వాకిట్లో నిల్చున్న వ్యక్తి “లోపలకి రండి… అన్నయ్య ఉన్నారు” అన్నాడు. అతనెవరో తెలియడంలేదు. నేను అతనికి ‘నమస్కారం’ పెడుతూ చెప్పులు విడిచిపెట్టాను.
అతను వొంగి నా చెప్పులు చేతికి తీసుకున్నాడు. “బయటే వదిల్తే కుక్కలెత్తుకుపోతాయి… లోపలికి పదండి.”
విశాలమైన రాతి అరుగుకు అవతల మండువాలో ముదురుటెండ తెల్లటి తెర వేలాడుతున్నట్టు పడుతోంది. ఒకవైపు పొడవైన అరుగులాంటి గదిలో ఒక పెద్దాయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఒడిలో ఇత్తడి తాంబూలం పెట్టె, అడకత్తెరతో వక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తున్నారు. కళ్ళజోడు కొంచం కిందకి జారిన ఆయన మఖంలో ఇష్టమైన ఆటలో మునిగిపోయున్న పసిపిల్లవాడంత శ్రద్ధ.
నన్ను ఇందాక ఆహ్వానించిన వ్యక్తి నా వెనకే వచ్చి, “రచయిత జయమోహన్ వచ్చారు…” అన్నాడు. నా పేరును అతను రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాల్సి వచ్చింది. పెద్దాయన తల పైకెత్తి నన్ను చూసి “రండి, రండి” అన్నారు. ఆయన కుర్చీ వెయ్యమని చేయి చూపించగానే ఆహ్వానించిన వ్యక్తి మడత కుర్చీ తెచ్చి వేశాడు. “ఇతను సామినాథం… రిటైర్డ్ పంతులు” అన్నారు పెద్దాయన. నేను అతనికేసి మరోసారి నమస్కారం చెప్పాను. “జానకిరామన్‌కు బాగా దగ్గరివాడు” అన్నారు పెద్దాయన, “రండి, కూర్చోండి” అంటూ. నన్ను ఇంకా గుర్తుపట్టినట్టు లేరు అన్నది ఆయన ముఖంలోని ఆ నవ్వులో తెలుస్తోంది.
కూర్చోగానే కుర్చీ కాలు గచ్చులోని ఒక చిన్న గుంటలో పడి బెసికింది. తట్టుకొని నేను కుర్చీని కొద్దిగా జరుపుకొని కూర్చున్నాను. పైకప్పుకున్న నాటుపెంకుల కింద వెదురు వాసాలలో రంధ్రాలు. ఆ రంధ్రాలనుండి ఒక జోరీగ తంబూరాలా గీ పెడుతూ గుండ్రంగా ఎగురుతోంది. ఆయన చేతనున్న అడకత్తెర తన దీర్ఘకాల అనుభవంతో లాఘవంగా ఆ పచ్చి వక్కను ముక్కలు చేస్తోంది. అటుకుల్లా రాలిన చిన్న చిన్న వక్క పలుకుల్ని పోగుచేసి ఒక చిన్న డబ్బీలో వేశారు.
“ఊళ్ళోనే ఉన్నారా?” అని ఆయన అడిగినప్పుడు ఆ ప్రశ్న ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గ్రహించాను. చిరునవ్వు చిందిస్తూ “నాగర్‌కోయిల్ నుండి వస్తున్నా…” అన్నాను. ఆయన నా పెదవుల వంక చూడడం గమనించి పడక్కుర్చీలో ఉన్న దినపత్రిక తీసి, దానిమీద ఒక మూల ‘నాగర్‌కోయిల్, జయమోహన్’ అని రాశాను. వెంటనే కళ్ళు విప్పార్చి నా చేతులు గట్టిగా పట్టుకున్నారు. “సంతోషం… చాలా సంతోషం… నన్ను వెతుక్కుని రావడం మహా గౌరవం నాకు” అన్నారు. ‘నాకే గౌరవం’ అని రాశాను. ఆయన నవ్వి తలూపారు.
“రవి సుబ్రహ్మణ్యం తెలుసా?”
“లేదు, కలవాలి.”
“రేయ్ సామినాథం, ఆది అందుకోరా… అదేరా…”
ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని కొత్త కథల సంపుటాన్ని తీసి ఇచ్చాడు సామినాథం.
“పార్వతి ప్రచురణలు. మంచి పిల్లాడు… ముందుగానే రాయల్టీ డబ్బు కూడా ఇచ్చేశాడు. డాక్టర్ ఖర్చులవీ ఎక్కువయ్యాయి… డబ్బులివ్వందే చూడరు కదా!”
నేను నవ్వి “బహుశా డాక్టర్‌కే నేరుగా ఇచ్చేయొచ్చు” అన్నాను. పగలబడి నవ్వారు. హాస్యాన్ని మాత్రం చెవులతో కాకుండా కళ్ళతోనే అర్థం చేసుకునేలా ఉన్నారు. తాంబూలం నములుతున్న ఆయన ముఖంలో నవ్వు ఉప్పొంగుతోంది.
నేను “తాంబూలం కూడా ఒక వ్యసనమే కదా?” అన్నాను.
ఆయన తల ఊపి “ఆకు, వక్క, సున్నం సరిగ్గా కుదరాలి. రాగం, తాళం, భావంలాగా… దాన్లో దేవుడి పాత్ర కూడా ఉంది. అది రావాలి…”
“మంచి పద్యంలాగా?”
“ఏం? మంచి సంభోగంలాగా అనరాదా? అనండి. నాకేం అంత వయసయిపోలేదు” అని నవ్వును కొనసాగించారు.
“అందులో మూడోది ఏముంది? రాగం, తాళం మాత్రమేగా…”
ఆయన తల ఊపుతూ “అందులో మూడోది ఒకటి ఉంది… అది చోటు. ఏ ప్రేమ కవితలోనైనా చోటుని చెప్పకుండా ఉండగలరా?” అన్నారు.
సామినాథం బయటికెళ్ళి జగ్గులో కాఫీ తీసుకొచ్చాడు. నాకు ఒక గ్లాసులో పోసి, పెద్దాయనకు సగం గ్లాసుకు పోశాడు.
“చల్లారిపోయిందా?” అడిగారు.
“కొంచం” అన్నాను.
“నాకు కొంచం చల్లగా తాగితేనే తృప్తిగా అనిపిస్తుంది. వేడిగా తాగితే వేడి మాత్రమే తెలుస్తుంది. రుచి, వాసన లేనట్టు అనిపిస్తుంది… పరుగెడుతున్న అమ్మాయిని చూసి ఆస్వాదించగలమా? ఏమంటారూ?”
నేను నవ్వి “గుఱ్ఱం మీద పరిగెడుతున్నప్పుడు మాత్రమే” అన్నాను.
నవ్వుతూ “పోన్లే. కవిత్వంలో మాత్రమే అన్నిటికీ జవాబులుంటాయి. న్యాయంగా నేను కాఫీ తాగకూడదు. అయితే దానిమీద ఇంకా కోరిక చావలేదు. అందుకని సగం గ్లాస్ మాత్రం తాగుతాను” అన్నారు.
“సగం గ్లాసు, సగం గ్లాసంటూనే నాలుగైదు సార్లు తాగేస్తారు” అన్నాడు సామినాథం.
“పోరా!” అన్నారు కోపం నటిస్తూ.
నేను కాఫీ గ్లాసు కింద పెడుతూ “ఆ కాలంలో రాయల్టీ అవి బాగానే వచ్చేవి కాదా?” అని అడిగాను.
“రాయల్టీనా! అలాంటివన్నీ బూతు పదాలు ఆ రోజుల్లో!”
“మీరు రాతలతోనే వైభోగంగా ఒక వెలుగు వెలిగారని విన్నానే?”
“ఎక్కడ వైభోగం! ఏం వెలగడం! పొట్టపోసుకోడానికి, పూటగడవటానికీ రాశాను, అంతే! వైభవమంతా నా ముప్పైమూడో ఏటవరకే! అప్పటిదాకా చేతిలో వంద రూపాయలు లేనిదే బయటకి అడుగు పెట్టేవాణ్ణి కాను. పదిమంది నా చుట్టూ ఉండేవాళ్ళు. అందరూ సంగీతం, సాహిత్యం అని అభిరుచిలో ఆరితేరినోళ్ళు. రాత్రింబవళ్ళు మాటలు, పాటలతో గడిచేవి. చేతిలో ఎప్పుడూ తాంబూలం పెట్టె. అందులో కుంభకోణం తమలపాకులు, పోకచెక్కలు. జగ్గులో ఎప్పుడూ మాంచి గుమ్మపాల కాఫీ. ఇంటినుండి పకోడీ, జంతికలు, కారప్పూస, గవ్వలు అవి ఎప్పటికప్పుడు డబ్బా నింపి పంపేవాళ్ళు. సాయంత్రాల్లో కావేరికి వెళ్ళేవాళ్ళం. ఇసుక తిన్నెలమీద కూర్చుని పాటలు, మాటలు, మధ్యమధ్యలో సాహిత్యం. అబ్బే ఏం సాహిత్యంలే! అంతా సొల్లు కబుర్లు, చాడీలు, పుకార్లు, ప్రగల్భాలు. ఆ రోజుల్లో మౌని కూడా అప్పుడప్పుడూ వచ్చేవాడు. పుకార్లు చెప్పడంలో ఆయప్పలాంటి ఒక రచయిత ఇంకొకడు పుట్టలేదనుకో… ఏం సామినాథం?”
“పుకార్లకు భయపడటంలో ఈ పెద్దాయన్ని మించినోడు ఉండడు ఈ ప్రపంచంలో” అన్నాడు సామినాధం.
పెద్దాయన తొడ తట్టి నవ్వి, సామినాథానికేసి చెయ్యి చూపించి “ ఈ జానకిరామన్ లవ్ అఫేర్లన్నీ తెలుసు వీడికి… నోరు విప్పడు. ఆ కాలంలో కుంభకోణం ఇప్పట్లా కాదు, గొప్ప ఊరు. సంగీతం, సాహిత్యం కావేరీ నదితో పోటీపడుతూ ప్రవహించిన ఊరు. ఎందరో మహానుభావులు ఆ ఊరివాళ్ళే, తెలుసా?” అన్నారు.
నేను నవ్వాను.
“వాటితోబాటే మోసాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు కూడా. నోట్లో తాంబూలం వేసుకుని పెదిమలు పక్కకు తిప్పి, చాడీ చెప్పారంటే ఆ శివుడైనా పార్వతిని పక్కకు పెట్టేయగలడంటే చూసుకో! వాళ్ళెవరూ కవులూ కారు, వాళ్ళ మాటల్లో ధర్మం అనే అఱం లేదు కాబట్టి సరిపోయింది. అధర్మపాలనో, ప్రజలకు సంక్షోభం కలిగించే పనులకో తలపడిన రాజులమీద కవులు తిరగబడి ‘అఱం పాడటం’ అనే ధర్మాన్ని తమ పద్యాల్లో వస్తువుగా పెట్టి పాడితే, ఆ రాజు వంశమే నిర్మూలం అయిపోయేది! ఆ రోజుల్లో కవులు ధర్మాత్ములు. ధర్మం కోసం నిలబడే వాళ్ళ వాక్కుకు అంత శక్తి ఉండేది.”
పెద్దాయన మరోసారి తాంబూలం వేసుకోడానికి సిద్ధపడుతూ పోకచెక్కలు తీశారు.
“ఏంటి చూస్తున్నారు? ఒట్టి పోక మాత్రమే. నాలుగైదు సార్లు ఇవి వేసుకుంటే ఒక్కసారి ఎర్రగా పండేలా తాంబూలం వేసుకుంటాను… ఏం చెప్తున్నాను?”
“కావేట్లో మాటలు…”
“అవును… అదయ్యాక అక్కణ్ణుండి నేరుగా రాయర్ క్లబ్‌కు వెళ్ళి అడయ్ లేదా పూరీ, చివర్లో ఆవుపాల కాఫీ. కాఫీలు అర్ధరాత్రుళ్ళు కూడా తాగేవాళ్ళం. రోజూ ఏదో ఒక గుళ్ళో గానకచ్చేరి ఉండేది. నాదస్వరం ఎక్కడ నిల్చున్నా వినబడేది. ఇష్టారాజ్యమే అంతా. అడిగేవాడు లేడు. ఇంట్లో నాలుగైదు మగ్గాలు నడుస్తుండేవి. ౙరీ నేత. ఉత్తరదేశం నాగపూర్‌నుండి ౙరీ వచ్చేది. మంచి నాణ్యమైన ౙరీ. వాటిని అందరు నేయలేరు. మేము నేశామంటే చీరమీద ౙరీలో మహాలక్ష్మి తద్రూపంగా ఉద్భవించేది…”
పోకచెక్కలు పుక్కిట పెట్టుకుని మాట్లాడకుండా ఆగిపోయారు. నిట్టూర్చి “అంతా పోయింది. ఉత్తరదేశంలో మెషిన్‌లు వచ్చేశాయి. ౙరీలో నకిలీలు వచ్చేశాయి. ఒరిజినల్ ౙరీ అంటే బంగారు, వెండి పోగులు పట్టు దారాలతో కలిపి చేసేవి. ఇప్పుడంతా ఇమిటేషన్ మాత్రమే… పందిరి కూలిపోయినట్టు రెండేళ్ళకే వ్యాపారం కుప్పకూలిపోయింది. అప్పులన్నీ కట్టేసి చూసుకుంటే చేతిలో దమ్మిడి లేదు. నలుగురు పిల్లలు. మరో వృత్తి చేతకాదు. ఎవరూ లేరు. నడివీధిన పడ్డాము అనొచ్చు… ఏరా?”
“అవునన్నయ్యా” అన్నాడు సామినాథం.
“ఆ రోజుల్లో ఈ దొంగముండాకొడుకు లేకుంటే మేమందరం ఆకలి చావులు చచ్చుండేవాళ్ళం. నాకు తెలీకుండా బియ్యమో, గోధుమలో తెచ్చి ఇంట్లో వేసి వెళ్ళేవాడు ఈ వెధవ… ఈ పిచ్చోడికి నేనెంత ఋణపడిపోయున్నానో. సరేలే, వచ్చే జన్మ ఉంది కదా… వీడి కొట్టంలో ఆంబోతుగా పుట్టి మెడ విరిగిపోయేలా వీడి బండి ఈడిస్తే తీరిపోతుంది… ఏరా?” అన్నారు పెద్దాయన.
సామినాథం మరోదిక్కుకేసి చూస్తున్నాడు. అతని కంఠంలో కదలికలు. పెల్లుబుకుతున్న ఏడుపుని ఆపుకుంటున్నట్టు అనిపించింది.
“అప్పుడు మరో దిక్కు తోచక రాయడం మొదలుపెట్టాను. అంతా రాత! తెలిసింది అదొక్కటే. ఆడదానిగా పుట్టుంటే దాసీపని చేసుంటాను. రచయితగా పుట్టాను కాబట్టి ఇది… అప్పుడప్పుడే కొత్తగా ప్రచురణ వ్యాపారాలు పుంజుకుంటున్న రోజులు. అప్పటివరకు పుస్తకాలంటే ఊరికి ఒకరు కొనేవాళ్ళంతే. స్వాతంత్రం వచ్చిన ఆ యాభైల్లో, ప్రతి ఊళ్ళోనూ బడి, కాలేజీలు వచ్చేశాయి. ప్రభుత్వ లైబ్రరీలు వచ్చాయి. బర్మానుండి వెనక్కి వచ్చిన నాటుకోట చెట్టియార్లు వచ్చీరాగానే ఈ వ్యాపారంలోకి దిగారు. అందరూ వాళ్ళోళ్ళే… మాఁవలు, బావమరుదులు, దాయాదులు అని వాళ్ళ బంధువర్గాల్లోనే ఉండేవి పుస్తకాల వ్యాపారాలన్నీ. మన ప్రచురణకర్త తిరుచ్చీలో ఉండేవాడు. అన్నదమ్ములు ఇద్దరు… మెయ్యప్పన్ బ్రదర్స్ అని. మహానుభావుడు పుదుమైపిత్తన్ కూడా కథల్లో వాళ్ళ గురించి ప్రస్తావించారు. అప్పడు వాళ్ళు మెడ్రాస్‌లో ఉన్న వాళ్ళ బంధువులతో కలిసి పుస్తకాలవీ వేశారు… ఏం కథరా అది, సామినాథా?”
సామినాథం తడుముకోకుండా “నిజముం, నినైప్పుం” అన్నాడు.
“అవును… ఆ కథలో ఒకడు ‘పుస్తకాల వ్యాపారం చెయ్యడంకంటే పొట్లకాయ వ్యాపారం చెయ్యొచ్చు’ అంటాడు. ‘పొట్లకాయలు నాల్రోజుల్లో అమ్ముడుపోకుంటే కుళ్ళిపోతాయిరా మూర్ఖుడా’ అని అంటాడు వాడి అన్నయ్య. అన్నదమ్ములకు పుస్తకాల వ్యాపారం గురించిన అవగాహన విషయంలో ఎంత తేడా చూశారా!”
పెద్దాయన ఉమ్ము చెంబందుకుని అందులో ఉమ్మేసి “మామూలుగా మంచోళ్ళే. ఇక్కడ తిరుచ్చీలో అంగడి పెట్టుకుని బానే వ్యాపారం చేశారు. డబ్బు తప్ప మరో ఆలోచన లేదు. కరడుగట్టిన వ్యాపారస్తులు… అదంతే. అలా ఉంటేనే వ్యాపారం చెయ్యగలరు. లేదంటే అంతా కట్టిపెట్టేసి మనలా వీధిన పడిపోగలరు. ప్రతి జీవినీ ఒక్కో కర్మకంటూ నియోగించేగా పుట్టిస్తాడు! ఏరా?”
“అవునన్నయ్యా” అన్నాడు సామినాథం.
“చెప్పాలంటే వీడే తీసుకెళ్ళాడు నన్ను. ‘ఏంటండీ పుస్తకాలు రాస్తారా? పేజీకింత అని ఇస్తాము’ అన్నారు. డబ్బిచ్చి అంగచూషణం చెయ్యమన్నా చేసుండేవాణ్ణి. అలాంటి పరిస్థితి నాకు. సరే అన్నాను. పేజీకి ఇంత అనమాట! రాయల్టీ ఏం ఉండదు. రాయడంతో మన పని అయిపోదు, ప్రెస్సుకు వెళ్ళి కూర్చుని సరిగ్గా ఉందా లేదా అని ప్రూఫు చూసి పెట్టాలి. అప్పట్లో అనుసృజన కథలకు మంచి గిరాకీ ఉండేది. నేరం, ప్రేమ, ఉత్కంఠ, అపరాధ పరిశోధన అంటూ అన్ని కోవల్లోనూ కావాలన్నారు. మేధావి అని ఒకాయన అలా అప్పట్లో చాలా రాస్తుండేవాడు. ‘మేధావి రాసినట్టు రాయగలరా?’ అని అడిగాడు పెద్ద చెట్టి. ‘నేను మేధావినే’ అన్నాను. ఆయనకు అర్థం కాలేదు. ఈ రచయితల వర్గమంతా తిక్కలోళ్ళు అన్న అవగాహనకు వచ్చేసిన వ్యక్తి.”
“మీరు రాసిన ఎన్నో నవలలు నేను చిన్నతనంలో చదివాను. ఒకడు బారిస్టర్ చదువుకోసం లండన్‌కు వెళ్తాడు. అక్కడ చాలా అందమైన ఒక యువకుడు, కురూపియైన ఒక యువకుడూ కలిసి ఉండేవాళ్ళు…”
పెద్దాయన చాలా మామూలుగా “ఏదోటి చదివి దాన్ని తిరగరాసిచ్చేయడమే… ఏవుంటాయి మహా అయితే? నెలకు రెండు నవలలు రాసేవాణ్ణి.”
“రెండా?”
“మరే. కొన్నిసార్లు మూడు, నాలుగూ రాశాను…”
“ఎంత ఇచ్చేవాళ్ళు?”
“పేజీల లెక్క అని ఒప్పందం. అయితే వ్యవహారంలో వాళ్ళకు తోచింది ఇచ్చేవాళ్ళు పదిరూపాయలనుండి ముప్పైదాకా… అదీ ఒక్కసారిగా ఇవ్వరు. వెళ్ళి అడిగితే ఒక ఎనిమిదణాలు ఇచ్చి లెడ్జర్లో పద్దు రాసుకునేవాళ్ళు. ఎనిమిదణాలకు పద్దు రాసుకోవడం గురించి పుదుమైపిత్తన్ ఒక కథలో రాశారు.”
నేను నివ్వెరబోయి “ముప్పై రూపాయలా! మొత్తం నవలకు అంతేనా?” అన్నాను.
“అంతేనయ్యా… ఆ తర్వాత మనకు రైట్స్ ఏం ఉండవు. రాసి సంతకం పెట్టి ఇచ్చేయాలి… ఇందాక నువ్వన్నావే ఆ నవలకి ఇరవైరూపాయలు.”
“అది చాలా చాలా తక్కువ కదా?”
“అవును. ఆ రోజుల్లో ప్యూన్ ఉద్యోగం చేసేవాడిక్కూడా నెలకు నూరురూపాయలు జీతం వచ్చేది. నేను నెలకు ముప్పై రూపాయలకే మద్దెల పాటుపడేవాణ్ణి. ఏం చేస్తాం… అంతా రాత!” అని నుదుట వేలితో రాసి చూపించారు.
“ఆ పుస్తకాలన్నీ ఇప్పటికీ అమ్ముడుపోతున్నాయిగా!”
“ముప్పై అయిదేళ్ళుగా మార్కెట్లో లభిస్తూనే ఉన్నాయి… ఇరవై ముద్రణలు దాటుంటాయి.” సామినాథం అందించాడు.
“ఆ తర్వాత మీకేం ఇవ్వలేదా?”
సామినాథం నవ్వి, “బాగుందే… ఈయనకు తిండిపెట్టి పోషించాంగా అంటారు” అని వాపోయాడు. “ఆ పెద్ద కథ ఉందిగా అది చెప్పండన్నయ్యా” అన్నాడు.
“అదెందుకులేరా ఇప్పుడు” అన్నారు పెద్దాయన.
“అలా కాదన్నయ్యా, ఈయన ఈ కాలం రైటర్… తెలుసుకుంటే బాగుంటుంది. చెప్పండి.”
పెద్దాయన మరోసారి తాంబూలం వేసుకోసాగారు. చేతులు వణకడంతో పచ్చి వక్కను తీసి చుట్టలేకపోయారు. వక్క చేజారి దొర్లి తూములో పడింది. వక్కడబ్బీ తీసి చేతిలో పట్టుకుని తలవంచుకుని కాసేపు గమ్మున ఉండిపోయారు.
నేను “పరవాలేదు, తర్వాత చెప్పొచ్చులే” అని అనబోయేంతలోనే పెద్ద నిట్టూర్పుతో మొదలుపెట్టారు.
“చెప్పాను కదా, అప్పట్లో స్కూలు పుస్తకాలకు మంచి గిరాకీ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. స్వాతంత్ర సమరయోధులు, దేశానికి సేవజేసిన నాయకులు ఇలాంటి వాళ్ళ గురించిన చిన్నచిన్న పుస్తకాలు బళ్ళలో ఉండాల్సిందేనని ఆదేశించారు. సైంటిస్ట్‌లు, అశోకుడు, అక్బర్ లాంటి చరిత్ర పురుషుల జీవిత చరిత్రల అవసరం చాలా ఉండింది. వీళ్ళు వంద పుస్తకాలు వేస్తామని ఒప్పేసుకున్నారు. అయితే రాసేవాళ్ళు లేరు. నన్ను పిలిపించి ఎన్ని పుస్తకాలు రాస్తారూ అని అడిగారు. అంతకు ముందురోజే మా ఇంట్లో పెద్ద గొడవ. మజ్జిగ, అన్నం, ఊరగాయ అంటూ పొట్టపోసుకుంటున్నాం. చాలీచాలని జీతం. కప్పుకోడానికి దుప్పట్లు లేక బియ్యం బస్తాలను విప్పి కప్పుకునే పరిస్థితి. చిరిగిన పంచ, చిరిగిన చొక్కా… ఒక ఖాకీ కోట్ ఉండేది. అది ఉండటంవల్ల చొక్కా చిరుగును దాచగలిగాను. ద్రౌపది మానం కాపాడిన కృష్ణ పరమాత్మ కోటు రూపంలో వచ్చాడనుకోండి. రాత్రి భోజనం తర్వాత మొదలైంది. ఇలానే ఉంటే పిల్లకు ఒక మంచీ చెడ్డా ఎలా చూస్తారని తిట్టసాగింది నా భార్య. నేను కూర్చుని రాసుకుంటున్నాను. కోపంతో వచ్చి నా పెన్నూ పేపర్లు లాక్కుని విసిరి కొట్టింది… నాకు ఎక్కడలేనంత కోపం వచ్చేసింది. లేచి చెంప ఛెళ్ళుమనిపించాను. గబగబా నడుచుకుంటూ వెళ్ళి భూతనాథుడి గుడి ముందు రాత్రంతా మంచులో కూర్చుని ఉండిపోయాను. మరుసటిరోజు చెట్టిగారు అలా అడిగేసరికి నా నోట్నుండి వెంటనే ఆ మాట వచ్చేసింది… నూరు పుస్తకాలనూ నేనే రాస్తాను అని చెప్పేశాను.”
“వంద పుస్తకాలనీ?” అన్నాను.
పెద్దాయన నవ్వుతూ “కుక్క వెంటబడి తరుముతుంటే పరిగెట్టడమే… అవును, నూరిట్నీ! ఒక్కో పుస్తకానికి యాభై రూపాయలు. నూరు పుస్తకాలకు ఐదువేలు… అట్లాటగా ఉందా అన్నాడు చెట్టి. లేదు, నేను రాసేస్తాను అన్నాను. వాళ్ళకు నా వేగం తెలుసు. ఒక ఏడాదిలో అన్ని పుస్తకాలూ ఇచ్చేస్తావా అని అడిగారు… తప్పకుండా ఇచ్చేస్తాను అన్నాను.”
“మూడురోజుల్లో ఒక పుస్తకమా!” అని ఆశ్చర్యంగా అడిగాను.
“రాశాను. ఇప్పుడు నాకూ ఆశ్చర్యంగానే ఉంది. అబ్బాయికి ఒక జాబు రాయాలి… ఏడురోజులైంది. ఇన్లాండ్ లెటర్‌లో నాలుగు లైన్‌లు రాసి అలా వదిలేశాను… అయితే అప్పుడు మాత్రం పూనకం వచ్చినట్టు రాశాను. తెల్లవార్లూ కూర్చుని రాసేవాడిని. ఒకే రోజులో వంద పేజీలు కూడా రాసిన సందర్భాలున్నాయి. చేయి పడిపోయేది. తెల్లవారాక చూస్తే ముంజేయి మినపగారెలా వాచిపోయుండేది. అప్పుడు నేను చెప్తుంటే మా అమ్మాయి, అబ్బాయి కూడా రాసిపెట్టేవాళ్ళు. మూడురోజులకు ఒక పుస్తకం చొప్పున ఇచ్చేవాణ్ణి. ఉదయం ప్రెస్సుకు వెళ్ళి ప్రూఫ్ చూసి మధ్యాహ్నం అక్కడే కాసేపు కునుకు తీసేవాణ్ణి. అక్కడ్నుండి నేరుగా లైబ్రరీకి వెళ్ళి తర్వాత పుస్తకానికి కావలసిన మూలపుస్తకాన్ని తీసుకుని ఇంటికి వచ్చి కాఫీ తాగి రాయడానికి కూర్చునేవాడిని. చదవడం రాయడం రెండూ ఏకకాలంలో జరిగిపోయేవి. కొన్నిసార్లు రాస్తూనే తెల్లవారిపోయేది… చెప్పడానికేం గానీ, ఒక ఏడాదిలో అన్నీ రాసిచ్చేశాను… చివరి పుస్తకం రాసేప్పటికి తొలిగా రాసిన పుస్తకం మూడో ముద్రణ అమ్ముతుండేవారు.”
“నేను ఆ పుస్తకాలన్నిట్నీ చదివాను. ఇప్పడు కూడా కొత్త ముద్రణ వేశారు.”
“అవును. అమ్ముడుపోతూనే ఉన్నాయి.” నవ్వారు.
“పడినపాట్లదేముంది గాని, ఒక మార్గదర్శకుడిగా నాకు చాతయినది పిల్లలకు చేశాను” అని నిట్టూరుస్తూ, “అయితే నేను కథలు రాయడం మానేశాను. సాహిత్యం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరినీ కలవలేదు. అరుదుగా పసులపోలిగాడు రోడ్డుమీద కనబడితే ‘రేయ్, నీ యబ్బా. నల్లపూస అయిపోయావుగదరా. ఆగరా!’ అంటుంటాడు. దూరంగా అయితే ‘పనుంది స్వామీ’ అని జారుకునేవాణ్ణి. దగ్గరగా దొరికితే చొక్కా పట్టుకునేవాడు. అమ్మనా బూతులు తిట్టేవాడు… అతనికేం, అ, ఆ, ఇ, ఈ అని గొంతెత్తి పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు నెల నెలా పెన్షన్ ఇంటికి వస్తుంది. సాహిత్యం మాట్లాడుతాడు. నాకు అన్నీ పోయాయి… రెండు నవల్లు, నాలుగైదు కథలు ఉన్నాయి నాకంటూ. వాటిని ఎవడైనా కొని చదివితేనే… చదువుతారు.”
సామినాధం “పుదుమైపిత్తన్ చెప్పారుగా” అంటూ, కంఠోపాఠాన్ని అప్పజెప్పినట్టు “చీకటి ఉంటేనేగా వెలుతురు? వెలుతురు రాకుండా పోతుందా? అప్పటివరకు ఓపిక పట్టాల్సిందే” అన్నాడు.
పెద్దాయన ముఖంలో దరహాసం. అంత విషాదం నిండిన ఒక చిరునవ్వును నేను ఈ మధ్యకాలంలో చూడలేదు.
సామినాథం “ఎంత కాలమో! వెలుతురు వచ్చేప్పుడు మనం ఉండాలి అని కూడా ఏమీ లేదు” అని ముగించాడు. అది పుదుమైపిత్తన్ రాసిన జాబు అన్న కథనుండి అనిపించింది.
పెద్దాయనకేసి “చెప్పండీ… మెయిన్ పాయింటుకే రాలేదింకా” అన్నాడు సామినాథం.
“ఎందుకులేరా అదంతా! శవం చితిమంటలో కాలిపోయేప్పుడు అన్నీ కాలి బూడిదైపోతాయి. కామం, క్రోధం, మోహం, మాత్సర్యం అంతా… లైఫ్‌లో వీటికి ఏ పరమార్థమూ లేవురా…”
“లేదన్నయ్యా… ఆయన తెలుసుకోవాలి” అని బలవంతపెట్టాడు సామినాథం.
పెద్దాయన నవ్వి నాకేసి చూపిస్తూ “ఈయన మామూలోడు కాదురా! ఈయనకు తలుపులన్నీ తానుగా తెరుచుకుంటాయి. లేదంటే ఈ మనిషే పగలగొట్టేస్తాడు. కొన్ని జాతకాలు అలాంటివి” అన్నారు.
మళ్ళీ కాసేపు మౌనం. “అడపా దడపా తీసుకున్నది పోగా మిగిలిన డబ్బంతా వాళ్ళదగ్గరే ఉంచాను. మన చేతిలోకి వస్తే దారిద్ర్యదేవతకి పూజులు చెయ్యడానికి, నైవేద్యాలు పెట్టడానికే సరిపోతుంది. ఇంచుమించుగా మూడువేల రూపాయలు చెట్టిగారి దగ్గరే ఉండింది. దాన్ని నమ్ముకుని కూతురికి పెళ్ళిపెట్టుకున్నాను. చేతిలో తాంబూలప్పళ్ళెం పట్టుకుని చెట్టిగారి ముందు నిలబడ్డాను. శుభకార్యం పెట్టుకున్నాను, ఆ డబ్బు మూడువేలు ఇమ్మన్నాను. ‘మూడువేలా… ఏంటండీ వాగుతున్నారు? బుక్కు రాయడానికి మూడువేలా?’ అని అడిగాడు. నేను సరదాకి ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాను. కాస్త గడిచాక అర్థం అయింది, నిజంగా అంటున్నాడు అని. అప్పటిదాకా ఐదు, పది అని మాత్రమే ఇచ్చెరిగిన వ్యక్తి ఒక రచయితకు మూడువేల రాపాయలు ఇవ్వడం అన్నదాన్ని జీర్ణించుకోలేకపోయాడు.”
“అప్పటికే మీరు రాసిన వంద పుస్తకాలూ అమ్మడుపోతున్నాయి కదా…” అన్నాను.
“అవును, అందులో వచ్చిన లాభాలతోనే అంగడి డబుల్, ట్రిపుల్‌గా విస్తరించింది. తిరుచ్చీలో బంగళా కట్టాడు. ఊళ్ళో పొలం గట్రా కొన్నాడు. అయితే వాటిని పక్కన పెట్టేసి, నాకు లక్ష రూపాయలు అప్పుంది అన్నాడు. పంచదార చిలకల్ని పేర్చి పెట్టినట్టు రకాలవారిగా పుస్తకాలు అచ్చేసి గోడవున్ అంతా కట్టలు కట్టలుగా పేర్చిపెట్టి ఉన్నాడు. అంతా నెలల్లో సొమ్ముగా మారిపోగలదు. వ్యాపార పెట్టుబడంటే అప్పు తప్పనిసరేగా! అయితే ఈ సొమ్ము కంటబడలేదు. అప్పుని మాత్రమే చెప్తున్నాడు. ఆ అప్పు పెట్టుబడితో సంపాదించుతున్నది అతని కంటికి కనిపించడంలేదు… ‘మూడువేలు అన్న మాటే తీసుకురాకు. ఏడు వందలైతే ఇస్తా’నన్నాడు. ‘స్వామీ, నా పొట్టకొట్టకండి’ అని బతిమలాడాను. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యకండి చెట్టిగారూ అంటూ ఆయన మేజాకింద వంగి చెట్టి కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు విదిలించుకుని లేచి గట్టిగట్టిగా కేకలేశాడు. ‘నన్నేమైనా ఎర్రాడు అనుకున్నావా? కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయి కాసులివ్వడానికి? నాలుగణాలు, ఎనిమిదణాలంటూ కష్టపడి చేర్చిన డబ్బు… నువ్వేం రాశావూ? నాలుగు పుస్తకాలు చదివి వాటిని అటు ఇటు చేసి రాశావు. దానికి నాలుగు వేలా… రాసేదేమైనా పెద్ద బొచ్చుపీకే పనా? స్కూలు పిల్లలు కూడా రోజంతా రాస్తారుగా! ఇన్నాళ్ళు నీ ఇంట్లో పొయ్యి వెలిగింది నా డబ్బుతోనేగా? ఆ కృతజ్ఞత ఉండనీ. నిన్నూ ఒక మనిషిగా నమ్మాను, నీకు పనిచ్చాను…’ అని కారుకూతలు కూశాడు.”
“గబగబా జనం గుమిగూడారు. ‘యజమాని చెప్తోంది న్యాయమే కదా, ఎంతైనా ఏడేళ్ళుగా పోషిస్తున్న దేవుడు కదా ఆయన’ అంటున్నారు. అప్పుడే చెట్టి తమ్ముడు అక్కడి వచ్చాడు. వాడూ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నాకు ఆవేశం వచ్చి అరవసాగాను. ‘నన్ను మోసం చేసి ఆస్తులు కూడబెడుతున్నావు, నువ్వు బాగుపడ’వన్నాను. వాడు ఉన్నఫళంగా నన్ను లాగి కొట్టేశాడు. జనం పట్టుకున్నారు. ‘నా ఉప్పు తిని నాకే శాపనార్థాలు పెడుతున్నావా, పోరా కుక్కా!’ అని అరిచాడు చెట్టి. నేను వీధిలో నిలబడ్డాను. ఏం చెయ్యోలో తోచలేదు. సాయంత్రం వేళ. ఎటెళ్ళాలో తోచడంలేదు. ఇంటికి ఎలా వెళ్ళడం! పెళ్ళి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. డబ్బు కావాలి. నగలు, చీరలు కొనాలి. పందిరికి, భోజనాల సరుకులకీ, వంటగాళ్ళకీ అడ్వాన్స్ ఇవ్వాలి. అక్కడే నిల్చున్నాను. చీకటిపడ్డాక మళ్ళీ చెట్టి కాళ్ళమీద పడి ఏడ్చాను. పోరా అని మెడబట్టి బయటకి తోసేశాడు.”
“ఎనిమిదికి అంగడి కట్టేశారు. రాత్రంతా అక్కడే నిల్చున్నాను. ఎలా నిల్చున్నాను, ఎందుకు నిల్చున్నానో తెలీదు. చెవిలో గుయ్యిమని ఒక శబ్దం వస్తోంది. ఆ శబ్దం కొన్నాళ్ళ తర్వాత చాలా పెద్ద ఇబ్బందిగా మారిందిలెండి. ‘శబ్దాలు’ చదివే ఉంటారుగా…”
“అవును” అన్నాను.
ఆయన కాసేపు ఏదీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం బండరాయంత బరువుగా అనిపించింది. కాసేపటికి నిట్టూర్చి “పొద్దున చెట్టి అంగడి తియ్యడానికి వచ్చినప్పుడు నేను అరుగుమీద కూర్చుని ఉన్నాను. ఆయన్ని చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. చేతులు మాత్రమే జోడించగలిగాను. నా నోట ఒక్క మాటైనా రాలేదు. గొంతులో రాయిపడినట్టు అనిపించింది… ఆయన నన్ను కాసేపు చూశాడు. ఆ చూపులో మలాన్ని చూసినటువంటి ఏహ్యత… తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. గల్లాపెట్టె ముందు కాసేపు కూర్చున్నాడు. టక్కుమని లేచి వచ్చి ‘నీ తల్లి, నువ్వు కడుపుకు కూడే తింటావా పియ్యి తింటావారా? మనిషివేనా నువ్వు? ఒక అబ్బకు పుట్టినవాడివైతే ఒక్కసారి చెప్తే అర్థం అయుండేది…’ అని తిట్లందుకున్నాడు. ఆ బూతులకు నా చర్మం ఊడిపోతున్నట్టు అనిపించింది. నేను కంట నీటితో ‘నాకు మరో గతిలేదు. నేను ఎక్కడైనా పడి చావాల్సిందే!’ అన్నాను. ‘పొయ్యి చావురా, కుక్కా. ఇదిగో విషం కొనుక్కోపో’ అని ఒక్క రూపాయి తీసి నా ముఖాన కొట్టాడు.”
“కాసేపు మతి భ్రమించినవాడిలా కూర్చున్నాను. ఏదో ఒక ఊపు వచ్చి లేచి గబగబా నడిచాను. చెట్టిగారి ఇంటికి వెళ్ళాను. ఉదయం సమయం పదిగంటలయ్యుండచ్చు. చెట్టిగారి భార్య అరుగు మీద కూర్చుని పక్కింటి పాపకు ఇడ్లీ తినిపిస్తోంది. ఆమె ముందు నిలబడి చేతులు జోడించాను. ‘ఏంటి కవిగారూ ఇలావచ్చారు?’ అన్నారామె. ఆమెకు పెద్దగా ఏమీ తెలియదు. అక్షరాలు కూడి చదవగలదంతే. నేను జోడించిన చేతులు తియ్యకుండానే జరిగిందంతా చెప్పాను. ఆమెతో చెప్పి చెట్టికి చెప్పించాలనే వెళ్ళాను. అయితే చెప్తున్నకొద్దీ నాలో ఏదో ఒక ఉద్రేకం వేగం పుంజుకుంది. ఒళ్ళంతా అగ్నిసెగలు ఎగసిపోతున్నట్టు. చేతులు కాళ్ళు జ్వాలల్లాగా కదులుతున్నట్టు అనిపించింది. ‘నేను సరస్వతీ కటాక్షం కలిగినవాణ్ణి’ అన్నప్పుడు నాలో ప్రళయ రుద్రుడు ప్రవేశించినట్టు పూనకం వచ్చేసింది. నా గొంతు పైస్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఆడిన మాటలన్నీ ఎలా మాట్లాడానన్నది నాకు ఈ రోజుకీ ఆశ్చర్యమే. ‘నా పొట్ట కొట్టేసిన మీరూ మీ పిల్లలూ బతకరు… ఒకవేళ బతికితే ఆ సరస్వతిదేవి వ్యభిచారి అని అర్థం’ అని చెప్తూనే పెన్ను తీసి ఒక పద్యం రాసి ఆమె ప్లేట్లోని ఇడ్లీ తీసి ఆ కాగితానికి రాసి ఆ ఇంటి తలుపుకి అంటించేసి వచ్చేశాను.
“నా కాళ్ళు తడబడ్డాయి. నడక ముందుకు సాగలేదు. భోజనం చేసి అప్పటికి రోజు దాటింది. అయితే భోజనాన్ని తలచుకుంటేనే పేగుల్లో దేవేసినట్టు అనిపించింది. నేరుగా వెళ్ళి నా చేతికున్న వాచీని అమ్మేసి పీకలకాడికి తాగాను. ఎప్పుడు ఇంటికి వచ్చాను, ఎక్కడ పడుకున్నాను అని ఏమీ తెలియదు నాకు. నా భార్య బావిలో దూకడానికి పరిగెట్టిందట. ఇంట్లో జనమంతా ఉండటంతో పట్టుకున్నారట. నేను శవంలా పడున్నాను. ఎవరెవరో వచ్చి పలకరిస్తున్నారు, కదుపుతున్నారు, తిడుతున్నారు. గట్టిగా ఊపి లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కావేరి ఇసుకలో పూడిపోయి పైన జరిగేవాటిని చూస్తున్నట్టు అనిపించింది. నేను చనిపోయానేమో అనిపించింది. నేను చచ్చిపోయాను అనిపించినప్పుడు ఒక ప్రశాంతత కలిగింది. బరువంతా పోయి తేలికపడినట్టు అనిపించింది. నలభై ఏళ్ళుగా తీర్చలేని లక్షల అప్పును ఒకే రోజు తీర్చేస్తే ఎలా ఉంటుంది! అలాంటొక ప్రశాంతత. గాలిలాగా, దూదిలాగా… అప్పుడు నా చెవుల్లో ఒక గొంతు వినబడింది. ఎవరో నా పేరు చెప్తున్నట్టు. నెమ్మదిగా కన్నతల్లి పిలుస్తున్నట్టు… మరణం ఎంత అందమైనది అని అప్పుడు అనిపించింది. ఇప్పుడు చావంటే భయంలేదు. నవ్వుతూ ఎదురు చూస్తున్నాను.”
“ఆ పద్యం…?” అడిగాను. మనసులో అప్పటికే ఊహించాను. ధర్మం పాడుంటారు అని.
“ధర్మమే… అలాంటొక ఆచారం ఉందిగా మనకు! రాస్తారని విన్నాను గానీ అంతకంటే వివరాలేవి తెలియదు. పసులపోలిగాడూ నేనూ ఛందస్సు గురించి చర్చించుకున్నాం గానీ నేను ఎప్పుడూ పద్యం రాసెరగను. నేను క్రమంగా వ్యాకరణమే చదువుకోలేదు. నేను రాసిన తొలి పద్యమూ చివరి పద్యమూ అదే! పద్యం పూర్తిగా గుర్తులేదు. ఆ సంఘటనని మరిచిపోవాలనే పాతికేళ్ళుగా ప్రయత్నిస్తున్నాను. చివరి రెండు పాదాలు మాత్రం ఇంకా గుర్తుంది.
…చెట్టి కులమంతరించిన నెత్తుటిమట్టిరాశిలో విస్తరించనీ నా ధర్మంబు!”
నేను ఆత్రంగా “ఆ పైన ఏం జరిగింది?” అని అడిగాను.
“ఏం జరిగిందని తర్వాత వేరేవాళ్ళు చెప్తే తెలిసింది నాకు. ఆ చెట్టమ్మ ఉన్నఫళంగా ఇంటినుండి పరుగెట్టుకుంటూ చెదిరిపోతున్న చీరతో, విరబోసుకున్న జుట్టుతో నేరుగా అంగటి ముందు వెళ్ళి నిల్చుందట. కవిగారి బాకీ పైసాతో సహా ఇప్పటికిప్పుడే చెల్లించమన్నారట. తలచుకుంటేనే ఝల్లుమంటుంది. అలా ఎలా చేసిందో! పూర్వం కణ్ణగి అనే స్త్రీమూర్తి మధురైని తన ధర్మంతో తగలబెట్టిందే, ఆమేనా ఈమె? ఆమె కులంలోని కొనసాగింపేనా ఈమె? ఆమె నిల్చున్న తీరు చూసి చెట్టి గడగడా వణికిపోతూ ‘ఆయన డబ్బు మొత్తం చెల్లించేస్తాను… రేపటిలోపు ఇచ్చేస్తాను, ఒట్టు’ అన్నాడట. ‘ఇవాళే ఇవ్వు, ఇప్పుడే ఇవ్వు. నువ్విచ్చాక గానీ నేనిక్కడ్నుండి కదలను’ అంటూ వెళ్ళి తారు రోడ్డుమీద కూర్చుందట. ఆవిడది నిగనిగలాడే నల్లని రంగు. భారీ ఆకారం. నలుగురి పెట్టు ఉంటుంది. పసుపు రాసుకున్న ముఖం. అణా నాణెమంత పెద్ద కుంకుమబొట్టు – నల్లని నుదుట మండే నిప్పుకణికలా! మెడలో మందపాటి మంగళసూత్రం, విరగబూసిన దిరిసెన పూలు వేలాడుతున్నట్టు అందులో బిళ్ళలు, పూసలు, మణులు… స్వయంగా గుడిలోని అమ్మోరుతల్లి లేచి వచ్చి కూడల్లో వెలసినట్టుగా కూర్చుందట. ఆమె ముందు నిలబడి మరో మాట మాట్లాడలేరు. గొంతు కొరికి రక్తం తాగేయగలదు… చెట్టి పరుగులు తీశాడు. బేంకులో అంత డబ్బులేదు… అప్పుకు పరిగెట్టాడు. తెలిసినవారి కాళ్ళావేళ్ళా పడి డబ్బు పోగు చేసుకోడానికి సాయంత్రం అయింది. అప్పటిదాక ఆమె నడిరోడ్డుమీద నల్లరాతి విగ్రహంలా కళ్ళు మూసుకుని కూర్చుని ఉండిపోయిందట. అగ్గిలా మండుతున్న చైత్రమాసపు ఎండలు. అగ్నినక్షత్రం రోజులవి. తారు కూడా కరిగే ఆ రోడ్డుమీద కదలకుండా కూర్చునే ఉందట. చెట్టి టాక్సీ పట్టుకుని నేరుగా మా ఇంటికి వచ్చాడట. నేను శవంలా పడున్నాను కదా! నా భార్య కాళ్ళమీద పడి డబ్బు పోసి, ‘నా వంశాన్ని నాశనం చేసేయొద్దని నీ భర్తతో చెప్పమ్మా… నా ఇంటి ఇలవేల్పు, కులపాలిక ఇప్పుడు వీధిలో కూర్చుని ఉంది… మీ డబ్బంతా వడ్డీతో సహా ఇందులో ఉంది’ అని చెప్పి ఏడుస్తూ వచ్చిన టాక్సీలో తిరిగెళ్ళాడట. నేరుగా భార్యముందు నిలబడి, పైగుడ్డను నడుముకు చుట్టుకుని ‘నా కులదైవమా, లెయ్యి. నేను చెయ్యాల్సింది చేసేశాను తల్లీ’ అని మొరపెట్టాడట. నలుగురు మనుషులు ఆమెను పట్టి లేపారట. చీర, లంగాతోబాటు చర్మం కూడా తారుకు అంటుకుపోయిందని చెప్పారు!”
నాకు ఆ దృశ్యమంతా స్పష్టంగా కళ్ళముందు కనిపించింది. పెద్దాయన ఆ రోజులకు వెళ్ళిపోయారు. వీధిలో ఎవరో “ముగ్గు పొడీ…” అని కేకేస్తూ వెళ్తున్నారు. నేను ఎక్కడున్నాను అని కాసేపు పోల్చుకోలేకపోయాను.
“పెళ్ళి కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తయ్యాయి. చెట్టి అన్నదమ్ములు ఒక కాసు ఉంగరం పంపించారు. పదిరోజుల తర్వాత చెట్టమ్మ నన్ను తీసుకురమ్మన్నారట. నేను వెళ్ళాను. ఆవిడ కాళ్ళమీద సాష్టాంగంగా పడిపోవాలి అనే ఆలోచనతోనే వెళ్ళాను. నా కూతురు పెళ్ళి ఎప్పుడైతే చక్కగా జరిగిపోయిందో అప్పుడే నా మనసు మరో దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఎందుకంత కోప్పడ్డాను అని పశ్చాత్తాపం కలిగింది. అప్పుచేసి వ్యాపారం చేసేవాడిదగ్గర ఒక్కసారిగా అంత డబ్బు అడగటం తప్పేమో అన్న ఆలోచన వచ్చింది.
“ఇంట్లోకి అడుగు పెట్టగానే చేతులు జోడించి నా దగ్గరకొచ్చి నిల్చున్న చెట్టమ్మ, ‘కవిగారూ, మీ నోటితో మా వంశాన్ని దీవించి ఒక పద్యం పాడండి. మేము చేసిన తప్పును క్షమించండి. లక్ష్మి వస్తుంది, వెళ్తుంది… సరస్వతి ఏడేడు జన్మల పద్దు చూసిగానీ కటాక్షించదు అంటారు. మీరు పెద్దవారు, పండితులు. నా ఇంటి వాకిట కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆ పాపపు మరక మా మీద అంటుకోకుండా ఉండాలంటే మళ్ళీ మీ మాటలే మమ్మల్ని రక్షించాలి’ అని వేడుకుంది. ఆమె మాటలకు నివ్వెరబోయాను! బంగారు నాణేలను ఎంచి పెట్టినట్టు… ముత్యాలను గూర్చినట్టు… తడబడకుండా, వెతుక్కోకుండా మాట్లాడుతున్నారు. మనమూ ఉన్నాం దేనికి? ఒక పంక్తి రాయాలంటే నాలుగుసార్లు, రాసి, కొట్టి, దిద్ది చూసుకుంటాం. ఏదీ సరిగ్గా రాదు. సరస్వతి కటాక్షం అంటే ఏంటి? మనసులో ఆ దీపం ప్రజ్వలిస్తే, ఆమె వచ్చి కూర్చోక తప్పదు. మరో మార్గంలేదు సరస్వతికి… మిగిలినవంతా వృథా ప్రయాసలు…”
మళ్ళీ కాసేపు మౌనం.
“ఏం చెప్తూ ఉన్నాను? ఆఁ… నాకు చెయ్యీ కాలూ ఆడలేదు. నిశ్చేష్టుడనయ్యాను. నాలుక పిడచగట్టుకుపోయింది. అలా కుర్చీలో తలదించుకుని కూర్చుండిపోయాను. తలపైకెత్తి ఆమెను చూడలేకపోయాను. చెట్టమ్మ పాదాలనే చూస్తూ… మట్టెలు. వాటికో ఐశ్వర్య లక్షణం ఉంది! అది ఇంటిని పాలించే ఆడవారి ఐశ్వర్యం. ధర్మం దేశపాలనకు మాత్రమే అని ఎవరన్నది? ధర్మం ఇంట్లో ఉంది. ధర్మపత్ని అని ఊరకే అన్నారా? ఉన్నపళంగా పద్యం స్ఫురించింది. గబగబా కాగితం తీసుకుని పద్యం రాసేశాను. చెట్టమ్మ చేతిలో పెట్టాను. ఆమె రెండు చేతులతో అందుకుని కళ్ళకద్దుకుంది.”
“ఆ పద్యంలో మొదటి రెండు పాదాలు మాత్రమే గుర్తుంది. ‘మట్టెల కాంతి జిమ్మ, మేనంతయు పసిడి దీపంబువోలె, చెట్టి కులపాలిక మునుజన్మ నోముఫలము’ అంతే మిగిలిన పాదాలు గుర్తు తెచ్చుకోడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. జ్ఞప్తికి రాలేదు. సరేలే, మనం చేసింది అంతే మిగిలినదంతా సరస్వతి లీల అనుకుంటాను. లోపల పట్టుచాప పరిచి దాని మీద వెండిపళ్ళెంలో భోజనం పెట్టి స్వయంగా తానే వడ్డన చేసింది చెట్టమ్మ. ఒక చిన్న తాంబూలపు పళ్ళెంలో బంగారు నాణేలు మూడిటిని పెట్టి, దానితోబాటు ఐదు వందల రూపాయలు డబ్బూ ఇచ్చింది. నా ఆశీస్సులు తీసుకోమని పిల్లలకు చెప్పింది… ఆ రోజు ఆ ఇంటి గడప దిగిన నేను అంతకు ముందు ఉన్న నేను కాను. మరణించి మళ్ళీ కొత్త జన్మ పొందాను. అప్పుడర్థం అయింది మాటంటే ఏంటని! మాట – కచ్చితంగా అది పార్థుడి బాణమే! ఎక్కుపెట్టేప్పుడు ఒకటే, విల్లునుండి విడిచాక నూరు, వెళ్ళి కొట్టేప్పుడు వెయ్యి… ఏరా సామినాథం?”
“ధర్మం అని ఊరకే అన్నారా అన్నయ్యా” అన్నాడు సామినాథం.
“సిలప్పదిగారంలో ఇళంగో అదేగా అన్నాడు! ధర్మం నీ పక్కనుంటే నీకు అన్యాయం చేసినవారిని ఆ ధర్మం దండించి తీరుతుంది అని!” పెద్దాయన సామినాథానికేసి చూసి, తర్వాత తనకు తానే చెప్పుకుంటున్నట్టు, “అవును, ధర్మమే! అయితే అది ఆమెలోనేగా ఉండింది…” అన్నారు.
(మూలం: అఱం, 2011)