స్వ

స్వ-I

సమూహం నుండి వేరు పడడం కాకుండా
వేరుపడీ పడలేకపోవడమా అసలైన ఒంటరితనం!?

ఎప్పటికప్పుడు
ఆ నిమిషాన్ని ఆరనీయకపోవడమే కదా బతుకంటే

ఇక్కడున్న లక్షల కోట్ల ఊపిరితిత్తుల లాగానే
కాసేపు గాలిని అద్దెకు తీసుకుని బ్రతికే వాళ్ళమేగా అందరం

తుపాకీల పై దొరికిన వేలిముద్రల్లో
నాదంటూ ఓ గీత వుంటుంది
తూటాలకు అంటిన మరకల్లో
నాదంటూ ఓ నెత్తుటి చుక్క వుంటుంది
రాళ్ళు విసిరే చేతిలో నాదీ ఓ వేలుంటుది
పగిలిన విగ్రహం వేలిలో నాదీ ఓ బతుకుంటుంది
పారే ఉప్పు నదులలో నాదంటూ ఓ పాయ వుంటుంది
నవ్వే పెదవులలో నాదంటూ ఓ కారణముంటుంది

ఒకే ఊపిరి పంచుకున్న వాళ్ళం
ఒకే ఊపిర్లో భాగమైన వాళ్ళం
బతుకులోనూ కారణమవుతాంగా

మనది కాని ఓ పరాయి క్షణాన్ని హత్తుకుని అనుభవించడమూ జీవితమే.

స్వ-II

ఇక్కడేదీ స్వంతం కాదు
కాకపోతే
అనంతమైన ముసురులో
తలో తోవ చూస్తున్నాం

కోట్ల చుక్కలూ
కోట్ల కథలూ
కోట్ల దారులూ.

ఇది
మిణుగురు గుండెలోని
ఉదయపు వేడీ
రాత్రుల చీకటీ
ఊగే చెట్లూ, పారే వ్యర్ధాలూ
ఊపిరాడనివ్వని కమరుతో పాటు
తనకంటూ దాచుకున్న గుప్పెడు గాలి.