విడూడభుడి కల

న జచ్చా వసలో హోతి, న జచ్చా హోతి బ్రహ్మణో
కమ్మునా వసలో హోతి, కమ్మునా హోతి బ్రహ్మణో
(142: వసల సుత్తం, సుత్తానిపాత)

పుట్టుక చేత ఒకడు చండాలుడు కాడు, పుట్టుకచేత ఒకడు బ్రాహ్మణుడు కాలేడు. చేసే పనుల (కర్మ) చేతనే మనిషి బ్రాహ్మణుడు అవుతాడు, కర్మల చేతనే చండాలుడవుతాడు.


క్రీ.పూ. 502. శ్రావస్తి కోసల రాజ్యం. మహారాణి వాసభఖత్తియ అంతఃపురం.

“అమ్మా, ఇదంతా నిజమేనా!?” పదహారు సంవత్సరాల యువరాజు విడూడభుడి ముఖం అవమానభారంతో ఎర్రగా కందిపోయినట్లుంది.

పదిహేను సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న జీవితం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్లనిపించింది వాసభఖత్తియకు. ఏం చెప్పాలో తెలియక కొద్దిసేపు మౌనంగా కుమారుని ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది. కాసేపయ్యాక ఇక చెప్పకతప్పదన్నట్లు “నిజమే విభా, నువ్వు విన్నది నిజమే” ఒక్కో అక్షరాన్ని కూడదీసుకొని కష్టంగా అస్పష్టంగా పలికింది.

తన జీవితంలో జరిగిన ఒక్కోసంఘటన గుర్తుకు వచ్చేకొద్ది వాసభఖత్తియ ముఖం మ్లానమయ్యింది. తల్లి నాగముండ పట్ల, తన పట్ల తండ్రి మహానాముడు చూపిన నిరాదరణ ఊహ తెలిసిన వయసునుంచే చేదు అనుభవం. అచ్చు గుద్దినట్లు తండ్రి పోలికలతో బంగారువర్ణంతో శాక్యబాలికలాగే ఉండటాన్ని కూడా సహించలేక తనది శాక్యజాతి కాదు, సంకరజాతని, తన ధైర్యాన్ని, ఠీవిని చూసి ‘నువ్వేమైనా క్షత్రియకన్యవనుకుంటున్నావా? బానిసకు పుట్టిన బానిస’వని హేళన చేసిన అంతఃపుర స్త్రీలు గుర్తుకొచ్చారు.

కోసల మహారాజు ప్రసేనజిత్తు బుద్ధుని పైన గౌరవంతో అభిమానంతో ఓ శాక్యకన్యను వివాహాం చేసుకోవాలనుకొని మహానాముని వద్దకు మంత్రులను పంపినప్పుడు కపిలవస్తు అంతఃపురమంతా కలకలమేరేగింది – ‘ఎంత మహారాజైతే మాత్రం ఓ మాతంగుడుకి శాక్యకన్యను ఇచ్చి వివాహం చేయడమా?’ కోసలమంత్రులకు ఆ మాట చెప్పే ధైర్యం లేక శాక్యులు ఆడిన నాటకమే కదా తనను రాణిని చేసింది. ఆ రోజు ఆ మహానాముడు దీనంగా ముఖంపెట్టి అమ్మతో అన్నమాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ‘నాగా, మమ్మల్మి ఈ గండం నుంచి గట్టెక్కించు. చూస్తూ చూస్తూ శాక్యులెవరూ వాళ్ళ కూతురుని ఆ జాతితక్కువ వానికి ఇచ్చి చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా వాసభని ఒప్పించు. మంచి రంగు, ఎత్తు, గిరిజాల జుత్తుతో శాక్యకన్యలను మించిన అందంతో ఉంది వాసభ. దాసి కూతురనే విషయం బయటకు పొక్కకుండా చూసే బాధ్యత నాది. కోసల మంత్రులను ఒప్పించి వివాహం కూడా శ్రావస్తిలోనే జరిగే ఏర్పాట్లు చేస్తాను. ఒక్కసారి అది అంతఃపురంలో అడుగుపెడితే ఇక ఏ ఇబ్బందీ ఉండదు.’ అతని ఎదురుగా ఏమీ మాట్లాడని అమ్మ ఆ రాత్రి తనని పట్టుకొని ‘ఇదంతా మోసం కదా తల్లీ. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఇది దేనికి దారి తీస్తుందో వీరికి అర్థం అవ్వడం లేదు. మహారాజు ప్రసేనజిత్తు భగవానుడి అనుయాయుడు. అదొక్కటే ఆశ’ అంటూ పెద్దగా ఏడవడం గుర్తుంది.

అమ్మ మొదటి నుంచి బౌద్ధ ఉపాసకురాలుగానే ఉంటూ వచ్చింది. శాక్యుల పట్ల భక్తితో ఆదరంగానే ఉండేది. ఓ సారి కపిలవస్తు వచ్చిన బుద్ధుడిని చూడటానికి శాక్యులందరూ ఎగబడ్డారు. అమ్మ తనను తీసుకెళ్ళి ఆయన పాదాలకు ప్రణమిల్లచేసింది. ఆయన నవ్వుతూ ఆదరంగా చూశాడు తన వైపు. శాక్యులందరూ ఒకలాగే అనిపిస్తారు. తన వంట్లో ప్రవహించే శాక్యరక్తం పట్ల తనకెప్పుడూ నిరసనే.

మహారాజు ఎంత ప్రేమగా చూసుకున్నా కోసలలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతిక్షణం ఒక యుగంగానే గడిచింది. తొమ్మిదోనెల గర్భంతో ఉన్నప్పుడు కదా తన పుట్టుక విషయం తెలిసి మహారాజు కోపంతో ఊగిపోయింది. గర్భవతిని చంపే ధైర్యం చేయలేక, బయటకు పంపితే బుద్ధుడికి ఎక్కడ తెలుస్తుందోనని పశువుల పాకలో ఉంచింది. అక్కడే కదా విభను కన్నది. ఆ సమయంలో అక్క మల్లిక సాయం లేకపోతే అప్పుడే చనిపోయేది తను! బహుశా ఆమె చెప్పినందువల్లనే విభ పుట్టినప్పుడు బుద్ధుడు, ఆనందుడు ఇద్దరూ వచ్చి మహారాజును కలిసింది. ఏం చెప్పారో తెలియదు కాని, వారి మాటలు విన్న తరువాతే కదా మళ్ళీ తనను అంతఃపురంలోకి గౌరవంగా ఆహ్వానించింది. ఇన్ని జరిగినా తనెప్పుడు బుద్ధుడికి సాష్టాంగపడింది లేదు. తన చూపులో నిరసనను తగ్గించుకున్నదీ లేదు.

అక్క మల్లిక పూర్తిగా బౌద్ధం వైపు మరలిపోవడం, మహారాజుకి తనపై పెరిగిన ప్రేమ, విభ ఒక్కడే మగసంతు కావడం ఇవన్నీ చివరికి తనను కోసల మహారాణిగా చేశాయి. విభకి ఎందుకో చిన్నప్పటి నుంచే బుద్ధుని పట్ల భక్తి ప్రపత్తులు ఎక్కువ. ఆనందుడితో చనువు. ఇప్పుడు వాడికి శాక్యులు చేసిన వంచనే కాక, వారి వివక్షాపూరిత ప్రవర్తన కూడా తెలిసిపోయింది, అనుకుంటూ నిట్టూర్చింది వాసభఖత్తియ.


క్రీ.పూ 487. మహారాజు విడూడభుడి శయనమందిరం.

పరిచారికలు అప్రమత్తతతో వింజామరలు వీస్తూ మహారాజు నిద్రకు భంగం కలుగనివ్వడం లేదు. అయినా, మెత్తటి హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్న విడూడభుడు అసహనంగా నిద్రలో అటూ ఇటూ కదులుతూ దిగ్గున లేచి కూర్చున్నాడు. పరిచారికలు భయంతో దూరంగా జరిగి నిలబడ్డారు.

ఉరుకులెత్తుతూ పైన పడిన నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కోసల మహాసైన్యపు హాహాకారాలు, గుర్రాల సకిలింతలు, ఏనుగుల ఘీంకారాలు. మెలుకువరాని నిద్ర నుంచి మెలుకువలేని నిద్రలోకి మునిగిపోతూ నిదానంగా అస్పష్టమై పోతున్న ముఖం.

గడిచిన రెండు సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ అదే కల కలవరపరుస్తూనే ఉంది.

భగవానుడు చెప్పిందే జరగబోతుందా!?

‘నువ్వు నదిని దాటుదామనుకుంటున్నావా? లేదా దానిలో కొట్టుకుపోవాలనుకుంటున్నావా విడూడభా?’ అని భగవానుడు దేని గురించి అడుగుతున్నాడు? నా కల గురించా లేక నాలో పెల్లుబుకుతున్న ద్వేషం గురించా? నాది ద్వేషమేనా, లేదా నా కుటుంబానికి శాక్యులు చేసిన వంచన పట్ల రగులుతున్న ప్రతీకార భావననా? ఎంత సముదాయించుకున్నా, ఎన్ని జవాబులు చెప్పుకున్నా ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు దీన్ని అధిగమించలేకపోతున్నానో!

గత రెండుసార్లుగా నన్ను ప్రేమగా ఎలా వారించాడో, పౌర్ణమినాడు కూడా జేతవనంలో కలిసినప్పుడు అలానే వారించాడు భగవానుడు. హృదయాన్ని గుచ్చుతున్న బాకులాంటి అవమానపు వేదనను తొలగించే అనేక విషయాలు ఎప్పటిలానే సున్నితంగా చెప్పాడు. క్షమ, దయ, సహనం లాంటి మాటలు నాలో రేగుతున్న అల్లకల్లోల సంద్రాన్ని ప్రశాంతసాగరంగా మార్చగలవా?

తండ్రి ప్రసేనజిత్తు భగవానుని మాటలు విని తల్లిని, తనను ఆదరించి ఉండచ్చు. పదహారు సంవత్సరాలు పుట్టినింటికి తను వెళ్తానన్నా వెళ్ళనీకుండా ఆపడానికి అమ్మ ఎంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని ఉండి ఉంటుందో! అక్కడ తనపై చూపిన మోసపు గౌరవానికి, ఆ తరువాత జరిగిన అవమానకర పరిణామాలు తెలిసి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో!

కాలం గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ శాక్యులను క్షమించి ఈ విషయాన్ని తేలికగానే తీసుకొని ఉండచ్చు. కాని, మోసపోయిన తండ్రికి, తక్కువ చేయబడ్డ తల్లికి లేని దుఃఖం నన్నెందుకు ఇంతగా వేధిస్తుంది. ఇది కాలంతోపాటు శాక్యుల పట్ల మరింత వ్యతిరేకతను పెంచడమే కాదు, తండ్రిపై కూడా ద్వేషాన్ని పెంపొందించింది. అందుకే కదా తండ్రి, బుద్ధుడు లేని సమయంలో కోసలను హస్తగతం చేసుకుంది. మహామంత్రి దీర్ఘచరాయణుడు మాత్రం నిరంతరం శాక్యులపై పగ తీర్చుకోవా అని రెచ్చగొడుతూనే ఉన్నాడు. ‘రాజ్యం చేతికి వచ్చాక కూడా బుద్ధుడి పట్ల ఈ భయభక్తులేంటి?’ అని చిరాకుపడుతూనే ఉన్నాడు. తన శ్రేయోభిలాషి. తనతో పాటు కపిలవస్తుకి వచ్చి అక్కడి పరిస్థితిని గమనించినవాడు. వేగులను అక్కడే ఉంచి శాక్యుల వంచనాబుద్ధిని బయటపెట్టినవాడు, ప్రతిక్షణం తనకు తోడునీడగా ఉంటూ తండ్రిని కాదని రాజ్యాన్ని చేతికి అప్పగించినవాడు కదా దీర్ఘచరాయణుడు. కనీసం అతని కోరికనైనా తీర్చడం మిత్రధర్మం.

‘లిచ్ఛవులు, శాక్యులు, కోలీయులు… వీరికి క్షత్రియులమనే అహంభావం. వర్ణ సంకరం పట్ల ఏహ్యత. బ్రాహ్మణులమైనా మేము కూడా మీ పట్ల ఆదరంగానే ఉన్నాం కదా! మరి ఈ శాక్యులు నువ్వు కూర్చున్న ఆసనాన్ని, వాడిన వస్తువులను బయటవేయించి దహనం చేయించడం ఎంతటి వివక్షా ప్రదర్శన విడూడభా! లేని గౌరవాన్ని నటిస్తూ శాక్యులందరు నిన్ను చూసి లోలోపల నవ్వుకొని ఉంటారు. మరిక్కడేమో అదే శాక్యకులం నుంచి వచ్చిన బుద్ధభగవానుడు మాత్రం తను ఏర్పరిచిన సంఘంలో అందరూ సమానమే అని బోధిస్తాడు. నువ్వు ఆయనకు సాష్టాంగ పడతావు’ అంటూ దెప్పుతాడు ధీర్ఘచరాయణుడు.

‘నీ కోరికే నీ దుఃఖం విడూడభా!’ అంటూ చిరునవ్వుతో చెప్తాడు భగవానుడు.

అది కోరిక కాదు తథాగతా, శాక్యుల చేసిన వంచన వలన రగిలిన అగ్ని కదా అని చెప్పలేను. పెదతల్లి మల్లిక, అక్క వజీరా నన్ను ప్రేమగానే చూశారు. బావ అజాతశత్రు క్షత్రియుడైనా కూడా నన్ను, నా పుట్టుకను తక్కువగా చూసిందేమీ లేదు. ఏమాత్రం వివక్ష లేకుండా అక్కను పట్టపురాణిగా చేసుకోలేదా? కాకుంటే వాళ్ళకి కోసలపై ఆశ. అదీ న్యాయమే. ఏదో ఒక రోజు సమరం తప్పదు. కానీ భగవానుడు జీవించి ఉన్నంత వరకు అజాతశత్రు లిచ్ఛవులపైన కాని, కోసలపైన కాని దండెత్తే ప్రయత్నం చేయలేడు. బావకి ఉన్నంత సహనం నాకెందుకు లేదు? నేను కూడా ఆగితే సరిపోతుందేమో కదా! కాని ఈ లోపు ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందో. దీర్ఘచరాయణుడి నోటి వెంట ఎన్ని మాటలు వినవలసి వస్తుందో!

నా రక్తంలో బానిస రక్తం ఉందని తెలియడం నాకవమానిపిస్తుందా, లేకా శాక్యుల మోసానికి హృదయం భగ్గుమంటుందా? మా తండ్రి దీన్ని ఎలా సహించగలిగాడు? నేను దాన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నా? హే! భగవాన్ ఇలాంటి నిద్రలేని రాత్రులు నా ప్రాణాలను నిలిపేట్లు లేవు. వీస్తున్న చల్లటిగాలి కూడా దేహాన్ని దహిస్తున్నట్లుగా ఉంది.

మూడవ జాము గడిచింది. నగరం నిద్రలో జోగుతుంది.

‘ఊహూ, ఇక నిద్ర వచ్చే అవకాశం లేదు’ అనుకుంటూ ఒంటరిగా విడూడభుడు అచిరావతి ఒడ్డున ఉన్న విశ్రాంతి మందిరానికి బయలుదేరాడు.

సద్ధా తలతి ఓఘం, అప్పమాదేన అణ్ణవం
వీరియేన దుక్ఖమచ్ఛేతి, పఞ్ఞాయ పరిసుజ్ఝతి (186 ఆళవక సుత్తం, సుత్తానిపాత)

మనిషి శ్రద్ధ చేత వరదను దాటుతాడు. అప్రమత్తత చేత సముద్రాన్ని దాటుతాడు. ప్రయత్నంతో దుఃఖాన్ని నశింపచేస్తాడు. ప్రజ్ఞతో పరిశుద్ధతను పొందుతాడు.

చిన్నతనంలో ఆనందుడి దగ్గర కూర్చొని వల్లెవేసిన సుత్తం గుర్తుకు వస్తుంది. ఆనందుడు ఎన్నెన్ని విషయాలు చెప్పేవాడు. జాతులు, కులాలు వీటిని ఎప్పుడూ పట్టించుకోకని ఎన్నో సుత్తాలు వినిపించేవాడు.

న జచ్చా బ్రహ్మణో హోతి, న జచ్చా హోతి అబ్రాహ్మణో
కమ్మునా బ్రహ్మణో హోతి, కమ్మునా హోతి అబ్రాహ్మణో(655)

పుట్టుకతో ఒకడు బ్రాహ్మణుడు కాలేడు, పుట్టుక వలన ఒకడు అబ్రాహ్మణుడు కాలేడు. చేసే పనుల చేత(కర్మ) ఒకడు బ్రాహ్మణుడు లేదా అబ్రాహ్మణుడు అవుతాడు.

కస్సకో కమ్మునా హోతి, సిప్పికో హోతి కమ్మునా
వాణిజో కమ్మునా హోతి, పేస్సికో హోతి కమ్మునా(656)

ఒకడు తాను చేసే పనిని బట్టే కర్షకుడు గాను, శిల్పిగాను, వర్తకుడుగాను, సేవకుడుగాను అవుతాడు.

చోరోపి కమ్మునా హోతి, యోధాజీవోపి కమ్మునా
యాజకో కమ్మునా హోతి, రాజాపి హోతి కమ్మునా(657)

కర్మచేతనే (చేసే పని చేతనే) ఒకడు దొంగ, యోధుడు, యాజకుడు, రాజు అవుతాడు.

కమ్మునా వత్తతి లోకో, కమ్మునా వత్తతి పజా
కమ్మనిబన్ధనా సత్తా, రథస్సాణీవ యాయతో. (659 వాసేట్ఠసుత్తం, సుత్తానిపాత)

పని చేతనే లోకం బ్రతుకుతుంది, పని చేతనే ప్రజలు. ఇరుసుపైన ఆధారపడి కదిలే రథంలా జీవులు కర్మ నిబద్ధులు.

ఏదో ఒకరోజు నేను ఎదుర్కోబోయే నా మానసిక స్థితిని ఊహించే ఇవన్నీ నేర్పేవాడా? ఏమో మరి!

ఈ మధ్య పూర్వారామంలో కలిసినప్పుడు ఆనందుడు –

యం పరే సుఖతో ఆహు, తదరియా ఆహు దుక్ఖతో
యం పరే దుక్ఖతో ఆహు, తదరియా సుఖతో విదూ (767, ద్వయతానుపస్సనా సుత్తం, సుత్తానిపాత)

మూర్ఖుడు దేన్ని శ్రేష్ఠమనుకుంటాడో జ్ఞాని దాన్ని హీనమంటాడు. మూర్ఖుడు హీనమన్నది జ్ఞానులకు శ్రేష్ఠం – అనే సుత్తాన్ని నవ్వుతూ వినిపించాడు.

అంటే నేను అనుకున్నది హీనమని భావిస్తున్నాడా లేక నాది మూర్ఖత్వమని హేళన చేస్తున్నాడా? అయినా ఆనందుడు కూడా శాక్యుడేగా?

ఒకపక్క శాక్యులపై పగ, మొత్తం శాక్యజాతినంతా నరికిపోగులు పెట్టాలనేంత. ఇంకో పక్క ఈ శ్రమణ శాక్యులపైన వారి మాటలను జవదాటలేని భక్తీ, గౌరవం. నన్ను నేను ఎలా నిర్ణయించుకోవాలో కూడా తెలియని అయోమయం లోకి నెట్టివేయబడుతున్నానా?

అంత బతుకు బతికిన నా తండ్రి నా పైన భయం, కోపంతోటి అల్లుడు అజాతశత్రు సాయం కోసం వెళ్ళి ఆ కోట ద్వారం వద్ద మరణించడం మరో అవమానం. అయినా తండ్రికి నా పైన వచ్చిన కోపం శాక్యులపై ఎందుకు రాలేదో? ఏ రోజుకైనా నాకు దక్కవలసినదానినే కదా తీసుకున్నాను. మరి శాక్య కన్యకు బదులు దాసి కన్యతో వివాహాన్ని ఎలా సహించాడో!

నా పగను తీర్చుకోవాలంటే ముందు భగవానుని దాటాలి. బుద్ధ భగవానుడు వర్షావాసానికి చంపకవిహారానికి బయలుదేరి నేటికి పక్షం దినాలు. దీర్ఘచరాయణుడు చెప్పినట్లు శాక్యజాతిని సమూలంగా నిర్మూలించడానికి ఇదే మంచి అవకాశం.

పుట్టుకే నా హీనత్వాన్ని నిర్ణయిస్తున్నప్పుడు ఇక నేను ఎంత హీనంగా ఆలోచిస్తే మాత్రం తప్పేముంది. ఎంత ఉన్నతంగా ఆలోచిస్తే మాత్రం లాభమేముంది?

దీర్ఘచరాయణుడు చెప్తునే ఉంటాడు, ‘మానవ సమాజం ఎప్పటికీ ఏకసమూహం కాదు, కాలేదు. మానవ ఆవిర్భావం నుండి అదెప్పుడూ కుదురులు కుదురులుగా సమూహ ప్రత్యేకతలతో అస్తిత్వాలతో బతకడానికే ప్రయత్నించింది. నాగరికసమాజాలు ఏర్పడే క్రమంలో తప్పనిసరి సర్దుబాట్లలో ఎవరి సామర్థ్యాల మేరకు వారు ఎక్కువ తక్కువలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేస్తూనే ఉంటారు. ఆధిక్యత, ఆధిపత్య భావన అనేవి మానవ రక్తంలో కలిసిపోయిన జంతుభావనలు. అవి మనిషిని అక్కడే ఆపుతాయి. ఆ భావన మాటలు, చేతలకు సంబంధించి కావచ్చు లేదా బలానికో, బుద్ధికో సంబంధించి కావచ్చు. నీ బలమే నీ ఆధిపత్యం. దాన్ని నువ్వు నిరూపించుకోవల్సిందే కదా! బుద్ధ భగవానుడే దీన్ని కాదన్నా, ఎంత వారించినా సరే’ అని.

పుట్టుకతో హీనత్వాన్ని నిర్ణయించడం ఎంత హేయం. మన అస్తిత్వాన్ని బలంగా స్థిరపరుస్తూ మనల్ని హీనులుగా మార్చడం ఓ కుట్ర. దీన్ని అంతమొందించక తప్పదు. పుట్టుకతో కులం అనే ముద్రవేసే వ్యవస్థ లేని, ఎలాంటి వివక్షలు లేని రాజ్యాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో ఇదే నా తొలిమెట్టు.

తూర్పున వెలుగురేకలు మెల్లగా విచ్చుకుంటున్నాయి.

అచిరావతి అక్కడక్కడ నెమ్మదిగా పిల్లకాలువల్లా ప్రవహిస్తుంది.


కపిలవస్తుపైన విడూడభుడు చేసిన దాడిలో పిల్లలు, స్త్రీలతో సహా దాదాపు శాక్యులందరూ హతమయ్యారు. తిరిగి వస్తూ అచిరావతి నది ఇసుక తిన్నెలపైన విజయగర్వంతో విడిది చేసి విశ్రాంతి తీసుకుంటున్న విడూడభూడి సైన్యం మొత్తం హఠాత్తుగా నదికి వచ్చిన వరదలో కొట్టుకుపోయింది. ఈ విషయాలు బుద్ధుడికి ఎలా చెప్పాలో ఆనందుడికి అర్థం కావడం లేదు.

చంపకవిహారం నిశ్శబ్దంగా ఉంది. దూరంగా భగవానుడి ధర్మబోధ జరుగుతుంది. నెమ్మదిగా లోపలికి నడిచాడు ఆనందుడు.

న హి వేరేన వేరాని, సమ్మన్తీధ కుదాచనం
అవేరేన చ సమ్మన్తి, ఏస ధమ్మో సనన్తనో.

ఎక్కడైనా వైరం వైరం చేత తొలగించబడదు. మైత్రీభావం వలన మాత్రమే శత్రుత్వాలు శమిస్తాయి. ఇదే సనాతన ధర్మం.

భగవానుడి నోటి వెంట గంభీరంగా వెలువడుతున్న సుత్తాన్ని వింటూ అక్కడే ఆగిపోయాడు ఆనందుడు.


“తరువాత ఏమయ్యింది?” ఆసక్తిగా అడిగింది మాధవి.

“సైన్యము, వారసులూ లేని కోసలరాజ్యం మొత్తం ఎలాంటి యుద్ధం లేకుండానే మగధ రాజు అజాతశత్రు ఆధీనం లోకి వచ్చింది. అలా చారిత్రికంగా శాక్యరాజ్యం లానే, కోసల కూడా అంతరించింది. గంగా పరివాహక ప్రాంతంలో బలమైన మగధసామ్రాజ్యానికి బాటలుపడ్డాయి.”

“మహారాజు అంటావ్ హీనజాతి అంటావ్. ఆ కాలంలో రాజు కావాలంటే క్షత్రియుడై ఉండాల్సిందే కదా!?”

“నిజానికి మన దేశచరిత్రలో ఏర్పడ్డ తొలి ఏకసత్తాక రాజ్యాలు కోసల, మగధ. కోసల మహారాజు ప్రసేనజిత్తు మాతంగ జాతికి చెందినవాడు. ఈ ప్రసేనజిత్తు చెల్లెలు మహాకోసలదేవిని మగధ మహారాజు బింబిసారుడు చేసుకుంటాడు. వాళ్ళు హర్యాంక వంశీయులు. క్షత్రియులే కాని వివాహవిషయంలో వీళ్ళకి కులమతపరమైన పట్టింపులు ఏమీలేవు. వీళ్ళు బుద్ధుడికి సమకాలీనులు, ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు. ఈ కోసల కాని, హర్యాంక వంశం తరువాత వచ్చిన నందులు, మౌర్యులు కానీ క్షత్రియులు కారు. దాదాపు మగధసామ్రాజ్యాన్ని పుష్యమిత్రుడు హస్తగతం చేసుకునే దాకా, అంటే భారతదేశ చరిత్రలో తొలి నాలుగువందల సంవత్సరాలలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజులు శూద్రులే.”

“మరి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వేలసంవత్సరాలుగా ఈ దేశంలో వేళ్ళూనుకుపోయిందని, స్వాతంత్రం వచ్చే దాకా అంతా దాని ప్రకారమే జరిగిందని చెబుతారు కదా!”

“మనదేశం అనేక రాజ్యాలుగా విభజితమై ఉండేది మధూ. షోడశ మహాజనపదాలు మొదలు, 567 సంస్థానాల దాకా ఎక్కడ ఏది తక్కువ జాతో, ఏది ఎక్కువ జాతో అంచనా వేయడం కష్టం. కాకుంటే మొత్తం దేశానికి ఉమ్మడిగా అలాంటి భావనైతే ప్రచారంలో ఉంది. ఇక్కడ కులాలు మతాలు కాలంతో పాటుగా స్థానిక పరిస్థితులను బట్టి అనేక మార్పులకు గురవుతూనే ఉన్నాయి.”

“ఈ కులాలు, వర్ణాలు ఏర్పడటానికి కారణం బ్రాహ్మణులేనా?”

“కులం అనేది మన దేశంలో ఒక సమూహానికి చెందిన ప్రత్యేక అస్తిత్వ భావనేమో! అనేక కారణాలవలన దాన్ని ఎవరికి వారు పైన వేసుకొని మోస్తున్నదే తప్ప కులాలను సృష్టించేంత శక్తి బ్రాహ్మణులకు లేదనే అంటారు చాలామంది. ఉండి ఉంటే కొత్త కులాన్ని సృష్టించే మంత్రాలు రాయబడే ఉండేవి. అవేమీ లేకుండానే కాలక్రమేణా కులాల సంఖ్య పెరుగుతూనే వచ్చింది.”

“విడూడభుడు కోరుకున్న వివక్షలు లేని రాజ్యం ఇక్కడ సాధ్యమేనా?”

“మూడువేల సంవత్సరాల భారతీయ చరిత్రలో మతపరంగా, రాజ్యాలపరంగా అత్యంత వివాదాలు నడిచినప్పటికీ పుట్టుకతో మనిషి ఔన్నత్యాన్ని లేదా హీనత్వాన్ని నిర్ణయించడం డిబేటబుల్ అంశంగానే నడిచింది. అది అనధికారికంగానే కొనసాగింది. కాని స్వతంత్ర భారతదేశమే దీన్ని ధిక్కరించి ఈ వ్యవస్థని ఇంకో రకంగా అధికారికంగా స్థిరీకరించగలిగింది. నువ్వు పుట్టగానే నీ ముఖాన చెరపలేని పచ్చబొట్టులాగా నీ పేరుతో ఓ కులపు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. నువ్వే కాదు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా దీన్నుంచి తప్పించుకోవడం ఈ దేశంలో ఇక ఇప్పుడు సాధ్యమయ్యేపని కాదు. ఎలాంటి రాజ్యాన్నైతే విడూడభుడు కోరుకున్నాడో అది మాత్రం ఇక్కడ ఓ కలే మధూ ప్రస్తుతానికి.”


సచ్చం వే అమతా వాచా, ఏస ధమ్మో సనన్తనో
సచ్చే అత్థే చ ధమ్మే చ, ఆహు సన్తో పతిట్టితా. (455 – సుభాషిత సుత్తం, సుత్తానిపాత)

సత్యం అమృత వచనం – ఇదే సనాతన ధర్మం. దీన్ని ఆచరించే వారు సత్యంలో, మంచిలో, ధర్మంలో నిలబడతారు.