#పంచనామా

‘ఎలా జరిగింది?’
తెలియదు.

‘ఆమెకైనా తెలుసా?’
అనుమానమే!

‘ఆ మెడకి చుట్టుకున్నదేవిటి?’
ఎవరిదో నిశ్శబ్దం

‘ఆ పిడికిలిలో ఏమిటి?’
అడగలేని ప్రశ్నలు.

‘ఆ కప్పుకున్నదేవిటి?’
పెంచుకున్న ఆశలు.

‘ఎవరైనా వస్తారా ఈమె కోసం?’
వస్తారు. ఎవరి కోసం పోయిందో
వారు తప్ప అందరూ వస్తారు.