సీతాయనం

శివధనుస్సును విరిచే వీరుడినా
నేను కోరుకున్నది?
మనోవీణను మీటగల మిత్రుడిని కదా!
ఏడడుగులు నడిచినందుకు
ఏడేడు సంవత్సరాలు
కాలదన్నాను రాజభోగాలను.
పద్నాలుగేళ్ళ వనవాసం
సహచరుడి హృదయావాసాన్ని
కానుక చేయగలదని కదా ఆశపడ్డాను.

లేడికూనతో ఆడుకోవాలనుకోవటం
నేరమని తెలియనేలేదు
అన్నార్తుడిని ఆదుకోవాలనుకోవటం
గీత దాటడమనుకోలేదు.
కాముకుని చెరలో ఉన్నా
జీవించాను నీ తలపుల బందీగానే
దశాబ్దికి పైబడిన సాహచర్యం
నేనేమిటో నీకు తెలుపనేలేదు కదూ!

ఆర్యధర్మస్థాపన కోసం
రావణుని వధించిన వీరుడా!
నేను అగ్నిప్రవేశం చేసి
పతిగా దగ్ధమైన నిన్ను చూశాను
రాజధర్మస్థాపన కోసం
భార్యను తరిమేసిన రాజా!
రెండవసారి వనవాసంలో
మరణించిన మిత్రుని కనుగొన్నాను
తండ్రి నీడ ఏనాడూ సోకకపోయినా
తీర్చిదిద్దాను బిడ్డలను
వీరులుగా, విద్యావంతులుగా
ధర్మం నీది మాత్రమేనా?
నేను పాటించింది ధర్మం కాదా?

అశ్వమేధయాగానికి నా రూపం తోడు
అవని పాలనకు నా ప్రతిరూపాల అండ
ఇదేగా నువ్వు కోరుకున్నది?
అందుకే పుట్టినిల్లు పదిలమనుకున్నాను
ఆత్మాభిమానం నిలుపుకున్నాను.
కోరుకున్న అనురాగం
ఆశించిన స్నేహం
ఎండమావులేనని తెలిసి
అమ్మ ఒడిలో సేదతీరుతున్నాను.