“అమ్మా, నేను మతం మారిపోతాను.” భోజనం ముగించి లేస్తూ అన్న నవ్య మాటలకి ఉలిక్కిపడ్డాను.
పదోక్లాసు పరీక్షలు రాయబోతున్న నవ్య చాలా విషయాలు సులువుగానే అర్థం చేసుకుంటుంది. నా సమాధానానికి ఎదురుచూడలేదు. తన నిర్ణయం చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. బోర్డ్ ఎగ్జామ్స్ నాలుగురోజుల్లోకి వచ్చాయి. తన చదువు గురించిన దిగుల్లేదు కానీ అకస్మాత్తుగా ఈ ప్రస్తావనే కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళ నాన్న ఉన్నా ఇలాగే చెబుతుంది ఏ విషయమైనా. నవ్య అలాగే స్వేచ్ఛగానే పెరిగింది. మాధవ్ క్యాంపులో ఉన్నాడు కానీ ఈ మాటలు తనకీ కాస్త అయోమయాన్ని కలిగించక మానవు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ విషయం ఎందుకొచ్చిందో! సమయం చూసి తనే చెబుతుంది.
ఆఫీసులో బిజీగా ఉన్నా, మధ్యమధ్య నవ్య మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. దాన్ని ఏ విషయం కలవరపెట్టిందో! ఇంట్లో మామధ్య ఎప్పుడూ కులమతాల ప్రస్తావన రాలేదు. ఇంటికొచ్చే స్నేహితుల్లో అందరూ ఉన్నారు. వాటి గురించి దేశంలో జరుగుతున్న చర్చలు, ప్రచారం టీనేజ్ పిల్లల్లో ఎలాటి ఆలోచనలు రేపుతున్నాయో! మా తరం చదువుకునేప్పుడు, ఉద్యోగస్థలాల్లోనూ ఎప్పుడూ వీటికి ఇంత ప్రాధాన్యం ఉందన్నది తెలియదు.
సాయంకాలం ఇల్లు చేరేసరికి నవ్య స్నేహితులంతా వరండాలో పుస్తకాల మధ్య కూర్చుని సీరియస్‌గా ఏదో డిస్కషన్‌లో ఉన్నారు. వంట ముగించేసరికి నవ్య అందర్నీ పంపి లోపలికొచ్చింది.
“అమ్మా, ఈ రోజు ఆకాశ్ చదువుకుందుకు రాలేదు. అందరం వెళ్ళి బ్రతిమాలితే అప్పుడొచ్చాడు. వాడి అమ్మా, నాన్నలకి ఎందుకో గొడవట. భయం వేస్తోందన్నాడు. ఇద్దరూ ఆఫీసుకెళ్ళిపోయాక బాగా ఏడుపొచ్చి ఇంట్లో ఉండిపోయాడట.” నవ్య నా ఒడిలో ఒదిగిపోయింది. ముఖంలో ఎప్పుడూ కనిపించని దిగులు. స్నేహితుడి దుఃఖం తనకు, తన స్నేహబృందమంతటికీ నొప్పిని కలిగిస్తోంది.
“నేను సరితా ఆంటీతో మాట్లాడతాను. ఆకాశ్‌ని మాత్రం మీతోపాటు చదువులో కూర్చోపెట్టుకోండి.” ఓదార్పుగా అన్నాను.
పరీక్షలు మొదలైనంతసేపు పట్టలేదు. చకచకా పూర్తి అయిపోయాయి.
ఒక సాయంత్రం ఇంటికొస్తూనే మాధవ్ “నీకు చెప్పలేదు కదూ, వారం క్రితం రఫీ ఆఫీసుకొచ్చాడు,” అన్నాడు. విషయమేంటన్నాను.
“ఇన్నేళ్ళూ లేనిది ఆ భార్యాభర్తల మధ్య వాళ్ళవైన అస్తిత్వాల కోసం పెనుగులాట మొదలైంది. రఫి చాలా నిండైన మనిషి. ఎప్పుడూ ఎలాటి సందర్భంలోనూ బయటపడలేదు. తన సహనం చుట్టూ ఉన్న అందరి జీవితాల్లోనూ శాంతిని నింపుతుందని నమ్మాడు. ఎదురవుతూన్న గాయాల్ని ఎంత హుందాగా దాచుకుంటూ వచ్చాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక అవాంఛనీయమైన వాతావరణం దేశమంతా కమ్ముకోవటం ఎంత దురదృష్టకరమో అని బాధపడ్డాడు. కులమో మతమో ఒక ముద్రని వేసి వేరొకరి జీవితాల్లో అభద్రతని, భయాన్ని నింపే అధికారం ఎవరికైనా ఎక్కడిది? బలహీనంగా ఉన్న పిల్లపట్ల ఎక్కువ శ్రద్ధ చూపించే మనస్తత్వం ఇంటి పెద్దలకుంటుంది కదా. మన సమాజంలో వ్యతిరేకంగా ఎందుకుంది? ఆకాశ్ జరుగుతున్నదంతా చూసి, మానసికంగా నలిగిపోతున్నాడు. తండ్రి మైనారిటీ వర్గంలో ఉన్నాడన్న కొత్త స్పృహ వాడికొచ్చింది. నవ్య మతం మారతాననటం వెనుక స్నేహితుడి పట్ల కన్‌సర్న్ ఉంది. ఆకాశ్ తల్లితో ఏం చెప్పాడో తెలుసా? మైనారిటీ వర్గానికి చెందిన తండ్రికి బలం ఇచ్చేందుకు తను ఆ మతాన్ని తీసుకుంటాడట.”
మాధవ్ చెబుతున్నది వింటూంటే నాకంతా అయోమయంగా అనిపించింది.
ఉగాది పండగ తెల్లవారితే. తమ ఇంట్లో ఉన్న వేపపువ్వు తెచ్చి సరిత మా అందరికీ ఇచ్చేది. ఈసారి రాలేదెందుకో! నేనే వెళ్ళి వేపపువ్వు తెచ్చుకోవాలని బయలుదేరాను.
నన్ను చూస్తూనే సరిత ముఖం సంతోషంతో వెలిగింది. వెనుకే ఒక దిగులు నీడ కూడా.
“సారీ అక్కా, చాలారోజులైంది కలిసి. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటోంది. ఆకాశ్ పరీక్షలకని సెలవు పెడదామనుకున్నాను కానీ, పిల్లలంతా కలిసి చదువుకుంటున్నారు కదా…”
“నువ్వు నానుంచి బోల్డు విషయాలు దాస్తున్నావు,” అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ. ఉలికిపడింది.
“అవును మరి, క్రితం నెల ఊరువెళ్తున్నావనీ, అంతా సస్పెన్స్ అనీ, వచ్చేక బోలెడు విషయాలు చెబుతానన్నావు. ఆ తర్వాత మళ్ళీ మనం కలవనే లేదు.” నా మాటలకి రిలీఫ్‌గా, “ఓహ్, అదా! చెప్తాను. ముందు రా, టీ తాగుదాం.” అంటూ లోపలికి దారితీసిన సరిత వెనుకే వంటింట్లోకెళ్ళాను. వాళ్ళు బదిలీమీద వచ్చినప్పట్నుంచి మాకు మంచి స్నేహం ఉంది. ఆకాశ్, నవ్య ఒకే క్లాసు కావటం కూడా కారణం. సరిత ఇంట్లో హిందువుల పండుగలు చేస్తుంది. శ్రావణమాసం పేరంటాలకొస్తుంది. రఫీ కాలనీలో అందరితో కలిసిమెలిసి ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ ఎవరి స్పేస్‌ని వారు గౌరవించుకుంటారని నాకు ఇష్టంగా ఉంటుంది. టీ కప్పు అందిస్తూ సీరియస్‌గా అడిగింది.
“అక్కా, మతానికి ఏప్రాధాన్యం లేదంటావా? దేశమంతా మతం గురించి ఇంతగా చర్చలు ఎందుకు నడుస్తున్నాయి? మనవరకూ అన్ని మతాల్ని గౌరవంగా చూసినా ఒక సమస్యేదో ఉన్నట్టే అనిపిస్తోంది.”
ఏదో చాలా పెద్ద విషయమే ఉంది! వాతావరణం తేలికచేసేలా “పదిహేనేళ్ళకు పైగా ఇంట్లో రెండు మతాల్ని సమానంగా ఆదరిస్తున్నావు. మతం గురించి చెప్పేందుకు నీకున్న అథారిటీ నాకెక్కడిది సరితా?” అంటూ నవ్వాను.
“ఈ రెండు నెలలుగా కొన్ని విషయాలు జరిగాయి. నేను ఎవరితోనైనా చెప్పుకోగలను అంటే అది నీతో మాత్రమే. క్రితం నెల దాదాపు పదహారు పదిహేడేళ్ళ తరువాత నా పుట్టింటి వాళ్ళనందరినీ కలిశాను. నా చెల్లెలి కొడుకు ఉపనయనం జరిగింది. అమ్మానాన్నలు, అన్నదమ్ముల కుటుంబాలు అందరూ వచ్చారు. అసలు ఈ ఆహ్వానం రావటమే నాకు ఆశ్చర్యం. ఇంత గ్యాప్ తర్వాత ఎంతవరకు కలవగలనో, ఏమంటారో, ఎలా ఉంటారో అని నేను సంశయిస్తుంటే రఫీనే వెళ్ళమన్నాడు. ఆకాశ్‌నీ తీసికెళ్ళమన్నాడు, వాడికి అందరూ తెలుస్తారని. కాని వాడికి ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి అప్పుడు. అందుకని నేను ఒక్కదాన్నే బయలుదేరాను. రకరకాల ఆలోచనలతో వెళ్ళాను. అందరూ బాగా ఆదరించారు. రఫీ, ఆకాశ్‌లు ఎలా ఉన్నారనీ వాళ్ళు రాలేదేమనీ అడిగారు. రఫీతో కాపురంలో పుట్టింటివాళ్ళను నేను పెద్దగా మిస్సవలేదు కాని, నావాళ్ళ మధ్య ఇన్నేళ్ళ తర్వాత కలిసి కూర్చుని మంచిచెడ్డలు పంచుకుంటుంటే ఎంత బావుండిందో! ఇప్పటికయినా నావాళ్ళు మళ్ళీ నన్ను కలుపుకున్నారని సంబరపడ్డాను.
‘నీ కొడుకు వీడికంటే పెద్దవాడు. వాడికి ఈ వేడుక ముందుగా జరిగుండాల్సింది’ అన్న నాన్న మాటలు ఆయన మనసులో ఆశని చెప్పేయి. నాన్న అన్నాక ఆకాశ్‌కి ఉపనయనం చేస్తే బావుణ్ణని నాకూ అనిపించింది. కబుర్లమధ్య అన్నయ్య అన్నాడు, ‘దేశంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నావుగా, నీ కొడుక్కి ఒక భద్రమైన భవిష్యత్తునివ్వాలి’ అని.
ఇన్నేళ్ళుగా రఫీకి, నాకు మతమొక సమస్య కాలేదు. పెళ్ళికి ముందు మా మధ్య మతం విషయంలో ఎలాటి అభిప్రాయభేదం ఉండదని అనుకున్నాం. అందరితో కలిసిమెలిసి నిశ్చింతగా బ్రతకటమే అతని మతం. అంతకుమించి ప్రత్యేకత ఇవ్వక్కర్లేదంటాడు. అలవాటైన పండుగల్ని ఇంట్లో చేస్తున్న నా సరదాని అతను కాదనలేదు. ఉపనయనం విషయంలో రఫీ అభ్యంతరం ఏమీ ఉండదనే అనుకుంటూ తిరుగుప్రయాణమై వచ్చాను. కాని రఫీ ఒప్పుకోవట్లేదు. ‘మనకి మతాలే వద్దనుకున్నాం. అలాటిది ఇప్పుడు వాడికి అదొకటుందని ఒక కొత్త ఆలోచన రేపుతావా? అలాటివేవీ నాకొడుక్కి అక్కర్లేదు. నేను ఒప్పుకోను’ అంటున్నాడు.”
సరిత దీర్ఘంగా నిట్టూర్చింది.
మనుషుల మధ్య శాంతి మాయమై, జీవితాలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? అందరూ కలిసి సామరస్యంగా బతకాలన్న పెద్ద కాన్వాస్‌పై విషపు రంగులు దొర్లించే ఈ రాజకీయాలు ఎంత అమానవీయమైనవి! ఉమ్మడి బతుకులో దొరికే ఆనందాన్ని ఎందుకు చేజేతులా పోగొట్టుకుంటున్నారు? తెలిసీ చేస్తున్న తప్పుకి శిక్ష అనుభవిస్తున్నదెవరు?
“సరితా, ఉపనయనం గురించి నీ ఆలోచన సరే. ఆకాశ్‌ని అడిగావా వాడికి ఇష్టముందో లేదో?” తండ్రి మతాన్ని తీసుకుంటానన్నాడని ఆకాశ్ గురించి మాధవ్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. సరిత ముఖం కందిపోయింది. కాసేపు మౌనంగా ఉంది.
“అక్కా, ఇప్పుడు నేను కాస్త గట్టిగా ఉండాలి. నిండా పదిహేనేళ్ళు లేవు, వాడిప్పుడు తండ్రి మతం తీసుకొని, ఆయనకు సపోర్ట్‌గా ఉంటాడట. పేరు మార్చుకుంటాడట. ఇలాటిదేదో జరిగి వాడు నాకు దూరమవుతాడేమో అనే భయం ఎక్కడో మనసులో ఉంది. ఇది ఎప్పుడొచ్చిందో చెప్పలేను. వాస్తవంలో చూస్తున్న విషయాలు ఆకాశ్ పట్ల ఒక అభద్రతని కలిగిస్తున్నాయి. రఫీ, నేను మతానికున్న బలాన్ని తక్కువ అంచనా వేసేం అనిపిస్తోంది.
ఆకాశ్ పెరుగుతున్న సమాజం వాడిని ఎప్పుడైనా రెచ్చగొడుతుంది. అంతెందుకు, క్రికెట్ ఆడే సమయాల్లో వీడిని తమ టీమ్ లోకి తీసుకుందుకు పోటీపడతారు. అంతలోనే దేశంలో ఎప్పుడెలాటి మతసంబంధమైన గొడవలు జరిగినా వాళ్ళంతా ‘ఒరేయ్, మీ వాళ్ళేరా’ అంటూంటారట. వీడి వెనుక ఎవరో ఏదో అంటున్నారని ఇంకెవరో చెప్పబోతారట. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ ఇలాటివి వింటూనే ఉన్నాడు. సడన్‌గా వాళ్ళంతా తననొక్కణ్ణీ వేరుగా చూస్తుంటారట. ఇలాటివి పట్టించుకోవద్దంటాను. వాడూ సీరియస్‌గా తీసుకోలేదెప్పుడూ. ఉపనయనం చేసుకోననీ దానిపట్ల నమ్మకం లేదని చెప్పాడు.”
సరిత అప్పటిదాకా ఉగ్గబెట్టుకున్నట్టుంది, ఒక్కసారిగా ఏడ్చేసింది. తనని తాను కూడదీసుకునేవరకు మౌనంగా ఉండిపోయాను. సరిత ఎందుకు బాధపడుతోంది? ఉపనయనం విషయంలో తన మాట చెల్లదేమోననా? కొడుకు తండ్రిని, తల్లిని మతపరంగా విడదీసి చూస్తున్నందుకా? తండ్రిని బలపరుస్తున్నందుకా?
“ఆలోచిస్తే ఆకాశ్ స్కూలు అనుభవాలు అంతటితో ఆగవనిపిస్తోంది. అవి వాడిని ఎక్కడున్నా వెంటాడుతూనే ఉంటాయి. స్కూల్లో జరిగిన ఫ్రీ ఫైనల్స్‌లో ఆకాశ్ మొదటి స్థానంలో వచ్చినప్పుడు కొందరు టీచర్లు కూడా అన్నారట మైనారిటి స్టూడెంట్‌కి రావటం ఇదే మొదటిసారి అని. వాడి అస్తిత్వాన్ని సమాజం ఎలా చూడబోతోందో నాకు అర్థమవుతోంది కానీ రఫీ ఎందుకు తెలుసుకోవట్లేదు? ఎక్కువ ఆలోచించి భయపడుతున్నానన్నా సరే. మెజారిటీ వర్గంలో వాడున్నాడన్నది ప్రపంచానికి తెలియాలి. బలవంతంగానైనా వాడిని ఒప్పించి ఉపనయనం చేద్దామని ఉంది, రఫీతో గొడవపడైనా సరే. అవకాశం ఉంది కనుక వాడు కాళ్ళూనుకుందుకు ఒక బలమైన స్థానాన్నివ్వాలనుకుంటున్నాను. అన్నయ్య మాటలు విన్నప్పుడు అలాటి భయాలు మాకు లేవని స్థిరంగా అనుకున్నాను. కానీ అన్నయ్య చెప్పినదాంట్లో వాస్తవం ఉందనే తోస్తోందిప్పుడు.”
సరిత అంత ఆవేశంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు.
“స్కూల్లో చరిత్ర చదువుకున్నప్పుడు ఆ ఘర్షణలకి అర్థం లేదనిపించేది. అదే ధోరణి ఇప్పుడు ఇంకా ఇంకా జీవితాల్లోకి ఇంకిపోతోంది. వాడి మనసులో కొత్తగా మొలకెత్తిన ఆలోచనలు ఎలా పోగోట్టాలో తెలియట్లేదు. స్వార్థమే అనుకో, కానీ అసలు అది వాడి మంచికే. ఏదైనా చెప్పక్కా.”
ఇంతకాలంగా నమ్మినదాన్ని ఇంత తేలిగ్గా కాదనుకుంటోందా? ఎదురయ్యే ఒత్తిళ్ళ ముందు నమ్మకాలు వీగిపోవలసిందేనా?
“సరితా, ఆకాశ్‌ని ఉపనయనం విషయంలో బలవంతం చెయ్యకు. వాడు పెద్దవాడయ్యాడు. వాడి స్కూలు అనుభవాలు చేదైనవే. కానీ అలాటివేవీ వాడిని అంటకుండా నువ్వు ఇన్నాళ్ళూ గైడ్ చేస్తూ వచ్చావు. ఉపనయనం విషయంలో రఫీ, నువ్వు వేరువేరుగా ఆలోచిస్తున్నారు. రఫీ ఇన్నేళ్ళూ ఆచరించినదాన్నే ఇంకా స్థిరంగా నమ్ముతున్నాడు. నువ్వు చూస్తున్న ప్రపంచం అతనూ చూస్తున్నాడు. కొడుకు పట్ల అతనికీ కన్‌సర్న్ ఉంది. ప్రపంచం సంగతి వదిలెయ్. ఒక చక్కని కుటుంబంలో తుఫాను సృష్టిస్తోందే, దీనికున్న బలం తక్కువది కాదు నువ్వు చెప్పినట్టు. మీ ఇద్దరి ఘర్షణ చూసి ఆకాశ్ వాడికి తోచిన పరిష్కారం వాడు ఆలోచించాడు. మెజారిటీ బలంలేని తండ్రి వైపు మొగ్గాడు. రేపు వాడు చూసే ప్రపంచం మనం చూసే దానికంటే కఠినంగా ఉండొచ్చు. వాడికి సంయమనం, మానవత్వపు విలువలు నేర్పితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. ఒక్కసారి ఆలోచించు…”
“…”
“ఉపనయనం ఒక సరదా నీకు. దానికి నీ కారణాలు నీకున్నాయి. నువ్వు బలవంతం చేసినా వాడు ఒప్పుకుంటాడనుకుంటున్నావా? ఒకరకంగా ఇన్నేళ్ళూ వాడు పెరిగిన ధోరణికి వ్యతిరేకంగా ఒక వైపుకి మొగ్గేందుకు నువ్వే కారణమవుతున్నావు. వాడి ప్రాధాన్యత మారేలా చేస్తున్నది ఎవరో ఆలోచించావా? నువ్వు కోరుకున్నది ఇది కాదుకదా సరితా. రఫీ కూడా సంతోషిస్తాడనుకోను. ఇన్నేళ్ళూ మీ మీ స్పేస్‌ని ఎలా గౌరవించుకున్నారో ఆకాశ్ స్పేస్‌ని వాడికిచ్చి, దానిని గౌరవించాలి. ఇప్పుడు వాడు మతం మారతానంటే రఫి ఒప్పుకుంటాడనుకోను. అలాగే ఉపనయనంతో అంతా మారిపోదు. తండ్రిపేరు తెలిసినప్పుడు వాడి పట్ల వివక్ష ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఉపనయనం చేసినా ఈ మతస్తులు కూడా వాడిని తమలో పూర్తిగా కలుపుకుంటారనుకోను. ఆలోచించి చూడు.”
సరిత ముఖంలో ఆలోచన. ఒక్క క్షణం ఆగి అంది. “అవును. రఫీ ఆకాశ్‌తో వద్దనే అన్నాడు. మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన భయం ఏదీ లేదంటాడు రఫీ. ఏమతమైనా మనిషిని మంచిచెడుల పట్ల విచక్షణని నేర్చుకొమ్మనే చెబుతుంది. అది తెలుసుకోనప్పుడు ఏదైనా ఒకటే అంటాడు. ఆకాశ్ మతం మారతానన్నప్పుడు తను ఏం చెప్పాడో తెలుసా, ‘నువ్వు ఉపనయనం చేసుకుని అమ్మ మతం కావాలనుకున్నా నాకు అభ్యంతరం లేదురా. కానీ, జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకుందుకు ఇవన్నీ అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన ఆలోచన, నడవడి కావాలి. ఆ అవగాహనను మించిన మతం లేదు నా దృష్టిలో’ అన్నాడు.”
సరిత ఆ మాటలు దాచకుండా నిజాయితీగా చెప్పినందుకు నాకు బోలెడు సంతోషం వేసింది. ఆమె చేతుల్ని స్నేహంగా తాకాను.
“అవును నిజమే కదా! ఈ అభద్రత కొత్తగా వచ్చింది కాదు. ఇది ఎప్పుడూ ఉన్నదే. కాకుంటే ప్రస్తుతం కొంత హెచ్చుగా ఉంది. కులం, మతం కాకుంటే జాతి. వివక్ష ప్రపంచమంతా పెరగడం చూస్తూనే ఉన్నాం కదా. అమెరికాలో చూడు నల్లవారి పరిస్థితి. వర్ణాంతరవివాహాలు చేసుకున్న వారి పిల్లల పట్ల వివక్ష లేదంటావా? మనలా కాదు, వారిని చూడగానే గుర్తుపట్టచ్చు కూడా. నువ్వు ఎంత ప్రయత్నించు, సమాజం ఎప్పుడూ ఒక సంబంధంలో, అనుబంధంలో తక్కువతనాన్నే ఎత్తిచూపుతుంది. మనం పోగొట్టాల్సింది ఆ ఎక్కువతక్కువతనాన్ని. ఆకాశ్‌కు మీరు ఎలానూ నేర్పుతూనే ఉన్నారు. అందువల్ల ఉపనయనం చేసి ఆకాశ్‌ను హిందూపద్ధతులు పాటింపచేసినంత మాత్రాన ఏదో భద్రత కలుగుతుందన్న మీ అన్నయ్య ఆలోచన సరికాదనే నా నమ్మకం.”
“కానీ… ఉపనయనం చేస్తే అమ్మావాళ్ళంతా సంతోషిస్తారు, నా ఇంటికి వస్తారన్న ఆశ ఉంది.” తన ఆలోచనల్లోని లోటు గ్రహింపుకొచ్చినట్టు బలహీనమైన స్వరంతో అంది.
“అసలు నువ్వు ఎప్పుడైనా పిలిచావా? ఒకసారి మీవాళ్ళందరినీ పిలిచి చూడు. దానికి ఉపనయనమే అక్కర్లేదనుకుంటా. వీడి స్కూల్ గ్రాడ్యుయేషన్ కూడా ఒక మంచి అకేషన్. ఒకసారి పరిచయాలు పెరిగి బంధుత్వం గట్టిపడ్డాక వాళ్ళకూ మీరు అర్థమవుతారు. ఆకాశ్‌కు రఫీకీ కూడా తోడు నిలుస్తారు.”
“నిజం చెప్పాలంటే ఎప్పుడూ పిలవలేదు. రఫీ ఎవరూ లేకుండా పెరిగినవాడు. అతనికి మనుషులు కావాలి. పెళ్ళయిన కొత్తలో పిలుద్దామనేవాడు. కానీ, రఫితో పెళ్ళికి మావాళ్ళ మద్దతు లేకపోవటంతో వాళ్ళని ఇంటికి ఆహ్వానించేందుకు సంకోచించాను. ఇన్నాళ్ళకి వాళ్ళ పిలుపుకి వెళ్ళొచ్చాక వాళ్ళతో కలిసి ఉండాలన్న ఆశ కలుగుతోంది. నువ్వన్నట్టు ఆకాశ్ గ్రాడ్యుయేషన్‌కి పిలుస్తాను,” అంది. తన మొఖంలో రిలీఫ్ చూసి నాకు సంతోషంగా అనిపించింది.
ఇక చెప్పవలసిందేం లేదు. వెళ్తానంటూ లేచాను, సరిత గుమ్మం దాకా వచ్చింది.
“సరితా, మనిషి తన అస్తిత్వపు ఆనవాళ్ళని వెతుక్కునే ప్రయత్నం కొత్త కాదు, ఎప్పుడూ ఉండేదే. ప్రపంచం ఉన్నంత కాలం ఈ వర్గాలు, విభేదాలు ఉంటూనే ఉంటాయి. ఈ కాలానికి పెరుగుతున్న అసహనాల మధ్య, వైషమ్యాల మధ్య మరింత జాగ్రత్తగా పిల్లల్ని నడిపించాలి. ఎవరి నమ్మకాన్ని వారు కాపాడుకుంటూనే పక్కవారి నమ్మకాన్ని గౌరవించేలా చేస్తే చాలు. మన పిల్లలని మనం అలానే పెంచుతున్నాం. మన బాధ్యత అది. నీకు తెలుసా, ఆకాశ్‌కు తోడుగా వాడి మిత్రబృందం అంతా ఉన్నారు. పైచదువులకు వేరేదేశాలు వెళ్ళినా, ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఎంత దూరంగా స్థిరపడ్డా, ఒకళ్ళకొకళ్ళు తోడుండేది వాళ్ళే. అందుకని నువ్వు ఆకాశ్ గురించి కొత్తగా దిగులుపడి మనసు పాడు చేసుకోకు. సరేనా?”
“థాంక్సక్కా.”
“ఈ వీకెండ్ రండి మీరంతా మా ఇంటికి. కలిసి డిన్నర్ చేద్దాం.” అని చెప్పి ఇంటికి బయలుదేరాను కొంత కలతతోటే.
సరిత మరోమారు థాంక్స్ చెప్పింది.
ఇల్లు చేరేసరికి నవ్య స్నేహబృందమంతా కబుర్లూ, నవ్వులూ మధ్య కేరింతలు కొడుతుండటం చూసి మనసు తేలికపడింది.