కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.
మార్చ్ 2022
రచనలు ఎందుకు పత్రికలకు పంపాలి? ఎప్పుడు అచ్చేస్తారో, ఎందుకు వేస్తారో, వేస్తారో వెయ్యరో కూడా చెప్పని పత్రికల దగ్గర పడిగాపులు పడే కన్నా, అనుకున్నదే తడవు ప్రచురించుకొనే వెసులుబాటిచ్చే సొంత వేదికలు, క్షణాల్లో స్పందనని కళ్ళ ముందుంచే సోషల్ మీడియా ఖాతాలే మెరుగని రాసే గుణమున్న అందరికీ అనిపించడంలో చిత్రమేమీ లేదు. అయితే, సాహిత్యవ్యాసంగం మిగతా కళలలాగా ఎవరి స్థాయి వారికి ప్రత్యక్షంగా తెలియనీయదు. ఇది నా అనుభవం, నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను అన్న ధోరణి సాహిత్యవ్యాసంగపు ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. చిత్రిక పట్టడం వల్ల తొలిప్రతిలోని నిజాయితీ పోతుందన్నదీ శుద్ధ అబద్ధమే. చాలామంది రచయితలకు తమ రాతలలో ఏం లోపించిందో తెలియదు. ఎవరో కొందరు మినహాయింపుగా ఉన్నప్పుడు, వారినే ఆదర్శంగా తీసుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిది. ఆలోచనల్లోని స్పష్టత అక్షరాల్లోకి రావడం లేదని గమనించుకునే తెలివి అందరికీ ఉండదు. రాద్దామనుకున్న దానికి, రాసిన దానికీ ఉన్న భేదాలు తరచి చూసుకునే ఓర్పూ కొద్దిమంది ఆస్తే. కానీ అది వాళ్ళ సాహిత్య సృజనకేమీ అడ్డు కాదు. ప్రచురణకు అసలే అడ్డు కాదు. అయినప్పటికీ, రాద్దామనుకున్నదేదో రాశారో లేదో, రాసినది ఎంతవరకూ దానికది సంపూర్ణంగా స్వతంత్రంగా నిలబడగలుగుతుందో లేదో, మూడో మనిషి చేతుల్లోకి చివరిప్రతి వెళితేనే రచయితకు తెలుస్తుంది. ఒక బ్లాగుకో, సోషల్ మీడియా అకౌంట్‌కో మన రచనను అప్పగించే కన్నా, పత్రికకు పంపిస్తే అన్నిటికంటే ముందు, అది రచయిత, రచయిత తరఫువాళ్ళు, లేదా రచయిత ఆమోదించిన, రచయిత ఆజ్ఞలకు షరతులకు లోబడి మాట్లాడనున్న ఒకానొక ఆంతరంగిక వృత్తాన్ని దాటుకుని, రచనను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టకుండా చూడగల మరొక వృత్తంలోకి వెళుతుంది. అది, ఒక రచనను సర్వస్వతంత్రంగా నిలబెట్టి, దాని విలువను కేవలం సాహిత్య విలువ, ప్రతిభ ఆధారంగా బేరీజు వేస్తుంది. పత్రిక స్థాయి, ప్రమాణాలు మంచివైతే, రచయితకు ఒక చక్కని పరామర్శ/విమర్శ దొరుకుతాయి. పరిష్కర్తలయిన సంపాదకులతో చర్చలు సాహిత్య దృక్పథాన్ని విశాలం చేస్తాయి, అభిధనూ ధ్వనినీ మరింత బలంగా రచనలో వాడుకోవడం నేర్పుతాయి. ఇలా రచనను ఒక కొత్త చూపుతో గమనించుకునే వీలు కలుగుతుంది. ఎడంగా నిలబడి తప్పొప్పులను చర్చించే సావకాశం దొరుకుతుంది. రచన తిరస్కరించబడినప్పుడు, దానికి కారణాలు అర్థమయ్యే కొద్దీ రచనను శ్రద్ధగా గమనించడం అలవాటవుతుంది. ఇవన్నీ రచనను ఉద్వేగభరితంగా మాత్రమే కాక, తార్కికంగా కూడా బలపరుచుకునే వీలిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకోవడం, అనవసరమైన పదాల, వాక్యాల ఏరివేత అలవాటుగా మారడమన్నది ఒక పరిష్కర్త సహాయంతోనే సాధ్యమవుతుంది. అలా రచనలను మెరుగు పెట్టుకొనే కొద్దీ రచనావ్యాసంగం దానికదే పదును తేలుతుంది. దీనివల్ల తెలుగు భాషకో, తెలుగు సాహిత్యానికో ఈ రోజుకీ రోజు ఏదో లాభిస్తుందన్న అత్యాశ కాదు కానీ విమర్శ తిరగలిలో నలిగితే మంచి సాహిత్యపుటలవాట్లు కొద్దిమందికయినా అబ్బుతాయని నమ్మకం.
నువ్వనుకున్నావ్ కొండమావయ్యా నే పడుకున్నాననీ! వెన్నెలగా ఉంది కదూ ఇవాళ! పెద్దకిటికీ తీసివుందిగా! ఆకాశం మాంఛి తెల్లగా వెన్నలా మెత్తగా భలే బావుంది. అలా చూస్తూ ఉంటే కాస్సేపటికి చందమామ కిటికీకి ఎదురుగ్గా దగ్గరగా వొచ్చీసీడు. కళ్ళు మూసుకుని తెరిచీసరికి నేను ఆకాశంలో ఉన్నా. ఎంత మెత్తగా ఉందో ఆకాశం!
అన్నాచెల్లెళ్ళను గురించి ఇలాంటి వస్తువు అంతకుముందు ఇంగ్లీషు నవలల్లో ఎవ్వరూ చిత్రించలేదు. ఒకరకంగా ఇది జార్జి ఎలియట్ ఆత్మకథాత్మక నవల అనీ, ఆమెకు అన్న పట్ల అమితమైన ప్రేమ ఉండేదనీ విమర్శకులంటారు. ఇప్పటి విమర్శకులు ఫ్రాయిడియన్ సిద్ధాంతాలతో వ్యాఖ్యానించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న నవల ఇది.
ఒక స్పష్టమైన కారణం లేకుండా నా ప్రాణస్నేహితుడు నాకు ద్రోహం చేయడం నిజంగా నా హృదయాన్ని బద్దలు కొట్టింది. నా ఆ మిత్రుడి క్రూరమైన నిర్లక్ష్య ప్రవర్తన నన్ను, మా క్రికెట్ టీమ్‌ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. జీవనోత్సాహం అనేది జీవితంలోనూ ఆటలోను నశించిన నా వంటి కెప్టెన్ వల్ల క్రమంగా రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ టీమ్ జాలిగా కనుమరుగైంది.
షెఫ్‌సాన్ ప్రజలు మృదుభాషులు, ప్రశాంతజీవులు. తమ పనేదో తాము చేసుకుంటూ పోయేవాళ్ళు. మరకేష్, ఫెజ్ నగరాల్లో మొహం మీద గుచ్చి గుచ్చి మాట్లాడే మనుషుల్ని చూశాక ఇక్కడివాళ్ళను చూస్తే పిల్లగాలి వీస్తున్నట్టనిపించింది. ఇతర పట్టణాల్లో లాగా ఇక్కడ దళారీల వేధింపులు లేవు. బలవంతపు అమ్మకాలు లేవు.
అకస్మాత్తుగా మరో లైన్ మెరిసింది మెదడులో. ఒంటి నుండి నీటి బొట్లు జారిపడుతూ ఉండగా సుష్మ కిచెన్ లోకి పరిగెత్తుకొచ్చింది, ఆ లైను మాయమయ్యే లోపే కాగితం మీద పెట్టేయాలని. తెరచి ఉన్న పరదాల వెనక నుంచి, ఎదురింట్లో పనీ పాటా లేకుండా కూచునుండే డేగ కళ్ళు రెండు తనని చూస్తున్నాయేమో అని కూడా తోచలేదు సుష్మకి. ఆ లైన్ రాయడం పూర్తయ్యేసరికి ఒంటి మీద నుంచి జారిన నీటి బొట్లతో ఆమె పాదాల చుట్టూ చిన్న మడుగు కట్టింది.
చుట్టుపక్కల పిల్లల్లాగే అతను పెరిగి పెద్దవాడయ్యాడు. చేతిలోకి పుస్తకం చేరింది. కాలేజీ డిగ్రీని చేతపుచ్చుకుని ఉద్యోగస్తుడయ్యాడు. పెళ్ళి చేసుకున్నాడు. అమెరికా చేరి ఇల్లు కొనుక్కున్నాడు. అతని చేతిలో పుస్తకం అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉండేది; అప్పుడప్పుడూ మాత్రం వంట చేస్తున్నప్పుడు వంటల పుస్తకం, పడకగదిలో శృంగార పుస్తకం. పుత్రులకి కారకుడయ్యాడు, పౌత్రులతో ఆడుకున్నాడు. రోజులో మిగిలిన సమయంలో పుస్తకాన్ని వదలలేదు.
ఫాదరిన్లాస్ గిఫ్ట్ అని
రాయని మోటారుసైకిలెక్కి
సైకిల్ తొక్కేవాడిని చూసి జాలిపడుతూ
కారులో వెళ్ళేవాడిని చూసి ఈర్ష్యపడుతూ
భాను’డి’ విటమిను ఒంట పట్టించుకుంటూ
రాచ కార్యాలయానికి తగలడి
‘ఆ మెడకి చుట్టుకున్నదేవిటి?’
ఎవరిదో నిశ్శబ్దం
‘ఆ పిడికిలిలో ఏమిటి?’
అడగలేని ప్రశ్నలు.
‘ఆ కప్పుకున్నదేవిటి?’
పెంచుకున్న ఆశలు.
ఇది
మిణుగురు గుండెలోని
ఉదయపు వేడీ
రాత్రుల చీకటీ
ఊగే చెట్లూ, పారే వ్యర్ధాలూ
ఊపిరాడనివ్వని కమరుతో పాటు
తనకంటూ దాచుకున్న గుప్పెడు గాలి.
మానవ సమాజం ఎప్పటికీ ఏకసమూహం కాదు, కాలేదు. మానవ ఆవిర్భావం నుండి అదెప్పుడూ కుదురులు కుదురులుగా సమూహ ప్రత్యేకతలతో అస్థిత్వాలతో బతకడానికే ప్రయత్నించింది. నాగరికసమాజాలు ఏర్పడే క్రమంలో ఎవరి సామర్థ్యాల మేరకు వారు ఎక్కువ తక్కువలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేస్తూనే ఉంటారు. ఆధిక్యత, ఆధిపత్య భావన అనేవి మానవ రక్తంలో కలిసిపోయిన జంతుభావనలు.
సుమారు నూటతొంబై ఏళ్ళ తరువాత అంతకు మించి ఎన్నో రెట్ల శక్తితో వస్తోంది శాండీ! తీవ్రంగా వచ్చి తాకే హరికేన్ వేగానికి, హడ్సన్ నది అల్లకల్లోలమై – నగర వీధులు, రాకపోకలని సుగమం చేసే టనల్స్, సబ్‌వేలు జలమయమై పోయి, కరెంటు పోయి రెండు నగరాలూ ఊహకి అందనంత భారీనష్టం ఎదుర్కోవలసి రావచ్చని వాతావరణ నిపుణుల అంచనాలు చెపుతున్నాయి. కానీ ఈ విషయాలు దూరాన వున్న త్యాగికి చెప్పి అనవసరపు ఆందోళన కలిగించడం ఎందుకు?
వాటితోబాటే మోసాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు కూడా. నోట్లో తాంబూలం వేసుకుని పెదిమలు పక్కకు తిప్పి, చాడీ చెప్పారంటే ఆ శివుడైనా పార్వతిని పక్కకు పెట్టేయగలడంటే చూసుకో! వాళ్ళెవరూ కవులూ కారు, వాళ్ళ మాటల్లో ధర్మం అనే అఱం లేదు కాబట్టి సరిపోయింది. అధర్మపాలనో, ప్రజలకు సంక్షోభం కలిగించే పనులకో తలపడిన రాజులమీద కవులు తిరగబడి ‘అఱం పాడటం’ అనే ధర్మాన్ని తమ పద్యాల్లో వస్తువుగా పెట్టి పాడితే, ఆ రాజు వంశమే నిర్మూలం అయిపోయేది!
బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ
అడుగులు లెక్కపెడుతూ
చెట్టు కొమ్మలంతున్న
బుర్ర మీసాల సందున
చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ
ముతక తాత వెళ్తూ ఉంటాడు
జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు.
ఉన్నట్టుండి
పరిమళాలపారిజాతాలై కురిసిపోవాలి
గతపుజాతరలో తప్పిపోయి
పరధ్యానంగా కూర్చున్నపుడు
దాచుకున్న బ్రతుకు పానకపు రుచి
గుర్తు రావాలి
ఈ నాలుగు కథలు వస్తుపరంగా ప్రయోగాత్మకమైన కథలు. స్వీకరించే వస్తువు కొత్తదైనప్పుడు, మూస వస్తువుల్ని కాదని కొత్త వస్తువులతో కథలు రాసినప్పుడు ప్రయోగమే అవుతుంది మరి! అన్ని కథలు సమకాలీన కథలు. ఇవాల్టి కథలు. ఆధునిక సమాజంలో సంభవిస్తున్న మార్పులే ఆమె కథలకి వస్తువులు. ఇక కథలు వస్తుపరంగానే కాకుండా, రూపపరంగా వైవిధ్యాన్ని, విలక్షణతనీ కూడా కలిగివున్నాయి.
నిజానికి మహా సౌందర్యాఘాతమూ నరకమే. అదేదో గట్టిగా అనుభవించిన దాఖలా ఈ కవిగారు తన గురించి ఈ పుస్తకంలో చెప్పినచోట కనిపించింది. నా సొంత అనుభూతిలో నడిచి నడిచి సీదా తిరిగి మళ్ళీ ఈ సంకలనంలోని కవితల్లోకి ఇరుక్కున్నట్టయింది. అంటే భారీ సెంటిమెంట్లు, మరికొళుందు వాసన గోల కాదు నాది. ఈ కవితలు పన్నిన వలే అంత!
క్రితం సంచికలోని గడినుడి-64కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-64 సమాధానాలు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.