ఒక దుఃఖపు చేదులో
తడవని ఉదయానికై
రాత్రంత నిశ్శబ్దమవాలి
కానీ ఎలా?
కలల మేఘాలు సైతం
నెత్తుటి చినుకులను వర్షిస్తుంటే
కనురెప్పల నిండా
చిక్కగా పరచుకుంటున్న
దిగులు మరకలు
వద్దన్నా కాళ్ళకు చుట్టుకుంటున్న
తీగలను విదిలించడమెలాగో
తెలియని స్ధితి
తెలియని కలవరపాటుతో
ఊహల ఉలికిపాటు
చీకట్లోకి చూపులు పాతేస్తూ
ఆలోచనలను పాతరేస్తూ
గూట్లో ఒదిగిన పిట్ట
మూడవఝాము నడుస్తున్నా
దరి చేరని నిద్రపాదాల చెంత
బ్రతిమిలాట
కునుకుకీ మెలకువకీ నడుమ
ఒక అస్పష్టరేఖపై ఊగుతూ
విశ్రాంతికై తపిస్తూ
శ్వాస
ఇంతలోనే కిటికీ రెక్కను తట్టి
గదిలోకి జొరబడుతున్న
వెలుతురు వేళ్ళు
ఒక దుఃఖపు చేదులో
తడవని ఉదయానికై
రాత్రంత నిశ్శబ్దమవాలి
కానీ ఎలా?