ఒక కవిత కథ

సుష్మ కవిత రాయడం ప్రారంభించింది. మొదటి రెండు పాదాలూ సులభంగా పేపర్ మీదకు వచ్చేశాయి.

ఇప్పటికీ…
నువ్వు తలపుకొస్తే
నా కనురెప్ప అంచుపై కన్నీటి చుక్క తొణుకుతుంది

చాలా సాధారణమైన వాక్యాలే. ఆధునిక కవుల్లో ఎవరైనా రాయగలిగేవే. వాటికి ప్రత్యేకంగా అభినందనలు వెల్లువెత్తాయంటే, అవి ఒక స్త్రీ రాసినవి అయి ఉండాలి.

సుష్మ మొగుడు రఘురామన్‌తో సహా, మనలో చాలామందికి అలవాటే – ఒక రచయిత్రో, కవయిత్రో, ఒక స్త్రీ రాతల్లో ఆమెకు సంబంధించిన వ్యక్తిగతానుభవాలను కనిపెట్టి వెలికి తీయడం. రఘురామన్ సుష్మ రాసిన ఈ లైన్లు చదివితే, తప్పకుండా అనుమానించి తీరతాడు. సీజర్ భార్యలా అతని భార్య కూడానూ ఏ అనుమానానికీ తావివ్వకుండా అటువంటివాటికి చాలా పై ఎత్తులో ఉండాలి.

అందుకే సుష్మ కవిత్వం ఎప్పుడూ ఒక ప్రతికూల రహస్య ప్రపంచంలో పురుడు పోసుకుంటుంది. ప్రస్తుతం సుష్మ వంటింటి గట్టు మీద తెల్లకాగితాలు పరిచి, కవిత్వం రాస్తోంది. ములుకు విరిగిన పెన్సిల్, కూరగాయలు కోసే కత్తి, సగం తరిగిన కూర ముక్కలు, కాసిని ప్లేట్లూ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వేపుడు కోసం కాబోలు సగం బెండకాయలు చక్రాలుగా తరిగి పెట్టింది. పచ్చి అరటికాయలు, ములక్కాడలు, టమాటాలు – అవియల్ కోసం అయుండాలి.

ఇక సుష్మ ఏం చేస్తోందో చూద్దాం:

తరుగుతున్న కూరల్ని గట్టు మీద వదిలేసి, గబగబా ఆ రెండు లైన్లు రాసి, మళ్ళీ కూరల్ని, చాకుని దగ్గరకు లాక్కుంది. ఇందాక వదిలేసిన బెండకాయల్ని పూర్తిగా చక్రాలుగా తరిగి పక్కన పెట్టి, అరటి కాయల్ని అందుకుంది. రాయబోయే కవితను మననం చేసుకుంటున్నట్టు పెదవులు శబ్దం రాకుండా కదులుతున్నాయి. చాకు మొనతో అరటి కాయల్ని లాఘవంగా చెక్కు తీస్తూ, గబుక్కున ఆగి పోయింది. పేపర్ ముందుకు లాక్కుని మరో నాలుగు లైన్లు రాసింది, అంతే లాఘవంగా.

నాకు గుర్తుంది

ఒకరిలో ఒకరు ఒదిగి ఆ గొడుకు కిందకు మనం చేరడం
ఒంటరి వీధిలో ఆ కుంభవృష్టిలో తడిసి ముద్దయిన క్షణం
నా భుజం చుట్టూ పడిన నీ చేయి
నీ స్పర్శతో చిగురుటాకై వణికిన నా దేహం

నాకు గుర్తుంది

నెమ్మదిగా ఒక లేత బంగారు కాంతి సుష్మ మొహమంతా పరుచుకుంది. హాయిగా నిద్రలోకి జారుకుంటున్నట్టుగా ఆమె చేయి నెమ్మదిగా కాగితం మీద ఆగిపోయింది. ఆ వర్షం కురిసిన నాటి జ్ఞాపకాల్లోకి, ఆ వర్షం లోకి, మెరుపులు మెరుస్తున్న తన చేతి వేళ్ళ చివర్లతో సహా సుష్మ జారిపోయింది. ఈ లోపు ఆమె భర్త రఘురామన్ ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి.


స్కూలు దగ్గర్లోని బస్టాప్‌లో ఆఫీసు వైపెళ్ళే బస్ కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు రఘురామన్.

మామూలుగా అయితే బైక్ మీద వెళ్ళేవాడు గానీ ఇవాళ బండి కదలనని మొరాయించింది. అందుకే పిల్లల్ని ఆటో రిక్షాలో స్కూలు దగ్గర దింపి బస్ కోసం నిల్చున్నాడు. బస్సు తొందరగా వస్తే అటెండెన్స్ రిజిస్టర్‌లో లేట్ మార్క్ తప్పించుకుంటాడు.

ఆఫీసులో శ్రీరంజని డెస్క్ పక్కనే అతని డెస్క్. ఆమె అంటే అతనికి గొప్ప ఇష్టం. ఆమె ఒంపుసొంపులన్నిటినీ ఆరాధనగా, హక్కుగా చూస్తుంటాడు అదేదో ఆమె తన భార్య అయినట్టు, వాటిని సుష్మకు ఆపాదించి మరీ. ఆశ్చర్యంగా, ఆమె తన భార్య అయితే బాగుండునని రఘురామన్ ఎప్పుడూ కనీసం ఊహించుకోనైనా లేదు. భార్యలుగా సుష్మ లాంటి ఆడవాళ్ళే సరైన వాళ్ళని రఘురామన్ నిశ్చితాభిప్రాయం. సుష్మ నెమ్మదిగా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు, ఇంటి పనంతా చేసుకుపోతుంది. ఏ ఫిర్యాదూ చెయ్యదు. అన్నిటికీ మించి అద్భుతంగా వంట చేస్తుంది.

శ్రీరంజని బానే ఉంటుంది. కానీ ఒక స్నేహితురాలిగా మాత్రమే. మనసుకు, మెదడుకు కాస్త ఉల్లాసం కావల్సినపుడు, ఇండియన్ కాఫీ హౌస్‌కి తీసుకుపోయి, కలిసి కాఫీ తాగడానికి, మసాలా దోశ తింటూ ప్రపంచ సాహిత్యం గురించి, బోర్హెస్ గురించి, అరవిందన్ గురించి, ఉత్తరాధునికత గురించి ఉత్సాహంగా చర్చలు, వాదనలు జరపడానికి. అవును, వీటికే బాగుంటుంది శ్రీరంజని. ఆమెకి అభ్యంతరం లేకపోతే మరో అడుగు ముందుకు వేయాలనే ఉంటుంది మనసులో. అది కూడా, ఎలాటి లంపటాల్లోనూ ఇరుక్కోకుండా పడాలి ఆ అడుగు, అవసరమైతే వెంటనే వెనక్కు తీసుకునేట్టుగా. అంతే కాని, శ్రీరంజని లాంటి భార్యా? నో!

స్త్రీవాదులైన ఆడవాళ్ళందరూ పొరుగిళ్ళలో భార్యలుగా ఉంటేనే శ్రేయస్కరం.

శ్రీరంజని తలపుల్లో అతను కొట్టుకుపోతుండగానే బస్ వచ్చింది. స్కూలు పిల్లలు గుంపుగా దిగుతున్నారు. అందరూ దిగాక, కిటికీ పక్క సీట్లో సర్దుకుని హాయిగా వెనక్కి జారగిలబడి కూచున్నాడు. మళ్ళీ శ్రీరంజని గుర్తొచ్చింది. ఇవాళ ఎర్రని సిల్క్ చీరలో వస్తే బాగుండు ఆఫీస్‌కి అనుకున్నాడు.

ఇంతలో వెనక సీట్లో, తమకు తాము సాహిత్య విమర్శకులుగా భావించుకొనే ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ చెవిలో పడింది.

అతను: ఫలానా రచయిత్రి కొత్తగా రాసిన కథ చదివావా?

ఇతను: చదివాను. ఆ కథలో ఏ సుఖమూ సంతోషమూ లేని ఆ భార్య పాత్ర రచయిత్రిదే అనుకుంటాను.

అతను: నాకూ అదే అనిపించింది? కానీ నిజమే అంటావా? ఎలా తెలుస్తుంది మనకి?

ఇతను: నా కొలీగ్ ఒకాయన వాళ్ళింటి పక్కనే ఉంటాడు. ఇంట్లో ఏవో సమస్యలున్నాయట. నువ్వు గమనించావా? ఆమె కథానాయికలంతా అక్రమ సంబంధాల్లోకి దిగుతుంటారు. వాళ్ళెవరికీ పెళ్ళంటే ఇష్టం ఉండదు. కదా?

అతను: అవును నిజమే సుమా. అయితే ఇపుడు కథలో ఆ అమ్మాయి అఫైర్ కూడా…?

ఇతను: దాంట్లో సందేహమేముంది? ఆవిడగారిదే!

రఘురామన్‌కి ఆ కథ రాసిన రచయిత్రి గురించి, చీకూ చింతా లేని ఆమె వైవాహిక జీవితం గురించి బాగా తెలుసు. ఐనా ‘ఆమె అఫైర్ల’ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో మొత్తం విన్నాడు. సుష్మ రచయిత్రి కానందుకు హాయిగా నిట్టూర్చాడు. సుష్మ రచయిత్రి అయ్యుంటే అతని ఉత్సుకత తన బెడ్‌రూమ్ దాకా ప్రయాణించేదే. తన వైవాహిక జీవితం బాగున్నందుకు, గ్రహాలన్నిటికీ దణ్ణాలు పెట్టుకున్నాడు.

శ్రీరంజని కూడా కవిత్వం రాస్తుంది – ఇంగ్లీష్‌లో. జనం ఆమె గురించి కూడా మాట్లాడుకుంటారని రఘురామన్‌కి తెలుసు. అయినా ఈ ఆడవాళ్ళందరికీ ఏదో ఒకటి రాయాలని ఇంత ఉబలాటం ఎందుకో. ఊరికే ఉండలేరు కాబోలు.

బ్రిటిష్ కౌన్సిల్ బహుమతి పొందిన శ్రీరంజని కవిత తను చదివాడు. అది ఇలా మొదలౌతుంది:

నా వలువలు విప్పేసి ‘అసలైన’ నన్ను నీ నగ్నదృష్టితో చూడు
భయపడు, నిశ్చేష్టుడివైపో, నైతికంగా పతనమై పో!

అబ్బా, శ్రీరంజని తప్ప ఇంత శక్తివంతంగా ఎవరు రాయగలరు? ‘నా వలువలు విప్పేసి…’ ఎంత గొప్ప ప్రభావవంతమైన వాక్యాలు!

రఘురామన్ మనసంతా ఏదోలా అయిపోయింది. నాలుక అప్రయత్నంగా వచ్చి పెదవుల్ని తడిపి వెళ్ళింది.


సుష్మ కవితలో మరో మూడు లైన్లు చేరాయి:

వర్షపు బిందువు పువ్వునెలా తడిపిందో
రేకు రేకునా పుష్పంలో అగ్ని ఎలా రాజుకుందో
వెచ్చబడిన ఎర్రని కోరిక ఒళ్ళంతా ఎలా పాకిందో
నాకు గుర్తుంది

అసంపూర్తి కవిత కిచెన్ గట్టు మీద పడి ఉంది. ఇంటి పనులన్నీ ముగించి సుష్మ స్నానానికి వెళ్ళింది. ఒంటి మీద నీళ్ళు పడుతున్నా, సుష్మ మనసు మాత్రం ఆ కవిత మీదే ఉంది. బయట ఎండ తీవ్రమై మొక్కలన్నీ తలలు వాల్చాయి. ఇంటి చుట్టూ వేడిమి ఆవరించింది. కానీ సుష్మ వర్షంలో తడుస్తోంది.

అకస్మాత్తుగా మరో లైన్ మెరిసింది మెదడులో.

అవును నాకు గుర్తుంది
ఎలా నీ కళ్ళమీద నా నీలికురులు పరుచుకున్నాయో

ఒంటి మీదనుండి నీటి బొట్లు జారిపడుతూ ఉండగా సుష్మ కిచెన్ లోకి పరిగెత్తుకొచ్చింది, ఆ లైను మాయమయ్యే లోపే కాగితం మీద పెట్టేయాలని. కిటీకీలు తెరచి ఉన్నాయో మూసి ఉన్నాయో, తెరచే ఉంటే పరదాల వెనక నుంచి, ఎదురింట్లో పనీ పాటా లేకుండా కూచునుండే డేగ కళ్ళు రెండు తనని చూస్తున్నాయేమో అని కూడా తోచలేదు సుష్మకి. ఆ లైన్ రాయడం పూర్తయ్యేసరికి ఒంటి మీద నుంచి జారిన నీటి బొట్లతో ఆమె పాదాల చుట్టూ చిన్న మడుగు కట్టింది. రాయడం పూర్తి కాగానే తడి జుట్టుని విదిలించుకుంటూ తిరిగి బాత్‌రూమ్ లోకి పోతూ, పక్కనే ఉన్న బెడ్‌రూమ్ లోని అద్దంలో కనపడిన తన రూపాన్ని క్షణకాలం చూసి ముందుకు కదిలింది.

షవర్ కింద నిల్చుంటే రఘురామన్ తన శరీరాకృతి గురించి చేసే నీచమైన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి. ఒకసారి ఇంటికి వచ్చిన కొలీగ్స్‌తో అన్నాడు ఆ రోజు, “మిస్ యూనివర్స్‌కీ మా ఆవిడకీ ఒకటే తేడా. ఆవిడ ఒంపుసొంపులు ఎక్కడేవి ఉండాలో అక్కడ ఉంటాయి. మా ఆవిడకి ఉండవు. అంతే తేడా!” తన జోక్‌కి తనే పగలబడి నవ్వాడు. అతని మాటలకు కొలీగ్స్ ఇబ్బందిపడుతూ నవ్వు మొహాలు పెట్టారు. శ్రీరంజనో ఇంకెవరో ఒకరు మాత్రమే అతని మాటలకు అభ్యంతరం వ్యక్తం చేసింది.

వంటింట్లోకి వెళ్ళి సుష్మ భుజం మీద చెయ్యేసి అంది “ఈజీగా తీసుకోండి సుష్మా. మిమ్మల్ని చూసి రఘురామన్ చాలా గర్వపడతాడు. రోజూ ఆఫీసులో కనీసం వందసార్లయినా మీ గురించి తల్చుకుంటాడు తెల్సా?”

అతను తన గురించి ఆఫీసులో అసలంటూ మాట్లాడితే ఏం మాట్లాడతాడో సుష్మకి తెలుసు. ఇతర ఆడవాళ్ళతో పోల్చి కించపరుస్తాడంతేగా. అందుకే ఏం మాట్లాడతాడని శ్రీరంజనిని అడగలేదు.

కవిత్వం ప్రవహిస్తోన్న తన ఆలోచనల్లోకి ఆనాటి చేదు జ్ఞాపకం జబర్దస్తీగా చొరబడటం సుష్మకి అయిష్టంగా తోచింది.

“పో అవతలికి, నా పద్యానికి అడ్డురాకు!” విసుక్కుంది దాన్ని అవతలికి తోసేస్తూ.


కాంటీన్‌లో చికెన్ వేపుడు సుష్టుగా తిని బట్టలతోనూ నోటితోనూ ఆ పరిమళాలు పంచుతూ ఆఫీసులోకి వచ్చాడు రఘురామన్. వస్తూనే “ఇంకా తినలేదా? ఈ రోజు కూడా ఉపవాసమేనా ఏంటి?” అన్నాడు శ్రద్ధ కనబరుస్తూ.

“అవును, ఇవాళ గురువారం. నా పిల్లల క్షేమం కోసం సంతాన గోపాలస్వామికి ఉపవాసం ఉంటాను” అని చెప్పింది.

“భలే వైరుధ్యాలున్నాయి మీలో. ఒక పక్క నిర్భయంగా అన్నిటి గురించీ అభ్యుదయభావాలతో మాట్లాడతారు. మరో పక్క ఈ సంప్రదాయాలన్నీ పాటిస్తారు” అని నవ్వాడు.

శ్రీరంజని జవాబు చెప్పకపోవడంతో కోపం వచ్చిందేమోనని వెంటనే సర్దుబాటు చర్య చేపట్టి “ఇదిగో, ఇలాటి వైరుధ్యాలే మీ హుందాని మరింత పెంచుతాయి” అన్నాడు.

అతన్ని ఈ సంభాషణ నుంచి మళ్ళించేందుకు “మీరు ఇంటి నుంచి లంచ్ తెచ్చుకోరెందుకు? సుష్మ చక్కగా వండిపెడుతుంది మీరు తెచ్చుకోవాలే గానీ” అంది శ్రీరంజని.

“నాకు చల్లారిపోయిన భోజనం ఇష్టం ఉండదు. అన్నీ వేడి వేడిగా ఉండాలి. అసలందుకే నేను ఉద్యోగం సద్యోగం లేని, ఏ ఆశయాలూ లేని సుష్మని పెళ్ళి చేసుకుంది. మీకు తెల్సా మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేదు. కొనిపించాలని సుష్మ చాలా ట్రై చేసింది కానీ నేను పడనివ్వలేదు. ఇప్పుడు అర్థమైందా శ్రీరంజనీ, నా ఆరోగ్య రహస్యం?” అన్నాడు తనకేసి తను చూసుకుంటూ.

అప్రయత్నంగా శ్రీరంజని కళ్ళు అతని బలిష్టమైన చేతుల మీద, విశాలమైన ఛాతీ మీదా ఒక్క క్షణం వాలి తప్పుకున్నాయి.

ఏదో తప్పు చేసినట్టుగా కళ్ళు దించుకుని “ఇప్పుడే వస్తాను” అని అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది.


సుష్మ రాసిన కవిత ఇప్పుడు ఆమె ఒళ్ళో ఉంది.

గుర్తుంది నాకు
మన దారులెలా వేరైపోయాయో
కనపడని చేతుల తుడిపివేతలో
మన జ్ఞాపకాలు ఎలా మరుగైపోయాయో
ఎప్పటికీ గుర్తుంటుంది నాకు

మళ్ళీ ఒకసారి చదివి చిన్న చిన్న మార్పులు చేసి చూసుకుంది. ఆమెకిపుడు సంతోషంగా ఉంది.

బయట ఎండ చల్లబడుతోంది. సూర్యుడితో పాటే లేచి రోజంతా చాకిరీ చేస్తూనే ఉన్నా, సుష్మ మొహంలో ఇప్పుడు అలసట లేదు. భూలోకపు చిక్కని హరితవనాల్లో రహస్యంగా బిడ్డకు జన్మనివ్వడానికి దిగి వచ్చిన అప్సరలా ఆమె మొహం అద్భుతమైన దివ్యకాంతితో మెరిసిపోతోంది.

చుట్టూ చూసింది. కానీ ఆమె చూపులు టేబుల్ మీద సిద్ధంగా ఉంచిన టీ కెటిల్ మీద గాని, తినుబండారాల మీద గాని, గడియారం మీద గానీ లేవు. మరెక్కడో ఉన్నాయి.


“నేనివాళ పెందలాడే వెళ్తున్నాను. రోజూ లాగా పిల్లల్ని ఇంట్లో దింపి మళ్ళీ వెనక్కి రాను. బైక్ రిపేర్‌కి ఇచ్చాను. అది తీసుకుని ఇంటికి వెళ్తాను” రఘురామన్ లేస్తూ అన్నాడు శ్రీరంజనితో.

ఫైల్లోంచి తలెత్తి చూసి సమాధానంగా నవ్విందామె.

వెళ్ళబోతూ ఆమె టేబుల్ దగ్గరికి వచ్చి కొంచెం వంగి స్వరం తగ్గించి అన్నాడు “రేపు… రెడ్ కలర్ చీర కట్టుకు రారూ? ప్లీజ్… నా కోసం!” జవాబు కోసం చూడకుండా గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు.

అయోమయంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది శ్రీరంజని. అతని అడుగుల చప్పుడు ఆమె గుండెల మీద ప్రతిధ్వనించింది.


వణుకుతున్న చేతుల్తో సుష్మ ఫోన్ తీసి నంబర్ డయల్ చేసింది. పూర్తయిన కవిత ఆమె ఒళ్ళో పసిపాపలా విశ్రాంతి తీసుకుంటోంది. కొత్త పాదాలు ఏమీ కలవలేదు కాబట్టి ఆ కవిత బహుశా పూర్తయిపోయి ఉండాలి.

నంబర్ రింగ్ చేసి అసహనంగా కుర్చీ అంచుమీద కూచుంది. ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరో తీశారు.

“హలో!” పురుషుడి స్వరం.

పుష్ప గుండె ఆగిపోతోందేమో అన్నంతగా ఆమె మొహం బిగుసుకుపోయింది.

“హలో, ఎవరూ? మాట్లాడరేం? ఫోన్ చేసి ఎవరో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది?” విసుగ్గా అంటున్నాడతను.

టక్కున ఫోన్ పెట్టేసింది. బిగుసుకుపోయిన మొహం కాసేపటికి నెమ్మదిగా మామూలుగా అయింది.

సుష్మ, ఒళ్ళో ఉన్న కవితను తీసి మరి కొన్ని లైన్లు దానికి కలిపింది.

నీ మనోప్రపంచంలో నాకు చోటు లేకపోయినా
ఆకాశం నుంచి రాలే వాన చుక్కలా
నా కనురెప్ప అంచులో నిలిచిన కన్నీటి బొట్టువవుతావు
నీ తలపుల్తో సముద్రపుటలవై నన్ను ముంచెత్తుతావు.

రఘురామన్, పిల్లలూ వచ్చినట్టున్నారు, బయట ఆటో రిక్షా శబ్దం వినపడుతోంది.

సుష్మ ఒక్క ఉదుటున లేచి కవిత రాసిన కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చించేసి కిటికీ లోంచి బయటకు విసిరేసి డోర్‌బెల్ మోగకముందే తలుపు తీయడానికి ముందుగది లోకి నడిచింది. అలా తీస్తేనే ఆమె ఆదర్శ భార్య, ఆదర్శ మాత, ఆదర్శ మహిళ.

ప్రియమైనా పాఠకులారా! సుష్మ కవితను పూర్తిగా మనం చదవాలంటే, చిరిగి చెల్లా చెదురై ఆమె కథలో పరుచుకున్న ఆ కవిత ముక్కల్ని మనమే ఏరుకొని కూడగట్టుకోవాలి.

(మళయాళ మూలం: The story of a poem. ఆంగ్లానువాదం: Chandrika Balan)