అజ్ఞాతం

నెలల పిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి కూర్చోబెట్టిన చోటు నుంచి కదిలేవాడు కాదు.

‘చేతిలో గిలక్కాయ పట్టుకుని అలాగే కూర్చునేవాడు. ఎంతసేపయినా విసుగు లేకుండా దానితో ఆడుకునేవాడు. పాకే వయసులో అందరు పిల్లల్లాగా ఇల్లు పీకి పందిరేసుంటే వాడి వెనక నేను పరిగెట్టడానికే రోజులో సమయం అంతా సరిపోయేది. కుదురుగా కూర్చున్నాడు గనుకనే వాణ్ణి వంటింట్లో కూర్చోబెట్టి నేను బట్టలుతుక్కోవడానికి, బావిలో నీళ్ళు తోడుకుని రావడానికి, రెండు చెంబుల నీళ్ళు వంటిమీద కుమ్మరించుకోవడానికీ వీలయ్యింది! నాకు సహాయం చేసేవాళ్ళెక్కడున్నారూ? ఆయన ఆఫీసుకి వెళ్ళిన దగ్గరనుంచీ మేమిద్దరమేగా ఇంట్లో!’ అనేది అతని తల్లి ఆ చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా.

మందకొడిగానూ, మందమతిగానూ కాక చుట్టుపక్కల పిల్లల్లాగే అతను పెరిగి పెద్దవాడయ్యాడు. గిలక్కాయకి బదులు చేతిలోకి పుస్తకం చేరింది. కాలేజీ డిగ్రీని చేతపుచ్చుకుని ఉద్యోగస్తుడయ్యాడు. పెళ్ళి చేసుకున్నాడు. అమెరికా చేరి ఇల్లు కొనుక్కున్నాడు. అతని చేతిలో పుస్తకం అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉండేది; అప్పుడప్పుడూ మాత్రం వంట చేస్తున్నప్పుడు వంటల పుస్తకం, పడకగదిలో శృంగార పుస్తకం. పుత్రులకి కారకుడయ్యాడు, పౌత్రులతో ఆడుకున్నాడు. రోజులో మిగిలిన సమయంలో పుస్తకాన్ని వదలలేదు. రిటైరయిన తరువాతి పది సంవత్సరాల కాలంలో పుస్తకం చేతిలో ఉండడానికి మరీ ఎక్కువ అవకాశం దొరికింది. రెండేళ్ళ తరువాత…

భార్య చేతిని ఒక చేతిలోను, పుస్తకాన్ని రెండవ చేతిలోనూ పట్టుకుని అతను పొద్దున్న, సాయంత్రం బయట మెల్లగా నడుస్తూ కనిపించేవాడు. అతని చెవులని కప్పేసిన హెడ్‌ఫోన్స్ ఇద్దరి నోళ్ళకీ తాళం వేసినట్లుగా నడిచే ఆ జంట, అప్పుడప్పుడూ ఎదురుపడినవాళ్ళకి తమాషాగా కనిపించేది గానీ వాళ్ళుండేచోట జనసమ్మర్దం తక్కువ కావడం వల్ల అలాంటి సంఘటన అంత తరచుగా ఎదురయ్యేది కాదు. ఒక్కొక్కసారి ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న కొలను పక్కన వేసి వున్న బెంచీ మీద అతన్ని కూర్చోబెట్టి ఆమె ఒక్కర్తే ఒకటో, రెండో మైళ్ళు ఆ చుట్టుపక్కల వేగంగా నడిచివచ్చేది. పార్క్ లాంటి ఆ ప్రదేశంలో మనుషులు చేసేది వ్యాయామపు నడకలు, పరుగులు మాత్రమే; పని మీద అటుపక్కగా కాలినడకన ఎవరూ వెళ్ళరు. కొలను పక్కన బెంచీ ఉన్నదే మనుషులు కూర్చోవడానికి గనుక, ఆ నలుగురు తిరగనిచోట అతన్ని ఎవరూ పట్టించుకోరని, కదిలించరని ఆమెకు తెలుసు. అతన్ని వదిలివెళ్ళినప్పుడు తెరిచివున్న పేజీయే ఆమె తిరిగి వచ్చిన తరువాత కూడా ఆకాశాన్ని చూస్తూ కనిపించేది. తరువాత వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని ఇంటికి చేరేవారు.

ఒకసారి అతన్ని ఆ బెంచీమీద కూర్చోబెట్టి, రెండు మైళ్ళు నడిచే వ్యవధిలో తిరిగిరావచ్చని అనుకుని ఆమె కారులో దగ్గరలో ఉన్న గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళింది. షాపింగ్ పూర్తయి ఆమె స్టోర్‌ బయటికి అడుగుపెట్టేటప్పటికి వర్షం కురుస్తూ ఉన్నది. గబగబా కారుని నడిపి, రోడ్డుపక్కగా పార్క్ చేసి పరుగెత్తి ఆ బెంచీ దగ్గరకి చేరిన ఆమెకి అతను తడుస్తూ అక్కడే కూర్చుని కనిపించాడు. అతను అంగుళం కూడా కదిలిన జాడలు ఆమెకు కనిపించలేదు. తెరిచిన పుస్తకాన్ని అతని ఒడిలో ఎలా అమర్చి వెళ్ళిందో ఆమె తిరిగి వచ్చిన తరువాత కూడా అది అలాగే ఉన్నది. కళ్ళు తెరిచేవున్నాయి గానీ కొన్ని నెలల మాదిరిగానే అతని దృష్టి ఎక్కడ ఉన్నదో ఆమెకి ఇప్పుడు కూడా తెలియలేదు. అతని మొహాన్ని రొమ్ముకి ఆనించుకుని, తన గడ్డాన్ని అతని తలపై ఉంచి పెదవులని బిగబట్టి కళ్ళు గట్టిగా మూసుకుంది. కారులో వస్తూ, అతను గత కొన్ని నెలలుగా ఏ రోజూ తనంతట తాను తలుపు తీసి ఇంటి బయటకు వెళ్ళకపోవడాన్ని గుర్తు చేసుకుని అతను అక్కడి నించీ కదలడన్న నమ్మకంతో ఉన్నా గానీ, ‘ఇన్నాళ్ళూ అవనిది ఈనాడు వర్షం ప్రేరేపణవల్ల కదిలివుంటేనో?’ అన్న భయము, ‘ఒకవేళ అలా అయితే, ఎక్కడని వెతకగలను?’ అన్న ఆలోచన, ‘ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడాన్ని ఎవరితో మాత్రం ఎలా సమర్థించుకోగలను?’ అని ఆవరించిన నిస్పృహా ఆమె దృష్టిద్వారాల ద్వారా వెలికివెళ్ళి ఆమె తలపైనించి జారుతున్న వర్షపు నీళ్ళకి తోడయ్యాయి.

అతని శరీరం లోని అణుసముదాయం అతని జీవితం లోని ఇద్దరు ముఖ్యమైన స్త్రీలని ఎక్కువ బాధపెట్టకుండా ఉండడానికే కృషి చేసింది.