అంతా రొటీనే

ఉదయాన్నే లేచి
ఇంకా బతికే ఉన్నందుకు సంతోషించి
ప్రభాతే కరదర్శనం మానేసి
మాయా దర్పణ దర్శనం చేసుకుని
వీధికుక్కల్లా
కాట్లాడుకునే కామెంట్లు చదివి
ఏది సత్యం, ఏదసత్యమనే
ఏ చికిత్సకూ లొంగని
మాయా విచికిత్సకు లోనయి
దినఫలంలో
ప్రేమ ఫలిస్తుందని చదివి
అదెప్పుడో ఫలించి, పుష్పించి
రెండు కాయలు కాసేసిందని నిట్టూర్చి
జారిపోతున్న భావజాలమనే పైజమాని
లెఫ్టూ, రైటూ లాక్కుంటూ
కాలక్రమేణా కృత్యాలు పూర్తి చేసుకుని
ఫాదరిన్లాస్ గిఫ్ట్ అని
రాయని మోటారుసైకిలెక్కి
సైకిల్ తొక్కేవాడిని చూసి జాలిపడుతూ
కారులో వెళ్ళేవాడిని చూసి ఈర్షపడుతూ
భాను’డి’ విటమిను ఒంట పట్టించుకుంటూ
రాచ కార్యాలయానికి తగలడి
కుర్ర మేనేజరుని చూసి కుళ్ళుకుని
ముసలి గుమాస్తాని చూసి సమధానపడి

కొత్తగా వెలసిన ద కేన్సర్ హబ్‌లో
సిగరెట్టు ముట్టించి
పాన్ పరాగ్ దట్టించి
సంపూర్ణ మద్యపాన నిషేధ సమాధికి
తాను సైతం అంటూ
పగలే ఒక పెగ్గు బిగించి
గారపట్టిన పళ్ళని చూపిస్తూ
ఓరగా నవ్వే ఓ అటెండర్ పోరగా
నాకన్నా నువ్వే సంతోషంగా ఎలా ఉన్నావ్? అని మధనపడి

కాసేపు మార్కెట్ షేర్లు
ఆనక ‘శోష’ల్ మీడియా షేర్లు అంటూ
ఈజ్ ఆఫ్ డూయింగ్ నథింగ్
అభ్యాసం చేస్తున్న కింది ఉద్యోగిని
బర్రెని ప్రేమతో అదిలించినట్టు మందలించి
ఫైళ్ళగుట్టల్ని కదిలించి, కాస్త కరిగించి
టీ సిప్సు మధ్య గాసిప్సూ
జీతానికీ, జీవితానికీ లంకె కుదుర్చుకోలేక
చేసిన తప్పులకి ఇఎమ్ఐలు కట్టుకుంటూ
కొట్టుకుంటూ రాత్రికి నిజ గృహమ్మునకేగి
సెల్లాసురుడి ధృతరాష్ట్ర కౌగిలి వదిలించుకుని
నలభై రెండు ఇంచీల రంగులరాట్నం మీట నొక్కితే
అన్నీ నిర్వచనీయమైన బూతులే
ఈరోజు అసత్యాల్లోని ముఖ్యాంశాలు వింటూ
ప్రాప్తమున్న మెతుకుల్ని తింటూ
పొద్దున్నే లేచేసరికి
కామధేనువో, కల్పవృక్షమో ప్రత్యక్షమవాలని
పడుకుని కలలు కంటూ ఉండగా
ఇంతేరా ఈ జీవితం తిరిగే…
అని కాలర్ ట్యూన్ మోగగా
ఏంటి భయ్ విశేషాలు?
జీవితం ప్రస్తుతానికి సశేషమే
అనుభూతుల అవశేషాలేం లేవ్
అంతా రొటీనే
అదే… రొడ్డకొట్టుడుకి మర్యాద పదం.