స్తబ్దత

సూర్య చంద్రులు లేరని
హరివిల్లు ఆకాశాన్ని విడిచి వెళ్ళింది
ఆధారంగా ఉంటుందనుకున్న దారం
పతంగం చేయి వదిలి ఫక్కున నవ్వింది
మది ఊసుల్ని గానం చేయాలనుకున్న కోకిల
శ్రోతలే లేక బిక్కు బిక్కు మన్నది
రెండు జామపళ్ళయినా లేవని
చెట్టుని వీడి చిలుక ఎగిరిపోయింది
మమతల విడిది నవుతానన్న కల
రెప్పలు తెరవకముందే మాయమైంది

నిన్నటి దాకా పరిచితమైనది
ఒక్కసారిగా అపరిచితంగా!
ఈ క్షణం వరకు సొంతమైనది
మరు క్షణం పరాయిగా!
కాళ్ళ కింద నేల కదిలిపోయి
శూన్యంలో నిరాధారంగా!
సమాధైన భావాలను
పెకలించలేక నిస్సహాయంగా!
నిజం తెలిసినా
అంగీకరించలేక స్తబ్దంగా!