కొండచింత

ఏడు సంవత్సరాలుగా
ఎన్నోసార్లు నీ నీడలో నిలిచా
వందల అడుగులు
నీ ప్రక్క నుండే నడిచా
నా తలపుల్ని ఏ పరుగులు కమ్మేశాయో
కొండచింతా!
నిన్ను గమనించనేలేదు

గాఢమైన పరిమళాన్ని
విరజాజుల్లా వెదజల్లలేననుకున్నావో!
గ్రీష్మపు రాత్రుల్ని
మల్లెపూలలా చల్లబరచలేననుకున్నావో!
పరిమళాన్ని సైతం పొదుపుగానే పంచే సిగ్గరీ!
ఒకానొక ఆమని వేళ
ఒక్కసారిగా ఒడలంతా విచ్చుకున్న పూలతో
సున్నిత సుమధుర సుగంధంతో
నీవు నన్ను పలకరించాక కదూ!
మత్తెక్కించే సువాసనతో
ఇంటి వరకూ వెంబడించాక కదూ!
ఆ ఆమోద మూలాలను అన్వేషించింది
నీ ఔన్నత్య శిఖరాలను దర్శించింది

కొమ్మల రెక్కలను చాచి
ఎండపొడనైనా తగలనీయక
వాన చుక్కనైనా జారనీక
నీడనిచ్చే నిర్మల మానసం
పచ్చని గొడుగు మీద
పరుచుకున్న పసిడి పూలను
అల్లనల్లన జారవిడుస్తూ
పసుపు తివాచీని పరిచి
సేదదీర రమ్మని పిలిచే
స్వచ్ఛ దయార్ద్ర హృదయం
అద్భుత పరిమళాన్ని దాచుకున్నా
ఆర్భాటం చేయని వినయం

కొంతమంది మనుషులు సైతం
అచ్చంగా నీలాగే!
ఎంతో చేసి
అంతగానూ ఒదిగి
నిర్వికారంగా
నిరాడంబరంగా
అచ్చంగా నీలాగే!