వంశానికి ఒక్కడు

మా నాన్న 1955లో అనారోగ్యంతో చనిపోయే నాటికి మా నాన్నమ్మ కాలిఫోర్నియాలో ఒక వృద్ధాశ్రమంలో ఇంకా బతికే ఉంది. అప్పటికి 90 ఏళ్ళు ఉండొచ్చామెకి. అసలు మా నాన్నకి అనారోగ్యంగా ఉందని కూడా ఆమెకి తెలీదు. ఉన్నట్టుండి ఆయన చనిపోయాడని తెలిస్తే ఆ షాక్‌తో ఆమె చనిపోతుందేమో అని భయపడి మా మేనత్తలు, నాన్నకు గుండెల్లో నెమ్ము పట్టేసరికి పొడి వాతావరణం కోసం ఆరిజోనా రాష్ట్రంలో ఉంటున్నాడని చెప్పారు.

మా నాన్నమ్మ లాంటి మొదటితరం ప్రవాసులకు ఆరిజోనా అంటే స్విట్జర్లాండ్‌ లాంటిది. అక్కడికి ఆరోగ్యం కోసం వెళతారు. అంతకంటే ముఖ్యంగా బాగా డబ్బున్నవాళ్ళే ఆరిజోనా వెళ్ళగలరు. అదీ నాన్నమ్మ నమ్మకం. మా నాన్న బతికున్నపుడు చేసిన బిజినెస్‌లు ఏవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, పోన్లే ఇప్పటికైనా ఆరిజోనా వెళ్ళేంత డబ్బు సంపాదించాడని ఆవిడ సంతోషపడింది. మేమంతా ఇంట్లో ఏడుస్తూ ఉన్నపుడు ఆవిడ మాత్రం తన కొడుకు చక్కగా ఎడారి వాతావరణంలో హాయిగా ఉన్నాడని స్నేహితురాళ్ళకు గొప్పగా చెప్పుకుంది.

మా మేనత్తలు మమ్మల్ని అడక్కుండానే ఆ తర్వాత జరగాల్సింది ఏమిటన్నది నిర్ణయించేశారు. దాని ప్రకారం నాన్నమ్మ దృష్టిలో మేము కూడా నాన్నతో ఆరిజోనా వెళ్ళిపోయినట్టే కాబట్టి, ఆవిణ్ణి చూడ్డానికి మేం వెళ్ళకూడదు. నాకూ మా అన్నయ్య హెరాల్డ్‌కీ పెద్ద ఇబ్బందేమీ అనిపించలేదు. నిజానికి ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళడమే నరకం. నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటే చుట్టూ కూర్చుని ఉన్న ముసలివాళ్ళంతా తేరిపార మమ్మల్నే చూస్తుండేవాళ్ళు. నాన్నమ్మ ముసలి వగ్గులాగా ఉండి ఎప్పుడూ ఏదో ఒక జాడ్యంతో బాధపడుతుండేది. మతి స్థిమితం ఉండేదికాదు.

ఆవిణ్ని చూడకపోవడం మా అమ్మకూ పెద్ద బాధ కలిగించే విషయం కాదు. మా అమ్మకీ ఆవిడకీ నిమిషం పడేదికాదు. వెళ్ళి చూడగలిగినప్పుడు కూడా మా అమ్మ ఆవిడను చూడ్డానికి వెళ్ళలేదు. కాని, చిరాకు పుట్టించిందేమిటంటే మా మేనత్తలు కుటుంబంలో ఎవరినీ సంప్రదించకుండా అందరి తరఫునా నిర్ణయాలు వాళ్ళే తీసేసుకోడం. వాళ్ళు రక్తసంబంధీకులు కాబట్టీ వారికెక్కువ అధికారం ఉన్నట్టు. మొదటి నుంచీ ఈ తత్వమే అమ్మని వాళ్ళకు దూరంగా ఉంచింది. తనని అసలు ఇంటి కోడలిగా వాళ్ళు గుర్తించనే లేదంటుంది అమ్మ. పాతికేళ్ళుగా అమ్మ వాళ్ళతో బయటి మనిషి లాగానే పోరాడింది.

కర్మకాండలన్నీ అయ్యాక కొద్ది వారాలకి లార్చ్‌మాంట్ నుంచి ఫ్రాన్సిస్ అత్తయ్య ఫోన్ చేసింది. నాన్న తోబుట్టువుల్లో ఫ్రాన్సిస్ అత్తయ్య బాగా డబ్బున్న మనిషి. వాళ్ళాయన పెద్ద లాయరు. ఇద్దరు కొడుకులూ బాగా చదువుకుంటున్నారు. ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. “జాక్ (మా నాన్న) చాలా రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు ఎందుకు?” అని నాన్నమ్మ అడుగుతోందట.

“మన వంశంలో అటు ఏడుతరాలూ ఇటు ఏడుతరాలూ చూసినా నువ్వొక్కడివే రచయితవురా. నీ మీద మీ నాన్నకూ బాగా నమ్మకం ఉండేది పెద్దయినాక మంచి రచయితవు అవుతావని. కొంచెం ఏదో ఒక కథ అల్లి మీ నాన్న రాసినట్టు ఉత్తరం రాసివ్వరాదూ? నాన్నమ్మకి చదివి వినిపిస్తా” అంది ఫోన్ తీసిన నాతో.

ఆ రోజు సాయంత్రం కిచెన్ టేబుల్ దగ్గర హోమ్‌వర్క్‌ని పక్కకు నెట్టి ఉత్తరం ఒకటి రాశాను. ఆరిజోనా జీవితం నాన్నకి ఎలా ఉండి ఉంటుందో ఊహించి రాశాను. నిజానికి నాన్న ఎప్పుడూ పశ్చిమ రాష్ట్రాలకు పోనేలేదు. అసలు ఆయన ప్రయాణాలే చేసెరగడు. ఆ తరంలో మహాప్రయాణం అంటే కార్మికుడి స్థాయి నుంచి అధికారి స్థాయికి ప్రయాణించడమే. అది కూడా పాపం ఆయన గొప్పగా చేయలేకపోయాడు. తను పుట్టి పెరిగిన న్యూయార్క్ సిటీ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. పాత న్యూయార్క్ అంటే మరీ. అక్కడ టీపొడి ఇతర మసాలాలు అమ్మే హోల్‌సేల్ వ్యాపారులు కలుస్తారు ఆయనకి. జీవితమంతా సేల్స్‌మాన్‌గానే బతికాడు. గృహోపకరణాల సేల్స్‌మన్‌గా పని చేసిన నాన్న, అరుదుగా దొరికే కొత్త కొత్త వస్తువుల్ని ఎంతో ఇష్టంగా ఇంటికి తెచ్చేవాడు. రకరకాల వెన్నలు, విదేశాలలో పండే కూరగాయలు తెచ్చేవాడు. ఒకసారి బారోమీటర్ తెచ్చాడు. మరోసారి ఓడల్లో ఉపయోగించే టెలిస్కోప్ తెచ్చాడు. చెక్క కేస్‌లో బిగించి ఉండేది అది.

ప్రియమైన అమ్మా,

ఆరిజోనా చాలా బావుంది. రోజంతా తెల్లటి ఎండ ఇక్కడ. గాలి కూడానూ పొడిగా హాయిగా ఉంది. ఇన్నేళ్ళలో ఇంత హాయిగా ఎప్పుడూ లేను. ఇది ఎడారే అయినా నువ్వనుకున్నట్టు బంజరుగా ఏమీ ఉండదు. ఎక్కడ చూసినా అడవి పూలు, జెముడు మొక్కలు కనిపిస్తాయి. అవి కూడా విచిత్రంగా చేతులు చాపి నిల్చున్న మనిషి ఆకారంలో పెరుగుతాయి. ఎటు చూసినా విశాలంగా కనిపిస్తుంది. పడమర దిక్కున ఇక్కడికి యాభై మైళ్ళ దూరంలో కనుమలు ఉన్నాయి. ఉదయపు ఎండలో వాటి మీద మంచు మెరుస్తూ కనిపిస్తుంటుంది, ఇంత వేడిలో కూడా.

జాక్.

కొద్ది రోజుల తర్వాత ఫ్రాన్సిస్ అత్తయ్య ఫోన్ చేసింది. “నువ్వు రాసిన ఆ ఉత్తరం అమ్మకి చదివి వినిపిస్తూ ఉన్నపుడు, అన్నయ్య లేని లోటు పూర్తిగా తెలిసివచ్చింది. ఏడుపు ఆపుకోలేక పార్కింగ్ లాట్ లోకి పోయి ఏడ్చాను. వాడు నాకెంతో దగ్గర అని ఆ క్షణంలో అనిపించింది. నిజమే, వాడు వెళ్ళలేకపోయాడు గానీ, ప్రయాణాలు చేసి అన్నీ చూడాలని వాడికెంతో ఇష్టంగా ఉండేది” అని చెప్పింది.


నెమ్మదిగా మా జీవితాలు ఒక గాడిలో పడుతున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీ మీద నాన్న లోన్ తీసుకొని ఉండటంతో అది పోను పెద్దగా డబ్బేమీ రాలేదు. కొన్ని కమిషన్ మొత్తాలు రావలసి ఉంది గాని, ఆయన పనిచేసిన కంపెనీకి వాటిని చెల్లించే ఉద్దేశమేదీ ఉన్నట్టు కనపడలేదు. బాంక్‌లో ఉన్న రెండు మూడు వేల డాలర్లే మాకు దిక్కు. నాన్న చాలా రోజులు పేషంట్‌గా ఉండి చనిపోయిన హాస్పిటల్లోనే అమ్మ ఉద్యోగంలో చేరింది. అక్కడి డాక్టర్లు, నర్సులు అమ్మకు బాగా తెలుసు. హాస్పిటల్‌లో పని ఎలా చేయాలో ‘ఒక చేదు అనుభవం నేర్పింది’ అని చెప్పింది. వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. డల్‌గా ఉండే హాస్పిటల్ వాతావరణమంటేనే నాకస్సలు ఇష్టముండదు. నరకాన్ని అనుభవించే పేషంట్లని చూస్తూ గడపడం ఎంత బాధాకరం! కాని, తనను తాను అలా హింసించుకోవడం అమ్మకి ఇష్టంగా ఉందేమో అనిపించింది. కానీ ఆమెతో ఆ మాట అన్లేదు.

ట్రైన్ స్టేషన్ వీధికి మూలగా ఉన్న సందులో ఒక అపార్ట్‌మెంట్ మాది. మూడే గదులు. మా నాన్న చివరి రోజుల్లో, ఇక బతకడు తీసుకుపొమ్మని డాక్టర్లు చెప్పేశాక, ఇంటికి తీసుకొచ్చాం. ఆయన మంచం లివింగ్‌రూమ్‌లో వేయడం వల్ల, అక్కడి సామాను కొంత మా అన్న హెరాల్డ్ రూమ్ లోకి చేరింది. నేనూ వాడి బెడ్‌రూమ్‌లోనే పడుకోవాల్సి వచ్చింది. లివింగ్‌రూమ్‌లోని సోఫా-కమ్-బెడ్ మీద అమ్మ పడుకునేది.

ఇంటినిండా బోలెడు సామాను. లివింగ్‌రూమ్‌ నుంచి బెడ్‌రూమ్ వెళ్ళే సన్నటి హాల్‌వేలో కూడా అటూ ఇటూ పుస్తకాలు సర్దటంతో అది ఇరుకైపోయింది. వంటింటి నిండా నాన్న తన సేల్స్‌మాన్ ఉద్యోగంలో చవగ్గా దొరికాయని తెచ్చిన సామాను. రేడియో, రికార్డ్ ప్లేయర్, రికార్డుల డబ్బాలు, పుస్తకాల దొంతరలు – వాటి మధ్యనుంచి సర్దుకుని నడిచేవాళ్ళం. టోస్టర్, ప్రెషర్ కుకర్, గ్రిల్, డిష్ వాషర్, మిక్సీ… అవన్నీ వాడటం మా అమ్మకి చేతనయ్యేది కాదు. మాన్యువల్ చదివి ఎలా వాడాలో తెల్సుకునే ఆసక్తి ఆమెకి లేదు.

“ఈ పాపిష్టి సామానులో కూరుకుపోయేలా ఉన్నాం. ఎవడిక్కావాలివన్నీ? తీసేద్దాం” అంది అమ్మ. మాకు అక్కర్లేదు అనుకున్నవన్నీ డబ్బాల్లో పెట్టి తాడు కట్టాడు హెరాల్డ్. నాన్న బట్టల అలమరా తెరిచింది అమ్మ. సూట్లు చాలానే ఉన్నాయి. బాగు చేయించుకుని మమ్మల్ని వాడుకోమంది అమ్మ. వాటిని తను వాడనని హెరాల్డ్ చెప్పేశాడు. ఒకటి నాకు తొడిగి చూసింది.

“చాలా పెద్దదై పోయింది ఇది నాకు” అన్నాను. ఆ జాకెట్‌ లోనుంచి వస్తున్న వాసన నాన్నను తెచ్చింది. “నీ సైజుకు ఆల్టర్ చేయించి డ్రైక్లీన్ చేయిస్తాను. బాలేకుంటే నేను మాత్రం నీకు వేస్తానా ఈ బట్టలు?” అంది అమ్మ.

ఆ చలికాలపు సాయంత్రం కురుస్తోన్న మంచు కిటికీలో పేరుకుంటోంది. నాన్న బట్టలన్నీ దొంతరలుగా అమ్మ మంచం మీద పేరుస్తుంటే కప్పునుంచి వేలాడుతున్న బల్బు వెలుతురులో అది మనిషి శవాన్ని పడుకోబెట్టినట్టు అనిపించింది. అమ్మకు కళ్ళనీళ్ళు తిరిగాయి. ఏడవడం మొదలుపెట్టింది.

“ఎందుకేడుస్తున్నావ్ ఇప్పుడు? వీటిని ఎలాగూ వదిలించుకోవాలనుకున్నాం కదా?” హెరాల్డ్ అరిచాడు.


కొద్ది వారాల తర్వాత ఫ్రాన్సిస్ ఆంటీ మళ్ళీ ఫోన్ చేసింది. ఇంకో ఉత్తరం రాయాలట నేను. నాన్నమ్మకి కుర్చీ లోంచి పడి దెబ్బలు తగిలాయట. ఆమెకు కాస్త ఉపశాంతిగా ఉండాలంటే జాక్ ఉత్తరం కావాలట.

“ఎన్నాళ్ళు సాగాలి ఇలా?” అమ్మ అడిగింది.

“అదేమంత కష్టం? ఏదో అమ్మ బతికే కాసిని రోజులూ ఆమెని సంతోషంగా ఉంచితే ఏం? అంది అత్తయ్య.

అమ్మ టపీమని ఫోన్ పెట్టేసింది. “చచ్చిన మనిషిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. చివరికి చావు కూడా వీళ్ళ ఇష్టం ప్రకారమే. అయినా విషయం చెప్తే ఏమవుతుంది? ఆ షాక్‌తో చచ్చిపోతుందా మీ నాన్నమ్మ? ఆమె అంత తేలిగ్గా చచ్చే రకం కాదు.”

వంటింట్లో కూచుని ఉత్తరం రాశాను, నాన్న రాసినట్టుగా. హెరాల్డ్ నన్నే చూస్తున్నాడు. “అలా చూడకురా. ఇప్పటికే ఇది చాలా కష్టంగా ఉంది నాకు.”

“ఎవరో అడిగారు కదాని నువ్వీ పని చెయ్యక్కర్లేదు” అన్నాడు హెరాల్డ్. నాన్న చనిపోయాక సిటీ కాలేజ్‌లో చదువు మానేసి నైట్ కాలేజీలో చేరి చదువుకుంటూ, పగలంతా ఒక రికార్డ్ స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు వాడు.

ప్రియమైన అమ్మా,

నువు క్షేమమని తలుస్తాను. ఇక్కడ మేమంతా హాయిగా దుక్కల్లా ఉన్నాం. ఆరిజోనాలో జనమంతా చాలా స్నేహంగా ఉంటారు. ఎవరూ సూట్లు వేసుకోరు, టైలూ కట్టుకోరు. మామూలు పాంట్లూ పొట్టి చేతుల చొక్కాలూనూ. మహా అయితే సాయంత్రం స్వెటర్ వేసుకుంటారంతే. ఇక్కడ నేను రేడియోలు, రికార్డులూ అమ్మే దుకాణం ఒకటి పెట్టాను. బాగా నడుస్తోంది. కెనాల్ వీధిలో మన షాపు, జాక్స్ ఎలక్ట్రిక్స్ గుర్తుందా? అదే షాపు ఇప్పుడు జాక్స్ ఆరిజోనా ఎలక్ట్రిక్ అయిందన్నమాట. మన షాపులో ఇప్పుడు కొత్తగా టీవీలు కూడా పెట్టాం అమ్మడానికి.

జాక్.

ఆ ఉత్తరం ఫ్రాన్సిస్ అత్తయ్యకు పంపాను. కొద్ది రోజుల తర్వాత ఆమె నుంచి ఫోన్ వచ్చింది. హెరాల్డ్ ఫోన్ తీసి, మౌత్‌పీస్‌కు చెయ్యి అడ్డం పెట్టి “ఫ్రాన్సిస్ ఆంటీ, నీ ఉత్తరం గురించి లేటెస్ట్ రివ్యూ కాబోలు” అన్నాడు. ఫోన్ తీసుకున్నాను.

“జోనథన్? నీ దగ్గర చాలా టాలెంట్ ఉందిరా. ఎంత బాగా రాశావో ఉత్తరం. జాక్స్ షాప్ గురించిన వివరం చదువుతుంటే నాన్నమ్మ మొహం వెలిగిపోయిందనుకో. ఇలాగే కంటిన్యూ చేయి!”

“సారీ ఆంటీ. ఇక నేనిది కంటిన్యూ చేయలేను. ఇది తప్పుగా తోస్తోంది నాకు.”

ఆంటీ గొంతు మారిపోయింది. “మీ అమ్మ ఉందా అక్కడ? ఫోనివ్వు తనకి, నేను మాట్లాడతాను.”

అమ్మ అక్కడ లేదని చెప్పాను. “మరీ అంత గింజుకోవద్దని మీ అమ్మకి చెప్పు. ఆ ముసలావిడ ఎప్పుడూ మీ అమ్మ మంచే కోరుకుంది. ఇక తొందర్లోనే పోతుంది కూడా.”

ఈ మాటలన్నీ నేను అమ్మకి చెప్పలేదు. పాత సంగతులన్నీ తవ్విపోసి తనను బాధపెట్టడం నాకు ఇష్టంలేదు. రెండువైపులా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ, గొప్ప చాతుర్యంతో మాటలు విసురుకుంటారు. ఎటువైపూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకు ప్రశాంతత. మా నాన్న కూడా ఇలాగే చేసేవాడు. ఏళ్ళ తరబడి వ్యాపారంలో వైఫల్యాలు, చేజారిన అవకాశాలు నాన్న జీవితంలో భాగమైపోయాయి. ఒక వైపు తన కుటుంబం, మరో వైపు మా అమ్మ రూత్ ఒకరివైపు ఒకరు వేలెత్తి చూపిస్తూ. ఒకే వాదన ఎప్పుడూ – నాన్న జీవితం ఆశలు తీరకుండా ఇలా కావడానికి ఎవరు కారణం?

అమ్మ జోస్యం మాత్రం నిజమయింది. వేసవికాలం వచ్చినా నాన్నమ్మ ఇంకా బతికేవుంది.


ఒక ఆదివారం నేను, హెరాల్డ్, అమ్మా బస్‌లో న్యూ జెర్సీ వెళ్ళాం, బెత్ ఎల్ శ్మశానానికి, నాన్న సమాధిని చూడడానికి. కొద్దిగా ఎత్తులో మెరకప్రాంతంలో ఉంది అది. ఎత్తుపల్లాలుగా అన్నివైపులకూ బారులు తీరివున్న సమాధిరాళ్ళు. శ్మశానంలోకి అప్పుడే వస్తున్న నల్లటి కార్‌ల వరస. అక్కడక్కడా అప్పుడే తవ్విన గోతుల చుట్టూ మూగివున్న జనాలు. సమాధి చుట్టూ చిన్న చిన్న మొక్కలు నాటారు కాని, తల వైపు రాతి పలక ఇంకా పెట్టలేదు. మేము ఒక మంచి రాతి పలకని సెలెక్ట్ చేసి డబ్బు కూడా కట్టేశాం కాని, ఆ రాతిపనివాళ్ళు అప్పుడే సమ్మెకు దిగడంతో ఆ పని అలా పూర్తికాకుండా ఉండిపోయింది. తలపలక లేకుండా సమాధిని చూస్తుంటే, నాన్నని అవమానించినట్లు తోచింది. ఆయన్ని సగౌరవంగా సాగనంపలేదేమో అనిపిస్తోంది.

నాన్న సమాధి పక్కనే తన సమాధి కోసం కొనుక్కొని పెట్టుకున్న స్థలాన్ని చూస్తూ అమ్మ అంది. “అప్పట్లో కూడా, స్టాన్టన్ వీథిలో ఉన్నప్పుడు కూడా మీ నాన్న వైపు వాళ్ళ కంటికి ఎవరూ ఆనేవారుకారు. ఎంత పొగరుగా ఉండేవారో. చివరికి మీ నాన్న కూడా వారి కంటికి ఆనలేదు. ఆయన చవగ్గా వాళ్ళకి ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చిచ్చినపుడు మాత్రం ఆనేవాడు.” అమ్మ ఏడవడం మొదలుపెట్టింది.

“అమ్మా, ప్లీజ్. ఊరుకో” అన్నాడు హెరాల్డ్.

“వాళ్ళమ్మ జాక్‌ని తన కొంగుకి కట్టేసుకుందని నేను తనను కలవకముందు తెలీదు. ఆ కొంగు ఒక ఇనప పంజరమని అంతకంటే తెలీలేదు. మీ నాన్నమ్మ వాళ్ళింటికి దగ్గర్లోనే ఉండాలనేది ఎప్పుడూ, అప్పుడప్పుడూ వచ్చి పోవడానికి వీలుగా. కానీ టంచనుగా ప్రతీ ఆదివారం అత్తగారిని చూడడానికి పోవాలి. అంతే, అదే నా జీవితం. నేనేది కోరుకున్నా తనకు ముందే తెలిసేది. ఒక మంచి అపార్ట్‌మెంట్‌లో ఉందామనో, కాస్త మంచి ఫర్నిచర్ కొందామనో, పిల్లలను సమ్మర్ కాంప్ పంపుదామనో అనుకున్నప్పుడల్లా, మీ నాన్నమ్మ అడ్డుపుల్ల వేసేది. ఇక మీ నాన్న సంగతి తెల్సుగా? వాళ్ళమ్మ మాటే నెగ్గేది. దానికే తలొగ్గేవాడు. చివరివరకూ ఏమీ మారలేదు, ఎప్పుడూ అంతే.” అమ్మ ఏడుపు ఆగటంలేదు.

“అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది. ఏం చేద్దాం?” అన్నాడు హెరాల్డ్.

“ఆమె ఇక్కడికి వచ్చిందే అందుకు. ఏడవనీ” అంటుండగానే, నా గొంతులోంచి వెక్కిళ్ళు వచ్చాయి. “నాకూ ఏడవాలనిపిస్తోందిరా” అన్నాను హెరాల్డ్‌తో.

మా అన్నయ్య నా భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కున్నాడు. “ఆ నల్లరాయిని చూశావూ? ప్రపంచంలో అన్నింటి లాగానే సమాధిరాళ్ళూ ఫ్యాషన్ ప్రకారం మారిపోతుంటాయి.”


ఇదంతా జరుగుతూ ఉండగా నాన్న తరచూ కల్లోకి వచ్చేవాడు. దృఢకాయం, మెరిసే గులాబీ రంగు చర్మం, కోర మీసం, గోధుమ రంగు కళ్ళు, తల మీద మధ్యపాపిడితో రెండుగా విడిపోయే జుట్టు – నా చిన్నప్పటి ఆ నాన్న కాదు. చచ్చిపోయినప్పటి నాన్న. ఆస్పత్రి నుంచి మేము ఇంటికి తీసుకుపోతున్న నాన్న. చచ్చి బతికిన నాన్న. అది సంతోషమే అయినా, శరీరం పూర్తిగా శిథిలమై పోయి, పాలిపోయిన నాన్న. ఏ క్షణానైనా పోతాడనిపించే నాన్న. ఆయనకూ ఆ సంగతి అర్థమైనట్టే ఉంది. ఏమీ చేయలేనితనంతో వచ్చిన కోపంతో, అసహనంతో మామీద మండిపడుతున్న నాన్న. చాలా సహనంగా ఆయనకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా ఏదో ఒకటి ప్రతిసారీ అడ్డంపడుతుండేది. ఒకసారి ఆయన బట్ట్లల సూట్‌కేస్ కొక్కెం విరిగి బట్టలన్నీ దారిలో పడిపోయాయి. ఒకసారి కార్‌లో ఎక్కించాక కార్ కదల్లేదు. ఒకసారి అది చెక్కతో చేసిన కారు. ఒకోసారి ఆయన బట్టలన్నీ వొదులైపోయి తలుపుల్లో చిక్కుకునేవి. ఇంకోసారి ఒళ్ళంతా బాండేజిలు కట్టి ఉన్న నాన్నను వీల్‌చైర్‌లో తీసుకువస్తుంటే బాండేజీ ఊడిపోయి వీల్‌చైర్ స్పోకుల్లో చుట్టుకుపోయేది. అమ్మ ఇదంతా జాలిగా చూస్తూ, నాన్నకు నచ్చచెప్తుండేది.

ఇదే నా కల. కానీ ఎవరితోనూ చెప్పలేదు నేను. ఒకరోజు కల్లోంచి ఉలిక్కిపడి లేచి ఏడ్చాను. అన్నయ్య నన్ను లేపి ఏం పీడకల వచ్చింది అని అడిగాడు కానీ నాకేమీ గుర్తులేనట్టు నటించాను. ఆ కలల్లో నేను తప్పు చేసినట్టనిపించేది. ఆ కలల్లో మేము ఆయనతో కలిసి ఉండాలనుకోవడం లేదని మా నాన్నకి తెలుసు. కలలో మేము ఆయనను ఇంటికే తీసుకుపోతున్నా, మా అందరికీ తెలుసు, ఆయన ఒంటరిగానే బతకాలని. ఆయన చచ్చి బతికాడు. కలలో మేము ఆయనను ఒక చోటికి తీసుకెళుతున్నాం – అక్కడ ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా మళ్ళీ చచ్చేవరకూ బతకాలని కదా.

ఒక్కోసారి ఈ కల వల్ల ఎంత భయం వేసేదంటే నిద్రపోవడమే మానుకున్నాను. అనారోగ్యానికి ముందుటి నాన్న గురించిన మంచి విషయాలు గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాను. నాన్న నన్ను ‘తమ్మీ’ అని పిలిచేవాడు. ఆఫీసు నుంచి వస్తూనే ‘ఒరే తమ్మీ’ అని కేకేసేవాడు. ఎటన్నా పోదాం పద అనేవాడూ. షాపుకో, పార్కుకో, బేస్‌బాల్ ఆట చూడటానికో! నడవటమంటే ఆయనకు ఎంతిష్టమో.

“భుజాలు అలా కుదించి నడవకు. నిటారుగా నిలబడు. సూటిగా తలెత్తి నీ ఎదురుగా ఉన్న ప్రపంచాన్ని చూడు. ఏం అంటే ఏం అన్నట్టు ధైర్యంగా నడు” అనేవాడు. ఆయన అలాగే నడిచేవాడు. చుట్టూ ఏం జరగబోతోందో గమనిస్తూ ఉండటం ఎంతో ఇష్టం నాన్నకి.


తరవాతి లెటర్ కోసం ఫోన్ రావడం కాకతాళీయంగా ఒక సందర్భంతో ముడిపడింది. హెరాల్డ్ తన గర్ల్ ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె ఆ రోజు ఇంటికి వస్తుందని తెల్సి మేము వారం రోజులుగా ఇల్లంతా శుభ్రం చేశాం. బూజులు దులిపి, అద్దాలన్నీ తుడిచి తళతళా మెరిపించాం. డిన్నర్ ఏర్పాట్లు చూసేందుకు అమ్మ పెందలాడే ఇంటికి వచ్చింది. మడత డైనింగ్ టేబుల్ తీసి పరిచాం. అమ్మ దాని మీద తెల్లని ఇస్త్రీ దుప్పటి పరిచి, తన వెండి కంచాలు, స్పూన్‌ల సెట్ బయటకి తీసింది. నాన్న పోయాక అదే మొదటిసారి.

హెరాల్డ్ గర్ల్‌ఫ్రెండ్ బాగుంది. చక్కటి నవ్వు, పొడుగాటి జుట్టు, అందంగా ఉంది. ఆ అమ్మాయి రాక మా ఇంట్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. చుట్టూ చూసి ‘ఇన్ని పుస్తకాలు నేను ఎక్కడా చూళ్ళేదు’ అని ఆశ్చర్యపడింది.

అమ్మ వంటింట్లో వండుతూంది. అన్నయ్య, ఆ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నేను గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెట్టాను అమ్మకు సహాయంగా, భుజం మీద టవల్ వేసుకొని వెయిటర్‌లాగా నటిస్తూ. అమ్మ సంతృప్తిగా తలాడించింది. నావేపు చూసి పెదాలు కదిలించింది. “పిల్ల బావుంది!”

మేము ఎప్పుడు ఏమంటామో అని హెరాల్డ్ చాలా హింసపడ్డాడు. ఆమె పేరు సూసన్. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూనే సిటీ కాలేజీలో చదువుతోంది. మేం ఒకరికొకరు నచ్చుతామో లేదో అని మా అందరి ముఖాలూ మార్చి మార్చి చూస్తూనే ఉన్నాడు తింటున్నంతసేపూ. హెరాల్డ్ చికెన్ వేపుడు లోకి బాగుంటుందని వైన్ పట్టుకొచ్చాడు బయటి నుంచి. గ్లాస్ ఎత్తి పట్టుకుని ‘టోస్ట్’ అన్నాడు.

“అందరి ఆరోగ్యానికీ, సంతోషానికీ” అని అమ్మ టోస్ట్ చెప్పింది. అందరం ఒక గుక్క వైన్ తాగాం. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. లేచి బెడ్‌రూమ్ లోపలికి వెళ్ళాను.

“జోనథన్. ఫ్రాన్సిస్ ఆంటీని మాట్లాడుతున్నా. అందరూ బావున్నారా?”

“ఆఁ, బానే ఉన్నారు.”

“సరే, ఇదే చివరి సహాయం. ఇంకో ఉత్తరం రాయాలి నువ్వు నాన్నమ్మ కోసం. తన పరిస్థితి ఏమీ బాలేదు.”

“ఎవరదీ ఫోన్లో?” లివింగ్‌రూమ్ లోంచి అమ్మ అడిగింది పెద్ద గొంతుతో.

“సరే ఆంటీ. నేను వెళ్ళాలి. డిన్నర్ మధ్యలోంచి లేచి వచ్చాను” అంటూ ఫోన్ పెట్టేశాను.

“నా ఫ్రెండ్ లూయీ. లెక్కల పేపర్ రివ్యూ గురించి అడగడానికి చేశాడు.”

డిన్నర్ బాగా అయింది, కబుర్లూ నవ్వుల మధ్య. ఆపైన హెరాల్డ్, సూసన్ ప్లేట్లు గిన్నెలు కడిగి పెడుతుంటే, నేనూ అమ్మా కలిసి డైనింగ్ టేబుల్ తుడిచి మడిచి పెట్టేశాం గోడవారగా. అంతా అయాక అందరం సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. పాటలు విన్నాం. ఆ సాయంత్రం చాలా ఆనందంగా గడిచింది.


“నాన్న రాసినట్టు రాసే ఈ ఉత్తరాలు నిజంగా అవసరం లేదు” అన్నాడు హెరాల్డ్ అమ్మ ఇంట్లో లేని రోజు చూసి. “నాన్నమ్మకు కళ్ళు పూర్తిగా కనపడవు. చెవులు సరిగా వినిపించవు. ఉత్తరం చదివినా టెలిఫోన్ డైరక్టరీ చదివినా తనకు తేడా తెలుస్తుందా ఇప్పుడు? నీ రాతప్రతిభ అవసరమా నిజంగా? ఎందుకీ నాటకం అంతా!” అన్నాడు చేతులు పైకెత్తి.

“మరైతే ఫ్రాన్సిస్ ఆంటీ నన్నెందుకు అడుగుతోంది ఇలా ఉత్తరాల కోసం?”

“అదే మరి జోనథన్. ఆ ఉత్తరాలేవో ఆవిడే రాసుకోవచ్చుగా? తేడా ఏం పడుతుంది? పోనీ ఆవిడ కొడుకులు? డిగ్రీ చదివారు కదా. ఈ పాటి లెటర్ రైటింగ్ నేర్చుకోలేదంటావా వాళ్ళు?”

“కానీ వాళ్ళు జాక్ బిడ్డలు కాదు కదా.”

“అదే మరి. వాళ్ళకి కావలసింది ఊడిగం. నాన్న నానా అగచాట్లూ పడ్డాడు ఫ్రాన్సిస్ ఆంటీ కోసం. ఏం, మాలీ ఆంటీ మాత్రం తక్కువా? ఆమె కోసం, ఆవిడ మొగుడు, ఆవిడ మాజీ మొగుడు అందరికీ హోల్‌సేల్ ధరలో సామాను ఫ్రీగా తెచ్చి ఇవ్వడానికి. బతికున్నన్నాళ్ళూ నాన్న ఎన్నెన్ని సామాన్లు కొనిపెట్టాడో వాళ్ళ కోసం. చివరికి నాన్నమ్మ ఏదడిగినా కూడా. నాన్నకూ ఒక జీవితం ఉంది. ఆయనకూ పనులుంటాయి అని ఎప్పుడూ వాళ్ళకు గుర్తు రాలేదు. అలా తెచ్చి ఇచ్చినప్పుడల్లా నాన్న ఎవరికో బాకీ పడుతున్నాడని వాళ్ళకు ఊహకు కూడా రాలేదు. ఇంటి సామాను, పింగాణీ డిన్నర్ సెట్‌లు, గ్రామోఫోన్ రికార్డులు, వాచీలు, థియేటర్ టికెట్లు, ఏది కావాలన్నా సరే ఒకటే మాట. ‘జాక్‌కి ఫోన్ చెయ్యి.’ ఇదే వాళ్ళకు తెల్సిన మంత్రం.”

“వాళ్ళకు కావలసినవన్నీ చేయగలగడం నాన్నకి గర్వంగా ఉండేది. సంబంధాలు నిలుపుకోడానికి కూడా” అన్నాను.

“అదే, ఎందుకూ అని నాకు ఆశ్చర్యం” అన్నాడు వాడు కిటికీ లోంచి బయటికి చూస్తూ.

చటుక్కున అనిపించింది నేనేదో చిక్కుల్లో పడుతున్నానేమో అని.

“కాస్త బుర్ర వాడు అప్పుడప్పుడు” అన్నాడు వాడు.


అయినా సరే, అప్పటికి ఒప్పుకున్నట్టుగానే, ఆరిజోనా ఎడారి నుంచి నాన్న రాసినట్టు ఉత్తరం రాసి ఫ్రాన్సిస్ ఆంటీకి పంపాను.

కొన్ని రోజుల తర్వాత, ఒక రోజు నేను స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు కార్‌లో ఫ్రాన్సిస్ ఆంటీ కూచుని ఎదురుచూస్తూ కనపడింది. ఆ ఖరీదైన కారు ఆమెదే. సందేహం లేదు. నన్ను చూసి హారన్ మోగించింది. దగ్గరికి వెళ్ళి దించిన అద్దం లోంచి లోపలికి చూశాను.

“నాకెక్కువ టైము లేదు. నీతో కొంచెం మాట్లాడాలి. కారెక్కు.”

“అమ్మ ఇంట్లో లేదు. ఆఫీసు నుంచి ఇంకా రాలేదు.”

“నాకు తెలుసు. నీతో మాట్లాడ్డానికే వచ్చాను”

“ఇంట్లోకి వస్తావా?”

“లేదు. త్వరగా ఇంటికి వెళ్ళాలి నేను. రెండు నిమిషాలు మాట్లాడాలి నీతో. కారెక్కుతావా ప్లీజ్?”

ఫ్రాన్సిస్ ఆంటీ చాలా అందంగా ఉంటుంది. చక్కటి బట్టలు కట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచీ ఆమె అంటే ఇష్టమే నాకు. నన్ను చూసినపుడల్లా “జాక్ కొడుకు కాదు నువ్వు, నా కొడుకువి” అంటుండేది. తెల్లటి గ్లవ్స్ వేసుకున్న చేతులు స్టీరింగ్‌ని దృఢంగా పట్టుకుని ఉన్నాయి. ముందుకు చూస్తూ కారు నడుపుతోంది.

“జోనథన్, ఆ సీట్లో నువ్వు రాసిన లెటర్ ఉంది. అది నేను నాన్నమ్మకి చదివి వినిపించలేదని నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. నీ ఉత్తరం నీకే ఇస్తున్నాను. దీని గురించి ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా అనను. ఇది మనిద్దరి మధ్యే ఉంటుంది. నువ్వు కావాలని మరీ ఇంత క్రూరంగా చేస్తావని అనుకోలేదు.”

నేనేమీ అనలేదు. కారు రోడ్డు పక్కన ఆపింది.

“మీ అమ్మకి మేమంటే ఎప్పుడూ పడదు. నీకు కూడా ఆ విషాన్ని బాగానే ఎక్కించింది. ఎంత స్వార్థపరురాలో!”

“అమ్మ అలాటిది కాదు.”

“నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోలేదులే. తన గొంతెమ్మ కోరికలతో జాక్‌కి పిచ్చి పట్టించింది మీ అమ్మ. ఎప్పుడూ ఆకాశంలో ఉండేవి కోరికలు. వాటిని మీ నాన్న ఎన్నడూ తీర్చలేకపోయాడు. మీ నాన్నకు సొంత షాపు ఉన్నపుడు మీ అమ్మ తమ్ముడిని షాపులో పెట్టుకున్నాడు. వాడో తాగుబోతు. యుద్ధం ముగిశాక మీ నాన్న దగ్గర అంతగా డబ్బు లేనప్పుడు కూడా మీ అమ్మ ఖరీదైన ఉన్ని కోటు కావాలంది. వాడికి తీర్చాల్సిన అప్పులున్నా సరే, కోటు కావాల్సిందేనని పట్టుబట్టి కూచుంది. కొన్నాడు వాడు. నా తమ్ముడు ఎంతో సాధించి ఉండాల్సిన మనిషి. మీ అమ్మను ప్రేమించి జీవితమంతా ఆవిడగారికే అంకితం చేశాడు.”

ట్రాఫిక్ వైపు చూశాను. కొద్ది దూరంలో స్కూలు పిల్లలు బస్ కోసం ఎదురుచూస్తూ బ్యాగులు పక్కన పెట్టి అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నారు.

“ఇలా దిగజారి మాట్లాడాల్సివచ్చింది నేను. నిజానికి నేను వేరేవాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడను. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడాల్సి వస్తే, మాట్లాడకుండానే ఉంటాను గాని నోరు తెరవను. ఇంతకీ హెరాల్డ్ ఎలా ఉన్నాడు?”

“బానే ఉన్నాడు.”

“ఈ అద్భుతమైన ఉత్తరం రాయడంలో వాడి చెయ్యి కూడా ఉందా?”

“లేదు.”

“ఎలా ఉన్నారు మీరంతా? నిన్ను పండగకి రమ్మని పిలుద్దాం అనుకుంటాను కానీ మీ అమ్మ పడనివ్వదని అడగను ఎప్పుడూ.”

“బానే ఉన్నాం.” అన్నాను క్లుప్తంగా.

“సరే, ఇక వెళ్తాను నేను. ఆ లెటర్ తీసుకో. నువ్వేం చేశావో కూచుని ఆలోచించుకో.”


ఆ రోజు సాయంత్రం అమ్మ ఆఫీసు నుంచి వచ్చాక గమనించాను. ఫ్రాన్సిస్ ఆంటీ అంత అందంగా లేదు అమ్మ. మా అమ్మ చూడ్డానికి బాగుంటుంది అనుకునేవాడిని. కానీ అమ్మ లావై పోయింది, జుట్టూ నెరిసింది.

“ఏంటలా చూస్తున్నావు?” అంది అమ్మ

“ఏమీ లేదు.”

“ఇవాళ నాకో సంగతి తెల్సింది. మీ నాన్న నౌకాదళంలో పనిచేశాడు కదా కొంతకాలం, మనకి వెటరన్ అసోసియేషన్ నుంచి పెన్షన్ వచ్చే అవకాశం ఉందట.”

ఆశ్చర్యపోయాను. నాన్న నేవీలో పనిచేశాడని నాకు తెలీనే తెలీదు.

“మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు” చెప్పింది అమ్మ. “ఆయన వెబ్ నావల్ అకాడెమీలో చదివాడు. కొద్ది రోజుల్లో నేవీలో చేరేవాడు కూడా. ఇంతలో యుద్ధం ముగిసిపోయింది. ఆయనకు రావలసిన కమిషన్ మాత్రం రానేలేదు.”

రాత్రి భోజనం అయ్యాక ముగ్గురం కూచుని నాన్న వస్తువులన్నీ వెదికాం. వెటరన్ అసోసియేషన్ పెన్షన్‌కు పనికొచ్చే రుజువులు ఏమైనా దొరుకుతాయేమో అని. ఒక విక్టరీ మెడల్ దొరికింది. యుద్ధంలో పాల్గొన్న అందరికీ ఆ మెడల్ ఇస్తారని హెరాల్డ్ అన్నాడు. ఇంకోటి, షిప్‌లో తన తోటి ఉద్యోగులతో డెక్ మీద నాన్న దిగిన ఫోటో. వాళ్ళందరూ బెల్ బాటమ్ పాంట్లు టీషర్టులు వేసుకొని, బకెట్లు, చీపుర్లు, తుడిచే గుడ్డలు పట్టుకుని ఉన్నారు ఆ ఫోటోలో. ఓడలు కడిగే పని అన్నమాట నాన్నది.

“నాకసలు ఇది తెలీనే తెలీదు” అన్నాను ఆశ్చర్యంగా.

“నీకు గుర్తు లేదంతే” హెరాల్డ్ కొట్టిపారేశాడు. “మనం ఏ రుజువులూ చూపించక్కర్లేదు. నాన్న సర్వీస్ రికార్డ్ వాషింగ్‌టన్‌లో ఉంటుంది.”

ఫోటోలో గుర్తుపట్టాను. లైన్లో చివరగా నిల్చుని ఉన్నాడు నాన్న. సన్నగా, బోలెడంత జుట్టుతో అందంగా ఉన్నాడు. నాన్న తన తోటి పనివాళ్ళతో ఉన్న ఫొటోని నా మంచం పక్కనే స్టాండ్ మీద పెట్టుకున్నాను. వయసులో ఆరోగ్యంగా కళకళలాడుతున్న ఆ నాన్నని నాకు తెలిసిన నాన్నతో పోల్చి చూసుకున్నాను. నాన్న ఫొటోని తదేకంగా చూస్తూ ఉండిపోయాను. నెమ్మదిగా నా కళ్ళు ఎదురుగా బుక్ షెల్ఫ్‌లో కింది అరలో ఉన్న సముద్రంలో జీవితంపై రాసిన నవలల మీదికి మళ్ళింది. ఆ నవలల సెట్ నాన్న నాకు బహుమతిగా ఇచ్చాడు, వాటిని జాగ్రత్తగా బైండ్ చేయించి మరీ. అందులో మెల్విల్, కాన్రాడ్, విక్టర్ హ్యూగో, కెప్టెన్ మారియాట్ వంటివాళ్ళ రచనలు ఉన్నాయి.

ఆ పుస్తకాల వరస మీద అడ్డంగా పడుకోబెట్టి ఉంది, ఓడల్లో వాడే టెలిస్కోప్. చెక్క కేస్‌లో బిగించి ఉందది, ఇత్తడి తాళంతో సహా.

ఎంత బుద్ధిలేని, స్వార్థపు మనిషిని నేను! ఎంత అన్యాయంగా ప్రవర్తించాను! నాన్న ఆశలు, అభిరుచులు, తన జీవితం గురించి ఆయన కన్న కలలూ… వేటినీ ఆయన బతికి ఉండగా కనీసం నేను తెలుసుకోడానికి కూడా ప్రయత్నించలేదు. ఆయనేమిటో ఏనాడూ పట్టించుకోలేదు నేను.

అదే సమయంలో, ఫ్రాన్సిస్ ఆంటీకి విపరీతంగా కోపం తెప్పించిన ఉత్తరం, వంశానికి ఒక్కడిగా నేను నాన్న రాసినట్టు నాన్నమ్మకి రాసిన చివరి ఉత్తరం, నన్ను నేను కొంత క్షమించుకునేలా చేసింది. ఇదిగో, ఇదే ఆ ఉత్తరం పూర్తిగా.

డియర్ అమ్మా,

ఇదే నీకు నా చివరి ఉత్తరం. ఇక నేను ఎన్నో రోజులు బతకనని డాక్టర్లు చెప్పేశారు.

నా షాప్‌ను మంచి లాభానికి అమ్మేశాను. ఆ డబ్బు లోంచి ఐదు వేల డాలర్లకు చెక్కు రాసి ఫ్రాన్సిస్‌కు పంపిస్తున్నాను నీ అకౌంట్‌లో వేయమని. ఇది నీకు నా బహుమతి. ఫ్రాన్సిస్ నీకు పాస్‌బుక్ కూడా చూపిస్తుంది.

డాక్టర్లు నాకున్న జబ్బేమిటో నాకు చెప్పలేదు. కానీ నేను చనిపోతున్న కారణం నాకు తెలుసు. ఇది నేను కోరుకున్న జీవితం కాదు. అందుకే చచ్చిపోతున్నాను నేను. ఈ ఎడారికి నేను వచ్చి ఉండాల్సింది కాదు. ఇది నాకు తగ్గ స్థలం కాదు.

నేను చనిపోయాక నన్ను దహనం చేసి, బూడిదను సముద్రం మీద చల్లమని రూత్‌కు, నా పిల్లలకూ చెప్పాను.

నీ ప్రియమైన కొడుకు

జాక్.