ద డే బిఫోర్

న్యూ పోర్ట్, న్యూ జెర్సీ – అక్టోబర్ 28, 2012. ఆదివారం ఉదయం 7గం.

హడ్సన్ నదికి ఈ వైపున నిల్చుని ఏ కోణంలో చూసినా న్యూ యార్క్ నగరం – ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ – చేతికి అందేంత దూరంలో వున్న భ్రమ కలుగుతుంది. నివాసం ఇటు జెర్సీ సిటీలోనైనా, పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగరీత్యా నా రోజువారీ జీవితం గడిచేది ఆ నగరం లోనే!

వాటర్‌ఫ్రంట్ వాక్ – తీరం వెంట నివసించే వారి అదృష్టం! మెడనున్న స్కార్ఫ్ తీసి తల పైనుండి చుట్టుకొని నది అంచునే నడవసాగాను. సన్నగా చలిగాలి, స్తంభాలకి కట్టిన జండాల రెపరెపలు, జాగింగ్ చేస్తున్న వాళ్ళు, నింపాదిగా కూర్చుని నీటి అలలని చూస్తున్న వాళ్ళు – అందులో కొన్ని తెలిసిన మొహాలు – మార్పు లేని మరో ఉదయపు సందడి.

భుజాన ఒక రంగుల చిలుకతో రోజూ వచ్చే ఫిలిప్పీన్ పెద్దాయన నీటికేసి తదేకంగా చూస్తూ నిలబడి వున్నాడు. నీలిరంగు రెక్కలు, పసుపురంగు పొట్ట, కళ్ళచుట్టూ నల్లగీతలు, నల్లముక్కుతో అందరూ ఆగి మరీ చూసే చిలుక. ఈ రోజెందుకో మాటి మాటికి రెక్కలు విప్పార్చుకుంటూ వింత వింత శబ్దాలు చేస్తోంది. తుఫాను రాబోతున్న సూచన దానికి ముందే అందింది కాబోలు!

రెండు రోజుల క్రితం వరకూ ప్రమాదకరం కాదనుకున్న హరికేన్ శాండీ ఉధృతమై దిశ మార్చుకుని న్యూ జెర్సీ తీరాన్ని తాకనుంది. అలా తాకిన క్షణం నుండి చుట్టూ ఇక ఇలా ఉండదనుకుంటే నమ్మశక్యంగా లేదు. ఈదురుగాలులతో కూడిన వర్షం హెచ్చరికగా ముందే వస్తే రేపు ఈ సమయానికి కనీసం బయటకైనా రాగలమో లేదో?!

పది అడుగుల దూరంలో యూ-టర్న్ తీసుకుని వచ్చి ఆగిన ట్యాక్సీలో సూట్‌కేసులు ఎక్కిస్తూ నా వయసున్న ఒక స్త్రీ, మరో యువతి. “న్యూ యార్కులో బస్ సమయానికి ఎక్కితే మూడింటికల్లా బెతెస్డా చేరుకోవచ్చు.” ఆమె గొంతులో చిన్న ఆదుర్దా! “దగ్గరుండి శాండీకి వెల్కమ్ చెప్పకుండా ఇంటికి తీసుకుపోతున్నావేంటమ్మా!” ట్యాక్సీ కదిలాక కూడా ఆ అమ్మాయి నవ్వు అక్కడే గాలిలో కాసేపు తచ్చాడింది. రాకపోకల సౌకర్యాలు నిలిపివెయ్యక ముందే నగరం నుండి బయటపడాలన్న తొందర వాళ్ళది. ఇక ఇక్కడ సబ్‌వే రాకపోకలు నిలిచిపోతే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి చేరడమే గగనం అయిపోవచ్చు!

వెనుక నుండి జాగింగ్ చేస్తూ వచ్చి కలిసింది క్రిస్టీన్. మోకాళ్ళ మీద చేతులతో ఒంగి ఆయాసం తీర్చుకుంటూ అడిగింది. “లుక్స్ లైక్ ఉయ్ హావ్ టు ఫేస్ సివియర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ప్రెసిడెంట్ ఒబామా ఎమర్జెన్సీ ప్లాన్ సైన్ చేశారట. ఆర్ యూ ప్రిపేర్డ్?”

“ఏముంది ప్రిపేర్ అవడానికి? జస్ట్ మిల్క్ అండ్ గ్రాసరీస్ ఎక్స్‌ట్రా తెచ్చిపెట్టుకున్నాను.” ఇద్దరం కలిసి ముందుకి నడవసాగాం.

“అంతేగా! మదర్ నేచర్ ముందు అందరం తలవంచాల్సిందే! నేషనల్ ట్రూప్స్ వస్తున్నారు. స్టేట్ గార్డ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ నేషనల్ గార్డ్స్ యూ నో! అన్నట్లు గోల్డీకి ఇది ఫస్ట్ టైమ్ రియల్ ఫీల్డ్‌ వర్క్ కదా! సో యూ టేక్ కేర్ ఆఫ్ దట్ బాయ్ అండ్ హి టేక్స్ కేర్ ఆఫ్ అజ్!” అంటూ నవ్వింది.

క్రిస్టీన్ మాట వాస్తవాన్ని పచ్చిగా గుర్తు చేసింది. రాబోతున్న హరికేన్ గోల్డీకి పరీక్ష పెట్టబోతోంది. ఆర్మీలో చేరుతానన్న వాడిని ఎలాగో ఒప్పించి కాలేజ్‌లో చేరేలా చేశాం. కానీ ఇంట్లో చెప్పకుండా సమ్మర్ సెలవుల్లో స్టేట్ గార్డుగా ట్రైనింగ్ తీసుకున్నాడు. ‘ముందే చెపితే ఒప్పుకోమనేగా!’ అన్నాడు త్యాగి నిరాశగా. తండ్రి ఆశించేది ఒకటైతే కొడుకు కోరుకునేది మరొకటి. ఎక్కడో ఏదో తెగిపోయింది. వాళ్ళ ఇష్టాలని వ్యతిరేకించే కొద్దీ యువతరం మననుండి దూరం అయిపోతుందేమో!

“త్యాగి ఇండియా నుండి ఎప్పుడు వస్తున్నాడు? హోప్ హి ఈజ్ నాట్ ఫ్లయింగ్ అరౌండ్ దిస్ టైమ్.”

తేరుకుని “లేదింకా, ఇంకో నెల అక్కడే వుంటాడేమో!” అన్నాను.

బై చెప్పి తిరిగి పరుగందుకుని తను నన్ను దాటిపోయింది. కొలీగ్ అండ్ నైబరే కాదు, క్రిస్టీన్ మంచి స్నేహితురాలు కూడా. తనో ఓపెన్ బుక్. అరమరికలు లేకుండా తన కష్టసుఖాలు చెప్పుకుంటుంది. మరి నేనో? పైపైని ఫ్యామిలీ విషయాలు తప్ప ఇంట్లో సంఘర్షణలు ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేను. వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇచ్చే అమెరికన్ ఫ్యామీలీస్ మనలాగా పీర్ ప్రెషర్, కంపారిసన్స్ లాంటి వాటికి లొంగి బ్రతకరేమో!

రోడ్డు క్రాస్ చేసి ఇంటికేసి నడుస్తుండగా త్యాగి నుండి ఫోన్.

“ఎలావుంది అక్కడ?”

“రేపు సాయంత్రానికి అట్లాంటిక్ సిటీ వద్ద హరికేన్ తీరాన్ని తాకుతుందట. న్యూ యార్క్, జెర్సీ మేయర్లు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సముద్ర తీరాలలో వున్న జనాలని ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకి, రెస్క్యూ షెల్టర్సుకి పంపిస్తున్నారు.”

“సిటీలో మన దగ్గర అంత ఇంపాక్ట్ వుండకపోవచ్చు.”

సుమారు నూటతొంబై ఏళ్ళ తరువాత అంతకు మించి ఎన్నో రెట్ల శక్తితో వస్తోంది శాండీ! సముద్రం పైనుండి తీవ్రంగా వచ్చి తాకే హరికేన్ వేగానికి, హడ్సన్ నది అల్లకల్లోలమై – నగర వీధులు, రాకపోకలని సుగమం చేసే టనల్స్, సబ్‌వేలు జలమయమై పోయి, కరెంటు పోయి రెండు నగరాలూ ఊహకి అందనంత భారీనష్టం ఎదుర్కోవలసి రావచ్చని వాతావరణ నిపుణుల అంచనాలు చెపుతున్నాయి. కానీ ఈ విషయాలు దూరాన వున్న త్యాగికి చెప్పి అనవసరపు ఆందోళన కలిగించడం ఎందుకు?

ఓ నిమిషం తరువాత అన్నాడు. “నీ కొడుకు మాత్రం ఇక రోడ్ల మీదే వుంటాడు కాబోలు. చెప్పు వాడికి ప్రాణాలు పణంగా పెట్టే ఘనకార్యాలేమీ చెయ్యక్కరలేదని!”

“వదినా వాళ్ళు ఎలా వున్నారు?” మాట మార్చి అడ్డుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు.

“అక్కా బావా నేను కలిసి గాంధీనగర్ అక్షరధామ్ వెళ్తున్నాం. బంధువులెవరెవరిని కలవాలన్నది ఇంకా ప్లాన్ చేస్తున్నాను.”

త్యాగి ఇండియాకి వెళ్ళి నెల రోజులు. ఓ రకంగా అలిగి వెళ్ళాడు. తిరిగి ఎప్పుడొస్తాడో కూడా చెప్పలేదు. గుజరాత్ లోని బంధువర్గం అందరినీ చూడాలి అన్నాడు. న్యూ జెర్సీలో అన్నగారి గ్రోసరీ షాపులో పాతికేళ్ళు పనిచేసినా – తనూ ఓ ఓనర్ హోదానే అనుభవించాడు. రోజుకి పదిహేను పదహారు గంటలు పనిచేసి అలసిన శరీరం, దెబ్బతిన్న కంటి చూపు – కొత్తగా షాపు కొన్నవాళ్ళు మ్యానేజ్ చెయ్యమని ఆఫర్ ఇచ్చినా ఇక అందులో పనిచేసే ఉద్దేశ్యం లేదతడికి. తన వంతుగా వచ్చిన లాభంలో ఇంటి పైనున్న అప్పు తీర్చేసి, మిగిలింది సేవింగ్సులో వేసి వెళ్ళాడు.

అయినా అన్నయ్య షాప్ అమ్మినందుకు కాదు త్యాగి అలక. కొడుకుని దానిని నడపడానికి ఒప్పించలేకపోయామని. షాప్ మేనేజ్‌మెంట్ తీసుకుని, నెలకి వచ్చే లాభంలో ఇంత అని ఇచ్చేస్తే షాప్ అమ్మననే ప్రపోజల్‌తో పెద్దనాన్న వచ్చినప్పుడు గోల్డీ నిరాకరించాడు. అది కాదనుకుంటే జీవితంలో అంతకు మించి బాగుపడే అవకాశం రాదని చెప్పి త్యాగికి కోపం. ఇద్దరికీ నచ్చచెప్పి ఒక తాటిపైకి తేవడం నాకు సాధ్యం కాదని ఎప్పుడో తేలిపోయింది.

ఎదురుగా ఓ చిన్న పార్క్ లాంటి ఆవరణలో హాలోవీన్ పెరేడ్. వచ్చే ఉపద్రవం కారణంగా ముందే సెలబ్రేట్ చేస్తున్నట్లున్నారు! రంగురంగుల దుస్తులు, విచిత్ర వేషాలలో చిన్నారులు. నవ్వులూ కేరింతలూ – ఒత్తిడి కనిపించని అందమైన లోకం. తాత్కాలికంగా ఆలోచనలకి ఆనకట్ట పడింది.


మేమున్న ఈ మూడు గదుల అపార్ట్‌మెంట్‌లో తూరుపు వైపున్న కిటికీల నుండి హడ్సన్ నది, న్యూ యార్క్ నగరం కొంతభాగం కనిపిస్తూనే వుంటాయి. తలుపులు వేసి వున్న నిశ్శబ్దంలో కూడా ఆ అలల సడి వినపడుతున్నట్లే వుంటుంది.

యూనిఫార్మ్, బ్యాడ్జ్ తీసుకుని డిఫెన్స్ ప్లానింగ్ అంటూ గోల్డీ ఉదయమే వెళ్ళిపోయాడు. తన సర్టిఫికెట్స్ వుండే ఫైల్ టేబుల్ పైన తెరచివుంది. కొత్తగా వచ్చిన స్టేట్ గార్డ్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ మరోసారి చేతిలోకి తీసుకున్నాను. మెడికల్ టెక్నీషియన్, నర్స్, ఫైర్‌ఫైటర్ లాంటి డిఫెన్స్‌కి కావలసిన స్కిల్స్ అన్నీ ఆ ట్రైనింగులో భాగం. ఈ డ్యూటీలో వున్నప్పుడు వీటి అవసరంతో నీకు ఎవరో ఒకరు ఎదురుపడుతూనే వుంటారు. అప్పుడు వాళ్ళ జీవితాలు నీ మీద ఆధారపడి వుంటాయి – వాటికి జతపరచిన స్లోగన్.

సమ్మర్ ఇంటర్న్‌షిప్ అంటూ రెండు నెలల పాటు వెళ్ళి ఈ సర్టిఫికెట్స్ తీసుకువచ్చి తండ్రి చేతిలో పెట్టి అప్పుడు చెప్పాడు. తండ్రి కోపాన్ని తిట్లనీ మౌనంగా భరించాడు. ఆ రోజు త్యాగికి వచ్చిన కోపం తాలూకు వేడి ఇంటిని ఇంకా అంటిపెట్టుకునే వుంది.

‘ధనంజయ్ కొడుకు కూడా ఇంజనీరింగులో చేరాడుట.’ ‘అన్నయ్య కాబోయే కోడలు కూడా డాక్టరే!’ గోల్డీ వినేలా త్యాగి చెప్పే మాటలు. కొడుకుని ఒప్పించలేక, వాదించలేక దానికి రెట్టింపు గోడు ఇద్దరమే వున్నప్పుడు నా దగ్గర జరిగేది.

తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ భరించలేక ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఆమాటే అంటే బావగారి కూతురు పదిహేనేళ్ళ సాన్వి విచిత్రంగా చూసింది. “గోల్డీ కదా చిన్నమ్మా! మీ నుంచి పారిపోవల్సింది. ఉయ్ ఆర్ నాట్ డ్రగ్ ఎడిక్ట్స్ ఆర్ బ్యాడ్ కిడ్స్. మేము తీసుకునే ప్రతి నిర్ణయంపైనా మీ ఆంక్షలెందుకు?”

సాన్వి అన్న సంజూ గోల్దీ కన్నా ఐదేళ్ళు పెద్ద. వాడి టోన్ నచ్చచెపుతున్నట్లు వుంటుంది. “గోల్డీ మా అందరిలా కాదు చిన్నమ్మా! మనవాళ్ళల్లో అలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు చాలా అరుదు. నువ్వయినా వాడిని సపోర్ట్ చెయ్యకపోతే ఎలా! లెట్ హిమ్ డూ వాటెవర్ హి వాంట్స్ టు డూ!”

అంటే, గోల్డీ నిర్ణయం పట్ల త్యాగి తన అయిష్టతని స్పష్టంగా వ్యక్తపరుస్తుంటే నేను మౌనం ముసుగులో దాక్కోగలిగానని అనుకుంటానే కానీ – వీళ్ళందరికి తెలుసు నా మౌనంలో సగమైనా అంగీకారం లేదని!

అదే ఫైలులో సర్టిఫికెట్స్ క్రింద అతి జాగ్రత్తగా గోల్డీ దాచుకున్న ఆర్టికల్. మరో మారు చదవడానికి ప్లాస్టిక్ కవర్ నుండి పైకి తీస్తుంటే అప్రయత్నంగా వేళ్ళు వణికాయి.

బూకన్‌వాల్డ్ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్ – ఏప్రిల్ 11, 1945.

అమెరికన్ సైనికులని ఆ రోజే నేను మొదటిసారి కలవడం. మేమున్న భూలోక నరకం లాంటి ఆ ప్రదేశాన్ని అపనమ్మకంగా చూస్తూ, అయోమయంగా వాళ్ళు కలయతిరిగారు. మాతో ఏం మాట్లాడాలో ఎలా ప్రతిస్పందించాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడారు. జీవితం పైన ఆశలన్నీ వదులుకున్న మేము, ఆ క్షణాన ఆ మృత్యుగృహంలోనుంచి బయట పడబోతున్నామని తెలిసి కూడా, వాళ్ళని దగ్గరకి తీసుకునే మాట అటుంచి కనీసం పలకరించే ఓపిక కూడా లేక చూస్తుండిపోయాము. సరైన తిండి లేక అనారోగ్యాలతో బక్కచిక్కి కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని ఉన్న మమ్మల్ని చూసి దారి తప్పిన చిన్నపిల్లల లాగా ఆ అమెరికన్ సైనికులు హోరుహోరున వెక్కివెక్కి ఏడ్చారు. అత్యున్నత మానవత్వచర్యకి నిదర్శనంగా వారి హృదయం లోనుండి పెల్లుబుకుతున్న ఆ కన్నీళ్ళని మేము కానుకగా స్వీకరించాము.– హోలోకాస్ట్ సర్వైవర్, బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, నోబుల్ ప్రైజ్ గ్రహీత అయిన ఎలీ విజేల్ (Elie Wiesel).

జులై 4, 2004న – అంటే ఇండిపెండెన్స్ రోజున – పరేడ్ పత్రికకి వ్రాసిన వ్యాసంలో భాగం అది. ‘ద అమెరికా ఐ లవ్‘ అనే శీర్షికతో, తనకి విముక్తి దొరికిన ఆ రోజున తీయబడిన ఫోటోలతో సహా ప్రచురించబడింది.

ఇరాక్ వార్ సమయంలో ప్రపంచం అమెరికాని తప్పుపడుతున్న రోజుల్లో, ఈ దేశపు మానవత్వపు కోణాన్ని తిరిగి గుర్తు చేయాలని ఎలీ విజేల్ ఆ ఆర్టికల్ వ్రాశాడు. ఎక్కడో రొమేనియాలో పుట్టాడు. జర్మనీ కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో చావు అంచుల వరకూ వెళ్ళి వచ్చాడు. ఈ రోజున, ఈ దేశపు పౌరుడిగా, కృతజ్ఞతకి ప్రతినిధిగా పలుచోట్ల ప్రసంగాలు చేసి మరీ మరీ గుర్తు చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ 2012లో తిరిగి చూస్తుంటే అర్థం అవుతోంది – తన పదమూడేళ్ళ వయసులో గోల్డీ ఈ ఆర్టికల్ జాగ్రత్తగా భద్రపరచుకున్నాడని. ఫైలులో అలాంటివే మరెన్నో ఆర్టికల్స్. అప్పట్లో చూసి స్కూల్ ప్రాజెక్ట్ కోసం అనుకున్నానే కానీ వాడి ఆశయాలకి అదే పునాది అని తెలియదు.


సూర్యాస్తమయవేళ. నది ఒడ్డుకి నేను చేరిన సమయానికి – ఎర్రబారుతున్న నింగి అత్యంత దురదృష్టకరమయిన ఆ రోజుని తిరిగి గుర్తు చేస్తోంది. అమెరికన్ చరిత్రలో నైన్-ఎలెవెన్ అంటూ ముద్ర పడిపోయిన రోజు! మింటికెగిసిన మంటల మధ్య ట్విన్ టవర్స్! పొగలు గమ్మిన ఆకాశం! బూడిద పూసిన నది! తప్పించుకునేందుకు మరో మార్గం లేక రెక్కలు విరిగిన పక్షుల్లా నేలకి రాలి మృతులైన జనం! పదకొండేళ్ళ నాటి గతం. గాయం న్యూ యార్క్ నగరానిది – వ్యధ పూర్తి దేశానిది! ఏదైతేనేమి బ్యాక్ టూ బిజినెస్ అంటూ నగరం వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పునర్నిర్మించుకొంటోంది.

రేపటి నుండి ఈ ప్రదేశం, ఈ రెండు నగరాలు తిరిగి సెంటర్ ఆఫ్ న్యూస్ కాబోలు! ఇంట్లో ఉన్నంతసేపు సుడులు తిరుగుతూ వస్తున్న ఆ ఒంటికన్ను రాక్షస చిత్రాన్ని పదే పదే టి.వి.లో చూస్తూ స్థలకాలాల సృహ కోల్పోయి సముద్రంలో చిక్కుకున్న ఫీలింగ్! వచ్చేంత వరకూ వార్త, వచ్చి వెళ్ళాక వార్త, మధ్యలో ఎదుర్కునేదే యుద్ధం లాంటి వాస్తవం.

నగరపు ఎత్తయిన భవనాలను దాటి వచ్చి చతుర్దశి చంద్రుడు వెలుగుతున్నాడు. విచిత్రం కాకపోతే తూఫాన్ తీరాన్ని తాకే సమయానికి పౌర్ణమి కలిసి రావాలా? రేపటి పౌర్ణమి ప్రభావం ఉప్పెన ధాటికి ఎగిసిపడే ప్రమాదకరమైన అలలను మరో ఇరవై శాతం తీవ్రతరం చేస్తుందని నాసా వారి ప్రిడిక్షన్.

ఏవి వేటికి ఉత్ప్రేరకాలో? ఎవరు ఎవరిని ఎందుకు ఇన్‌స్పయిర్ చేస్తారో?!

ఒక్కొక్క గంటే గడిచి రాత్రి చిక్కనవుతోంది. ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. ఎవరి ధ్యాసలో వారుగా నాతో పాటూ ఈ ఒడ్డున మరి కొందరున్నారు. మేమందరం వెన్నెల భ్రాంతిలో తడుస్తూ – ఆహ్వానం లేని అతిథికై ఎదురుచూస్తున్నాం.

గోల్డీ నుండి మెసేజ్ – ఇంటికి గెస్ట్స్ వచ్చారు, రమ్మని. ఈ సమయంలో ఇలాంటి రోజున ఎవరు వచ్చివుంటారు?


గోల్డీ వయసు వాళ్ళే ఓ అమెరికన్, ఓ స్పానిష్, కిటికీ దగ్గర నిల్చుని వున్నారు. అరవైలు దాటిన ఆఫ్రికన్ అమెరికన్ దంపతులు సోఫాలో ఇబ్బందిగా కూర్చుని వున్నారు. అందరి మొహాల్లో మొహమాటం, అలసట, అలజడి.

గోల్డీ కళ్ళు నా అంగీకారం కోసం కలవరంగా చూస్తున్నాయి. భరోసాగా వాడి చేతిని తాకి అందరిని పరిచయాలు చేసుకున్నాను.

నగరంలో స్పెషలిస్టుకి చూపించుకోడానికి మిసెస్ లోగన్ భర్తతో డెలవేర్ నుండి వచ్చారుట. తిరిగి వెళ్ళాల్సిన బస్ క్యాన్సిల్ అయి కంగారుపడుతూ బస్ స్టాపులో కనిపించారు గోల్డీకి. కనెక్టికట్ వెళ్ళాల్సిన ట్రైన్ నిలిచి పోవడంతో బ్రాండన్, మైకస్ ఇద్దరూ సిటీలో వుండిపోవాల్సి వచ్చింది.

వాళ్ళని రిలాక్స్ అవమని చెప్పి డిన్నర్ రెడీ చేశాను. గోల్డీ వాళ్ళకి కావలసిన పక్కబట్టలు తీసి వుంచాడు. ఒకరి విషయాలు మరొకరం తెలుసుకుంటూ కలిసి భోజనం చేశాం. రేపటి రోజున ఏదైనా షెల్టర్ చూసి అక్కడ దింపమని అడిగారు వాళ్ళు. సరైన షెల్టరో మరో మంచి సదుపాయమో దొరికే వరకూ ఇక్కడే వుండొచ్చని నేను నచ్చచెప్పాను. మొదట ఇంట్లోకి వచ్చినప్పడు వున్న ఇబ్బంది, మొహమాటం కరిగి వాళ్ళు కుదుటపడ్డారు.

కుర్రాళ్ళు గోల్డీని హగ్ చేసుకుని, నాకు థాంక్స్ చెప్పి సోఫాల మధ్యలో వేసిన పక్కల పైకి చేరారు. మిగిలిన ఇద్దరికీ గెస్ట్‌రూమ్ చూపించాము. “రేపటినుండి నీకు ఇంకెంత పనో! వెళ్ళి నువ్వు కూడా రెస్ట్ తీసుకో” అందామె గోల్డీని అభిమానంగా చూస్తూ.

భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని లేస్తూ చెప్పాడతడు. “ముందుగా నీ కొడుకుకి ధన్యవాదాలు! నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు! యూ ఆర్ ఏ బ్లెస్‌డ్ సోల్ టూ హ్యావ్ ఎ సన్ లైక్ హిమ్! గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ!”


కిచెన్ తుడిచి, డిష్‌వాషర్ వేసి వెళ్ళి చూసేటప్పటికి గోల్డీ మంచి నిద్రలో వున్నాడు.

కిటికీని ఆనుకుని నిల్చుని బయటకి చూస్తుండిపోయాను. వెలుగు నీడలని తోడు తీసుకుని నది కదిలిపోతోంది. దంపతుల మాటలు – గోల్డీ పట్ల వాళ్ళందరి కళ్ళలో అభిమానం – ఇంకా నన్ను అంటిపెట్టుకునే వున్నాయి.

తండ్రి దగ్గర తగినంత చనువు లేక, నా మనసు చదివే ప్రయత్నంలో ఆశగా వేడుకోలుగా చూసేవి ఆ కళ్ళు! గమనించనట్లు నటించేదాన్ని. ఏళ్ళ తరబడి సమాజం అంగీకరించే మూసలో మలచబడ్డవాళ్ళం! సమాజం ఆమోదం లేకుండా అడుగు వేయడానికి తడబడేవాళ్ళం! మా ఆలోచనలు మారాలంటే మరో తరం రావాలో, మరో జన్మ కావాలో!

గోల్డీ నుదుటి పైన చెయ్యి వేసే ప్రయత్నాన్ని విరమించుకుని కాళ్ళ పైన దుప్పటి సవరించాను.

‘అందరిలాంటివాడు కాడు చిన్నమ్మా! లెట్ హిమ్ డూ వాట్ హి వాంట్స్ టు డూ!’

మౌనాన్ని ఇక విడిచి పెట్టు
ఆ చేతిని మరింక వదిలి పెట్టు
ఎగరనివ్వు ఆ కలని!
ఎదగనివ్వు ఆ ఆశని!
లెట్ గో! లెట్ గో! లెట్ హిమ్ గో!

నీటి అలలలో అలజడి, చెట్ల కొమ్మల కదలిక, వేగవంతమవుతున్న గాలి! వాన తుంపరల నడుమ మసకబారిపోతున్న నగరం!

కడలి లోతట్టు తీరాలు, వందల ఏళ్ళనాటి వంతెనలు, రహదారులు – రేపటి రోజుని ఎలా తట్టుకుంటాయో?! హడ్సన్ అంచున వున్న ఈ రెండు పురాతన నగరాలను ప్రక్షాళన చేసే ప్రయత్నాన్ని రాబోయే ఉప్పెన ఎంత వరకూ నెరవేర్చుకుంటుందో?!