క్రితం సంచికలో తత్సమ, తద్భవ, అచ్చతెలుగు, దేశ్య, గ్రామ్య అంటూ కేతన చేసిన పదాల వర్గీకరణ గురించి తెలుసుకొన్నాం కదా. ఈ సంచికలో కేతన విపులంగా తెలుగులో సంస్కృత సమాలైన తత్సమాలు ఎలా మారుతాయోనని చెప్పిన విధానాన్ని చర్చిద్దాం. ఈ వ్యాసం చదివితే తెలుగు భాషా లక్షణాలు, సంస్కృత భాషా లక్షణాలు వేరు వేరు అని అర్థం అవుతుంది
సంస్కృత పదాలను తత్సమాలుగా మార్చే విధానం
సంస్కృత పదాలను తెలుగు పదాలుగా మార్చే విధానాలను ఇప్పుడు తెలియజేస్తాను అంటూ 28వ పద్యం మొదలుకొని, 42వ పద్యం వరకూ అంటే 14 పద్యాలలో సంస్కృతంలోని మాటలు తెలుగులో ఎలా మార్పు చెందుతాయో కేతన వివరించాడు.
వ.
సీ.
యనువిభక్తులు దెనుంగునకుఁ జొరవు
అస్తి ప్రయాతి గాయంతి భుంక్తే సంతి
నయతి స్మరతి యనుక్రియలు సొరవు
గత్వా హసిత్వా ప్రకాశ్య సంత్యజ్య నాఁ
దనరు త్వాంతల్యబంతములు సొరవు
గంతుంపురీం రిపుంహంతుం సుతంపాతు
మనుతుమున్నంతంబు లరయఁ జొరవు
తే.
లవ్యయంబులు చొర వెందు నాంధ్రకవితఁ
బెఱపదంబులతోడను దొరలినిల్చు
నవి తెనుంగులు గావింతు నభిమతముగ. (28)
సంస్కృత విభక్తులు, సంస్కృత క్రియా విధానం, క్వార్థక, తుమున్నర్థక, అవ్యయ రూపాలు సంస్కృతంలో ఉన్నవి ఉన్నట్లు తెలుగులో చేరవు. తెలుగుతో కలిసి అవి తెలుగుగా ఉండే విధాన్ని ఆమోద యోగ్యంగా ఉండేలా తెలియజేస్తాను అంటూ సంస్కృత సుబంత, తిఙ్గంత పదాలు కొన్ని పేర్కొని ఇవి తెలుగులో ఇట్లా వాడరని ఈ పద్యంలో స్థూలంగా చెప్పడంతో తత్సమాల గురించిన ఈ ఉపవిభాగం ప్రారంభమౌతుంది.
టీకా: వృక్షేణ = సంస్కృత వృక్ష శబ్దం తృతీయా విభక్తి; దక్షాయ = సంస్కృత చతుర్థి విభక్తి ప్రత్యయంతో దక్షశబ్దం (రెండూ ఏ.వ.); పక్షిభిః = పక్షి, తృ. బహు.; పుత్రస్య పుత్ర, షష్ఠి, ఏ.వ.; అను = అనే; విధమైన విభక్తులు = సంస్కృత విభక్తి ప్రత్యయాలు; తెనుంగునకు = తెలుగు భాషలో; చొఱవు = చేరవు; అస్తి = ఉండు (అస్) + ప్ర.పు.వర్తమానం; ప్రయాతి = తృ.పు.వర్త. ప్రయాతి -గాయంతి = పాడుతారు తృ. బహు.వర్త.; భుంక్తే = (ఆత్మనే పదం) (ఉ.పు. ఏ.వ.); సంతి = ప్ర.పు. బ.వర్త. కా.; నయతి = నయ్ ప్ర.పు. ఏక.వర్త; స్మరతి = స్మర – ప్ర.పు. ఏక.వర్త; అను = అనేటటువంటి; క్రియలు = క్రియా పదాలు (పనిని తెలిపేవి); సొరవు = చేరవు; గత్వా = క్వార్థంలో గచ్ఛ్ ధాతువు = వెళ్ళి; హసిత్వా = నవ్వి, ప్రకాశ్య ప్రకాశించి; సంత్యజ్య = వదిలి; నాన్ = అని; తనరు = ఉండే, ఒప్పే; త్వాంతల్య బంతములు = క్వార్థక ప్రక్రియలు; సొరవు చేరవు; గంతుం పురీం వూరు వెళ్ళడానికి; రిపుం హంతుం = శత్రువును చంపడం; సుతం పాతుం = పుత్రుణ్ణి రక్షించడం; అను = అనే విధమైన; తుమున్నంతంబులు ‘తుమున్నర్థక’ పదాలు; అరయన్ = తెలియగా; సొరవు = చేరవు; అపి=అయినప్పటికీ; చ, తు, హి, వై, న, వా, నను = ఇవన్నీ సంస్కృతంలో అవ్యయాలు (చ = మరియు, కూడా, తు = కూడా, హి = నిశ్చయంగా, వా = లేదా, నను = నిజంగా) అనగన్ అనేటటువంటి; పెక్కులు అనేక; అవ్యయములు = అవ్యయాలకు చెందిన మాటలు; చొరవు = చేరవు; ఎందున్ ఎక్కడా కూడా; ఆంధ్ర కవితన్ = ఆంధ్ర భాషలోని కవిత్వంలో కావ్యంలో; పెఱపదంబులతోడను = ఇతర పదాలతో; దొరలి = కలిసిపోయి; నిలుచున్ = ఉండే; అవి = వాటిని మాత్రమే; తెనుంగులు = తెలుగు పదాలు (గా); కావింతున్ = చేస్తాను; అభిమతముగ= సమ్మతంగా, అంగీకారయోగ్యంగా.
సంస్కృతంలో నుండి తెలుగులోకి వచ్చి చేరిన పదాలంటే వాటికి సంబంధించి స్త్రీ, పురుష, నపుంసక; ఏక, ద్వి, బహు వచన రూపాలన్నింటితోను చేరిన నామాలు కానీ, కాల, లింగ, పురుష వచన బోధక ప్రత్యయాలతో గూడిన క్రియారూపాలు గానీ, క్వార్థక, తుమున్నర్థక రూపాలు గానీ, అవ్యయాలు గానీ యథాతథంగా తెలుగులో వాడడానికి వీలులేదు. అవి తెలుగు పదాలతో కలిసి ఎలా ప్రయోగింప బడుతాయో తెలిసేవిధంగా, అందరికీ అంగీకార యోగ్యంగా వివరిస్తాను అని ఈ పద్యంతో కేతన సంస్కృత పదాలు తత్సమాలుగా ఎలా మార్పులు చెంది తెలుగులో ఉపయోగించబడతాయో (ముందు పద్యాల ద్వారా వివరిస్తానని) తెలియజేస్తున్నాడు.
అంటే సంస్కృతంలోని కొన్ని వ్యాకరణాంశాలు తెలుగులో చేరినప్పటికీ (ముఖ్యంగా సంధులు, సమాసాలు), నామ నిష్పన్న, క్రియా నిష్పన్న విధానాలు మాత్రం చేరలేదనీ, అవ్యయాలు కూడా తెలుగులో అలాగే వాడడం కుదరదనీ చెప్తున్నాడన్న మాట.
కం.
నెలకొని నిల్చినవిసర్జనీయంబులు సు
న్నలు నిలువవు తెనుఁగులలో
నలవడఁగాఁ బల్కుచోట నభినవదండీ. (29)
సంస్కృతంలో ఉన్నటువంటి విసర్గ, పూర్ణ బిందువులు ఆ సంస్కృత శబ్దాలను తెలుగుగా వ్యవహరించినప్పుడు ఉండవు.
ఈ పద్యం నుండీ కేతన తన బిరుదు ‘అభినవదండి’ని తానే పద్యమకుటంగా శతకాలలో వలె పలుసార్లు ఉపయోగించుకొంటాడు. మొదటి పద్యాలలో సంస్కృత విభక్తి ప్రత్యయాలు, క్రియాప్రత్యయాలూ, అవ్యయాలు తెలుగులో అలాగే వాడడానికి కుదరదని తెలిపిన కేతన ఈ పద్యంలో సున్న, విసర్గలు కూడా సంస్కృతంలో ఉన్నట్లుగా తెలుగులో ఉపయోగింప బడవు అని తెలియజేసాడు.
ఉదా: రామః లో విసర్గ పోయి, ‘రామ’ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వనమ్ ‘వనము’గా మారుతుంది. కావ్యభాషలో ‘వనం’ అని ‘సున్న’తో రాయకుండా ముకారాంతాలుగా రాయడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
కం.
వెలిగాఁ దక్కినపదముల వెలసినతుద య
చ్చుల నిడుపు లుడుపఁ దెనుఁ గగు
నిల నెప్పటియట్ల యుండు నీయంతంబుల్. (30)
“ఒకే అక్షరంతో ఉన్న పదాలు ఇతర పదాలన్నింటికీ దూరంగా (వెలిగా) (భిన్నంగా), వాటి చివర ఉండే దీర్ఘాలతో, సంస్కృతంలో వలెనే యథాతథంగా ఉంటాయి, కానీ మిగిలిన వాటికి దీర్ఘాంతాలు హ్రస్వాలవుతాయి.”
సంస్కృతంలో స్త్రీ వాచక శబ్దాలలో ముఖ్యంగా ఆకారాంత ( హ్రస్వ అకారాంతాల స్త్రీ శబ్దాలు లేవు), ఈకారాంత మొదలైనవి తెలుగులోకి తీసుకున్నప్పుడు అవి ఏకాక్షర పదాలు కానట్లయితే వాటి చివర ఉండే దీర్ఘాలు హ్రస్వాలుగా మార్పు చెందుతాయి. ఏకాక్షర పదాలయినట్లయితే యథాతథంగా (ఎప్పటివలె) దీర్ఘాంతాలు గానే (చివర అక్షరం దీర్ఘంగా అలాగే) ఉంటాయి – అని కేతన ఈ పద్యంలో సూత్రాన్ని వివరిస్తున్నాడు. ఉదాహరణలు తరువాతి పద్యంలో ఉంటాయి.
కం.
నీయేకాక్షరపదంబు లీక్రియఁ జను గౌ
రీ యన గౌరి యగున్ వా
ణీ యన వాణియగు మణి మణీ యనుచోటన్. (31)
“స్త్రీ, ధీ, శ్రీ ఇలాంటి ఏకాక్షర పదాలు దీర్ఘాంతాలుగానే తెలుగులోనూ ఉంటాయి కానీ గౌరీ, వాణీ, మణీ అనే మాటలు గౌరి, వాణి, మణి అని హ్రస్వాంతాలు అవుతాయి.”
కేతన చెప్పిన ఈ సూత్రాన్నే తర్వాతి వ్యాకర్తలందరూ, చిన్నయసూరితో సహా మళ్ళీ తమ వ్యాకరణాల్లో చెప్పారు. ఏకాక్షర పదాలైన స్త్రీ, ధీ, శ్రీ లలో తెలుగు వాళ్ళు స్త్రీ, శ్రీ అనే రెండు మాటలను విరివిగా వాడుతుంటారు. ఇవి ఇలాగే దీర్ఘాంతాలుగానే తెలుగులో చేరిపోయాయి.
కానీ ఈకారాంత (దీర్ఘంతాలైన) గౌరీ, వాణీ, మణీ, మొదలైన మాటలు మాత్రం వాటి చివరి దీర్ఘాలను హ్రస్వంగా మార్చుకుని తెలుగువారి వ్యవహారంలో ఉపయోగించబడుతూ వస్తున్నాయి. కేతన ఇక్కడ అన్నీ ‘ఈ’ కారాంత పదాలే ఇచ్చినా ‘రమా’, ‘ఉమా’ లాంటి ‘ఆ’ కారాంత స్త్రీలింగ శబ్దాలు కూడా హ్రస్వాలుకానే ఉపయోగిస్తాం. ఇంతకు పూర్వమే అబలా అబల అవుతుందని చెప్పాడు (పద్యం 20). అంటే ఏకాక్షర, పదాలకూ ఇతర పదాలకూ ఉన్న తేడాను స్పష్టంగా సూత్రీకరించి చెప్పడంలో కేతన సఫలీకృతుడయ్యాడు. సంబోధన అంటే పిలిచే తప్పుడు మాత్రమే దీర్ఘం గా పలుకుతాం.
ఒక పద్యంలో సూత్రం, మరో పద్యంలో ఉదాహరణ (లు) లేదా ఒకే పద్యంలో సూత్రం వెంటనే ఉదాహరణ ఇవ్వడం వర్ణనాత్మక భాషాశాస్త్ర వ్యాకరణాల రచనా పద్ధతి. ఇలాంటి పద్ధతిలో రాసిన కేతన వ్యాకరణం చదువుతూంటే తెలుగు భాషతో పరిచయం ఉన్న వారికెవరికైనా క్లిష్టంగా అనిపించదు. అదే చిన్నయసూరి పద్ధతి దీనికి భిన్నం. అందువల్ల విద్యార్థులు, ఇతర తెలుగు భాషా ప్రేమికులు కూడా ఆ వ్యాకరణాన్ని క్లిష్టమైందిగా భావిస్తారు. పద్య రూపంలో ఉన్న ‘కేతన’ వ్యాకరణమే సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఉంది అంటే దానికి ఆయన పాటించిన వర్ణనాత్మక సూత్రం – ఉదాహరణలు అన్న పద్ధతే కారణం అని చెప్పవచ్చు.
కం.
నక్షరములు దెలియుకొఱకు నను వైనక్రియన్
శిక్షార్థముగాఁ బల్కెద
లాక్షణికులు తప్పుగాఁ దలంపకుఁడు మదిన్. (32)
“భాషా సంబంధమైన లక్షణాలను వివరించేటప్పుడు చెప్పే అక్షరాలు స్పష్టంగా తెలియడానికి, నేర్చుకునేందుకు వీలుగా కొన్ని సంజ్ఞలు ఉపయోగిస్తాను; వాటిని ఇతర లాక్షణికులైన మీరు మీ మనస్సులో తప్పుగా తలంపకండి.”
ప్రతిభాషా వ్యాకర్తకూ భాషను గురించి తెలపడానికి (వర్ణించడానికి) భాషే ఆధారం. అందువల్ల సూత్రీకరణ కోసం ప్రత్యేకమైన పరిభాష కొంత అవసరం అవుతుంది. దీన్నే భాషా శాస్త్రంలో మెటా-లాంగ్వేజ్ (Meta – language) అన్నారు. పాణిని మొదలైన ప్రాచీన వ్యాకరణ పండితులు వీటిని “సంజ్ఞలు” (ఇత్సంజ్ఞలు) అన్నారు. అందువల్ల కేతన తాను కొత్తగా వాడే పరిభాషను గురించి “మీ మనస్సులో తప్పుగా అనుకోకండి” అంటూ ఇతర లాక్షణికులను పైపద్యంలో వేడుకొన్నాడు.
ఆ సంజ్ఞలు ఎలాంటివో తర్వాతి పద్యం ద్వారా తెలుస్తుంది.
కం.
ముఱ్ఱగు నఱ్ఱంతశబ్దములపై రెంటన్
డుఱ్ఱగుఁ బురుషాఖ్యలపై
నఱ్ఱుఱ్ఱగు నట్టియెడల నభినవదండీ. (33)
వుఱ్ఱ + అగున్ = “వు” అనేవర్ణం వస్తుంది; ఉఱ్ఱు అంతముపై చివర వచ్చే పదాలపై (అంటే ఉకారాంత పదాలకు ‘వు’ వస్తుంది); ముఱ్ఱు+అగు = ‘ము’ అవుతుంది; అఱ్+అంతశబ్దములపై = అకారాంత శబ్దాలపైన; రెంటన్ = రెండింట అనగా ఉకారాంత, అకారాంత పదాలు రెండింటిపైన; డుఱ్+అగున్ = ‘డు’ కారం వస్తుంది; పురుష+ఆఖ్యల పైన్ = పురుషుల పేర్లపైన; అఱ్ఱు+ఉఱ్ఱు అగున్ = అకారం ఉకారం అవుతోంది; అట్టియెడలన్ = అట్లాంటి సందర్భాలలో (అంటే అకారాంతంగా ఉండే పురుషుల పేర్లకు ‘డు’ ప్రత్యయం చేరినప్పుడు ‘అ’ ‘ఉ’గా మారుతుంది); అభినవ దండీ అభినవ దండి అనే పేరుగల కేతనా!
“సంస్కృతంలోని ‘ఉ’కారాంత శబ్దాలు తెలుగులో ‘వు’ కారాంతంగానూ, ‘అ’కారాంత శబ్దాలు ‘ము’ కారాంతంగానూ మారుతాయి. అకారాంతాలైన పురుష నామాలపై ‘డు’ ప్రత్యయం వస్తుంది. అట్లా ‘డు’ ప్రత్యయం చేరినప్పుడు నామంలోని ‘అ’కారం ‘ఉ’కారంగా మారుతుంది.”
ఈ పద్యంలో కేతన ప్రథమా విభక్తి ప్రత్యయాల గురించి చెప్తున్నాడు. సంస్కృతంలో స్త్రీ, పుం, నపుంసక భేదాలతో భాషాగతంగానే నామ పదాలన్నీ విభజింపబడుతాయి. అందువల్ల మొదటి 33, 34, పద్యాలలో స్త్రీలింగ శబ్దాలను గురించి స్త్రీ, గౌరీ, మొ॥ వాటి లోక్లుప్తంగా సూత్రీకరించిన కేతన ఈ పద్యంలో ‘ఉ’ కారాంతమైన సంస్కృత శబ్దాలన్నీ తత్సమీకరణలో ‘వు’ కారాంతాలవుతాయనీ, అలాగే ‘అ’ కారాంత శబ్దాలకు ‘ము’ కారం వస్తుందనీ, పురుషుల పేర్లకు ఈ రెండు చోట్ల అంటే ‘ఉ’ కారాంత ‘అ’కారాంత శబ్దాలకు రెండింటికీ ‘డు’ ప్రత్యయం వచ్చి చేరుతుందనీ, అట్లా చేరినప్పుడు దానికి ముందున్న ‘అ’ కారం ‘ఉ’ కారం అవుతుందనీ సూత్రీకరించాడు. అంటే ‘గురు’ తెలుగులో ‘గురువు’ అనీ, ‘వృక్ష’ వృక్షము అనీ; ‘ రామ’ శబ్దానికి ‘డు’ ప్రత్యయం చేరి ‘రామడు’ కాకుండా రాముడు (అ-ఉ గా మారి) అవుతుందని అర్థం. (చూ. పద్యం 35)
కం.
మానునకును మంతుఁడును గ్రమంబున నగు శ
బ్దానీకాంతనకారము
మానించి విభక్తు లెక్కుమఱియొక్కొకచోన్. (34)
“సంస్కృత శబ్దాలలో ‘వాన్’ చివర వచ్చే పదాలకు ‘వంతుడు’ అనీ, ‘మాన్’ చివర వచ్చే పదాలకు ‘మంతుడు’ అనీ చేరుతాయి. శబ్దం చివరన చాలాచోట్ల వచ్చే ‘న’ కారాన్ని తొలగించి ఒక్కొక్క సారి విభక్తి ప్రత్యయాలు చేరుతాయి.
ఈ సూత్రంలో మూడు విషయాలున్నాయి. (i) వాన్ అని ఏయే శబ్దాల చివర్లో వస్తుందో అవన్నీ ‘వంతుడు’ అని అవుతాయి; (ii) అలాగే మాన్ అంతంలో వచ్చే శబ్దాలన్నీ ‘మంతుడు’ గా మారుతాయి. (iii) సంస్కృతంలో చాలా శబ్దాల్లో వచ్చే చివరి నకారం ఒక్కొక్కసారి విభక్తి ప్రత్యయం చేరినప్పుడు తొలిగిపోతుంది.
పై విషయాలను మొట్టమొదటి సారిగా ఇంత స్పష్టంగా చెప్పిన వ్యాకర్త కేతనే. తర్వాతి వ్యాకర్తలందరూ దీనినే స్వీకరించారు. ఈ సూత్రాలన్నింటికీ ఉదాహరణలు తర్వాత కింద చెప్పే పద్యంలో చూస్తాం.
కం.
గురుఁడు పురుషుఁడు త్తముండుగుణవంతుఁడు సు
స్థిరమతిమంతుఁడు యశమున
నరుదుగ హనుమంతుఁ డన నుదాహరణంబుల్. (35)
“తరువు, తనువు, ధనము, అర్థము, గురుడు, పురుషుడు, ఉత్తముడు, గుణవంతుడు, యశమున సుస్థిర మతిమంతుడు, అరుదుగా హనుమంతుడు అని ఉదాహరణలు.”
ఈ పద్యంలో ఇచ్చిన ఉదాహరణల్లో సూత్రాల ప్రకారం వర్తించేవే కాకుండా అరుదుగా కనిపించే (exception) ఉదాహరణ కూడా చూపించాడు. దీనిలో ఇంతకు ముందు పద్యంలో చెప్పిన ‘వాన్, మాన్’లకు సంబంధించిన ఉదాహరణలు కూడా (వంతుడు, మంతుడు అని ఇంతకు పూర్వం 34వ పద్యంలో పేర్కొన్న వాటికి) ఇచ్చాడు.
34వ పద్యంలోని సూత్రాల ప్రకారం:
- ఉకారాంతాలపై ‘వు’ ఉదా. తరు = తరువు, తను = తనువు.
- అకారాంతాలపై ‘ము’ కారం – ఉదా :- ధన = ధనము, అర్థ = అర్థము
- అకారాంత ఉకారాంతాలకు ‘డు’ వర్ణం. ఉదా :, పురుష+డు = పురుషుడు;గురు-డు
- వాన్ = వంతుడు; ఉదా : గుణవాన్ = గుణవంతుడు;
- మాన్ = మంతుడు, ఉదా :< మతిమాన్ = మతిమంతుడు;
- కానీ అరుదుగా హనుమంతుడు. గుణవాన్ లో గుణ+వాన్ అని మతిమాన్ లో మతి+మాన్. వాన్, మాన్లను ప్రత్యయాలుగా గుర్తించి అవి వంతుడు, మంతుడుగా తెలుగులోకి మారుతాయని పై ఉదాహరణలు చెబుతున్నా, హనుమంతుడులో ‘హనుమ’లోని ‘మ’కారం పేరుకి చెందిందే తప్ప ప్రత్యయానికి (ఉపసర్గకు) చెందింది కాదని కేతన చెప్పిన ‘అరుదుగ’ అనే దాని అర్థం. హనుమా! అని అంటాంకానీ ‘హను’ అనం కదా! కానీ ‘మతి’ అంటాం కానీ ‘మతిమ’ అనం కదా? ఈ భేదాన్ని కేతన చక్కగా గుర్తించి వివరించారు. అందువల్ల సంస్కృతంలోని ద్వితీయా విభక్తి రూపంఅయిన హనుమాన్ నుండి తెలుగులో హనుమంతుడనే తత్సమం ఏర్పడిందని పండితులు చెప్తారు.
తే.
పూర్వకబుకారమేనియుఁ బొసఁగియుండు
ఖగ మన ఖగ మ్మనంగా ఖగం బనంగ
ఝష మన ఝష మ్మనంగా ఝషం బనంగ. (36)
అకారాంత సంస్కృత శబ్దాలు తెలుగులో ఉపయోగించినప్పుడు వాటికి – ము కారం చివర చేరుతుందని ముందు చెప్పిన సూత్రానికి ఇది మరో చేర్పు. దీని ప్రకారం, ము కారంత మైన తత్సమ పదాలన్నీ కూడా మరో రెండు రూపాంతరాలను సంతరించుకుంటాయి. (i) ద్విత్వం కావడం అంటే -మ్ము అని అవడం (ii) బిందుపూర్వక అంటే సున్నాతో కూడిన ‘బు’కారం అంటే ‘ంబు’ అని చివర రావడం. ఈ సూత్రం వల్ల ‘ఖగ’, ‘ఝష’ వంటి సంస్కృత శబ్దాలు ‘ఖగము’, ఝషము’ అనే కాకుండా ‘ఖగమ్ము’, ‘ఖగంబు’ అనీ ‘ఝషమ్ము’, ‘ఝషంబు’ అని కూడా వాడవచ్చు. ఇలాంటి రూపాలు కావ్య రచనల్లో గణాల కోసమూ, ప్రాస-యతుల కోసమూ కవులకు అవసరమయ్యాయి. ‘ఖగము’ అనేది మూడు హ్రస్వాలతో ‘న’ గణమైతే, ఖగమ్ము, ఖగంబు అనే రూపాలలో మధ్య ‘గురువు’ వచ్చి లఘువు-గురువు-లఘువు (IUI) అని ‘జ’ గణంగా మారుతుంది.
కం.
గదిసిన ఋఱ్ఱంతపద మొకండును వెలిగా
ముదమున డులు తల మోచును
విదితపుఁబురుషాఖ్యలందు వివరింపంగన్. (37)
“పురుషుల పేర్లుగల శబ్దాల చివర ఉండే ‘ఆ’ కారాలను తగ్గించినా, కలిపినా వాటి చివర ‘డు’ వచ్చి చేరుతోందనేది స్పష్టం. అయితే ‘-ఋ’ కారంతో అంతమయ్యే పదాలకు మాత్రం ఇది వర్తించదు. అవి వేరుగా ఉంటాయి.”
పై సూత్రం ప్రకారం ఆకారాంత పురుషుల పేర్లను తెలిపే అన్ని పదాలకు చివర ‘డు’ వచ్చి చేరాలి. అలా చేరినప్పుడు ‘ఆ’ కారం ‘ఉ’ కారంగా మారుతుందని కూడా కేతన ముందు చెప్పాడు. అయితే అకారాంతంగా కనపడే కొన్ని పురుషనామాలు నిజానికి అకారాంత శబ్దాలు కాకపోవడం వల్ల, అంటే అవి – మూలం లో ఋకారాంత పదాలు కావడం వల్ల వాటి ప్రథమా విభక్తి ఏక వచన రూపాలు ‘అ’కార అంతాలుగా కనిపించినా వాటికి ‘డు’ వచ్చి చేరదు అని పై సూత్రానికి అర్థం. దీనికి గాను ఉదాహరణలు కింది పద్యంలో కనిపిస్తాయి.
ఆ.
బ్రహ్మవేత్త యనఁగఁ బరఁగుచుండుఁ
బూరితాత్ముఁ డనఁగఁ బుణ్యకర్ముఁ డనంగఁ
బుష్పధన్వుఁ డనఁగఁ బొలుచు జగతి. (38)
“హోత, ధాత, నేత, దాత, బ్రహ్మవేత్త అనే రూపాలున్నాయనీ, అలాగే పూరితాత్ముడు, పుణ్యకర్ముడు, పుష్పధన్వుడు అనీ (-డు కారాంత) రూపాల శబ్దాలున్నాయని ప్రపంచానికి తెలుసు”.
సంస్కృతంలో ఋకారాంత పుంలింగం అంటూ చెప్పుకొనే హోతృ, ధాతృ మొ॥ శబ్దాల ప్రథమా విభక్తి ఏకవచన రూపాలు ఋత్వంలో ఉండవు. అందువల్ల ధాతు రూపంలో ఉండే హోతృ, ధాతృ, నేతృ, దాతృ, బ్రహ్మవేతృ పురుష నామ శబ్దాల ప్రథమైక వచనాలు హోతా, ధాతా అన్న విధంగా ‘ఆ’ కారాంత దీర్ఘాలుగా ఉంటాయి. ఇవి తెలుగులో తత్సమాలుగా మారినప్పుడు హోత, ధాత, నేత, మొదలైన ‘అ’ కారాంతాల వలె కనపడే (రామ, కృష్ణ మాదిరిగా) శబ్దాలుగా మారుతాయి కానీ వీటికి -డు ప్రత్యయం చేరదు. హోతుడు, ధాతుడు అనే విధంగా వీటిని వాడరు; హోత, ధాత మొ॥ విధంగానే వాడుతారు. కానీ పూరితాత్మ, పుణ్యకర్మ, పుష్పధన్వ అనే రూపాలలోని ‘అ’ ‘ఉ’ గా మారుతూ వాటికి పురుష బోధక ప్రత్యయమైన ‘-డు’ చేరుతుంది. ఎందుకంటే ఇవి ‘న’ కారాంత శబ్దాలు.
ఆ.
శర్మ వర్మ నాఁగ శర్ముఁ డనఁగ
వర్ముఁ డనఁగఁ జెల్లు వటువును మనువును
బటువు డులకుఁ బాసి పరఁగుచుండు. (39)
“గురువు, ప్రభువు అనే రూపాలు గురుడు, ప్రభుడు అని కూడా వాడబడతాయి. అలాగే శర్మ, వర్మ అనే పేర్లు శర్ముడు, వర్ముడు అని కూడా వ్యవహరింపబడుతాయి, కానీ, వటువు, మనువు, బటువు మాత్రం –డు ప్రత్యయం తీసుకోక అలాగే ఉంటాయి”
ఉకారాంత పుంలింగ శబ్దాలైన గురు, ప్రభు అనే పదాలు రెండు రకాల రూపాలనూ అంటే -వు, -డు ప్రత్యయాంతాలతో గురువు అని కానీ గురుడు అని కానీ వాడవచ్చు; అలాగే ప్రభువు అని కానీ ప్రభుడు అని కానీ వాడవచ్చు. అదేవిధంగా ‘అ’కారాంత శబ్దాలైన శర్మ, వర్మలకు కూడా -డు ప్రత్యయం చేరి శర్ముడు, వర్ముడు అనవచ్చు. కానీ వటువు (-వటు), మనువు (-మను), బటువు (-బటు) అనే పులింగ రూపాలకు ‘వు’ చేరుతోంది కానీ -డు ప్రత్యయం చేరదు.
తే.
విత్పదమునకు విదుఁ డగు వేదవిదుఁడు
భుక్పదమునకు భుజుఁ డగు భూభుజుండు
దిక్పదమునకుఁ గుఱ్ఱగుఁ దెలియు దిక్కు (40)
“సంస్కృతంలోని ‘ద్విట్’ ద్విషుడు, విద్విషుండు అనీ; ‘విత్’ పదము విదుడు, వేద విదుడు అనీ, భుక్ అనే శబ్దం భుజుడు, భూభుజుండు అనీ; దిక్ పదం మాత్రం “-కు’ చేరి దిక్కు అనీ మారుతాయి.”
‘ద్విట్, విత్, భుక్, దిక్,’ అనే సంస్కృత శబ్దరూపాలు తెలుగులో ఎలా ఉపయోగించాలి అన్న విషయం ఈ పద్యం ద్వారా తెలుస్తోంది. దానికి అప్పటికే ఏర్పడిపోయిన ప్రయోజన రూపాలు ఉండటం వల్ల వీటిని సూత్ర రూపంలో కాకుండా ‘పదాంశ విధేయసూత్రాలలో వలె’ ‘ద్విట్’ కి ద్విషుడు, విద్విషు(ం)డు అనీ; విత్ కి విదుడు, వేదవిదుడు అనీ, భుక్ కి భుజుడు, భూభుజుండు అనీ అవుతాయి; కానీ దిక్ కు మాత్రం ‘కు’ అదనంగా చేరి ‘దిక్కు’, అనీ అవుతుందని కేతన చెప్పాడు. (చిన్నయసూరి కూడా ఇవే ఉదాహరణలు చూపించాడు 1857.)
కం.
పలికెడి తెఱఁ గెఱిగినంత ప్రవ్యక్తముగాఁ
దెలిపితిఁ దెలుపనిపదములు
గల వవి సంస్కృతముతోడఁ గలయుఁ దెనుఁగునన్. (41)
“తెలుగులో సంస్కృత పదాలు కలిసే తీరు తెలియజేసాను. అయినా ఇంకా చెప్పని పదాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ సంస్కృతంతోనే (వాటి వలెనే) తెలుగులో చేరుతాయి.”
సంస్కృత శబ్దాలను తత్సమాలుగా మార్చే క్రమంలో కొన్ని సూత్రాలను కేతన ఉదాహరణ పూర్వకంగా తెలియజేసాడు. అయినా తాను చెప్పని మరెన్నో సంస్కృత పదాలు తెలుగులో ఉన్నాయనీ, అవి పైన పేర్కొన్నట్లుగా సంస్కృత పదాలవలెనే తెలుగులో వ్యవహరిస్తాయని తెలియజేస్తూ కేతన ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఇంత చక్కగా స్పష్టంగా తెలుగు ఎంత భిన్నమైనదో, ఎట్లా సంస్కృత పదాలను మార్చుకుందో వివరించిన కేతన భాషా వ్యవస్థలలో మాటలు, వ్యాకరణం ఈ రెండు భాషల్లో ఎంత తేడా ఉందో నిరూపించారు.
వచ్చే సంచికలో కేతన తెలియజేసిన తెలుగు సంధుల గురించి చర్చిద్దాం!
(సశేషం)