమ్మ ఇల్లంతా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసేది. రోజూ ఆ కార్పెట్లను ఒక బక్కపలచ పనిమనిషి చీపురుతో ఊడ్చేది. ఈ కార్పెట్లు అన్నిటినీ ఏడాదికోసారి నానమ్మ వాక్యూమ్ క్లీన్ చేసేది.

ఆ రోజు మధ్యాహ్నం నానమ్మ వాక్యూమ్ క్లీనర్ కోసం గరాజ్‌లోకి వెళ్ళింది కానీ అదక్కడ లేదు. పోయింది.

“ఇంకెవరూ? తీసింది నారాయణే అయ్యుండాలి. సెలవుల్లో మనం తందూరీ పెట్టి వండినపుడు దాని కోసం గరాజ్‌లోకి వెళ్ళింది నారాయణి ఒక్కతే” నిర్ధారించింది నానమ్మ.

అసలు అప్పటికే నానమ్మ నారాయణి గురించి ప్రతిదానికీ ఏదో ఒకటి ఫిర్యాదు చెయ్యడం మొదలెట్టింది. వంటలో ఏదైనా తేడా వచ్చినపుడు ‘ఈ నారాయణికి ఏమీ రాదు’ అనేది. వంటను ఎవరైనా మెచ్చుకుంటే ‘మసాలా నేనే వేశాను కూరలో’ అనేది.

నిజానికి నారాయణి ఇంట్లో ఉందంటే నానమ్మకి భరోసా. బెంగళూరులో వారానికోసారి జరిగే లేడీస్ మీటింగ్‌కి వెళ్ళడానికి కుదిరేది. టివి ముందు కూచుని నచ్చిన సినిమాలన్నీ చూసేది. అప్పుడప్పుడు ఎవరైనా డోర్‍బెల్ కొడితే వెళ్ళి చూసేది. లేదా ఫోన్లు తీసేది. అంతకంటే పనేమీ ఉండేది కాదు.

“నారాయణీ, వాక్యూమ్ క్లీనర్ కనపడట్లేదు.”

ఇద్దరూ వంటింట్లో నిమ్మకాయ పులిహోర చేస్తున్నారు. నానమ్మ గొంతులో తెచ్చి పెట్టుకున్న అమాయకత్వాన్ని నారాయణి గ్రహించలేకపోయింది.

“ఎక్కడ పెట్టారమ్మా?”

“గరాజ్‌లో.”

“లేదా అక్కడ?”

“లేదు. కార్పెట్లు శుభ్రం చేయాలి. మారుతి కారు పక్కనే ఉండేది.”

“సరిగా చూశారా అమ్మా?”

“చూశానుగా!?”

“సరే, నేను వెళ్ళి వెదుకుతాలెండమ్మా.”

“ఇప్పుడు కాదు, వంట పూర్తి కానీ ముందు.”

నారాయణి అబద్ధం చెప్తోందని నానమ్మకి అనిపించలేదు. మరెవరు తీసి ఉంటారు? రోజూ వచ్చే మరో పనమ్మాయి ముందు వైపు గుమ్మంలోంచే వచ్చి అటే ఇంటికి వెళ్తుంది రోజూ. ఆమె ఎప్పుడూ గరాజ్‌లోకి వెళ్ళినట్టు చూడలేదు. ఎపుడైనా విడిచిన బట్టల్లో దొరికే నోట్లు తెచ్చి ఇస్తుండేది కూడా.

ఇక తాతయ్య ప్యూను. ఈయన అయితే ఇంట్లో మనిషి కిందే లెక్క. ఇక్కడే అన్నం తిని, తోట పనిలో నానమ్మకి సహాయం చేసేవాడు. ఫిష్ పాండ్‌లో చేపలకు తిండి వేయడం, మట్టి తిరగదోడటం, మొక్కలకు నీళ్ళు పెట్టడం, సోలార్ దీపాలను శుభ్రం చేయడం… ఒకటేమిటి అన్నీ అతనే చేసేవాడు. అతనుగా అతనే ఈ నేరం చేశానని ఒప్పుకున్నా, అందరూ నవ్వి ‘పోరా’ అంటారు తప్ప నమ్మరు.

నిజానికి నానమ్మ నారాయణిని పనిలోంచి తీసేద్దామనుకుంది వాక్యూమ్ క్లీనర్ కనపడకుండా పోయాక. కానీ అమ్మతో చెప్తుంటే విన్నాను “డ్రైవర్లు, పనిమనుషులు దొరకడం చాలా కష్టం. రోజుల తరబడి స్నానం చెయ్యకుండా, షేవ్ చేసుకోకుండా, ఎప్పుడు చూసినా అదే బ్రౌన్ పాంటేసుకు వచ్చే డ్రైవర్ని ఇంకా ఎందుకు ఉంచాననుకున్నావు? ఒకసారి పనివాళ్ళు దొరికాక వాళ్ళను వెళ్ళిపోకుండా ఉంచడం చాలా కష్టం.”

ఇంతకు ముందు పని చేసిన బిరామాని ఎందుకు పంపించాల్సి వచ్చింది మరి? దానికి బోలెడు డిమాండ్స్. ఎర్రటి జెల్ టూత్ పేస్టు, పారాచూట్ కొబ్బరినూనె, టూత్‍బ్రష్షూ, లక్సు సోపూ! ఫెయిర్ అండ్ లవ్లీ దగ్గర నాయనమ్మ గీత గీసి ఆపేసింది.

బిరామాకి పొద్దున ఏడింటిదాకా నిద్రపోవడం ఇష్టం. అదే టైముకి తాతయ్యకి ఇడ్లీ పుట్టు బ్రేక్‌ఫాస్ట్‌గా కావాలి. ఇహ పెద్ద సౌండ్‌తో టీవీ పెట్టుకుని చూస్తూ, వికటాట్టహాసాలు చేస్తూ, సీరియల్లోని పాత్రలతో మాట్లాడుతూ నానా హంగామా చేసేది. ఒకరోజు తలకు నూనె పట్టించుకుని బద్ధకంగా టీవీ చూస్తూ కూచున్న బిరామాతో రొయ్యల కూర చెయ్యమని చెప్పి బయటకు వెళ్ళాం. రెండు గంటల తర్వాత మేము తిరిగొచ్చేసరికి కదలకుండా టీవీ చూస్తూనే ఉంది!

నానమ్మకి మండిపోయింది. “ఇక ఇలా కుదరదు బిరామా, నువ్వు వేరే ఇల్లు చూసుకో.”

“అసలు నేనే మానేద్దామనుకుంటున్నాలేండి, ఎప్పుడు చూసినా ఏదో ఓకటి అరుస్తూనే ఉంటారు” అంది నిర్లక్ష్యంగా బిరామా.

“అన్నంలో మరి కొంచెం పసుపు కలుపు” నారాయణితో అంది నానమ్మ. “ఆ చేపలవేపుడులో నూనె తగ్గించు.” గదిలోంచి బయటకు పోబోతూ మళ్ళీ అంది “మొన్న చేసిన బిర్యానీ ఎవరికీ నచ్చలేదు. చాలా మిరపకాయలు వేశావు దాంట్లో.”

ఆరోజు సాయంత్రం ఎందుకో గానీ తాతయ్య మాతో “అందరూ ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా బీరువాలో పెట్టి తాళం వేసుకోండి. బయట డబ్బులేమీ వదలద్దు ఎక్కడ బడితే అక్కడ” అన్నాడు.

పోయిన్ వాక్యూమ్ క్లీనర్ గురించి అమ్మా నాన్నలతో చెప్తే వాళ్ళసలు పట్టించుకోనేలేదు. తాతయ్యతో చెప్పాననుకోండి “అలాటి పనికిమాలిన విషయాలన్నీ నీకెందుకు? నీ వయసులో నేను “జేమ్స్‌ని చదివి, స్పినోజా గురించి చర్చిస్తూ ఉండేవాడిని తెల్సా?” అంటాడు. వాళ్ళెవరని అడిగే పొరపాటు చెయ్యలేదు నేను.

వాక్యూమ్ క్లీనర్ కనపడకుండా పోయిన నెల తర్వాత ఇల్లు తుడిచే పనమ్మాయి మానేసింది. ఈ లోపు నావి రెండు షర్టులు పోయాయి. బట్టలుతికి ఆరేసి మడతలుపెట్టే పని ఆమెదే కదా అని వాటి గురించి ఆమెనే అడిగాం. ఆమె జవాబేమీ చెప్పక తల అడ్డంగా వూపింది అంతే. ఆ మర్నాడు ఆమె ఒక పెద్ద ప్లాస్టిక్ బుట్టతో వచ్చింది. ఏళ్ళ తరబడి దీపావళికి, వేరే పండగలు పబ్బాలకు మేము ఇచ్చిన బట్టలు, ఇతర వస్తువులన్నీ ఆ బుట్టలో ఉన్నాయి. ఆ తర్వాత వారానికే ఆమె పని మానేసింది. నెల చివరి వరకూ చెయ్యమని బలవంతం చేసినా విన్లేదు.

నారాయణి షర్టులు తీసిందని మేమెవరమూ అనుకోలేదు.

పాత పనిమనిషి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నారాయణికి ఉత్తరాది ముసలామె ఇంట్లో పని పోయింది. ముసలామె పెళ్ళి కాని కొడుకు, పిల్లను వెదుక్కునేందుకు ఇండియా వచ్చాడు. తల్లికి మసాజ్ చేయడం చూసి తనకూ ఒళ్ళు పట్టమని అడిగాడు నారాయణిని. అతని కాళ్ళు చేతులు నారాయణి మసాజ్ చేస్తుండగా, వాడు ఆమె చేయి లాక్కుని తన పాంట్ మీద పెట్టుకున్నాడట.

మరుక్షణంలో నారాయణి ముసలామె దగ్గరకు పోయి “మీ ఇంట్లో పని మానేస్తున్నా, డబ్బులిచ్చేయండి” అందిట.

“ఎందుకు?”

“మీ అబ్బాయి నాతో చెత్తగా ప్రవర్తించాడు!”

ముసలామె ఉగ్రురాలైపోయింది. అలాటి ఫిర్యాదు కొడుకు గురించి చేయడమే కాక, నారాయణి ఇంగ్లీష్‌లో మాట్లాడుతోంది కూడానాయె ఆమెతో. “నీ కర్రిమొహం ఈ ఇంట్లో ఇంకొకసారి కనిపించడానికి వీల్లేదు” తిట్టి వెళ్ళగొట్టింది. మూడొందల రూపాయల జీతం పోయింది నారాయణికి.

“నువ్వు ఇల్లు చిమ్మి తుడిచావంటే ఆ జీతం నీకు నేనిస్తా” అంది నానమ్మ.

“మీరు నా సొంత మనుషుల్లాంటి వారు. ఎందుకు చెయ్యను?” ఒప్పుకుంది.


వేసవి కాలం వచ్చింది. పరీక్షల్లో గొప్ప మార్కులు రాకపోవడం వల్ల నూడుల్స్ తినడానికి అనుమతి లేకపోయింది. గదిలో కూచుని ‘ప్రిన్సెస్ డైరీ’ చదువుతుంటే ఎప్పట్లాగానే తలుపు కొట్టకుండా నేరుగా నా గదిలోకి వచ్చింది నానమ్మ.

“నారాయణికి కీ-చైన్ ఇచ్చావా?” అంది. అది నా పుట్టినరోజు నాడు నాన్న ఇచ్చాడు నాకు.

“ఏం?”

“ఇచ్చావా లేదా చెప్పు?”

ఎర్రని గాజు హృదయాకారం లోపలి వైపు పసుప్పచ్చని రిబ్బను ముడి వేసి అమర్చారు. ఏదో షాపులో చూసి బాగుందంటే నాన్న బర్త్‌డేకి సర్ప్రైజ్‌గా తెచ్చాడు. రెండు మూడు నెలలు వాడాక బోరుకొట్టి పక్కన పడేశాను. వాడకుండా పడేశాను కదాని నారాయణి తీసుకున్నట్టుంది.

“ఏమో నాకు గుర్తు లేదు.”

“ఏంటి గుర్తు లేదు? ఎలా మర్చిపోతావు అంత ముఖ్యమైన విషయాన్ని?”

“సరే నేనే ఇచ్చాను. గుర్తొచ్చింది సరేనా, వదిలెయ్ నన్ను.”

“నువ్వే ఇచ్చినట్టయితే, అంత సడన్‌గా మర్చిపోవడమూ, గుర్తు రావడమూ జరుగుతుందా?”

నానమ్మ దగ్గర అబద్ధమాడటం సులువు. ఎందుకంటే నిజం చెప్పినా సరే, ఇంట్లో వాళ్ళతో సహా ఎవరినీ నమ్మదు.

తనను అడక్కుండా నారాయణికి ఏమీ ఇవ్వొద్దని చెప్పి గదిలోంచి బయటికి వెళ్ళింది.

నారాయణి నడుముకు వేలాడుతున్న తాళాల గుత్తిలో ఈ కీ-చైన్ తాలూకు గొలుసుని చూసి గుర్తు పట్టిందట నానమ్మ, అమ్మ చెప్పింది.


స్కూలు మొదలు కావడంతో దీపావళి వచ్చేదాకా నారాయణిని అంతగా చూడలేదు నేను. తనొచ్చేసరికి నేను స్కూలుకు వెళ్ళిపోతాను కదా.

తను దీపావళి రోజుల్లో రోజూ కొత్త చీరలు కట్టుకునేది. నుదురు మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని దాని మీద బియ్యపు గింజలు అద్దేది. భాయిదుజ్ పండగ రోజు అన్నను ఇంటికి పిలిచి అన్నం, మూడు కూరలు, పరవాన్నం చేసి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. అతను యాభైవొక రూపాయలిచ్చాడు నారాయణికి. లక్ష్మీపూజ రోజు లేత ఎరుపు మీద ముదురు ఎరుపు పూలున్న చీర కట్టుకునేది. నల్లగా మెరిసే ఆమె ముఖం సెనగపిండి, పెరుగు కలిపి రుద్దుకున్నాక మరింతగా మెరిసిపోయేది. చిన్న నుదురు మీద దట్టమైన కనునొమలు రెండూ కలిసిపోయి ఉండేవి. నల్లని కళ్ళు, పొడుగాటి కనురెప్పలు ఇరవై ఎనిమిదేళ్ళ నారాయణిని మరింత చిన్నగా చూపించేవి. సన్నని నడుము, చిన్న వక్షోజాలు, గులాబి పెదవులు… అసలు ఆమెను చూస్తే ఏ జువాలజీ స్టూడెంటో అన్నట్టుండేది.

వాళ్ళ కులాచారం ప్రకారం నగలు పెట్టుకునేది. మెరిసే జుంకాలు, తను సొంతగా కొనుక్కున్న మంగళసూత్రం గొలుసు, మెడ చుట్టూ బిగుతుగా ఉండే ఎరుపు, పచ్చ రాళ్ళ కంటె, మట్టి గాజులు, పని చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నపుడు పల్చగా మోగుతూ ఉండే పట్టీలు. ఇవి కాక మెట్టెలు, పిల్లేళ్ళు.

ఒక రోజు మధ్యాహ్నం వరకూ రాలేదు. వస్తూనే చెప్పింది “ఇవాళ ఐదుగురు కన్నె ముత్తయిదువులకు భోజనం పెట్టానమ్మా. తలా ఒక స్టీలు గిన్నె, మూరెడు మల్లెపూలు, జాకెట్ గుడ్డ కూడా ఇచ్చాను.”

“మీ ఆయన క్షేమం కోసం చేస్తున్నావా ఇది కూడా?”

మంగళవారాలు ఉపవాసం ఉండేది, భర్త క్షేమంగా ఉండాలని, అతడికి మంచి పని దొరకాలనీ, అందుకే అడిగాను.

“లేదు పాపా, ఇది నా కూతుళ్ళ కోసం, వాళ్ళకి మంచి భర్తలు దొరకాలని.”

“నీ భర్త లాంటోడా?” వెక్కిరించాను.

“ఛ, కాదమ్మా, కాదు. ఎందుకు పాపా అలా మాట్లాడతావు?” నొచ్చుకుంది.

క్రిస్మస్ పండగ నెల రోజులుందనగా నానమ్మ పండగ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్లమ్ కేక్ కోసం కావలసిన సంబారాలన్నీ తేవడం, పార్టీకి వచ్చే బంధువులు, స్నేహితుల కోసం బహుమతులు, విదేశాల్లో ఉన్న బంధువుల కోసం గ్రీటింగ్ కార్డులు కొనడం… ఒకటే హడావుడి.

తాతయ్యకి పనెక్కువైంది. రాత్రుళ్ళు నానమ్మ చెప్పే కబుర్లు తనకి అలవాటైన అనాసక్తితో వినేవాడు. క్రిస్మస్ టైములో బార్ ఏర్పాట్లన్నీ తాతయ్యవే. చక్కని కాక్‌టెయిల్స్ కలిపేవాడు. వాటిలో నిమ్మరసం వాడకుండా జాగ్రత్తపడేవాడు. తాగటం గురించి ఏమీ తెలీనివాళ్ళే కాక్‌టెయిల్స్‌లో నిమ్మరసం వాడతారనేవాడు.

లివింగ్ రూములో మూడు క్రోకరీ కాబినెట్లలో క్రిస్మస్ డిన్నర్ సెట్లు రెడీగా ఉండేవి.


క్రిస్మస్ వారం ఉందనగా ఒకరోజు నానమ్మ కిచెన్‌లో పనిచేస్తున్న నారాయణి దగ్గరకెళ్ళి బెడ్ రూములోకి రమ్మని తీసుకుపోయింది. ఆ సమయంలో నేను కిచెన్‌లో నారాయణికి సహాయం చేస్తున్నాను. తన తల్లి పనిచేసే చోట యజమాని ఆమెకి టివి ఇచ్చిన సంగతి చెప్తోంది నారాయణి. కేబుల్ టీవీకి నెలకు రెండొందలయాభై రూపాయలు కట్టలేక ఆ టివి అలాగే పడుందట. చుట్టుపక్కలవాళ్ళు తలా కొంచెం వేసుకుని కేబుల్ డబ్బులు కడదామని అనుకుంటున్నారట, ఆడవాళ్ళు టివి సీరియల్సు, మగవాళ్ళు క్రికెట్ చూడ్డానికి వీలుగా ఉంటుందని.

గది నుంచి తిరిగొచ్చేసరికి నారాయణి మొహం మబ్బులు కమ్మి ఉంది. చూపులు ఎక్కడో ఉన్నాయి.

“అయితే నువ్వు కూడా ఇస్తావా కేబుల్‌కి డబ్బులు?” అడిగాను.

“ఇస్తాను.”

“ఎంత?”

“పది రూపాయలు.”

తర్వాత ఒక్క ముక్క మాట్లాడలేదు. నానమ్మ దగ్గరికి వెళ్ళేసరికి తెల్సింది, తాతయ్య వేలికి ఉండే పింక్ డైమండ్ ఉంగరం కనపడటం లేదట. తాతయ్య వాళ్ళ అమ్మ, తాతయ్య ఇరవై అయిదవ ఆనివర్సరీకి ఇచ్చిందట అది బహుమతిగా. వేలాంగణి మేరీమాత దగ్గరికి తీసుకుపోయి, ఆమె పాదాల వద్ద పెట్టి ఉంగరానికి ఆశీర్వచనాలు తీసుకుని మరీ వచ్చిందట. ఎవరు ఎప్పుడు ఆ ఉంగరం బాగుందని మెచ్చుకున్నా నానమ్మ ఈ కథ మొత్తం చెప్పేది.

సన్నని బంగారు తీగల మధ్య బిగించిన దీర్ఘ చతురస్రాకారపు పింక్ డైమండ్ ఉండేది ఆ ఉంగరంలో. దాని చుట్టూ ఇరవైవొక్క సన్నని తెల్లగా మెరిసే వజ్రాలు పొదిగి ఉండేవి. ఆ ఉంగరం ఇచ్చిన కొద్దిరోజులకే వాళ్ళమ్మ చనిపోవడంతో అది మరింత అమూల్యమైంది. ప్రధానపుటుంగరం, పెళ్ళి ఉంగరాలతో పాటు ఇది కూడా రోజూ పెట్టుకునేవాడు తాతయ్య. ఇది కాక చిన్నపుడే తాతయ్య బుద్ధి బాగుండాలని జాతకం చూసి చేయించిన మరో ఉంగరం కూడా ఉండేది. రోజూ చేతులు కడుక్కునేటపుడు తాతయ్య ఉంగరాన్ని వాష్ బేసిన్ కౌంటర్ మీద పెట్టేవాడు. మొన్నొక రోజు చేతులు కడుక్కున్నాక తిరిగి ఉంగరం పెట్టుకోవడం మర్చిపోయాడట. ఆ రోజు నానమ్మ వంటింట్లో పని ముగించి వెళ్ళేసరికి రోజూకంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు.

“బాగా అలసటగా కనిపిస్తున్నావ్?” అని కూడా అన్నాడట. ఎన్ని నెలలైందో అలా అడిగి!

“ఏం లేదు, బాగానే ఉన్నాను. థాంక్స్… అడిగినందుకు. ఎలా ఉంది మీ రైటింగ్ పని?” నానమ్మ కూడా అడిగింది.

“పర్లేదు, బానే ఉంది.”

నానమ్మ చాలా ఏళ్ళుగా నిద్ర మాత్ర వేసుకుంటుంది రోజూ. ఆమె నిద్రపోయిందని నిర్థారించుకుని తాతయ్య లేచి ఉంగరం కోసం అంతటా వెదికాడు. వాష్ బేసిన్ దగ్గర, బీరువాలో, బాత్‌రూములో, అన్ని చోట్లా. ఉంగరం పోయిన సంగతి భార్యకు ఎలా చెప్పాలో తెలీడంలేదు ఆయనకి. ఏదైనా వస్తువు పోయిందంటే నానమ్మకి నేరమూ నేరస్తులూ వీటి గురించి చాలా అంచనాలుండేవి. పోగొట్టుకున్నవాళ్ళ అసమర్థత మీద కూడా. పనిమనుషులందరినీ నిర్దయగా ప్రశ్నించేవాళ్ళు ఇంట్లో. పోలీసులకు చెప్తామని బెదిరింపులు కూడా ఉండేవి.

ఈసారి విచారణ ఎదుర్కొంటున్నది నారాయణి. నిజానికి ఇన్ని రోజులుగా నానమ్మకి నారాయణి బాగా దగ్గరైంది. ఉత్తరాది ముసలామెకు నారాయణి ఇచ్చే బాడీ మసాజ్ ఇప్పుడు నానమ్మకి దొరుకుతోంది. తలకు నూనె మర్దన చేసి, వేడినీళ్ళలో తడిపిన టవల్ చుట్టేది కూడా. ఇవన్నీ నానమ్మకి బాగా నచ్చేవి. అయినా సరే, ఉంగరం విషయంలో నానమ్మ పట్టింపుగానే ఉంది ఈసారి. వాక్యూమ్ క్లీనర్, చొక్కాలు, కీ-చైన్ లాగా ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. పోలీసు కంప్లైంట్ ఇద్దామనే అనుకుంది కానీ, ఆడపిల్లలు ఇంట్లో ఉన్నపుడు పోలీసులు నారాయణి ఇంటికి వెళ్ళడం బాగుండదని ఆలోచిస్తోంది.

ఒకసారి నారాయణి తన చిన్న కూతుర్ని తీసుకొచ్చింది. ఎంత ముచ్చటగా ఉందని! ఎక్కువ మాట్లాడకుండా కూచుంది. ఏమి ఇచ్చినా తీసుకోలేదు.

చాక్లెట్లు, బిస్కట్లు, నా బార్బీ బొమ్మ… ఉహూ, ఏదీ తీసుకోలేదు.

“ఎంత మంచి పిల్లో” నానమ్మ మెచ్చుకుంది ఆ రోజు.

పార్టీ ఏర్పాట్లు చూస్తూనే ఉంది కానీ నానమ్మ ఉంగరం గురించి దిగులుతో మౌనంగా ఉంటోంది. నానమ్మ చాలా పెద్ద గొడవే చేస్తుందని అనుకున్నాం కానీ అదేమీ జరగలేదు. నన్ను మాత్రం వంటింట్లో ఎక్కువ సేపు గడపొద్దంది.

ఆ రోజు నారాయణి నా గది శుభ్రం చేయడానికి వచ్చింది. చదువుకుంటున్నాను నేను. కిటికీ లోంచి కొమ్మకొమ్మకూ పూలు పూసి దేవగన్నేరు నిండుగా కనిపిస్తోంది. పసుపు, గులాబీ కల్సిన రంగులో గుత్తులు గుత్తులుగా పూలు! ఆ పూలు కోశాక చేతులు తప్పకుండా కడుక్కోమనేవాడు తాతయ్య. ఆ జిగురు మంచిది కాదు, విషం.

నారాయణిని పలకరించి చాలా రోజులైంది. ఎలా ఉన్నావన్నాను. నారాయణి దిగులుగా చెప్పింది. భర్త తనని వదిలేసి పోబోతున్నాడట.

“ఇంకో దాని దగ్గరకు పోతున్నాడు. ఆమె ఇంకా ఎక్కువ డబ్బులిస్తుంది ఖర్చులకి. నేను వారానికి వంద రూపాయలిస్తాను. అది నూట యాభై ఇస్తుందట”

“పోనీ నారాయణీ. రోజూ కొట్టే మొగుడు నీకు మాత్రం ఎందుకు? ఎందుకేడుస్తావు అతని కోసం?”

“నీకు అర్థం కాదు పాపా.”

కొద్ది రోజుల తర్వాత మధ్యాహ్నం నానమ్మ నారాయణితో మాట్లాడుతుంటే విన్నాను. “ఆ మధ్య ఉంగరం పోయింది కదా నారాయణీ? అది అందరికీ అచ్చిరాదు ఉంగరం సొంతదారుకి తప్ప. ఎవరైనా దొంగిలిస్తే వాళ్ళ కాపరం కూలిపోతుంది. వాళ్ళ పెళ్ళి పెటాకులై పోతుంది. ఆ ఉంగరం ఎవరి దగ్గరుందో గానీ, వాళ్ళకేమీ కాకూడదని ప్రభువుని ప్రార్థిస్తున్నాను.”

నారాయణి ఏం చెప్పిందో వినపడలేదు. ఆ తర్వాత నారాయణి చాలా నీరసపడిపోయినట్టు కనపడింది. కళ్ళలో దిగులు గూడు కట్టింది. జుట్టు ఇదివరకులా జడ వేసుకోక వేలు ముడి వేసుకునేది. చీరకు మాచ్ అయ్యే మట్టి గాజులు వేసుకోడం మానేసింది.

నానమ్మ నారాయణితో మాట్లాడిన తర్వాత ఒక రోజు నారాయణి ఏడ్చి, ఉబ్బిపోయిన మొహంతో పనికి వచ్చింది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. భర్త పెద్ద కూతుర్ని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. వంటింట్లో నారాయణి వెక్కి వెక్కి ఏడుస్తుంటే నానమ్మ ఆమె వీపు నిమురుతూ ఓదారుస్తోంది.

తర్వాత మామూలుగానే వంట చేసింది. బెండకాయ వేపుడు, చేపల కూర, పాలకూర ఇగురు.

మర్నాడు ఉదయం నానమ్మ నా చేత లెక్కలు చేయిస్తుంటే బెడ్ రూములోంచి నారాయణి గొంతు వినపడింది పెద్దగా. “అమ్మా, ఇలా రండి, ఇలా రండి, చూడండమ్మా నాకేం దొరికిందో ఇక్కడ!” నానమ్మ పెన్ను పక్కన పెట్టి ఆ గదిలోకి వెళ్ళింది.

పరుపు ఎత్తి పట్టుకుని నిలబడి ఉంది నారాయణి. ఆశ్చర్యం, సంభ్రమం ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పరుపు కింది భాగంలో మంచం పట్టె మీద పడి ఉంది పింక్ డైమండ్ ఉంగరం.

మధ్యాహ్నపు సూర్యకాంతి తాలూకు కిరణం ఒకటి కర్టెన్ గుండా దూసుకొచ్చి గులాబీ రంగు డైమండ్ మీద ప్రసరించి, గది నిండా గులాబీ కాంతి పుంజాలు నింపింది. వాటి మధ్యలో నీలి, ఊదా రంగు చాయలు కూడా కనపడ్డాయి నాకు నారాయణి మొహాన్ని వెలిగిస్తూ.

(మూలం: The Thief)