వ్రాయలేనితనం

ఒళ్ళంతా పూలతో
నిండుగా నిలబడ్డ పచ్చనిచెట్టు
ఉన్నట్టుండి
పరిమళాలపారిజాతాలై కురిసిపోవాలి

గతపుజాతరలో తప్పిపోయి
పరధ్యానంగా కూర్చున్నపుడు
దాచుకున్న బ్రతుకు పానకపు రుచి
గుర్తు రావాలి

వెండివెన్నెల వాకిట్లో
చూపులపడక్కుర్చీ వాల్చి
నింగి గుమ్మానికి కట్టిన
నక్షత్రతోరణాలను చూడాలి

కలతనిదురను గాఢత్వంలోకి జోకొడుతూ
కనురెప్పల మాటున
విరిసిన కలలకలువలను
మరో లోకంలో రేకులు విప్పనివ్వాలి

వ్రాయలేనితనపు నిశ్శబ్దరాత్రులను
ఉన్నట్టుండి ఒక్కఉదుటన పగులగొట్టాలి
విశాల ఆకాశంలోని
ఊహల మబ్బులన్నీ చిక్కబడి
హోరువానై కాగితంపై
ఏకధాటిగా కురిసిపోవాలి