చూడబోతే నేను ఒట్టి చెట్టునే. కానీ, నా మనస్సులో వున్నదంతా చెబితే, యీ రోజంతా చెప్పినా తీరదు. ఈ జీవితంలో, కళ్ళతో యెన్ని చూసుంటాను! చెవుల్తో యెన్ని వినుంటాను! మీ బామ్మలకు బామ్మలు గంతులేసి ఆడుకోవడం ఈ కళ్ళతో చూశాను. నవ్వుతారేమో కాని, నేను చెప్పేదాంట్లో ఆవగింజంత కూడా అబద్ధం లేదు. నేను చాలా పురాతనమైన చెట్టుని. దాదాపు నూరేళ్ళయినా వుంటాయి. అబద్ధాలు రావు నాకు. మీ జేజమ్మలకు బామ్మలంతా కుండలు, బిందెలతో మా చెరువుకే వచ్చేవారు. కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చేవారు. ముద్దొచ్చేవాళ్ళు ఆ పిల్లలు. పిల్లల్ని కట్ట మీద వదలిపెట్టి, చీరల్ని వుతికి, పసుపు రాసుకొని అందంగా స్నానం చేసేవాళ్ళు. పిల్లలంతా బాలగోపాలులల్లే గంతులేస్తూ మల్లెపూల చెట్ల దగ్గరికి పోయి, మల్లె మొగ్గల్ని చూసి నవ్వేవారు.
ఆ కాలంలో ముద్దుముద్దుగా పూలు పూసిన ఒక పొగడమల్లె చెట్టు ఆ మూలన వుండేది. చెరువుకట్ట అంతా గుప్పుమని గుబాళించేది. ఇప్పుడు ఆదరణ కరవై పాడుపడిపోయింది. కొంచెం పెద్దపిల్లలు, వారంతట వారే పువ్వుల్ని కోసి ఆశగా వాసన చూసేవాళ్ళు. ఓహ్! ఆ రోజుల్ని తలచుకుంటే యెంత ఆనందంగా వుంటుంది! అయితే, నేనిప్పుడు మీకు ఆ కాలపు కథ చెప్పడానికి సిద్ధంగా లేను. మనసు సంతోషంగా వున్నప్పుడు చెబుతాను.
ఏడెనిమిది రోజులుగా నాకు రుక్మిణి జ్ఞాపకాలే. పదిహేను సంవత్సరాలయ్యింది. కానీ నాకు నిన్న జరిగినట్టుంది. మీలో యెవరికీ రుక్మిణి గురించి తెలియదు. చూడ్డానికి బంగారు బొమ్మ లాగుంటుంది బిడ్డ. ఆ పాప చిరునవ్వు ముఖాన్ని తల్చుకుంటే, తానే వచ్చి యెదురుగా నిలబడినట్టు వుంది నాకు. ఆమె అందాన్ని రోజంతా చూస్తూనే వుండచ్చు. పొడవైన శరీరం. తామర తూడుల్లాంటి కాళ్ళూ చేతులు. మల్లెపూవు వంటి మృదువైన దేహం. ఆమె అందమంతా ఆ కళ్ళల్లోనే వుంటుంది. ఎంత విశాలమైన నేత్రాలవి! ఎంత స్వచ్ఛత! ఎంత జ్ఞానం! కళంకం లేని నీలాకాశం గుర్తొస్తుంది. ఆమె కళ్ళు నీలి కలువలతో నిండిన నిర్మలమైన సరస్సులా వుంటాయి. చూపుల్లో ఎంత ప్రేమ! ఎంత కరుణ! ప్రతి అమావాస్య సోమవారం పరమాత్ముడి పూజకోసం నాకు ప్రదక్షిణం చేసేది. అప్పుడు నన్ను చూసే చూపుల్లో వుండే ప్రేమ గురించి ఎంతని చెప్పేది? నా మోడువారిన కొమ్మలు కూడా ఆమె ప్రేమమయమైన చూపులు తాకగానే కొత్తగా చిగురించేవి!
అయ్యో! నా రుక్మిణి బంగారం! ఎప్పుడు చూస్తాను యింక మీదట నీలాంటి బిడ్డల్ని? ఆమె చిన్నతనం నుండి, చివరి రోజు దాకా యిక్కడికి రాని రోజే లేదు. ఐదారేళ్ళ వయస్సప్పుడు, రోజంతా యిక్కడే ఆడుకుంటూ వుండేది. ఆమెను చూడగానే లాగి యెత్తుకొని ముద్దులివ్వాలని అనుకోనివారే లేరు. ఎంత అవసరమైన పని వున్నా కూడా, మన వేణుగోపాలశాస్త్రిగారున్నారే, ఆయన ఉదయమే స్నానంచేసి, మల్లెపూలు కోసి, బిడ్డ చేతి నిండా పోయకుండా వెళ్ళేవారు కాదు. మన వూరి ఆవుదూడలు కూడా యెంత మొరటువైనా సరే, ఆమెను చూడగానే, మొరటుతనమంతా వదలిపెట్టి, ఆమె చేతుల్తో నిమిరించుకోవాలని ఆమె పక్కకెళ్ళి కాచుకొని వుండేవి.
పసిబిడ్డలంటే నాకు యెప్పుడూ ఆశే. అయితే, ఆమె వస్తే చాలు నన్ను నేను మైమరచిపోతాను. ఆమె మీద కాస్త యెండ కూడా పడకూడదు. ఆమె కొంచెం పక్కకు వెళ్ళినా కూడా నా చేతుల్ని చాచి ఆమెకు గొడుగు పడతాను. నా నాథుడైన సూర్యుడి ముఖాన్ని ఉదయం దర్శనం చేసుకోగానే నాకు బిడ్డ రుక్మిణి గుర్తొస్తుంది. ఆమె రాకకోసం ఆతృతతో ఎదురు చూస్తుంటాను. ఆమె రాగానే నాలో అణచిపెట్టలేని ఆనందం పుట్టుకొస్తుంది. పిల్లల మధ్య భేదం చూడకూడదనేది నిజం. అయితే, ఇంకెవరు వచ్చినా నాకు ఆమె వస్తున్నట్టు అనిపించదు. నేను మాత్రమేనా? వూర్లో వున్న మిగతా పిల్లలు కూడా ఆమె వచ్చిన తర్వాతే, మరింత ఆనందంతో ఆడుకుంటారు. ఆమె వాళ్ళందరికీ రాణి. అంత అయస్కాంత శక్తి వుండేది ఆమె దగ్గర.
అప్పుడంతా వాళ్ళ నాన్న కామేశ్వర అయ్యర్ మంచి స్థితిమంతుడు. బిడ్డంటే ఆయనకు యెనలేని ప్రేమ. ఆమెకేదైనా చెయ్యాలంటే ఆయనకు అలుపే రాదు. అంగడి వీధిలో కొత్తగా ఏవైనా పట్టుబట్టలు వస్తే చాలు, ‘మన రుక్మిణి వీటిని వేసుకుంటే అందంగా వుంటుంది’ అని వెంటనే కొని తెచ్చేసేవారు. మేలురకం వజ్రాలు, కెంపులు తెచ్చి ఆమెకు అనేక ఆభరణాలు తయారు చేయించారు. ఆమెకు పదేళ్ళప్పుడు కోలాటం జాతరకని, వొక పట్టుపావడా ఓణీ తెచ్చారు. ఆ వెన్నెల్లో ఎంత అందంగా ఉంది, ఆ అలంకరణతో! కళ్ళనిండా నింపుకున్నాను ఆమెను నేను. ఆమె కంఠాన్ని గురించి మీకు చెప్పడం మరిచాను. కోయిల దేనికి పనికొస్తుంది? బంగారు తీగలా జారిపోయే ఆమె గాత్రం! రోజంతా వింటున్నా విసుగు రాదు. కోలాటం జాతర్లప్పుడే ఆమె పాటను నేను విన్నాను. ఇప్పుడు తలచుకొన్నా కూడా ఆమె గొంతు అదే తీయదనంతో, సొగసుతో నా మనసులో వినిపిస్తూ వుంటుంది. ఆమెకు వయసు వచ్చేకొద్దీ, ఆమెతో పాటు పెరిగిన ఆమె సౌందర్య లావణ్యాల గురించి యెలా చెప్పాలి?
చిన్నపిల్లగా వున్నపుడే ఆమె ఎవరితో అయినా పొందికగా వుండేది. ఈ గుణం దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. స్నేహితులు వేరు, తాను వేరు అనే తలంపే ఆమెకు వుండేది కాదు. పేదింటి పిల్ల అయినా సరే, పెద్దింటి పిల్ల అయినా సరే, ఆమెకు స్నేహితురాళ్ళందరి మీదా ఒకే రకమైన ప్రేమాభిమానాలు. ఇంకా చూడబోతే, పేదింటి పిల్లల మీదనే ఆమె మిగిలిన వారికన్నా యెక్కువ అభిమానాన్ని చూపేది. బిచ్చగాళ్ళు వస్తే, చేతినిండా బియ్యం తెచ్చి వేస్తుంది. కళ్ళు లేని బిచ్చగాళ్ళను చూసినప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళలోంచి కన్నీరు ధారగా కారడం చూశాను. మిగిలినవాళ్ళ కంటే వాళ్ళకు యెక్కువే వేసేది. యీ విధంగా అంతులేని జాలి, సానుభూతి ఆమెకు వుండడం వల్లనే, ఆమెను తల్చుకున్నప్పుడంతా, భరించలేని ఎండాకాలం తర్వాత మంచి వర్షం పడినప్పుడు కలిగే గొప్ప ఆనందం కలుగుతుంది.
ఈ విధంగా, కంటికి కన్నుగా నేను భావిస్తూ వచ్చిన నా ప్రియమైన బిడ్ద గతి యిలా అవ్వాలా? నేను పాపిని. పెట్టుకున్న ఆశ నిష్ఫలమైపోవాలా? బ్రహ్మదేవుడికి కళ్ళు లేవా? అయినా, బ్రహ్మదేవుడు యేం చేస్తాడులే, మనుషులు చేసే అక్రమాలకు!
రుక్మిణికి పన్నెండో యేడు రాగానే వాళ్ళ నాన్న ఆమెను కరణం రామస్వామి అయ్యర్ కుమారుడు నాగరాజన్‌కు కన్యాదానం చేశారు. వాళ్ళ పెళ్ళి ఎంతో అంగరంగవైభోగంగా జరిగింది. పెళ్ళికి ముందు జరిపే పొంగలి పండుగ ఊరేగింపు రోజు ఆమెను చూశాను. దిష్టి తగిలేంత అందంగా వుంది! ఆమె స్నేహితురాళ్ళ మధ్యలో వున్నపుడు చూస్తే, దీపకోటి సేవలందుకొంటున్న దీపరాణి జ్వలిస్తున్నట్టు వుంది. కామేశ్వర అయ్యర్ రుక్మిణికి పెళ్ళిపందిట్లో చీరె సారెలు పెట్టారు. ఆమె అత్తామామలు యెంతో సంతృప్తి చెందారు.
పెళ్ళి తర్వాత అత్తగారు ఆమెను మాటిమాటికీ పిల్చుకొనిపోయి వాళ్ళింట్లోనే వుంచుకొనేది. ఇష్టంగా ఆమెకు తల దువ్వి పూలజడ వేసేది. తన బంధువుల్ని చూసేందుకు వెళ్ళినప్పుడు, ఆమెను పిల్చుకొనిపోకుండా పోయేదే కాదు. ఈ విధంగా రుక్మిణి అత్తగారు జానకి తనకు రుక్మిణి మీదున్న అభిమానాన్ని రకరకాలుగా చాటుతూ వుండేది. పెళ్ళికొడుకు నాగరాజన్ కూడా చాలా బుద్ధిమంతుడు. అతడు కూడా రుక్మిణి పట్ల చాలా ప్రేమగా వుండేవాడు. గ్రామంలో వారిద్దరూ రూపంలో, గుణంలో, సంపదలో సరైన జోడి అని అనుకోనివారు, మాట్లాడుకోనివారు లేరు. యీ విధంగా మూడు సంవత్సరాలు గడిచాయి.
యీ మూడేళ్ళల్లో యెన్ని మార్పులు! కామేశ్వరయ్యరుకు చేతిలో వున్నదంతా పోయింది. ఉన్న రొక్కం అంతా యేదో అరుబత్తునాట్ కంపెనీ అంట! ఆ బ్యాంకులో వడ్డీకి పెట్టుబడి పెట్టి వున్నారు. మన వూరి డబ్బు నాలుగు కోట్ల రూపాయల్ని అది మింగేసి తేన్చేసింది. కామేశ్వరయ్యరు ఒకే రోజులో పరమ పేదవాడిగా మారిపోయారు. రుక్మిణి వాళ్ళమ్మ వంటి మీదున్న నగలు మాత్రమే మిగిలాయి. పూర్వీకుల సొత్తు అయిన యింటినీ, పొలాల్నీ అమ్మి ఆయన అప్పుల్ని తీర్చాల్సి వచ్చింది.
ఇప్పుడు కుప్పుస్వామి వున్నాడే కాలువ వొడ్దున, ఆ యింట్లోకి మారారు. మీనాక్షి కూడా చూడ్డానికి మహాలక్ష్మిలాగా వుంటుంది. ఆమె శాంతానికి యెల్లలు లేవు. ఎంత పెద్ద కష్టం వచ్చిపడిందో, అయినా కూడా ఆమె కుప్పకూలిపోలేదు. మనసు కొంచెం కూడా పట్టుతప్పలేదు. ‘యేదో యిన్ని రోజులు సుఖంగా బతికాము. ఎవర్నడిగి స్వామి ఇచ్చారు! ఆయన ఇచ్చినదాన్నే ఆయన తీసుకున్నారు. దానివల్ల ఏమైందిప్పుడు? అయినా, రుక్మిణి ప్రాణాలతో వున్నంత వరకు నాకు కొరత లేదు. ఈ మాఘమాసంలోనే రుక్మిణికి శాంతి ముహూర్తం జరిపించి సంబంధీకుల యింటికి పంపించేస్తే, తర్వాత మాకు యే విచారమూ లేదు. కలో గంజో తాగి యెప్పటిలాగా భగవద్ధ్యానం చేసుకుంటూ గడిపేస్తాము’ అని చెప్పేది. అయ్యో పాపం! జరగబోయే దాని గురించి ఆమెకెలా తెలుస్తుంది?
కామేశ్వరయ్యరు పూర్తిగా దివాళా తీశాడని రూఢి అయ్యాక, రామస్వామి అయ్యరుకు ఆయనతో వున్న స్నేహం చల్లబడటం మొదలైంది. ఇంతకుముందంతా ఆయన కామేశ్వరయ్యరు యింటికి పదే పదే వచ్చేవారు. ఆయన దారిలో కనిపిస్తే పది నిమిషాలు మాట్లాకుండా పోయేవారు కాదు. యిప్పుడో, కామేశ్వరయ్యరు దూరంగా రావడం చూడగానే, యేదో అవసరమైన పని మీద వెళ్తున్నట్టు యింకో దిక్కు తిరిగి వేగంగా వెళ్ళిపోతారు. యిలా చేసే వ్యక్తి కామేశ్వరయ్యరు యింటికి రావటమే మానేశారని నేను చెప్పకుండానే మీరు గ్రహిస్తారు. ఆయన యిల్లాలు జానకి కూడా అదే మాదిరిగా మీనాక్షి అమ్మతో గడపడం మానేసింది. కానీ, దీన్నంతా మీనాక్షి అమ్మ, కామేశ్వరయ్యరు వొక విషయంగానే తీసుకోలేదు. సంపద వున్నపుడు సంబంధాలు పెట్టుకోవడం, అది పోయినప్పుడు అపరిచితుల్లా ప్రవర్తించడం మామూలే. వీటన్నిటినీ నిజమైన బంధాలుగా పరిగణించకూడదు.
అయితే వాళ్ళు రుక్మిణి విషయంలో కూడా వ్యత్యాసం చూపడం మొదలుపెట్టారు. అరుబత్తునాట్ బ్యాంకు దివాళా తీయడానికి ముందు, కొన్ని నెలలుగా జానకి ప్రతి శుక్రవారం ఉదయపు భోజనం తర్వాత, రుక్మిణిని పిలుచుకొని రమ్మని పనిమనిషిని పంపేది. ఆ రోజు ఆమెకి జడ వేసి, కాటుక, బొట్టు పెట్టి, సింగారించి అఖిలాండేశ్వరి దేవాలయానికి తీసుకొనిపోయి, దర్శనం చేయించి, ఆ దినం రాత్రంతా తన యింటిలోనే వుంచుకొని మరుసటిరోజు వుదయం మాత్రమే రుక్మిణిని యింటికి పంపేది. అయితే, అరుబత్తునాట్‌లో పోయింది పోయినట్టే అని నిశ్చయమయ్యాక, శుక్రవారం రోజు, ‘నాకీ రోజు యింట్లో పనెక్కువుంది’ అని చెప్పి పంపేది. మరుసటి శుక్రవారం నుండి అలా చెప్పి పంపడం కూడా మానేసింది. ఇది మీనాక్షికీ, కామేశ్వరయ్యరుకు యెంతో దుఃఖాన్ని కలిగించింది. రుక్మిణి కూడా ‘మనల్ని యింత చులకనగా చూస్తుంది చూశావా, మా అత్తగారు కూడా!’ అని చాలా బాధపడింది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఊరంతా ‘గుసగుస’మని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అన్ని రహస్యాలు చెరువుగట్టు మీదనే బయటకు వచ్చేవి. అరకొర మాటలే నా చెవిన పడినాయి తప్ప, మొత్తం విషయం నాకు తెలియదు. ఊర్లో యెప్పుడూ యిలా లేదు.
నాకు మనసు గుబగుబలాడుతూ వుంది. ఏదో కీడు కోసమే యింత రహస్యం అని నాకప్పుడు అనిపించింది. కానీ యెవరికి అనేది మాత్రం తెలియలేదు. చివరికి అటూ ఇటూ అయ్యి, దాన్నీ దీన్నీ వొక దగ్గరకు చేర్చి చూడగా చూడగా కొంచెం కొంచెం సమాచారం నా మనసుకు అందింది. రామస్వామి అయ్యరు, జానకి, రుక్మిణిని వదిలిపెట్టి నాగరాజన్‌కు వేరే పెళ్ళి చేయడానికి నిశ్చయించుకున్నారు! యేం చేసేది నేను! నా మనసు ముక్కలైంది. బిడ్డ రుక్మిణిని పక్కకు నెట్టేసే ధైర్యమా మనుషులకు? పాపీ! జానకీ, నీలాంటి ఆడదే కదా ఆమె కూడా! నిన్ను ఏం చేసింది ఆ బిడ్డ! ఆ పిల్లని కంటితో చూస్తే రాయి కూడా కరుగుతుందే! రాయికన్నా కఠినమైనదా నీ మనసు! కామేశ్వరయ్యరుకు, మీనాక్షికి ముఖంలో ఈగ కూడా ఆడదు. నాకే యిలా ఉంటే కన్న తల్లిదండ్రుల గురించి చెప్పాలా! యింక మీదట నాగరాజన్ గురించి ఏదైనా నమ్మకం పెట్టుకోవడమే మిగిలుంది!
అతడు పట్టణంలో చదువుకుంటున్నాడు. మార్గశిర మాసం వచ్చేసింది. అతడు వచ్చేరోజు కోసం లెక్కపెట్టుకుంటూనే వున్నా. చివరికి వచ్చి చేరాడు. వచ్చిన రోజు ఉదయమే అతడి ముఖంలో నవ్వు నాట్యమాడుతూ వుంది. ఆ సంతోషం మారిపోయింది. తల్లిదండ్రులు అతడి మనసును కళంకితం చేయడం మొదలుపెట్టారు. రోజురోజుకీ ముఖంలో కలవరం యెక్కువ అవుతూనే వచ్చింది. కరిగించేవాళ్ళు కరిగిస్తే రాళ్ళయినా కరుగుతాయి అంటారు. అతడి కలవరపు ముఖాన్ని చూసినపుడంతా నాకు కడుపులో దేవినట్టయ్యేది. ఇప్పటిదాకా యితడి మీద ఆశ వుండేది. అది కూడా పోయింది. రుక్మిణి గతి అధోగతే అని నిశ్చయించుకున్నాను.
పుష్యమి వచ్చింది. బహిరంగంగానే మాట్లాడటం మొదలుపెట్టారు. ఏదో తూర్పుదిక్కు పిల్ల అంట. తండ్రికి నాలుగు లక్షల రూపాయలకు భూస్థితి ఉందంట. కొడుకు లేడంట. ఈ పిల్ల కాకుండా యింకో కూతురు వుందట. రామస్వామి అయ్యర్ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందుతాయి. ఇదంతా నాకు కర్ణకఠోరంగా ఉంది. కానీ యేం చేయాలి? తలరాత అని వినడమే నా పని.
ఈ విషయాలు బయటికి రావడం మొదలయ్యాక, మీనాక్షి పగలు బయటికే రావడం లేదు. సూర్యోదయానికి ముందే చెరువుకు వచ్చి, స్నానంచేసి, నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమె ముఖం చూస్తే ఘోరంగా వుంది. సరైన నిద్ర ఎక్కడ? భోజనం ఎక్కడ? ఓహో అని బ్రతికి, చివరికి ఈ గతి పట్టిందే అనే వేదన ఆమె అందాన్ని పాడుచేసింది. ఇల్లూ వాకిలి పోయినప్పుడు, నగానట్రా పోయినప్పుడు, కేవలం పసుపు తాడు మాత్రం కట్టుకునే పరిస్థితి దాపురించినా కూడా ఆమె బాధపడలేదు. రామచిలుక లాంటి కూతురు యింట్లో వుంటే, జానకి ఆమె మీద కొంచెం కూడా జాలి చూపించకుండా కంటికెదురుగానే కొడుక్కి వేరే పెళ్ళి చేయాలని అనుకుంది చూశావా! అనే వేదనే ఆమెకు రాత్రీపగలూ అంతా. ఆమె ముఖం చూస్తే జానకి మనసు కూడా కరుగుతుంది. అయినా ఆ రాణిగారు యెక్కడ చూస్తుంది! అప్పుడంతా రుక్మిణి యెలా వుందో ఏమి ఆలోచిస్తుందో నాకేమీ తెలియదు. ఏమీ యెరగని బిడ్డ అది. ఏమి ఆలోచిస్తుందో! ఒకవేళ, అత్తగారు మనల్ని పూర్తిగా వదిలిపెట్టదు అని అనుకుంటుందో, లేదా అత్తగారు ఏమనుకున్నా నాగరాజన్ ఒప్పుకోడు అని అనుకుంటుందో!
ఇంకా పూర్తిగా అయిదేళ్ళు అవలేదే ఆ జంట మన చెరువుకట్ట మీద ఆడుకొని! పెళ్ళయిన తర్వాత కూడా ఎవరికీ తెలియకుండా రావడం యెన్నోసార్లు చూశాను. పాతరోజుల్లో లాగానే ప్రేమాభిమానాలతో నాగరాజన్ ఆమెతో మాట్లాడేవాడు. అతడు చెయ్యి వదలడు అనే రుక్మిణి అనుకుంటూ వుంటుంది. కానీ రోజులు గడిచేకొద్దీ నాగరాజన్ పెళ్ళి వార్త బలపడుతూనే వుంది. నాగరాజన్ మనసులో ఏముందో మాత్రం యెవరికీ తెలియదు. పట్టణం నుంచి తిరిగి వచ్చినరోజు అత్తమామలకు నమస్కారం చేయడానికి వచ్చాడే, అంతే. తర్వాత రుక్మిణిని అతడు తలుచుకుంటున్నాడు అనేదానికి ఆవగింజంత కూడా ఆనవాలు లేదు. అయితే, అతని ముఖాన్ని మొదటిరోజు వదిలిపోయిన ఉల్లాసం మరలా తిరిగి రాలేదు! ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పుడూ ముఖం వేలాడేసుకుని వుంటున్నాడు.
చివరికి ఒకరోజు పిల్ల యింటివాళ్ళు వచ్చి లగ్నపత్రికలు కూడా రాసుకొని పోయారు. అయ్యో! ఆ రోజు మేళం శబ్దం విని నా పంచప్రాణాలు పోయాయి. కామేశ్వరయ్యరుకు యెలా ఉందో, మీనాక్షి మనసు ఎంత తల్లడిల్లిందో, రుక్మిణి ఎలా సహించిందో! అంతా ఈశ్వరునికే తెలుసు. నాగరాజన్‌కు పిసరంత కూడా దయ, పశ్చాత్తాపం లేకుండా పోయింది కదా అని నేను యేడవని రోజు లేదు. ఇలా చేస్తే ఇతడు మాత్రం బాగుపడతాడా అని కూడా అనుకునేదాన్ని.
ఇలా నా మనసు నలిగి నలిగి, తల్లడిల్లిపోతున్నప్పుడు, కడుపులో పాలుపోసినట్టుగా ఒక సంగతి నా చెవిన పడింది. నాగరాజన్‌తో పాటు చదువుకున్నాడట శ్రీనివాసన్ అనే వొక స్నేహితుడు, నాగరాజన్‌ను చూసేందుకు వచ్చాడు. వాళ్ళకి రహస్యంగా మాట్లాడుకోవడానికి తగిన స్థలం మన చెరువుకట్టే కదా!
ఒకరోజు సాయంకాలం ఏడెనిమిది గంటలకు అందరూ వెళ్ళిపోయాక, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. శ్రీనివాసన్ చాలా మంచివాడు. అతడి ఊరు అక్కడికి 50, 60 మైళ్ళకావల వుంది. నాగరాజన్ యిక్కడ అమ్మాయిని పెట్టుకుని, ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని ఎవరో అతడికి ఉత్తరం రాశారట. వెంటనే తపాలబండి లాగా పరిగెత్తుకొని వచ్చాడు. చెరువుకట్టకు వచ్చి తాను విన్నదంతా నిజమేనా అని అతడు నాగరాజన్‌ను అడిగాడు. నాగరాజన్, “అమ్మ నాన్న కలిసి నిశ్చయం చేశాక నేను వద్దని చెబితే మాత్రం ఆగుతుందా? అంతే కాదు, అమ్మాయి కూడా లక్షణంగా ఉంటుందట. వాళ్ళ నాన్న లక్ష రూపాయల ఆస్తిని ఆమె పేరిట రాశాడట. ఆయన తదనంతరం మరొక లక్ష రూపాయల సొత్తు వచ్చి చేరుతుంది. ఇలా తనంతట తానే వస్తున్న శ్రీదేవిని యెందుకు వద్దు అని చెప్పాలి?” అని చెప్పాడు.
ఇదంతా చెబుతున్నప్పుడు శ్రీనివాసన్ ముఖం మారుతున్న తీరుని గురించి ఏమని వర్ణించను? నాగరాజన్ చెప్పడం ఆపాక, శ్రీనివాసన్ అతడితో “యెన్ని లక్షలు అయినా రానివ్వు, ఒక అమ్మాయిని మోసంచేసిన పాపాన్ని మూటకట్టుకుంటావా? పెళ్ళి పందిట్లో మంత్రాల మధ్య చేసిన ప్రమాణాలను గాలికి వదిలేస్తావా?” అని అరగంటసేపు నానా విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని యెత్తిచూపి, రాళ్ళు కరిగేట్టుగా రుక్మిణి కోసం వివరంగా చెప్పాడు. ‘అతడు క్షేమంగా ఉండాలి, ఏ కొరతా లేకుండా జీవించాలి’ అని నిమిష నిమిషం నేను శ్రీనివాసన్ శ్రేయస్సును కోరుకుంటూనే ఉన్నాను.
అయితే, అతడు మాట్లాడాక, నాగరాజన్ అతన్ని చూసి, “శ్రీనివాసా, నీతో ఇప్పటివరకూ చెప్పినదంతా తమాషాకే. నేను కాసుల కోసం ఇంత అల్పుడిగా మారిపోతానని అనుకున్నావా? నేను ఎవరికీ తెలియకుండా దాచి వుంచాలని అనుకున్నా. అయితే, ఎప్పుడైతే నువ్వు యింత దూరం మాట్లాడావో, యిక మీదట నీకు తెలియకుండా దాచడంలో ప్రయోజనం లేదని నిర్ణయించుకున్నాను. కానీ, ఒకటి గుర్తుంచుకో, దీన్ని నువ్వు ఎవరికీ చెప్పకూడదు. మా అమ్మానాన్నలు ఆర్యతనాన్ని వదిలి, మ్లేచ్ఛతనంగా నడుచుకోవడానికి నిశ్చయించుకోవడం వల్ల వీళ్ళకి బాగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాను. నేను ఎంత మొత్తుకున్నా అమ్మానాన్నలు పిడివాదంతోనే వున్నారు. అందువల్ల మన్నార్ గుడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి, కుదరదని చెప్తాను. అయితే, నన్ను ఒత్తిడి చేయనే చేస్తారు. ముహూర్తపు పందిట్లో కూర్చుంటాను. కానీ, ఏది యేమైనా మూడు ముళ్ళు వేయాల్సింది నేనే కదా? వేరే ఇంకెవరు వేయలేరు కదా? ఆ సమయంలో ఖచ్చితంగా నేను వెయ్యనని చెప్పేస్తాను. అందరూ అల్లం తిన్న కోతుల్లాగా కళ్ళు తేలేస్తారు. రుక్మిణిని తాకిన చేత్తో ఇంకొక అమ్మాయిని తాకుతానని అనుకున్నావా!” అని చెప్పి ముగించాడు.
“అయితే నువ్వు వివాహానికి బయలుదేరే ఉదయం రుక్మిణీ వాళ్ళ అమ్మానాన్నల మనసులు ఎలా వుంటాయోనని ఆలోచించి చూశావా?” అని శ్రీనివాసన్ అడిగాడు. దానికి నాగరాజన్, “ఆలోచించాను. అయితే అంతా అయిపోయిందని వాళ్ళు నిరాశతో తల్లడిల్లుతున్న సమయంలో, ఉన్నట్టుండి నేను పరిగెత్తుకొచ్చి అత్తమామల కాళ్ళకు నమస్కరించి, ‘బాధపడకండి! నా రుక్మిణిని నేను ఒకరోజు కూడా చెయ్యి వదలను! ధనాశ పట్టుకున్న వాళ్ళందరినీ పెళ్ళి పందిరిలో అవమానించి యిక్కడకు వచ్చాను,’ అని చెబుతున్నప్పుడు వాళ్ళకు యెంత ఆనందంగా వుంటుంది! దాన్ని చూసి అనుభవించాలని కోరుకుంటున్నాను” అన్నాడు.
“ఆరోజు వరకు వాళ్ళ గుండెలు ఎలా కొట్టుకుంటూ వుంటాయో ఆలోచించి చూడు…” అన్నాడు శ్రీనివాసన్. దానికి నాగరాజన్, “ఇంకా ఐదు రోజులు కూడా లేదు, ఈ రోజు శుక్రవారం. ఆదివారం ఇక్కడి నుంచి అందరం బయల్దేరి వెళ్తాం. తర్వాతి రోజు ముహూర్తం. ఆ రోజే బయలుదేరి మరుసటి రోజు ఉదయమే ఇక్కడికి తిరిగి వచ్చేస్తాను. ఇన్ని రోజులు ఓర్చుకోలేరా?” అన్నాడు. “ఏమో, నాకు యిది సరికాదు అనిపిస్తోంది…” అని శ్రీనివాసన్ మాట్లాడుతున్నప్పుడే, ఇద్దరూ యిక్కడి నుండి కదలడం మొదలుపెట్టారు.
తర్వాత నాకు ఏమీ వినిపించలేదు. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర రాలేదు. చూశావా నాగరాజన్! అతడిలాంటి సుపుత్రుడు వుంటాడా లోకంలో అని చెప్పుకొన్నాను. ఇక మీదట భయం లేదు. ఐదు రోజులేంటి, పది రోజులేంటి? నాగరాజన్ మొండివాడు. చెప్పినట్లే చేస్తాడు. రుక్మిణికి ఇక మీదట వొక్క కొరత కూడా వుండదు అని పొంగిపోయాను.
ఆదివారం వీళ్ళంతా మన్నార్ గుడికి బయలుదేరుతున్నారు అని వూరంతా అల్లకల్లోలంగా వుంది. రామస్వామి అయ్యరునూ జానకినీ శపించని వాళ్ళు లేరు. కానీ, వాళ్ళని పిలిచి మంచి బుద్ధి చెప్పడానికి మాత్రం ఒక్కరు కూడా ముందుకురారు. ఒకవేళ యెవరైనా చెప్పినా, వాళ్ళు కట్టుబడేవాళ్ళు కూడా కారు. వాళ్ళు బయలుదేరుతున్న రోజున ఊర్లో వుండి కళ్ళారా చూస్తే, ఇంకొంచెం కడుపు మంట పెరుగుతుందని కామేశ్వరయ్యరు, మీనాక్షి శనివారం మధ్యాహ్నమే బయలుదేరి మణప్పారైకి వెళ్ళిపోయారు. ఇంట్లో రుక్మిణికి వాళ్ళ అత్త సుబ్బలక్ష్మి అమ్మాళ్ మాత్రమే తోడు.
శనివారం రాత్రి అయింది. ఊరంతా నిశ్శబ్దం అలుముకొంది. తొమ్మిది, తొమ్మిదిన్నర అయివుంటుంది. నాగరాజన్ ఒంటరిగా చెరువుకట్ట మీదికి వచ్చాడు. వచ్చి నా కింద కూర్చొని, ఏదో ఆలోచిస్తూ వున్నాడు. కాసేపటికి దూరంగా ఒక స్త్రీ ఆకారం కనిపించింది. అది చెరువుకట్ట వైపు వస్తూ వుంది. అయితే మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూనే వచ్చింది. చివరికి నాగరాజన్ కూర్చుని వున్న చోటికి వచ్చి నిలబడినప్పుడే అది రుక్మిణి అని నేను గ్రహించాను. నేను కొయ్యబారిపోయాను. అయితే వెంటనే తెలివి తెచ్చుకొని ఏమి జరుగుతుందో చూద్దామని కళ్ళు విప్పార్చుకొని జాగ్రత్తగా గమనిస్తున్నాను. ఐదు నిమిషాల వరకు నాగరాజన్ గమనించనే లేదు. దీర్ఘాలోచనలో ఉన్నాడు. రుక్మిణి కదలకుండా అలానే నిల్చుంది. యథాలాపంగా నాగరాజన్ తల పైకెత్తాడు. రుక్మిణిని చూసి, అతడు కూడా ఆశ్చర్యపోయాడు. కాని, వెంటనే సంబాళించుకొని, “రుక్మిణీ, ఇంత రాత్రి, వొంటరిగా రావచ్చా నువ్వు?” అని అడిగాడు. “మీరు వున్న స్థలంలో నేను ఒంటరిగా వుండాల్సిన రోజు రాలేదు” అని బదులిచ్చి రుక్మిణి నిలబడింది.
రెండు మూడు నిమిషాల పాటు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఇద్దరి మనసుల్లోనూ అలజడి. కానీ, యెలా మొదలుపెట్టి, యేం మాట్లాడాలి అనేది యిద్దరికీ తెలియడంలేదు. చివరికి నాగరాజన్, “యీ వేళలో మనం ఇక్కడ వుండటం తెలిస్తే వూర్లో యేదైనా చెప్పుకుంటారు, రా యింటికి వెళ్ళి పోదాం” అన్నాడు. దానికి రుక్మిణి “మీతో కొన్ని విషయాలు మాట్లాడేందుకు మీరు అనుమతి ఇవ్వాలి” అంది. “చెప్పు” అని నాగరాజన్ అనడంతో, రుక్మిణి మాట్లాడింది: “నాకు మీతో యేం చెప్పాలో తెలియడం లేదు. ఈ మూడు నెలలుగా నా మనసు పడే పాట్లు ఆ అఖిలాండేశ్వరికి మాత్రమే తెలుసు తప్ప మనుషులకు తెలియదు. మీరు పట్టణం నుంచి రాగానే నా కలతలన్నీ పోతాయని అనుకున్నాను. అత్తమామలు యేం చేసినా మీరు నా చెయ్యి వదలరని నమ్ముతున్నాను. కానీ మీరు కూడా నన్ను చెయ్యి వదిలేస్తే, తర్వాత దేన్ని నమ్ముకుని నేను బతకాలి? కంచే చేను మేయడం మొదలుపెడితే, పంట గతి ఏమవ్వాలి? ఇప్పటివరకు జరిగిందంతా నా మనసును ముక్కలు చేసింది. మీరు వాటిని కలిపితేనే వుంటాను. లేదంటే, నా ఆయుస్సు యింతవరకే, దానిలో సందేహం లేదు.” యీ విషయం చెప్పేటప్పుడు రుక్మిణీ కళ్ళలోంచి కన్నీరు కారింది. దాంతో మాటలు ఆగిపోయాయి.
నాగరాజన్ మాట్లాడలేదు. రుక్మిణి కూడా కొంతసేపు చూసి, “రేపటికి ప్రయాణం పెట్టుకున్నట్టు వున్నారే, మీరు వెళ్తున్నారు కదా?” అని అడిగింది. కాసేపు ఆలోచించి నాగరాజన్, “అవును, పోవాలనే వున్నాను” అన్నాడు. అలా అతడు చెప్పగానే, రుక్మిణికి గుండెలు అదిరాయి, దుఃఖం పొంగుకొచ్చింది, శరీరం గడగడ వణికింది. దాన్నంతా బయటకి చూపించకుండా “అట్లంటే, మీరు నన్ను చెయ్యి వదిలేశారు కదా?” అని అడిగింది. దానికి నాగరాజన్, “నిన్ను నేను చెయ్యి వదుల్తానా రుక్మిణీ? ఒక్కరోజు కూడా వదలను. కానీ, అమ్మానాన్నల్ని తృప్తిపరచడం నా బాధ్యత కదా? అయినా, నువ్వు విచారించకు. నిన్ను ఒక్కరోజు కూడా దూరం పెట్టను” అన్నాడు. రుక్మిణి భరించలేకపోయింది. “మీరు మారు వివాహం చేసుకుంటారు. అయినా నేను మాత్రం విచారించకుండా ఉండాలి. నన్ను ఏ రోజూ చెయ్యి వదలరా? అయినా అమ్మానాన్నలు చెప్పింది జవదాటరా? నేను చెప్పాల్సింది యింకేముంది? నా గతి యింతే!” అని చెప్తూ అలానే కూర్చుండిపోయింది.
నాగరాజన్ యేమీ మాట్లాడలేదు ‘పెళ్ళిని ఆపేస్తున్నాను’ అనే మాట తప్ప, ఇంక ఏమాట చెబితే మాత్రం రుక్మిణి మనసును తేట పరచగలం? ఆ మాటను ఇప్పుడు చెప్పడం అతడికి ఇష్టం లేదు. అందువల్ల తన నోటితో ఏమీ చెప్పకుండా తన మనసులో వున్న ప్రేమనూ ఆదరాభిమానాలను తన ప్రవర్తనలో వెలిబుచ్చాడు. ఆమె చేతిని చేతుల్లోకి తీసుకుని తన ఒడిలో పెట్టుకుని మృదువుగా పట్టుకున్నాడు. బిడ్డను నిమిరినట్టు వీపుమీద ఆదరంతో నిమిరాడు. అప్పుడు ఆమె తల వెంట్రుక రాలి అతని చేతి మీద పడింది. వెంటనే ఆశ్చర్యపోయి, “యేం రుక్మిణీ, తల పిడచకట్టుకుపోయిందే! ఇలానా చేసుకునేది? నిన్ను ఇలా చూసేందుకు నా మనసు సహించలేకుండా వుందే. ఏదీ నీ ముఖం చూపించు! అయ్యో, కళ్ళంతా యెరుపెక్కి వున్నాయే! ముఖంలో వెలుగంతా పోయిందే! నా బుజ్జీ, ఇలా వుండకు. నేను నీ చెయ్యి వదలనని, ఇది సత్యమని నమ్ము. నీ మనసులో కొంచెం కూడా అధైర్యపడకు. నా హృదయపూర్వకంగా చెబుతున్నా. నిన్ను ఈ స్థితిలో చూడడాన్ని నేను సహించలేకపోతున్నా. చిన్నవయసు నుంచి మనమధ్య వున్న అన్యోన్యతను మరిచిపోయానని కలలో కూడా అనుకోవద్దు. ఇక మీదట మనం ఇక్కడ వుండకూడదు, పద పోదాం” అని చెప్పి ముగించాడు.
రుక్మిణి లేవలేదు. ఆమెను చూసి నాగరాజన్‌కు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ సమయంలో తన మనసులో వున్న రహస్యాన్ని చెప్పేద్దామా అని అతని బుద్ధికి తోచినట్టు అనిపించింది. చెప్పినాడా పాపీ! అతడికి అతడి పిల్లాటే ముఖ్యమైపోయింది. అందువల్లే దాన్ని గూర్చి మాత్రం నోరు విప్పలేదు. అయినా, అతడికి మాత్రం ఎలా తెలుస్తుంది ఇలా జరుగుతుందని? ఇంత వయస్సున్న నాకే తెలియలేదే, ఆ సమయంలో ఎక్కడ తెలిసుంటుంది బిడ్డకు!
అలా ఆలోచిస్తూ కూర్చుని వున్న రుక్మిణిని మెల్లగా, పువ్వులాగా పైకి లేపి గుండెలకు హత్తుకుని, “ఏంటి, ఏమీ మాట్లాడకుండా వున్నావే రుక్మిణీ, నేనేం చేయాలి?” అని కరుణతో కరిగిపోతూ అన్నాడు. రుక్మిణి తల పైకెత్తి అతన్ని సూటిగా చూసింది. ఆ చూపు గురించి మీకు ఎలా చెప్పాలి? నదీప్రవాహంలో కొట్టుకుపోతూ చేతులు అలసిపోయిన వొకరికి దూరంగా కొయ్య ఒకటి తేలుతూ పోతున్నట్టు కనపడి, అతడు దానివైపు ఈదుకుంటూ పోయి ‘అబ్బ, బతికిపోయాంరా’ అని చెప్పుకుంటూ దాన్ని తాకినపుడు, అయ్యో పాపం! అది కొయ్య కాదు, కేవలం చెత్తకుప్ప అని తెలిసినప్పుడు, అతడి మనసు ఎలా ముక్కలవుతుంది, అతడి ముఖం ఎలా మారిపోతుంది? అలా ఉంది రుక్మిణి ముఖం, ఆ ముఖంలో ప్రతిఫలిస్తున్న ఆమె మనసు.
ఎల్లలు లేని వేదన ఆ చూపుల్లో ఉంది. దాన్ని చూసి నాగరాజన్ మౌనంగా ఉండటం చూసి, రుక్మిణి మెల్లగా పక్కకు జరిగి, “నేను చెప్పాల్సింది ఇంక యేమీ లేదు. మన్నార్ దేవాలయానికి పోననే మాట మీరు నాకు చెప్పనంటున్నారు. ఈ రోజుకి ఇలా నా తలరాత ముగిసింది. మీరు ఎప్పుడు నన్ను ఆ విధంగా విడిచిపెట్టేయాలనుకున్నారో, ఇక మీదట నేను దేన్ని నమ్ముకొని, ఎవరి కోసం ప్రాణాన్ని నిలబెట్టుకొని వుండాలి? మీ మీద నాకు బాధ లేదు. మీ మనసు ఈ కార్యానికి సమ్మతించడం లేదు. నా తలరాత, మా అమ్మా నాన్నల కష్టం, మిమ్మల్ని ఇలా చెయ్యమని చెబుతూ వున్నాయి. ఇక మీదట, ‘రుక్మిణి ఒకతె వుండేది. ఆమె నా మీద యెల్లలు లేని ప్రేమ పెట్టుకొని ఉంది. ప్రాణం వదిలేటప్పుడు కూడా నన్ను తలచుకుని ప్రాణం వదిలింది’ అని ఎప్పుడైనా గుర్తు చేసుకోండి. ఇదే నేను మీ నుంచి చివరిగా కోరుకునేది,” అని చెబుతూ నాగరాజన్ కాళ్ళ మీద పడి కాళ్ళను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.
నాగరాజన్ వెంటనే ఆమెను పైకి లేపి, “పిచ్చిదానా! అలా యేమీ చేయద్దు. నువ్వు పోతే, నా ఊపిరి ఆగిపోతుంది. తర్వాత ఎవరు యెవర్ని గుర్తుపెట్టుకోవాలి? వానజల్లు మొదలైంది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. కాసేపాగితే పెద్ద వర్షం వచ్చేటట్లుంది. రా యింటికి వెళ్దాం,” అని ఆమె చేయి పట్టుకొని రెండడుగులు వేశాడు. ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు యేవీ కనబడలేదు. అన్ని వైపులా వొకటే అంధకారం. అప్పుడప్పుడూ మేఘాల్ని ఖడ్గంతో నరుకుతున్నట్టు కోట్లాది మెరుపులు జ్వలిస్తున్నాయి. కానీ, మరు నిమిషం ముందు కంటే అధికంగా గాఢాంధకారం ఆవరిస్తున్నది. యావత్తు భూమి గడగడమని వణుకుతుంటే, ఆకాశాన్నే ముక్కలు చేస్తున్నట్టు ఉరుములు ఉరుముతున్నాయి. గాలి వొకటి, చండమారుతం లాగా వీస్తున్నది.
దూరంగా వర్షం పడుతున్న శబ్దం పెద్దదవుతూ, దగ్గరవుతూ ఉంది. ప్రళయకాలం లాగా ఉన్న ఈ సమయంలో రుక్మిణీ, నాగరాజన్ మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిలో సరిగ్గా పడలేదు. వాళ్ళు కూడా ఇంటి వైపు వేగంగా వెళుతున్నారు. ఒక మెరుపు మెరిసినప్పుడు, రుక్మిణి ఇంటికి పోవడానికి మనస్కరించక, వెనక్కి తిరుగుతుంటే, నాగరాజన్ ఆపి, ముందుకు పిలుచుకొని పోవడం మాత్రం కంటికి కనిపించింది. వాళ్ళ మాటలు ఒకటి రెండే నా చెవిలో పడింది. “ప్రాణం నిలవదు… అమ్మ హృదయం… తృప్తి… శుక్రవారం ఉదయమే… స్త్రీల… ముక్కలైపోతుంది… చెప్పద్దు… ఆ అమ్మాయినైనా బాగా చూసుకోండి… మనఃస్పూర్తిగా అభినందిస్తున్నాను… ఆరోజు తెలుసుకుంటావు… చివరి నమస్కారం… అప్పటి దాకా ఓపిక పట్టు…” ఈ మాటలే ఉరుముల మధ్య, గాలి శబ్దాల మధ్య, వర్షపు ధ్వనుల మధ్య నాకు వినబడ్డాయి. వర్షం కుండపోతగా కురవడం మొదలైంది. రుక్మిణీ నాగరాజన్‌లు కనుమరుగయ్యారు.
అయిపోయింది. మరుసటి రోజు తెల్లవారింది. వర్షం ఆగిపోయింది. అయినా, ఆకాశంలో నల్లటి మేఘాలు తొలగిపోలేదు. ఓదార్చడానికి మనిషిలేని బిడ్డలాగా గాలి విడవకుండా విలపిస్తూ ఉంది. నా మనసులో గందరగోళం చెప్పనలవికాదు. ఎంత ఆపుకోవాలి అనుకున్నా మనసుకి సమాధానం కలగలేదు. ‘ఏందిరా యిది, ఎప్పుడూ లేని దుఃఖం మనసులో పొంగి వస్తుంది? కారణం యేమిటో తెలియడం లేదే’ అని నేను నా లోపలే మథనపడుతున్న సమయంలో మీనా, ‘యేంటమ్మా, యిక్కడొక చీర తేలుతూ ఉంది!’ అని కేక పెట్టింది.
వెంటనే గుండెలు అదురుతుంటే, ఆ వైపు తిరిగాను. చెరువులో స్నానం చేస్తున్న అమ్మాయిలందరూ అలానే తిరిగి చూశారు. చీరను చూస్తే మీనాక్షి అమ్మాళ్ చీరలా ఉంది. అమ్మా నాన్నల తలల మీద బండరాయి విసిరి, రుక్మిణి మళ్ళీ వచ్చి చెరువులో దూకేసింది అని అనుకున్నాను. అది మాత్రమే తెలుసు. అలానే స్పృహ కోల్పోయాను. తర్వాత కాసేపయ్యాక తెలివి వచ్చింది నాకు. ఈ లోపల చెరువు కట్టంతా గుంపులు గుంపులుగా జనం. జానకినీ రామస్వామి అయ్యరునూ శపించని వారే లేరు. ఇంక మీదట శపిస్తే ఏమిటి, శపించకపోతే ఏమిటి? ఊరి శోభను, తల్లిదండ్రుల జీవితాల్ని, నా సంతోషాన్నీ అన్నిటినీ చేర్చి కట్టి, ఒక్క నిమిషంలో ఎగిరిపోయింది నా రుక్మిణి.
కింద, ఆ మల్లెచెట్టు పక్కనే ఆమెను పడుకోబెట్టారు. ఆమె బంగారు చేతులతో యెన్నిసార్లు ఆ మల్లె మొగ్గల్ని కోసివుంటుంది? ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు, చెరువు కట్టంతా ఆమె పాదం పడని చోటేది? ఆమె తాకని చెట్టేది? అయ్యో, తలచుకుంటే మనసు మెలిపెడుతుంది. ఆ అందమైన చేతులు, ఆ అందాల పాదాలు, అన్నీ మోడువారిపోయాయే! అయినా ఆమె ముఖంలో కళ మాత్రం మారలేదు. పాత దుఃఖం అంతా పోయి, ముఖంలో వొక విధమైన ప్రశాంతత పరచుకొంది. ఇదంతా కొంచెమే గమనించడానికి వీలుపడింది. అంతలోపే, ‘నాగరాజన్ వచ్చాడు, నాగరాజన్ వచ్చాడు’ అని గుంపులో కలకలం లేచింది. అవును నిజమే. అతడే పడుతూ లేస్తూ పరిగెత్తుకొని వస్తున్నాడు. మల్లెచెట్టు దగ్గరకు వచ్చి గుంపును, గుంపులో ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, “రుక్మిణీ, ఎంతపని చేశావు రుక్మిణీ!’ అని యేడుస్తూ కిందపడిపోయాడు. గుంపులో శబ్దం చప్పున అణగిపోయింది. అందరూ నాగరాజన్‌నే చూస్తున్నారు. చాలాసేపటిదాకా అతడు నేలమీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు. రామస్వామి అయ్యర్ భయపడిపోయి అతడి ముఖంపై నీళ్ళు చల్లగా, చివరికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచాడు. అయినా, తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రుక్మిణి ప్రాణంలేని శరీరాన్ని చూసి, ‘నా జీవితాన్ని నాశనం చేసి జూలియట్ లాగా ఎగిరెళ్ళిపోయావే రుక్మిణీ! శ్రీనివాసన్ చెప్పిందే నిజమైపోయిందే! నేను పాపిని! నా వల్లే నువ్వు ప్రాణం వదిలేసినావు. నేను నిన్ను హత్యచేసిన పాతకుడ్ని. నిన్న నేను రహస్యం పూర్తిగా చెప్పి ఉంటే, ఈ గతి మనకు ఎప్పుడూ వచ్చుండేది కాదే! కుసుమ సదృశం… సత్యః పాతి ప్రణయి హృదయం’ (స్త్రీ హృదయం పువ్వులాంటిది) అనే లోతైన వాక్యాన్ని వేళాకోళంగా మాత్రమే చదువుకున్నాను తప్ప, దాని సత్యాన్ని గ్రహించలేకపోయానే! ఇంక మీదట నాకు ఏముంది? రుక్మిణీ! నువ్వే అవసరపడి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నాకింక సంసార జీవితం వద్దు. ఇదిగో, సన్యాసం పుచ్చుకుంటున్నా!” అని చెబుతూనే, ఎవరూ అడ్డుపడకముందే తాను ధరించిన పంచెను, ఉత్తరీయాన్ని అట్లానే చింపేశాడు. అతని తల్లి గానీ తండ్రిగానీ నోరు విప్పలేదు. నాగరాజన్ కూడా, వారు దిగ్భ్రాంతి నుంచి తేరుకోకముందే, వాళ్ళ కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసుకొని, ఎవరితోనూ మాట్లాడకుండా కౌపీనధారి అయి, బయలుదేరి వెళ్ళిపోయాడు.
ఇలా ముగిసింది నా రుక్మిణి కథ! నా ప్రియమైన బిడ్డలారా, స్త్రీల మనసును బాధపెట్టే విధంగా యేదైనా చేయాలనిపించినపుడు, ఇక పైన యీ కథను గుర్తు తెచ్చుకుని చూడండి. వేళాకోళం కోసం కూడా స్త్రీగా పుట్టిన వాళ్ళ మనసును నలిపేయకండి. ఏ బాల్యక్రీడ ఏ విపరీతానికి దారితీస్తుందో యెవరు చెప్పగలరు?
(కులతంగరై అరసమరం 1915)
వ.వె.సు. అయ్యర్ (1981-1925): పూర్తి పేరు వరహనేరి వెంకటేశ సుబ్రమనియం అయ్యర్. తమిళ కథా పితామహుడు. కొంత విభేదాలున్నా, ఇప్పటికీ ‘చెరువుకట్ట మీది రావిచెట్టు’నే మొదటి తమిళ కథగా, వ.వె.సు. అయ్యరును మొదటి తమిళ కథారచయితగా పరిగణిస్తున్నారు. వ.వె.సు. అయ్యర్ బ్రిటీష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన తీవ్రవాద వుద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. బ్రిటీష్ నిర్బంధం నుండి తప్పించుకోవడానికి కొంతకాలం పాండిచ్చేరిలో ఆశ్రయం పొంది అక్కడినుండి పనిచేశాడు. కథలతో పాటు అయ్యర్ తిరుక్కురల్‌ను ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. దానితో పాటు 12వ శతాబ్ధంలో కంబర్ రాసిన రామావతారంను కూడా అనువాదం చేశాడు.