ఆ కొండగుట్ట మీద ఉన్న ఒక్క గుడి గోపురం మాత్రమే వరదను తప్పించుకుని ఎత్తుగా కనిపిస్తోంది. గుళ్ళో దేవుడు మాత్రం మెడ వరకూ మునిగిపోయాడు.
ఎటు చూసినా నీళ్ళే.
మేడ మీద ఉన్న మూడు గదుల్లో మూడొందల మంది పెద్దలు, అరవై ఏడుమంది పిల్లలు, కుక్కలు, పిల్లులు, మేకలూ అందరూ కలిసి తలదాచుకున్నారు. చాలామంది వరదలో ఇళ్ళు పోగొట్టుకుని వేరే ఊళ్ళకి బతుకు జీవుడా అని తరలిపోయారు. పడవలు ఉన్నవాళ్ళ ఇళ్ళలో, ఒకరు ఇంటికి కాపలాగా మిగిలిపోగా, మిగిలినవాళ్ళు వెళ్ళిపోయారు.
రాత్రంతా వాన నీళ్ళలో నిల్చునే ఉన్నాడు చెన్నన్. అతని యజమాని వరద నుంచి తప్పించుకుని వేరే వూరు వెళ్ళిపోయి మూడు రోజులైంది. చెన్నన్‌కి పడవ లేదు. తన గుడిసెలోనే కొబ్బరిమట్టలతో అటక తయారుచేశాడు. వరద తగ్గకపోతుందా అన్న ఒకే ఒక్క ఆశతో కుటుంబమంతా దాని మీదే కూచుని గడిపారు.
గుడిసె వదిలిపోకుండా అంటిపెట్టుకుని ఉండటానికి కారణం మరోటుంది. నిండుగా కాసి గెలల భారంతో వొంగిపోతున్న తన ఆ ఐదు అరటి చెట్లు.
మట్టలు బలహీనమై, అటక కూలిపడింది. సహాయం కోసం పెద్దగా కేకలుపెడుతూ అరిచాడు చెన్నన్. ఎవరో ఒకరు సాయానికి రాకపోతే అతనితో పాటు, నలుగురు పిల్లలు, కడుపుతో ఉన్న భార్య, పెంపుడు కుక్క, పిల్లి, అందరూ ప్రాణాలు పోగొట్టుకొనేవారే.
ఎలాగో ఇంటి కప్పు ఎక్కి అటుగా పోతున్న నాటుపడవను చూసి కేకలు పెట్టాడు చెన్నన్. పడవ అతని వైపు చూసింది. అందరూ ఆశతో ముందుకు కదిలారు. ఇంట్లో అందరూ పడవ ఎక్కడానికి చేయందించాడు చెన్నన్. పిల్లి ఒక్క గంతుతో పడవలోకి ఎక్కింది. కుక్క మాత్రం ఎక్కలేకపోయింది. చెన్నన్ వెనకే ఇంటి కప్పు ఎక్కి చుట్టూ తిరుగుతూ పరిశీలిస్తూ అక్కడే మిగిలిపోయిందది.
పడవను అది గమనించలేదు, చెన్నన్ హడావుడిలో దాన్ని మర్చిపోయి పడవ ఎక్కేశాడు.
చెన్నన్ కుటుంబం అంబలాపుళ చేరింది క్షేమంగా.
ఇంటి కప్పు చుట్టూ తిరగడం పూర్తిచేసి తిరిగొచ్చేసరికి, చెన్నన్ కనిపించలేదు. వాసన చూస్తూ కంగారుగా అటూ ఇటూ వెదుకుతూ తిరిగింది. ఊఁ ఊఁ అని మూల్గింది భయంతో. అటక మీద కూచున్న కప్ప ఒకటి దాని హడావుడిని చూసి ముందు జాగ్రత్తగా నీళ్ళలోకి దూకి, అలలు పుట్టించింది.
ఆకలేస్తోంది. తిండి కోసం వాసన చూస్తూ అటూ ఇటూ తిరిగింది. కాసేపు తెరిపిచ్చిన వాన మళ్ళీ ముంచుకొచ్చేలా ఉంది. ఏం చేయాలో పాలుపోక గబుక్కున ముందు కాళ్ళ మీద సాగిలపడి పడుకుంది.
మొహం మాత్రం నీళ్ళపైకి పెట్టి, తేలుతోన్న మొసలిని చూసి కుక్క హడలిపోయి భయంతో తోక కాళ్ళ మధ్య పెట్టుకుని దూరంగా పోయి పడింది ఒక్క గంతులో. మొసలి ఇదేమీ పట్టనట్టు నీళ్ళలో నిశ్శబ్దంగా కదిలి ముందుకు పోయింది.
జోరున కురుస్తున్న వాన.
ఆకలి, అలసట, భయం.
తడిసిపోయిన గుడిసె కప్పుమీద బోర్లా పడుకుని చూస్తోంది. నిస్సహాయంగా మొరిగింది. విసురుగా పరిగెడుతున్న వానగాలి దాని ఏడుపుల్ని కూడా అన్ని వైపులకీ తీసుకుపోయింది. గుడిసెలకు కాపలాగా ఉండిపోయిన వాళ్ళెవరో దాని ఏడుపులు విని జాలిపడ్డారు. చెన్నన్ బహుశా అన్నం తింటున్నాడేమో. భోజనం చివర్లో కొంత అన్నం మిగిల్చి ముద్దచేసి కుక్కకి పెట్టడం అలవాటు. ఇవాళ భోజనం చివర్లో అలా ముద్ద చేస్తాడేమో అలవాటుగా.
దాని ఏడుపులు బలహీనపడి క్రమంగా ఆగిపోయాయి.
ఎవరో రామాయణ శ్లోకాలు చదువుతున్నారు. అది వినడానికన్నట్టు కాసేపు మౌనంగా ఉండి, మళ్ళీ అరిచింది. శ్రావ్యంగా వినపడుతున్న ఆ గొంతు దాన్ని అరవకుండా ఆపింది. కాసేపటికి పఠనం ఆగిపోయింది. గాలి చప్పుడు తప్ప మరేమీ లేదు.
ఒక చేప నీళ్ళలోంచి ఎగిరి తుళ్ళిపడింది. కప్ప ఒకటి నీళ్ళలోకి దూకిన చప్పుడు.
కుక్క ఒకసారి చిన్నగా మొరిగింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.
సూర్యుడు పైకొచ్చేసరికి కుక్క గొంతు బలహీనపడిపోయింది. అరుద్దామంటే చిన్నగా ధ్వనించింది. ఇంటి కప్పు చివర వరసగా కూచుని ఉన్న కప్పలు, కుక్క కదిలితే నీళ్ళలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి.
నీళ్ళలో మునిగిన చూరుపుల్లలను చూసింది, ఎక్కడైనా కాస్త తిండి దొరుకుతుందేమో అని.
తడిసిన దాని బొచ్చు నిండా దోమలు ముసిరి కుడుతున్నాయి. కాళ్ళతో దోమకాట్ల మీద గోక్కుంటూ, లేత ఎండలో నీరసంగా ఒరిగింది.
అప్పుడప్పుడూ అటుగా పోతున్న చిన్న చిన్న పడవల వైపు ఆశగా చూస్తోంది. దాని కళ్ళ ముందే ఒక పడవ ఆ గుడిసె ముందు నుంచే దాటిపోయి పొదల మధ్య చుక్కలా అదృశ్యమైంది. సన్నగా జల్లు మొదలైంది.
దాని ఆశలు అడుగంటిపోతున్నాయి.
కాసేపటికి ఒక పడవ నెమ్మదిగా అటువైపు వచ్చి గుడిసె ముందున్న కొబ్బరి చెట్లకు సమీపంలో ఆగింది. దాని ఆశలు మళ్ళీ చిగురించాయి. ముందుకాళ్ళ మీద సాగిలపడి, తోక ఊపుతూ ఆవలించింది. పడవలోంచి ఒకడు కొబ్బరి చెట్టెక్కి, ఒక కొబ్బరి బోండాం కోసుకొని నీళ్ళు తాగి, దొప్పల్ని నీళ్ళలో విసిరేసి, పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్క నిరాశతో చూస్తూ ఉండిపోయింది.
చచ్చిన గేదె ఒకటి నీళ్ళ మీద తేలుతూ వచ్చింది. కాకి వచ్చి వాలి దాన్ని పొడుచుకు తింటోంది. కుక్క నిస్సహాయంగా నాకూ ఆకలేస్తోందని అరిచింది. కడుపు నిండిన కాకి ఎగిరిపోయింది.
ఒక ఆకుపచ్చని పిట్ట ఎగిరొచ్చి అరటి చెట్టు బోదె మీద వాలి కువకువలాడింది. చీమల పుట్ట నీళ్ళ మీద తేలుతూ వచ్చి గుడిసె కప్పు తగిలి ఆగిపోయింది. అదేమిటో అర్థంకాలేదు దానికి. తినే వస్తువేమో అని దగ్గరికి వెళ్ళి వాసన చూసింది. చీమలు యథాశక్తి దాడి చేయడంతో, నొప్పికి విలవిలలాడుతూ ఒక్క గంతు వేసి ఇవతలికి వచ్చిపడింది. క్షణాల్లో దాని సున్నితమైన మూతి ఎర్రబడి వాచిపోయింది.
మధ్యాహ్నానికి ఇద్దరు మనుషులు పడవ నడుపుకుంటూ గుడిసె దగ్గరికి వచ్చారు. దాని మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. తోక ఊపుతూ గంతులు వేసింది. చేతనైనట్టు సంతోషం ప్రకటిస్తూ నీళ్ళ అంచు దగ్గరికి వెళ్ళింది పడవలోకి దూకడానికి సిద్ధమవుతూ.
ఇద్దర్లో ఒకడు కొంచెం తగ్గాడు.
“రేయ్, కుక్క ఉంది, చూడు” అన్నాడు నెమ్మదిగా.
రెండో వాడు” పోనిద్దూ” అన్నాడు నిర్లక్ష్యంగా.
పడవలోకి దూకడానికి రెండుసార్లు ప్రయత్నించి, నీళ్ళను చూసి భయపడి వెనకడుగు వేసింది. తనను తీసుకెళ్ళమని నానా రకాలుగా మూల్గి ప్రాధేయపడింది. దాని మూల్గులు హృదయ విదారకంగా ఉన్నాయి.
పడవ ముందుకు కదిలింది. వాళ్ళలో ఒకడు వెనక్కి తిరిగి చూశాడు.
“అయ్యో…”
అన్నది ఆ మనిషి కాదు. కుక్క!
అవును. ‘అయ్యో’ అని ఏడ్చింది కుక్కే. దాని గొంతులో నిస్సహాయత తాండవించింది. ఇక ఈ లోకానికి వీడ్కోలే అన్న బాధ దాని గొంతులో. దాని మూలుగుని చదవగలిగితే ‘ఇక మనుషులను ఎన్నడూ ప్రేమించకూడ’దనే భావం అర్థమవును.
పడవ దాటిపోయింది.
నీటి పామొకటి నీళ్ళలో కొట్టుకొచ్చి గుడిసె చూరుకి చిక్కుకుంది. లేని ఓపిక తెచ్చుకుని కుక్క భయంకరంగా మొరిగింది. పాము నీటిలోకి జారిపోయింది. నిస్సత్తువతో దాని అరుపులు మూలుగులోకి మారాయి. ఆకలి, భయం నిస్సహాయత, అధైర్యం నిరాశ ముప్పిరిగొన్న శబ్దం అది. దాని మూలుగు అర్థం వేరే గ్రహం నుంచి దిగొచ్చిన వాడికైనా ఇట్టే అర్థమవుతుంది.
ఆ రాత్రి భీభత్సమైన తుఫాను గాలి, వాన. నీళ్ళలో తేలుతున్న కప్పు ఊగిపోతోంది. రెండుమూడుసార్లు కుక్క దాదాపుగా జారి పడబోయి నిగ్రహించుకుంది. ఆ నీళ్ళలో కొట్టుకొస్తోన్న మొసలిని చూసి భయపడి శక్తికొద్దీ మొరిగి ఏడ్చింది.
కొబ్బరికాయలు, అరటి గెలలతో భారంగా నడుస్తూ పడవ ఒకటి గుడిసె చేరువగా వచ్చింది.
“కుక్క మొరుగుతోందెక్కడనుంచో. గుడిసెలో ఇంకా ఎవరైనా ఉన్నారా?” ఎవరో అన్నారు పడవ లోంచి.
ఆ గొంతు వినిపించినవైపు తిరిగి చూసింది. వాడు అరటి మొక్కలవైపు వెళుతున్నాడు. అది చూసి గొంతు పెంచి, గట్టిగా మొరగడం మొదలుపెట్టింది.
“జాగ్రత్తరోయ్, ఆ కుక్క కరుస్తుందేమో” రెండోవాడు హెచ్చరించాడు. అతడి మాట పూర్తి కాకముందే అది భీకరంగా అరుస్తూ అరటిమొక్కల దగ్గరున్న వాడి మీదకు దూకనే దూకింది.
వాడు చెన్నన్ అరటి గెలలను దొంగిలిస్తున్నాడు.
కుక్క తనపై దూకిన దూకుడుకి వాడు జారి నీళ్ళలో పడిపోయాడు.ఈ లోపే వాడు కోసిన అరటి గెలల్ని రెండోవాడు పడవలో సర్దాడు. వెటకారంగా దాన్ని చూస్తూ “నీ కోసం ఒకటి తెచ్చా, చూపిస్తా ఉండు” అని గుడిసె కప్పు మీదికి దూసుకెళ్ళాడు దానివైపు.
రౌద్రంగా మొరుగుతూ అది వాడి మీదికి దూకి పిక్కలో కోరలు దించింది. బాధతో అరుస్తూ వాడు పడవలోకి దూకాడు. రెండోవాడు ఈ లోపు పడవ నడిపే తెడ్డుతో కుక్క నెత్తి మీద ఒక్కటి బాదాడు. కెవ్వుమని అరుస్తూ కింద కూలిపోయింది అది. కానీ పడవ అక్కడి నుంచి కనుమరుగయ్యే దాకా అది బాధను లెక్కచేయకుండా అరుస్తూనే ఉంది.
అర్ధరాత్రి దాటాక బాగా ఉబ్బిపోయిన ఆవు కళేబరం ఒకటి నీళ్ళలో కొట్టుకొచ్చి గుడిసె కప్పు దాకా వచ్చి, అలల తాకిడికి కప్పు మీదికి చేరింది. భయంకరమైన ఆకలితో నకనకలాడుతున్న కుక్క, సంతోషంతో తోక ఊపుతూ చచ్చిన ఆవు మీదకి ఎక్కి, గబగబా దాన్ని చీల్చి ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నించింది.
ఆవు బరువుని తట్టుకోలేని గుడిసె కప్పు అకస్మాత్తుగా ఫెటిల్లున శబ్ద చేస్తూ విరిగిపోయింది. చచ్చిన ఆవు, దాని మీద ఉన్న కుక్క రెండూ నీళ్ళలోకి జారిపోయాయి. ఉబ్బిపోయిన ఆవు శవం రెండు పల్టీలు కొట్టింది.
కుక్క క్షణాల్లో అదృశ్యమైపోయింది.
ఇప్పుడు ఎవరికైనా వినిపిస్తే ఆ శబ్దం ఊళలు వేస్తున్న వానగాలిది, బెకబెకమంటున్న కప్పలదీ.
ఇళ్ళ దగ్గర కాపలాగా మిగిలిపోయిన వాళ్ళకు ఇక కుక్క ఆకలి ఏడుపులు, హృదయవిదారకమైన మూల్గులు, కేకలు, రక్షించమని అది చేసే ఆర్తనాదాలు ఏమీ వినిపించవు.
గలగలమని పారే వరద నీళ్ళు. అప్పుడప్పుడూ కొట్టుకొస్తున్న పశువుల శవాలు, వాటి మీద వాలి భోంచేసే కాకులు. ఈ వరదని తట్టుకుని లాభపడింది దోపిడీ దొంగలు మాత్రమే
చెన్నన్ ఆస్తిని కాపలా కాస్తూ ఆ చిన్న ప్రాణి, చివరి వరకూ విశ్వాసంతో దాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు వదిలి పోయింది. నీళ్ళలో నానిన గుడిసె కప్పు పూర్తిగా మునిగిపోయింది.
అంతా ముగిసిపోయింది. ఇప్పుడు అక్కడ నీళ్ళు తప్ప ఇంకేమీ కనిపించడంలేదు.
వరద నెమ్మదిగా తగ్గడం మొదలైంది. చెన్నన్ ఆ నీళ్ళలో ఈదుకుంటూ వచ్చాడు కుక్కని వెదుక్కుంటూ.
కొబ్బరి చెట్ల కింద, వరద నీటి అలలకు నెమ్మదిగా వూగుతూ ఒక కుక్క మృతదేహం అతని కంటపడింది. చెన్నన్ దాన్ని ముందుకు తిప్పి చూశాడు. తన కుక్కేనా అనుకున్నాడు. ఆ ఊహే అతన్ని చిత్రవధ చేసింది.
ఆ కుక్కకు ఒక చెవి లేదు. ఏ చేపలో తినేసి ఉంటాయి. అది బతికి ఉన్నపుడు దాని రంగేమిటో కూడా ఊహించలేనంతగా శరీరం ఉబ్బి, కుళ్ళిపోయి ఉంది.
చెన్నన్ భారంగా కన్నీళ్ళతో ముందుకు కదిలాడు.
(మళయాళ మూలం: వెల్లపోకత్తిల్. ఆంగ్లానువాదం: O. V. Usha)